ప్రశ్నా భాగం
◼ వేరే భాష మాట్లాడే గుంపును ఎప్పుడు ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుంది?
ఒక సంఘ క్షేత్రంలో వేరే భాష మాట్లాడే ప్రజల సంఖ్య ఒక మోస్తరుకు చేరుకుందంటే, ఆ భాషలో ప్రకటనా పనిని వ్యవస్థీకరించేందుకు పెద్దలు చేయగలిగింది చేయాలి. (km 7/02 1వ పేజీ; km 2/98 3-4 పేజీలు) బహుశా వేరే భాష మాట్లాడే ప్రజలు మీ పొరుగునున్న రెండు లేక అంత కంటే ఎక్కువ సంఘాల క్షేత్రాల్లో చెల్లాచెదురుగా అక్కడక్కడా ఉండివుండవచ్చు. అలాంటి సందర్భంలో ప్రయాణ పైవిచారణకర్త(లు) అవసరమైన మార్గదర్శకాన్ని ఇస్తారు, ఆ క్షేత్రాలకు సంబంధించిన సంఘాలు ప్రకటనా కార్యకలాపాల్లో పరస్పరం సహకరించుకోవడానికి సహాయం చేస్తాడు. వేరే భాష కూటాలకు ఎంతమంది హాజరవుతారో తెలుసుకునేందుకు, అప్పుడప్పుడు ఒక బహిరంగ ప్రసంగమో లేదా కావలికోట అధ్యయనమో ఏర్పాటు చేయవచ్చు.
ఈ క్రింద చెప్పిన అవసరతలు సమకూరినప్పుడు వేరే భాష మాట్లాడే గుంపును ఏర్పాటు చేయవచ్చు: (1) వేరే భాషలో సువార్తను బాగా అర్థం చేసుకోగల ప్రచారకులు లేదా ఆసక్తిగలవారు ఉండాలి. (2) సారథ్యం వహిస్తూ కనీసం వారానికి ఒక కూటం నిర్వహించేందుకు అర్హతగల పెద్ద లేదా పరిచర్య సేవకుడు అందుబాటులో ఉండాలి. (3) ఆ గుంపుకు మద్దతు ఇచ్చేందుకు ఇష్టపడే పెద్దల సభ ఉండాలి. ఈ అవసరతలు సమకూరినప్పుడు, ఆ గుంపు అధికారికంగా గుర్తించబడేలా, ఆ తర్వాత కావలసిన సూచనలు ఇవ్వబడేలా పెద్దలు బ్రాంచి కార్యాలయానికి తెలియజేయాలి.
చాలా గుంపులు ముందు ప్రతీ వారం సంఘ పుస్తక అధ్యయనాలు జరుపుకుంటాయి. ఆ తర్వాత బహిరంగ ప్రసంగం, కావలికోట అధ్యయనం వంటివి అదనంగా చేర్చేందుకు పెద్దలు ఆమోదించవచ్చు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల సలహాదారుగా సేవ చేసే అర్హతతోపాటు ఆ భాష మాట్లాడగల పెద్ద గానీ పరిచర్య సేవకుడు గానీ ఉంటే 2వ, 3వ, 4వ నియామకాలను వేరే తరగతి గదిలో నిర్వహించవచ్చు. అయితే ఆ గుంపు ఉపదేశ ప్రసంగం, బైబిలు ఉన్నతాంశాలు, పరిచర్య కూటం కోసం సంఘంతో కలుస్తుంది. గుంపు కోసం క్షేత్ర సేవా కూటాలు కూడా ఏర్పాటు చేయవచ్చు.
గుంపులోని వాళ్ళందరూ పెద్దల సభ ఆధ్వర్యంలో సన్నిహితంగా పనిచేయాలి. పెద్దలు సమతూకమైన మార్గదర్శకాన్ని ఇవ్వాలి, గుంపు అవసరాల పట్ల శ్రద్ధ చూపించేందుకు చొరవ తీసుకోవాలి. ఆ గుంపుకు మద్దతిస్తున్న సంఘాన్ని ప్రయాణ పైవిచారణకర్త సందర్శించినప్పుడు, ఆయన ఆ గుంపును ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు వారితో కూడా పనిచేయాలి. యెహోవా ఆశీర్వాదంతో, వేరే భాష మాట్లాడే గుంపు కాల క్రమేణా ఒక సంఘంగా మారవచ్చు.