క్రొత్త బ్రోషుర్ను పంచిపెట్టేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమం
1 లోక పరిస్థితులను బట్టి నేడు చాలామంది కలత చెందుతున్నారు కానీ ఈ లోకం ఎందుకు ఇలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాబోయే తీర్పులో రక్షణ పొందేందుకు తాము ఏమి చేయాలి అనే విషయాలను కొందరే అర్థం చేసుకుంటున్నారు. (యెహె. 9:4) ప్రస్తుత కాలాలకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించేందుకు వారికి సహాయం చేయడానికి అప్రమత్తంగా ఉండండి! అనే క్రొత్త బ్రోషుర్ను పంచిపెట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 18 సోమవారం నుండి మే 15 ఆదివారం వరకు ఒక ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించబడుతుంది.
2 ఈ బ్రోషుర్ను ఇంటింటి పరిచర్యలో పాల్గొంటున్నప్పుడు, పునర్దర్శనాలు చేసేటప్పుడు, అనియత సాక్ష్యం ఇచ్చేటప్పుడు, లేక బహిరంగ ప్రదేశాల్లో సాక్ష్యం ఇచ్చేటప్పుడు ప్రతిపాదించవచ్చు. కానీ అప్రమత్తంగా ఉండండి! అనే ఈ బ్రోషుర్ను విచక్షణారహితంగా పంచిపెట్టకూడదు. లోక ఘటనల భావం గురించి బైబిలు చెబుతున్న దాని గురించి తెలుసుకోవాలని నిజమైన ఆసక్తి చూపించే వారికి మాత్రమే ఈ బ్రోషుర్లను అందించాలి. సందేశంపట్ల అంతగా ఆసక్తి చూపించనివారికి బ్రోషుర్ బదులు కరపత్రం అందించవచ్చు.
3 మీరు ఇలా చెప్పడం ద్వారా ఒక వ్యక్తి అవధానాన్ని ఆకర్షించవచ్చు:
◼ “నేడు సర్వసాధారణం అయిపోయిన గంభీరమైన సమస్యల గురించి, విభ్రాంతిని కలిగించే ఘటనల గురించి చాలామంది కలత చెందుతున్నారు. [స్థానికంగా తెలిసిన ఒక ఉదాహరణను పేర్కొనండి.] ఇలాంటి విషయాల గురించి బైబిలు ముందుగానే చెప్పిందని మీకు తెలుసా? [ప్రతిస్పందించనివ్వండి. మీరు పేర్కొన్న సమస్యకు అనువైన ఒక లేఖనాన్ని అంటే మత్తయి 24:3, 7, 8; లూకా 21:7, 10, 11; లేక 2 తిమోతి 3:1-5 లాంటి లేఖనాలను చదవండి.] ప్రస్తుత కాలాల భావం గురించీ మానవజాతి భవిష్యత్తు గురించీ బైబిలు వెల్లడి చేస్తోంది. మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారా? [ప్రతిస్పందించనివ్వండి. నిజమైన ఆసక్తి చూపిస్తే బ్రోషుర్ ఇవ్వండి.] ఈ బ్రోషుర్ను ఉచితంగా ఇస్తున్నాం. అయితే మా ప్రపంచవ్యాప్త పనికి మీకు తోచినంత చందా ఇవ్వాలనుకుంటే దానిని మేము సంతోషంగా అంగీకరిస్తాం.”
4 లేక మీరు ఇలా చెప్పడం ఫలవంతంగా ఉండవచ్చు;
◼ “నేడు లోకంలో జరుగుతున్న విభ్రాంతికరమైన ఘటనల కారణంగా లేక వ్యక్తిగతంగా తీవ్ర నష్టానికి గురవడం మూలంగా చాలామంది ఆందోళన చెందుతున్నారు. అలాంటి పరిస్థితులను నివారించేందుకు దేవుడు ఎందుకు జోక్యం చేసుకోడని కొందరు ఆశ్చర్యపడుతుంటారు. మానవజాతి బాధలను తొలగించడానికి దేవుడు త్వరలో చర్యతీసుకుంటాడని బైబిలు హామీ ఇస్తోంది. దేవుడు మానవజాతికి చేకూర్చే ప్రయోజనాలను గమనించండి. [కీర్తన 37:10, 11 చదవండి.] మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఇష్టపడుతున్నారా?” పై ప్రతిపాదనలాగే ముగించండి.
5 బ్రోషుర్ను అంగీకరించే ప్రతి వ్యక్తి పేరు, చిరునామా సంపాదించేందుకు ప్రయత్నించి ఆసక్తిని వృద్ధి చేసేందుకు పునర్దర్శనం కోసం ఏర్పాటు చేసుకోండి. ఆసక్తిని ఎలా వృద్ధి చేయాలనే విషయం గురించిన సూచనలు భవిష్యత్తులో సేవా కూటంలోని భాగాల్లో చర్చించబడతాయి. ఒక వ్యక్తి మొదటి సందర్శనంలోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తే అప్రమత్తంగా ఉండండి! లేక దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ లాంటి ఇతర ప్రచురణలను ఉపయోగించి వెంటనే బైబిలు అధ్యయనం ప్రారంభించవచ్చు.
6 ఈ శీర్షికను చర్చించే వారంలో సేవా కూటం ముగిసిన తర్వాత క్రొత్త బ్రోషుర్ ప్రతులు లభ్యమవుతాయి. ప్రారంభంలో ప్రచారకులు, పయినీర్లు మొదటి కొన్ని రోజుల కార్యక్రమానికి అవసరమయ్యే ప్రతులను మాత్రమే తీసుకోవాలని సలహా ఇవ్వబడుతోంది. యెహోవా తనకు స్తుతి, అన్ని ప్రాంతాల్లోని యథార్థ హృదయులకు ప్రయోజనం చేకూరే విధంగా ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆశీర్వదించును గాక.—కీర్త. 90:17.