బంధువులకు ఎలా సాక్ష్యమివ్వాలి?
1. బంధువులకు సాక్ష్యమిస్తున్నప్పుడు వివేచన ఎందుకు అవసరం?
1 మన బంధువులు యెహోవా ఆరాధనలో ఐక్యంగా ఉంటూ మనతో పాటు నూతనలోకంలోకి ప్రవేశించడం మనకు ఎంత ఆనందాన్నిస్తుందో కదా! మన బంధువులకు సాక్ష్యమివ్వడంవల్ల ఈ ఆనందకరమైన ఉత్తరాపేక్ష వాస్తవరూపం దాల్చగలదు. అయితే బంధువులకు ఉల్లాసాన్నిచ్చే విధంగా సాక్ష్యమివ్వడానికి వివేచన అవసరం. ఒక ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా పేర్కొన్నాడు: “కొద్ది కొద్దిగా సాక్ష్యమివ్వడం ద్వారా తమ బంధువులలో ఆసక్తిని రేకెత్తించేవారు శ్రేష్ఠమైన ఫలితాలను సాధిస్తారు.” మనం దీనిని ఎలా చేయవచ్చు?
2. మన బంధువులపట్ల మనకున్న నిజమైన శ్రద్ధ, వారి ఆసక్తిని రేకెత్తించేందుకు మనకు ఎలా సహాయం చేయగలదు?
2 వారిలో ఆసక్తిని రేకెత్తించండి: మీ బంధువులలో ఆసక్తిని ఎలా రేకెత్తించాలనే విషయాన్ని ముందే జాగ్రత్తగా ఆలోచించండి. (సామె. 15:28) వారికి ఎలాంటి చింతలు ఉన్నాయి? వారు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్నారు? వారికి ఆసక్తి కలిగించే అంశంమీద ఒక శీర్షికను లేదా ఆ అంశంమీద వారిని ఆకట్టుకొనే లేఖనాన్ని చూపించవచ్చు. మీ బంధువులు మీకు సమీపంలో నివసించనట్లయితే మీరు ఒక ఉత్తరం ద్వారా లేక టెలిఫోను ద్వారా వారిలో ఆసక్తి రేకెత్తించవచ్చు. అధిక సమాచారంతో వారిని ఉక్కిరిబిక్కిరి చేయకుండా, సత్య విత్తనాలను నాటి, ఆ విత్తనాలను వృద్ధిచేసేందుకు యెహోవావైపు చూడండి.—1 కొరిం. 3:6.
3. మన బంధువులకు మనమీదున్న ఆసక్తి, సాక్ష్యం ఇచ్చేందుకు మార్గాన్ని ఎలా సుగమం చేయగలదు?
3 ఒక వ్యక్తికి పట్టిన చాలా దయ్యాలను వెళ్లగొట్టిన తర్వాత యేసు ఆ వ్యక్తికి ఇలా ఉపదేశించాడు: “నీవు నీ యింటివారియొద్దకు వెళ్లి, ప్రభువు నీయందు కనికరపడి, నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పుము.” (మార్కు 5:19) ఆ వ్యక్తి బంధువులలో అది ఎలాంటి భావాన్ని కలిగించివుంటుందో ఒక్కసారి ఉహించండి! అలాంటి అసాధారణమైనవి మీరు ఎదుర్కోకపోయినా, మీ కార్యకలాపాలలో, మీ పిల్లల కార్యకలాపాలలో మీ బంధువులకు ఆసక్తి ఉండవచ్చు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో మీరు ఇచ్చిన ప్రసంగం, హాజరైన సమావేశం, బెతెల్ సందర్శనం, వ్యక్తిగత జీవితంలో ప్రాముఖ్యమైన సంఘటన వంటివాటి గురించి వారికి చెప్పడం, యెహోవా గురించి, ఆయన సంస్థ గురించి ఇంకా ఎక్కువగా వారితో చర్చించేందుకు మార్గం సుగమం చేయగలదు.
4. బంధువులకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఎలాంటి ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి?
4 వివేచన కలిగివుండండి: బంధువులకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు, అంతా ఒకేసారి చెప్పడానికి ప్రయత్నించకండి. ఒక సహోదరుడు తాను బైబిలు అధ్యయనం ప్రారంభించిన సమయాన్ని గుర్తుచేసుకుంటూ ఇలా అంగీకరించాడు: “నేను బైబిలునుండి నేర్చుకుంటున్న దాదాపు ప్రతీ విషయాన్ని గురించిన వివరణలను మా అమ్మకు గంటలకొద్దీ వివరిస్తూ ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసేవాణ్ణి, అలా చేయడం చాలామట్టుకు వాదనలకే దారితీసింది, ముఖ్యంగా మా నాన్నతో అలా వాదనలు జరిగేవి.” ఒక బంధువు బైబిలు సందేశంపట్ల ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ, ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనే ఆసక్తి ఆ వ్యక్తిలో కలిగేలా జవాబివ్వండి. (సామె. 25:7) పరిచర్యలో, అపరిచితులతో మాట్లాడుతున్నప్పుడు మీరు చూపిస్తున్నట్లే, వారిపట్ల ఎల్లప్పుడూ గౌరవాన్ని, దయను, సహనాన్ని చూపించండి.—కొలొ. 4:6.
5. బంధువులకు సాక్ష్యం ఇస్తున్నప్పుడు వారు అనుకూలంగా ప్రతిస్పందించనట్లయితే మనం ఏమి చేయాలి?
5 ఒక సందర్భంలో, యేసు ఇంటివారు ఆయనకు మతి చలించిందని తలంచారు. (మార్కు 3:21) అయితే ఆ తర్వాత కొందరు విశ్వాసులయ్యారు. (అపొ. 1:14) బంధువులతో సత్యం పంచుకోవాలనే మీ ప్రారంభ ప్రయత్నాల్లో వారు అనుకూలంగా ప్రతిస్పందించనట్లయితే, పట్టు విడువకండి. పరిస్థితులు, వైఖరులు మారవచ్చు. వారి ఆసక్తిని రేకెత్తించగల అంశాన్ని పంచుకొనేందుకు మరో అవకాశంకోసం ఎల్లప్పుడూ ఎదురుచూడండి. నిత్యజీవానికి నడిపే మార్గంలోకి వచ్చేందుకు వారికి సహాయం చేయడంవల్ల కలిగే ఆనందం మీకు లభించవచ్చు.—మత్త. 7:13, 14