క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం
ఈ “అపాయకరమైన కాలములో” యెహోవా ఆమోదాన్ని పొంది, దానిని కాపాడుకొనేందుకు మనకు దైవిక జ్ఞానం అవసరం. (2 తిమో. 3:1) 2005 సేవా సంవత్సరంలో జరిగే ప్రాంతీయ సమావేశ కార్యక్రమం “‘పైనుండివచ్చు జ్ఞానము’ చేత నిర్దేశించబడండి” అనే మూలాంశాన్ని విశదపరుస్తుండగా మనకు ఆచరణాత్మకమైన ఉపదేశం, ప్రోత్సాహం లభిస్తాయి.—యాకో. 3:17.
“మన జీవితంలో ‘పైనుండివచ్చు జ్ఞానమును’ కనబరచడం,” అనే మొదటి గోష్ఠి, పవిత్రమైనవారిగా, సమాధానపరులుగా, సహేతుకమైనవారిగా, సులభంగా లోబడేవారిగా ఉండడంలో ఏమి ఇమిడివుందో గ్రహించేందుకు మనకు సహాయం చేస్తుంది. ఆ తర్వాత ప్రాంతీయ పైవిచారణకర్త, పైనుండివచ్చే జ్ఞానానికి సంబంధించిన మూడు ఇతర అంశాలమీదికి దృష్టి సారిస్తాడు. తర్వాత, జిల్లా పైవిచారణకర్త, కొందరు దేవుని పరిచారకులను ‘విద్యలేని పామరులుగా’ దృష్టించినా, దేవుని జ్ఞానాన్ని గురించి మాట్లాడేందుకు వారు ఎలా సిద్ధంగా ఉన్నారో వివరించడం ద్వారా మొదటి దినాన్ని ముగిస్తాడు.—అపొ. 4:13.
రెండవ దినాన, “క్షేమాభివృద్ధికరమైన వాటిని వెంబడించండి” అనే గోష్ఠి, ఆధ్యాత్మికంగా మనల్ని బలహీనపరచే అంశాలను గుర్తించి, వాటిని తప్పించుకొనేందుకు మనకు సహాయం చేస్తుంది. సంఘకూటాలలో, పరిచర్యలో, కుటుంబ పరిధిలో ఇతరులను మనమెలా ప్రోత్సహించవచ్చో కూడా అది చూపిస్తుంది. “దేవుని జ్ఞానం మనకెలా మేలు చేస్తుంది?” అనే బహిరంగ ప్రసంగం, దైవిక సూత్రాలను మన జీవితంలో అన్వయించుకుంటుండగా మనం పొందే ప్రయోజనాల విషయంలో మన ప్రశంసను అధికం చేస్తుంది. “దేవుని జ్ఞానం ప్రకారం ప్రవర్తించడం మనలను కాపాడుతుంది,” అనే ముగింపు ప్రసంగం ఈ అంత్యదినాలలో జ్ఞానంకోసం యెహోవాను వేడుకోవాలనే మన తీర్మానాన్ని బలపరుస్తుంది.
ప్రతీ సమావేశంలో ఉండే ఉన్నతాంశం, కొత్త శిష్యులు బాప్తిస్మం తీసుకోవడం. ఆ వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, కావలికోట అధ్యయనం కూడా కార్యక్రమంలో ఉంటాయి. యెహోవా తాను అందిస్తున్న జ్ఞానంనుండి మనమందరం ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాడు. ప్రాంతీయ సమావేశంలో మనకోసం వేచివున్న ఉపదేశ ప్రోత్సాహాల ద్వారా మనం ఆధ్యాత్మికంగా సుసంపన్నం చేయబడతాం.—సామె. 3:13-18.