2005 “దైవిక విధేయత” యెహోవాసాక్షుల జిల్లా సమావేశం
1 యెహోవా దేవుడు మన మహోపదేశకునిగా, తన మార్గాలను ఉపదేశించడానికి మనల్ని సమావేశపరిచేందుకు ఏర్పాట్లు చేస్తాడు. (యెష. 30:20, 21; 54:13) ఆయన తన నమ్మకమైనవాడును బద్ధిమంతుడునైన దానుని తరగతి ద్వారా ఆ ఏర్పాట్లు చేస్తాడు, దాసుని తరగతి మన వార్షిక జిల్లా సమావేశాల వంటి కూటాలను ఏర్పాటు చేస్తుంది. (మత్త. 24:45-47) మన భావాలు కీర్తనకర్త దావీదు భావాలతో ఏకీభవిస్తాయి, ఆయన ఇలా పాడాడు: “సమాజములలో యెహోవాను స్తుతించెదను.” (కీర్త. 26:12) యెహోవా ద్వారా ఉపదేశం పొందడంలోని విలువను దావీదు స్పష్టంగా గ్రహించి ఆయన ప్రజలు కూడుకున్నప్పుడు తాను కూడా వారితో ఉండాలనే దృఢ సంకల్పాన్ని చూపించాడు.
2 మరి మీరు ఈ సంవత్సరం “దైవిక విధేయత” జిల్లా సమావేశానికి హాజరయ్యే “సమాజములలో” ఉంటారా? ఒకవేళ మీరు హాజరవుతున్నట్లయితే అందుకు తగిన ఏర్పాట్లు చేసుకునేందుకు ఈ క్రింది సమాచారం సహాయకరంగా ఉంటుంది.
3 అన్ని రోజులూ హాజరయ్యేందుకు ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి: “శ్రద్ధగలవారి యోచనలు లాభకరములు.” (సామె. 21:5) సమావేశానికి హాజరయ్యేందుకు వెంటనే ప్రణాళికలు వేసుకోవడంలో ఉన్న ప్రాముఖ్యతను ఈ పదాలు నొక్కి చెప్పడం లేదా? ఆధ్యాత్మికంగా పునరుత్తేజపరిచే కార్యక్రమంలో మీరు ఏదీ తప్పిపోకుండా ఉండేందుకు మూడు రోజులూ హాజరుకావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ ఇప్పుడే జ్ఞానయుక్తంగా చేసుకోవడం ప్రారంభించండి. సెలవు రోజులు, పాఠశాల పరీక్షా తేదీలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి కాబట్టి అందరికీ సౌకర్యంగా ఉండే సమయంలో సమావేశాలను ఏర్పాటు చేయడం అసాధ్యమని తేలింది. దీనిని దృష్టిలో ఉంచుకొని, ఈ సంవత్సరం నుండి సమావేశాలను త్వరగా అంటే వర్షాకాలంలోనే నిర్వహించాలని నిర్ణయించబడింది. ఆ సమయంలో అయితే ప్రయాణసౌకర్యాలు, వసతి, సమావేశ స్థలాలు సులభంగా లభిస్తాయి.
దీని కోసం మనం అదనపు ప్రణాళికలు వేసుకోవడం తప్పనిసరి. మీ యజమానిని సెలవు కోసం అడగాల్సి ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే అడగండి. మీ ప్రణాళికలను అవిశ్వాసియైన మీ జతతో చర్చించవలసిన అవసరం ఉంటే దీనిని ఆఖరి నిమిషానికి వదిలేయకండి. మీరు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నా వాటి గురించి యెహోవాకు ప్రార్థించి, ఆయన సహాయంతో ‘మీ ఉద్దేశములు సఫలమవుతాయని’ నమ్మకం ఉంచండి. (సామె. 16:3) అంతేకాకుండా మీ బైబిలు విద్యార్థులు ప్రతీ సెషన్‌కు హాజరయ్యేలా సిద్ధపడేందుకు వారికి సహాయం చేయడం మంచిది.
4 వసతి సౌకర్యాలు: మీకు అనుకూలంగా ఉండే విధంగా సమావేశం జరిగే ప్రతీ నగరంలో వసతి ఏర్పాట్లు ఇప్పటికే చేయబడ్డాయి. సిఫారసు చేయబడిన హోటళ్ళ పట్టిక అందిన వెంటనే అది సమాచార బోర్డు మీద అంటించబడుతుంది. అనేక సందర్భాల్లో, సహోదరులు మన ప్రతినిధుల కోసం తక్కువ ధరకు వసతి లభించేలా హోటల్ వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి హోటల్ లేక లాడ్జివారితో సంప్రదించేటప్పుడు మీరు సమావేశానికి హాజరవుతున్నారని పేర్కొని, పట్టికలో సూచించిన రేట్లనే చెల్లించడానికి అంగీకరించండి. హోటల్ యజమాని, అంగీకరించిన రేటుకు గదిని ఇవ్వడానికి నిరాకరిస్తే ఆ విషయాన్ని మీ సంఘ కార్యదర్శి ద్వారా రూమింగ్ డిపార్టమెంటుకు తెలియజేయండి. మీ సహకారంవల్ల ఉన్నత శ్రేణి హోటళ్లను తక్కువ రేటుకు ఏర్పాటు చేయడానికి బ్రాంచి కార్యాలయానికి వీలౌతుంది. మంచి వసతులుగల హోటళ్లు ఎప్పుడూ సమావేశం జరిగే స్థలానికి అతి సమీపంలోనే ఉండకపోవచ్చునని గుర్తుంచుకోండి. గదిని రిజర్వు చేసుకొనేందుకు ఫోను చేసే ముందు “వసతి ఏర్పాట్లకు మీరు మద్దతు ఇవ్వగల విధానం” అనే బాక్సులోని అంశాలను సమీక్షించండి. మీరు ఫోను చేసేటప్పుడు, “హోటల్ గదిని రిజర్వ్ చేసుకొనేందుకు సరైన పద్ధతి ఏమిటి?” అనే బాక్సులోని సలహాలను పాటించండి.
5 ప్రత్యేక అవసరతలు: అపొస్తలుడైన పౌలు కొంతమంది సహోదరుల వలన తనకు ‘ఆదరణ కలిగినట్లు’ చెప్పాడు. (కొలొ. 4:7-11) వారు సహాయం చేసిన ఒక విధం, పౌలు తన వ్యక్తిగత అవసరతలు తీర్చుకొనేందుకు సహాయం చేయడం. ఈ సమావేశం సంబంధంగా మీరు ఇతరులకు ఎలా ‘ఆదరణ కలిగించవచ్చు’? వయస్సు పైబడిన ప్రచారకులకు, అనారోగ్యంగా ఉన్నవారికి, పూర్తికాల పరిచర్య చేస్తున్నవారికి, ఇతరులకు రవాణా లేక వసతి సౌకర్యాల విషయంలో ఆచరణాత్మక సహాయం అవసరం కావచ్చు. ఇలాంటి వారిపట్ల శ్రద్ధ తీసుకోవలసిన ప్రాథమిక బాధ్యత కుటుంబ సభ్యులదే. (1 తిమో. 5:4) వారు శ్రద్ధ తీసుకోలేకపోతే, స్థానిక సంఘాల్లోని తోటి విశ్వాసులు సహాయం చేయవచ్చు. (యాకో. 1:27) పుస్తక అధ్యయన పైవిచారణకర్తలు తమ గుంపులో ప్రత్యేక అవసరతలు ఉన్నవారు సమావేశం కోసం ముందుగానే పథకాలు వేసుకున్నారో లేదో నిర్ధారించుకోవాలి.
6 వసతి అవసరతలను కుటుంబ సభ్యులు గానీ సంఘం గానీ తీర్చలేకపోయిన ప్రచారకులకు మాత్రమే స్పెషల్ నీడ్స్ రూమ్ రిక్వెస్ట్ ఫారాలు ఇవ్వబడతాయి. సంఘ సేవా కమిటీ, ఫారంలో ఉన్న మార్గదర్శక సూత్రాలనూ, అన్ని పెద్దల సభలకు ఉద్దేశించిన డిసెంబరు 14, 2004 తేది ఉన్న లెటరునూ ఉపయోగించి ప్రచారకుల అర్హతలను పరిశీలించాలి. ఈ ఏర్పాటు మంచి పేరు ఉన్న ప్రచారకులకు, మంచి ప్రవర్తన ఉన్న వారి పిల్లలకు మాత్రమే.
7 వేరే సమావేశానికి హాజరవడం: ఈ సంవత్సరం ఆంగ్లంలో అనేక సమావేశాలు జరగనున్నాయి. ఒకే ప్రాంతంలో జరుగుతున్న ఇతర భాషా సమావేశాలకు హాజరయ్యేవారి సంఖ్యను తగ్గించేందుకు, ఆంగ్లభాష స్పష్టంగా అర్థంచేసుకొని మాట్లాడగలవారు సాధ్యమైతే ఆంగ్లభాషా సమావేశాలకే వెళ్ళాలని మేము ప్రోత్సహిస్తున్నాం. వారి సంఘం వేరే భాషా సమావేశానికి నియమించబడినా కూడా పై విధంగానే చేయాలని ప్రోత్సహిస్తున్నాం. అలా చేయడంవల్ల సీట్లు, సాహిత్యాలు, వసతి సౌకర్యాలు మొదలైనవి సరిపోయేన్ని ఉండేటట్లు నిర్ధారించుకోవడానికి సహాయం లభిస్తుంది. మీరు ఆంగ్ల సమావేశానికి హాజరు కాగలిగినట్లయితే ఇండియాలో జరిగే సమావేశాల చిరునామాల కోసం, దయచేసి 2005, ఏప్రిల్ మన రాజ్య పరిచర్యను చూడండి. సిఫారసు చేయబడిన హోటళ్ళ పట్టిక లేక ఏదైనా అదనపు సమాచారం కావాలంటే మీ రిక్వెస్టుతోపాటు మీ చిరునామా ఉన్న, స్టాంపులు అంటించిన కవరును పంపించడం మరవకండి. ఆ నగరంలో ఒకటి కన్నా ఎక్కువ సమావేశాలు నిర్వహించబడుతుంటే, మీరు హాజరయ్యే సమావేశపు తేదీలను సూచించండి.
8 స్వచ్ఛంద సేవకులు అవసరం: ఇతరుల అవసరతల విషయంలో వినయంగా శ్రద్ధ వహించడంలో యేసు ఒక పరిపూర్ణ ఆదర్శంగా ఉన్నాడు. (లూకా 9:12-17; యోహా. 13:5, 14-16) సమావేశాల్లో స్వచ్ఛందంగా సేవ చేసేవారు అలాంటి స్ఫూర్తినే ప్రతిబింబిస్తారు. సమావేశ డిపార్ట్మెంటుల అవసరతలు తీర్చడానికి స్థానిక సమావేశ కమిటీలు తమతో పని చేయడానికి త్వరలో ఇతరులను ఆహ్వానించనున్నాయి. ప్రత్యేకంగా పెద్దలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నియామకాలు స్వీకరించవలసిన అవసరం ఉంది. వారు ఇష్టపూర్వకంగా ముందుకు వస్తే అది సంఘంలో ఉన్న వారందరికీ మంచి ఆదర్శంగా ఉంటుంది.—1 పేతు. 5:2, 3.
9 ఇతరులు చూసేది: ఒక హోటల్ సేల్స్ మేనేజర్ ఇలా అంది: “మిమ్మల్ని మేము ఎంతో ఇష్టపడతాం. ఇతర గుంపులతో పోల్చితే మీరు చాలా చక్కగా ప్రవర్తిస్తారు. మీరు దయతో వ్యవహరిస్తారని, టిప్స్ కూడా ఇస్తారని మా హోటల్లో పని చేసే హౌస్కీపర్లు అందరూ మీ గురించి చెబుతారు. వాస్తవానికి, మీరు ఇక్కడ ఉండే వారాంతంలో అందరూ పనిచేయడానికి ఇష్టపడతారు!” మరో హోటల్ ప్రతినిధి ఇలా వ్యాఖ్యానించాడు: “యెహోవాసాక్షులతో పని చేయడం చాలా సులభం.” బహుశా ఆదర్శవంతమైన మీ ప్రవర్తన ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడానికి తోడ్పడి ఉండవచ్చు. అలాంటి స్తుతిని తీసుకువచ్చే విధంగా మనం ప్రవర్తించడం చూసి యెహోవా ఎంతగా సంతోషిస్తాడో ఊహించండి!—1 పేతు. 2:12.
10 ఈ సంవత్సరం ఆధ్యాత్మిక ఉపదేశం కోసం తన ప్రజలు సమావేశమయ్యేందుకు యెహోవా దేవుడు ‘నమ్మకమైన గృహనిర్వాహకుని’ ద్వారా ఏర్పాటు చేశాడు. (లూకా 12:42) మూడు రోజులూ హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవడానికి ఎంతో ప్రయాస పడవలసి ఉంటుంది అయితే దానికి తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఈ సంవత్సరపు దైవిక విధేయత జిల్లా సమావేశం ఇప్పుడు, నిరంతరం యెహోవాను సేవించాలనే మన దృఢ సంకల్పాన్ని తప్పక బలపరుస్తుంది. “సమాజములలో దేవుని స్తుతించుడి” అని కీర్తనకర్త ఇచ్చిన సలహాను అనుసరించాలనే దృఢ సంకల్పంతో మనం ఉందాం.—కీర్త. 68:26.
[3వ పేజీలోని బాక్సు]
కార్యక్రమ సమయాలు
శుక్రవారం, శనివారం
ఉ: 9:30 - సా: 5:05
ఆదివారం
ఉ: 9:30 -సా: 4:10
[4వ పేజీలోని బాక్సు]
వసతి ఏర్పాట్లకు మీరు మద్దతు ఇవ్వగల విధానం
◼ పట్టికలో ఇవ్వబడిన హోటళ్ళకు ఫోను చేయడం ద్వారా లేక వీలైతే స్వయంగా వెళ్ళడం ద్వారా గదులను రిజర్వ్ చేసుకోవడానికి వ్యక్తిగత ఏర్పాట్లు చేసుకోండి.
◼ హోటల్ యజమాన్యంతో మీ అవసరతలను స్పష్టంగా పేర్కొనండి. ఒకవేళ పిల్లలైనా పెద్దలైనా అదనంగా మీతోపాటు ఒకే గదిలో ఉండాలనుకుంటే దాని గురించి వారికి వివరించండి.
◼ పట్టికలో సిఫారసు చేయబడిన హోటళ్ళన్నింటికీ ఫోన్ చేసిన తర్వాత కూడా మీకు గదులు దొరకకపోతే లేక ఏదైనా హోటల్ నుండి మీకు సమస్య ఎదురైతే మీ సంఘ కార్యదర్శికి తెలపండి. పట్టిక పైనున్న సమాచారం ఉపయోగించి కార్యదర్శి మీ సమావేశ రూమింగ్ డిపార్ట్మెంట్ను సంప్రదించి అదనపు హోటళ్ళ పేర్లను మీకు తెలియజేస్తారు.
◼ మీకు నిజంగా అవసరమైనన్ని గదులనే రిజర్వు చేసుకోండి.
◼ మీ రిజర్వేషన్‌ను నిశ్చయించుకోవడానికి మీరు రిజర్వు చేసుకున్న ప్రతీ రూముకు డిపాజిట్ కట్టాలి. అలా చేయకపోతే హోటల్‌వారు మీ గదిని వేరొకరికి ఇచ్చే అవకాశం ఉంది.
◼ మీరు ఏ హోటల్లో గదిని రిజర్వు చేసుకుంటే ఆ హోటల్ గదిలోనే ఉండండి. మీరు రిజర్వు చేసుకున్న హోటల్ కన్నా మంచి హోటల్ లభించిందని ఊరికే హోటళ్ళను మార్చకండి.
[4వ పేజీలోని బాక్సు]
హోటల్ గదిని రిజర్వ్ చేసుకొనేందుకు సరైన పద్ధతి ఏమిటి?
1. సిఫారసు చేయబడిన హోటళ్ళ పట్టికలో ఉన్న ఫోన్ నంబర్లను ఉపయోగించి హోటల్ పని వేళల్లోనే ఫోను చేయండి.
2. యెహోవాసాక్షుల సమావేశానికి హాజరవుతున్నారని హోటల్వారికి చెప్పండి.
3. విడిది చేసే తేదీలను స్పష్టం చేయండి.
4. ఒకవేళ గదులు లభ్యం కాకపోతే పట్టికలో ఉన్న మరో హోటల్‌కు ఫోను చేయండి.
5. పట్టికలో సూచించబడిన ధర కన్నా ఎక్కువ ధర కట్టడానికి అంగీకరించకండి.
6. గదిని రిజర్వు చేసుకున్న తర్వాత, డిమాండ్ డ్రాఫ్ట్‌ను లేక మనియార్డర్ను పది రోజుల్లో పంపించండి. ఎన్నడూ డబ్బు పంపించకండి.
7. రసీదు కోసం, గదిని రిజర్వు చేసుకున్నట్లు నిర్ధారించే పత్రం కోసం అడగండి.