9వ భాగం: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
అనియత సాక్ష్యం ఇచ్చేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం
1 యేసే వాగ్దానం చేయబడిన మెస్సీయ అని అంద్రెయ, ఫిలిప్పులు గుర్తించినప్పుడు, పులకరింపజేసే ఆ సమాచారాన్ని వారు ఇతరులకు చెప్పకుండా ఉండలేక పోయారు. (యోహా. 1:40-45) అదే విధంగా నేడు, బైబిలు విద్యార్థులు తాము నేర్చుకుంటున్న వాటిని విశ్వసించడం ప్రారంభించగానే, దాని గురించి ఇతరులకు చెప్పేందుకు వారు కూడా ప్రేరణ పొందుతారు. (2 కొరిం. 4:13) వారు అనియత సాక్ష్యం ఇచ్చేలా వారిని మనమెలా ప్రోత్సహించవచ్చు, సమర్థవంతంగా అనియత సాక్ష్యం ఇచ్చేందుకు వారిని ఎలా సిద్ధం చేయవచ్చు?
2 బైబిలు నుండి నేర్చుకున్న వాటి గురించి ఇతరులతో మాట్లాడారా అని బైబిలు విద్యార్థిని మీరు అడగవచ్చు. అధ్యయనం చేస్తున్నప్పుడు తనతో పాటు కూర్చోవడానికి ఆయన తన స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆహ్వానించవచ్చు. ఆయన సహోద్యోగులు, తోటివిద్యార్థులు లేక పరిచయస్థులు ఎవరైనా సువార్త విషయంలో ఆసక్తి వ్యక్తం చేశారా అని ఆయనను అడగండి. ఈ విధంగా ఆయన సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించవచ్చు. యెహోవా దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వివేచనతో, మర్యాదతో, దయతో వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు ఆయనకు సహాయం చేయండి.—కొలొ. 4:6; 2 తిమో. 2:24, 25.
3 తమ నమ్మకాల గురించి మాట్లాడడం: బైబిలు విద్యార్థులు తమ నమ్మకాల గురించి మాట్లాడేటప్పుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించే విధంగా వారికి శిక్షణ ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అధ్యయనంలోని ప్రత్యేకమైన అంశాలను చర్చిస్తున్నప్పుడు, విద్యార్థిని ఇలా అడగండి: “మీ కుటుంబానికి ఈ సత్యాన్ని వివరించడానికి మీరు బైబిలును ఎలా ఉపయోగిస్తారు?” లేక “ఒక స్నేహితునికి ఈ అంశాన్ని నిరూపించడానికి మీరు ఏ బైబిలు వచనాన్ని ఉపయోగిస్తారు?” ఆయన ఎలా ప్రతిస్పందిస్తున్నాడో గమనించి, ఆయన తన బోధను లేఖనాల మీద ఎలా ఆధారం చేసుకోవాలో చూపించండి. (2 తిమో. 2:15) అలా చూపించడం ద్వారా విద్యార్థి అనియత సాక్ష్యం ఇచ్చేందుకు, అర్హత పొందినప్పుడు సంఘంతోపాటు సంస్థీకరించబడిన ప్రకటనా పనిలో భాగం వహించేందుకు మీరు వారిని సిద్ధం చేసిన వారవుతారు.
4 వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు బైబిలు విద్యార్థులను సిద్ధం చేయడం జ్ఞానయుక్తం. (మత్త. 10:36; లూకా 8:13; 2 తిమో. 3:12) ఇతరులు ప్రశ్నలు లేవనెత్తినప్పుడు లేక యెహోవాసాక్షుల గురించి వ్యాఖ్యానించినప్పుడు సాక్ష్యం ఇచ్చేందుకు విద్యార్థులకు మార్గం ఏర్పడవచ్చు. యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్ ‘సమాధానము చెప్పడానికి ఎల్లప్పుడు సిద్ధముగా’ ఉండడానికి వారిని సన్నద్ధులను చేస్తుంది. (1 పేతు. 3:15) సదుద్దేశంగల స్నేహితులు, కుటుంబ సభ్యులు మన బైబిలు ఆధారిత నమ్మకాలను, కార్యకలాపాలను అర్థం చేసుకోవడానికి సహాయం చేసేందుకు క్రొత్తవారు ఉపయోగించగల ఖచ్చితమైన సమాచారం దానిలో ఉంది.