బైబిలుకు మరింత ప్రాధాన్యత!
1. మొదట్లో, కావలికోట పత్రిక ప్రాథమికంగా ఎవరి కోసం ప్రచురించబడింది, ద గోల్డెన్ ఏజ్ పత్రిక ఎవరి కోసం ప్రచురించబడింది?
1 ద గోల్డెన్ ఏజ్ పత్రిక మొదటి సంచిక 1919, అక్టోబరు 1న ప్రచురించబడింది. అది ప్రకటనా పనిలో అత్యంత విలువైన ఉపకరణంగా తయారయ్యింది. ఎందుకు? ఎందుకంటే, అది ప్రత్యేకంగా బయటి ప్రజల కోసం రూపొందించబడింది. అయితే కావలికోట అలా కాదు, అది చాలా సంవత్సరాలపాటు, ముఖ్యంగా “చిన్న మంద” కోసం ప్రచురించబడుతున్న పత్రికగా పరిగణించబడింది. (లూకా 12:32) ఆ క్రొత్త ప్రచురణ విషయంలో రాజ్య ప్రచారకులు ఎంత ఉత్సాహంతో ప్రతిస్పందించారంటే, చాలా సంవత్సరాలపాటు ద గోల్డెన్ ఏజ్ పంపిణీ కావలికోట పంపిణీకంటే ఎంతో ఎక్కువగా ఉండేది.
2. ద గోల్డెన్ ఏజ్ నేడు ఏ పేరుతో కొనసాగుతోంది, మొదటి నుండి దాని సంకల్పమేమిటి?
2 ద గోల్డెన్ ఏజ్ పత్రిక, మానవాళి సమస్యలకు క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలనే నిజమైన పరిష్కారమనీ, ఆ పరిపాలన మానవాళికి నిజంగానే స్వర్ణ యుగాన్ని తెస్తుందనీ ప్రజలకు చూపించడానికి ప్రచురించబడింది. అయితే ఆ తర్వాతి దశాబ్దాల్లో, కాలానుగుణంగా మారుతున్న అవసరాలకు తగిన విధంగా ద గోల్డెన్ ఏజ్ పత్రికకు అనేక మార్పులు చేయబడ్డాయి. 1937లో దాని పేరు కన్సోలేషన్ అని మార్చబడింది. 1946లో అది అవేక్! అనే పేరుకు మారింది, ఇప్పుడు కూడా అదే పేరుతో కొనసాగుతోంది.
3. అవేక్! పత్రిక ఏ ప్రవచన నెరవేర్పులో శక్తిమంతమైన ఉపకరణంగా ఉంది?
3 మొదటి నుండి ఈ పత్రిక, 1919 నుండి ఇవ్వబడుతున్న గొప్ప సాక్ష్యానికి ఎంతగానో దోహదపడింది. (మత్తయి 24:14) అయితే, మన కాలాల అత్యవసరతను బట్టి, అవేక్! పత్రికకు మరిన్ని మార్పులు చేయడం జ్ఞానయుక్తమని అనిపిస్తోంది.
4. (ఎ) ఒక వ్యక్తి ‘యెహోవా ఉగ్రత దినాన’ రక్షణ పొందాలంటే ఏమి చేయాలి? (బి) ప్రకటన 14:6, 7 ప్రకారం, అందరూ ఏమి చేయాలని ‘ఆకాశమధ్యమున ఎగురుతున్న దూత’ చెబుతున్నాడు?
4 లక్షలాదిమంది అవేక్! పత్రికను చదవడానికి ఇష్టపడతారు, ఎందుకంటే అది మతానికి సంబంధం లేని అనేకానేక అంశాలను ఆకర్షణీయమైన విధంగా అందజేస్తుంది. ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు క్రమంగా హాజరయ్యేవారిలో అధికశాతం మంది అవేక్! పత్రికను క్రమంగా చదివేవారే అనడంలో సందేహం లేదు. అయినప్పటికీ, ‘యెహోవా ఉగ్రత దినాన’ రక్షణ పొందాలని కోరుకునేవారు మన ప్రచురణలను క్రమంగా చదివితే సరిపోదు, వారు అంతకంటే ఎక్కువ చేయడానికి వారికి సహాయం అవసరం.—జెఫ. 2:3; ప్రక. 14:6, 7.
5. (ఎ) జనవరి 2006 సంచిక మొదలుకొని, అవేక్! పత్రిక ఏ విషయాన్ని ప్రధానంగా నొక్కిచెబుతుంది? (బి) చాలామంది ఏమి చేయడానికి ప్రోత్సాహం పొందుతారు, అది ఏ ప్రవచన నెరవేర్పుగా జరుగుతుంది?
5 కాబట్టి, 2006 జనవరి నుండి, అవేక్! పత్రిక దేవుని రాజ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది. తమ సమస్యల పరిష్కారం కోసం బైబిలు వైపు చూడాలని పాఠకులను సూటిగా ప్రోత్సహిస్తూ ప్రస్తుత సంఘటనల గురించిన బైబిలు వివరణలను మరింత ప్రముఖంగా నొక్కిచెబుతుంది. ఈ విధంగా, పాఠకులకు ప్రస్తుత సంఘటనల గురించి చక్కని అవగాహన ఏర్పడుతుంది, తద్వారా వారు తాము చదివే దాన్నిబట్టి యెహోవా గురించి మరింత తెలుసుకోవడానికి ప్రోత్సాహం పొందవచ్చు.—జెక. 8:23.
6, 7. (ఎ) మొదటి థెస్సలొనీకయులు 2:13 ను అన్వయించుకోవడానికి అనేకులకు సహాయం చేసే విధంగా అవేక్! ఎలా రూపొందించబడుతుంది? (బి) అవేక్! ఎంత తరచుగా ప్రచురించబడుతుంది, ఈ మార్పువల్ల ఎన్ని భాషల మీద ప్రభావం పడుతుంది?
6 అవేక్! పత్రిక ఇతర ఆసక్తికరమైన అంశాలను ప్రచురించడాన్ని కొనసాగిస్తుంది. అయితే, బైబిలుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. (1 థెస్స. 2:13) కావలికోటలో లోతైన బైబిలు సమాచారం ఉంటుంది, అవేక్! కూడా లేఖనాధారిత సమాచారాన్ని ఎక్కువగా అందజేస్తుంది, కాబట్టి అవేక్! పత్రికను నెలకు రెండు సంచికలుగా ప్రచురించడం అవసరం అనిపించడం లేదు. అందుకే, 2006 జనవరి మొదటి సంచిక నుండి, అవేక్! నెలసరి పత్రికగా ప్రచురించబడుతుంది. దానివల్ల ఆర్టికల్స్ సిద్ధం చేయడం, అనువదించడం, సాహిత్యాన్ని రవాణా చేయడం వంటి పనులు చాలా మేరకు తగ్గిపోతాయి.
7 ఈ మార్పు, అవేక్! పత్రికను ప్రచురిస్తున్న భాషల్లో దాదాపు 40 శాతం భాషల మీద ప్రభావం చూపిస్తుంది. అనేక భాషల్లో, అవేక్! ఇప్పటికే మాసపత్రికగా, త్రైమాసిక పత్రికగా ఉంది. కావలికోట ప్రచురణలో ఎలాంటి మార్పు ఉండదు.
8. ప్రచారకులు కావలికోట పత్రికతోపాటు అవేక్! పత్రికను ఎలా ఉపయోగించవచ్చు?
8 ప్రచారకులు ప్రతి నెల వచ్చే అవేక్! పత్రికను ఆ నెలలోని ఏదో ఒక కావలికోట సంచికతో కలిపి ఇవ్వవచ్చు. అవేక్! పత్రికను అందజేసేవారు నెలంతా అదే సంచికను ఉపయోగించవచ్చు, ఇప్పుడు చేస్తున్నట్లుగా నెల మధ్యలో తమ అందింపును మార్చుకోవలసిన అవసరం ఉండదు.
9. అవేక్! పత్రిక ఏ పాత్ర నిర్వహించడంలో కొనసాగుతుంది?
9 మొదట ద గోల్డెన్ ఏజ, ఆ తర్వాత కన్సోలేషన్ అనే పేర్లతో ఉండి, ఇప్పుడు అవేక్! అనే పేరుతో కొనసాగుతున్న ఈ పత్రిక 1919లో తన మొదటి సంచిక నుండి ప్రకటనా పనిలో ప్రధాన పాత్ర నిర్వహించింది. మార్పు చేసిన ఈ పత్రిక పంపిణీని యెహోవా ఆశీర్వదించడం కొనసాగించాలని, అది “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆ యా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చే ఇంకా అనేకమంది ప్రజలు తమ ఏకైక నిరీక్షణగా దేవుని రాజ్యం వైపుకు తిరగడానికి సహాయం చేయాలని మేము ప్రార్థిస్తున్నాం.—ప్రక. 7:9.