“ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము”
1. ఏకముగా కూడి దేవుని నామమును గొప్ప చేయడానికి మనకెలాంటి అవకాశముంది, దానికి సిద్ధపడేందుకు మనమిప్పుడు ఏమి చేయవచ్చు?
1 “నాతో కూడి యెహోవాను ఘనపరచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము” అని కీర్తనకర్త పాడాడు. (కీర్త. 34:3) రానున్న “దేవునితో నడవండి” అనే జిల్లా సమావేశంలో, అనేక సంఘాల నుండి వచ్చే మన సహోదర సహోదరీలతో ఏకంగా కూడి యెహోవా నామమును గొప్ప చేసే అవకాశం మనకు లభిస్తుంది. మీరు మీ వసతి, ప్రయాణం, సెలవు వంటి వాటికోసం కావలసిన ఏర్పాట్లు చేసుకున్నారా? మనం చాలా ముందుగానే ఈ ఏర్పాట్లను చేసుకోవడం జ్ఞానవంతంగా ఉంటుంది.—సామె. 21:5.
2. సమావేశ స్థలానికి తొందరగా చేరుకునేలా ప్రణాళిక వేసుకోవడం దేనికి ప్రయోజనకరంగా ఉంటుంది?
2 సమావేశ స్థలానికి చేరుకోవడం: మనం సమావేశానికి హాజరైనప్పుడు శ్రద్ధ వహించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇంటి నుండి తొందరగా బయల్దేరడం, ఊహించని ఆలస్యం జరగకుండా, ప్రారంభపు పాటలో ప్రార్థనలో నిండు హృదయంతో పాల్గొనేందుకు వీలుగా సీట్లు వెతుక్కొని కూర్చోవడానికి సహాయకరంగా ఉంటుంది. (కీర్త. 69:30) దులియజాన్, న్యూ ఢిల్లీ, పోర్ట్ బ్లయర్, సికింద్రాబాద్‌లలోని సమావేశాలకు హాజరయ్యేవారిని తమ స్వభాషలోని పాటల బ్రోషుర్ (sb-29)ను తెచ్చుకొమ్మని కోరుతున్నాము, ఆ విధంగా అందరూ హృదయపూర్వకంగా కలిసి పాడవచ్చు. ఈ సమావేశాల కోసం తీసుకోబడిన పాటలన్నీ ఈ బ్రోషుర్ నుండే ఎంపిక చేయబడ్డాయి. సమావేశపు ఒక భాగం ప్రారంభించడానికి కొద్ది నిమిషాల ముందు, ఆరంభపు రాజ్య సంగీతం వినిపిస్తుండగా అధ్యక్షుడు వేదికపై కూర్చొని ఉంటాడు. ఆ సమయానికల్లా మనమందరం మన సీట్లలో కూర్చుంటే, కార్యక్రమం గౌరవప్రదంగా ప్రారంభించవచ్చు. (1 కొరిం. 14:33, 39-40) దులియజాన్, ఐజోల్ సమావేశాల్లో కార్యక్రమం ప్రతిరోజు ఉ. 8:30కి ప్రారంభమవుతుంది. సమావేశానికి వచ్చే ప్రతినిధులు చీకటి పడకముందే తమ నివాసానికి చేరుకోవడానికి సహాయకరంగా ఉండాలని ఈ సమయం నిర్ణయించబడింది.
3. ఈ సంవత్సరం సమావేశాలు పెద్ద సంఖ్యలో సమకూడేలా ఎందుకు ఏర్పాటు చేయబడ్డాయి?
3 ఈ సంవత్సరం భారతదేశంలో సమావేశాల సంఖ్య తగ్గించబడింది. మనం పెద్ద సంఖ్యలో సమకూడాలన్నదే దీని ఉద్దేశం. దీనివల్ల కొందరికి ప్రయాణ దూరం, ఖర్చులు అధికం కావచ్చు. అయితే ఎక్కువ మంది సహోదరులతో సహవాసాన్ని, ఉత్తమ కార్యక్రమాన్ని ఆస్వాదించే సదవకాశం మనకు లభిస్తుంది. ఇలాంటి పెద్ద పెద్ద సమావేశాలు స్థానిక సమాజానికి మంచి సాక్ష్యంగా కూడా ఉంటాయి. కాబట్టి యెహోవా ఆశీర్వాదాల కోసం ఆయనకు ప్రార్థించండి, కృత నిశ్చయంతో ప్రయత్నించండి, మొత్తం మూడు రోజులూ హాజరయ్యేందుకు డబ్బులు, సెలవులు పొదుపు చేసుకోండి.
4. మనం సీట్ల కోసం వెతుక్కునేటప్పుడు ఇతరుల పట్ల మన శ్రద్ధను ఎలా చూపించవచ్చు?
4 “మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి” అని దేవుని వాక్యం మనకు ఉద్బోధిస్తోంది. (1 కొరిం. 16:14) ఉ. 8:00 గంటలకు తలుపులు తెరచినప్పుడు, ఇతరులను పరిగణలోకి తీసుకుంటే, అందరికంటే ముందు మనకు నచ్చిన సీట్లను ఆపుకోవాలనే ప్రయత్నంలో పరుగెత్తడం, తోసుకుంటూ వెళ్ళడం, నెట్టివేయడం వంటివి చేయము. మీతోపాటు మీ ఇంట్లో ఉంటున్న వారికి, మీ బైబిలు విద్యార్థులకు మాత్రమే సీట్లు ఆపుకోవచ్చు.—1 కొరిం. 13:5; ఫిలి. 2:4.
5. మధ్యాహ్నపు విరామ సమయం కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అవి ఏ విధంగా ప్రయోజనకరంగా ఉంటాయి?
5 దయచేసి మధ్యాహ్న భోజనం కోసం సమావేశ స్థలం నుండి దూరంగా వెళ్ళకుండా, సాదా ఆహారం వెంట తెచ్చుకోండి. ఆ విధంగా అందరూ క్షేమాభివృద్ధికరమైన సహవాసాన్ని ఆస్వాదించవచ్చు, మధ్యాహ్న కార్యక్రమాన్ని మొదటి నుండి వినవచ్చు. కుటుంబ సభ్యులు, ఇతరులు తమ కోసం సహోదరీలు రకరకాల వంటకాలు చేసుకురావాలని ఆశించడం ప్రేమరహితమవుతుంది. అలాంటి వంటల వల్ల సహోదరీలు సమావేశానికి చేరే సరికి అలసిపోతారు, కార్యక్రమంపై ఏకాగ్రత నిలపడం వారికి కష్టమవుతుంది. సమావేశ స్థలంలోకి మద్యపాన పదార్థాలు అనుమతించబడవు.
6. మనం అందుకోబోయే ఉపదేశం కోసం మన హృదయాలను ఎలా సిద్ధం చేసుకోవచ్చు?
6 మన కోసం వేచివున్న ఆధ్యాత్మిక విందు: ‘దేవునియొద్ద విచారణ చేయుటకు తన మనస్సు నిలుపుకొన్న’ వారిలో రాజైన యెహోషాపాతు ఒకరు. (2 దిన. 19:3) సమావేశానికి ముందు మనం మన మనస్సును ఎలా నిలుపుకోవచ్చు లేదా ఎలా సిద్ధం చేసుకోవచ్చు? తేజరిల్లు! అక్టోబరు-డిసెంబరు 2004 సంచిక చివరి పేజీ వడ్డించబోయే ఆధ్యాత్మిక విందు యొక్క సమీక్షను అందజేస్తుంది. కాస్త సమయం తీసుకొని, యెహోవా మన కోసం ఏమి దాచి ఉంచాడో ఊహించుకుంటూ ఆ ఆర్టికల్‌ను ఎందుకు ధ్యానించకూడదు? మన మనస్సును లేక హృదయాన్ని సిద్ధం చేసుకోవడంలో, మనం అందుకునే ఉపదేశపు భావాన్ని గ్రహించడం కోసం, దాన్ని అన్వయించుకోవడం కోసం యెహోవాను సహాయం కోరడం కూడా ఇమిడివుంది.—కీర్త. 25:4, 5.
7. మనం ఏమి కోరుకుంటాం, అలా ఎందుకు కోరుకుంటాం?
7 దేవుని వాక్యం ద్వారా మనం రక్షణ విషయంలో ఎదగవచ్చని గ్రహించాం కాబట్టి, దాని నుండి మరింత నేర్చుకోవాలని మనమందరం కోరుకుంటాం. (1 పేతు. 2:1, 2) కాబట్టి “దేవునితో నడవండి” అనే మన సమావేశానికి హాజరై ‘ఏకముగా కూడి యెహోవా నామమును గొప్ప చేద్దాం.’—కీర్త. 34:3.
[3వ పేజీలోని బాక్సు]
దేవుని నామమును గొప్ప చేయడానికి మార్గాలు
◼ ముందుగానే సిద్ధపడండి
◼ ఇతరుల పట్ల ప్రేమ చూపించండి
◼ హృదయాన్ని సిద్ధం చేసుకోండి