యౌవనులారా—భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకోండి
1. క్రైస్తవ యౌవనులు బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం ఎందుకు అవసరం?
1 మీ మనస్సులోవున్న అతి ముఖ్యమైన విషయం ఏమిటి? మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు? ప్రస్తుత విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా లేక భవిష్యత్తుకు, దేవుడు వాగ్దానం చేసినవాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారా? (మత్త. 6:24, 31-33; లూకా 8:14) దేవుని వాగ్దానాల అనుసారంగా చర్య తీసుకోవడానికి బలమైన విశ్వాసం అవసరం, ఆ విషయాన్ని మనం అబ్రాహాము మోషేల మాదిరి నుండి చూడవచ్చు. (హెబ్రీ. 11:8-10, 24-26) మీరు అలాంటి విశ్వాసాన్ని వృద్ధి చేసుకుని “రాబోవు కాలమునకు మంచి పునాది” ఎలా వేసుకోవచ్చు?—1 తిమో. 6:18.
2. యోషీయా మాదిరి నుండి మనమేమి నేర్చుకుంటాము?
2 యెహోవాను వెదకండి: మీకు మీ కుటుంబంతో క్రమమైన ఆధ్యాత్మిక దినచర్య ఉంటే అది ప్రశంసనీయం. అయితే అలాంటి దినచర్య దానంతటదే బలమైన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తుందని అనుకోకండి. “దేవుని గూర్చిన విజ్ఞానము”ను కనుగొనడానికి మీరు వ్యక్తిగతంగా యెహోవాను వెదకాలి. (సామె. 2:3-5; 1 దిన. 28:9) యౌవనస్థుడైన యోషీయా రాజు అదే చేశాడు. ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏమాత్రం దోహదపడని వాతావరణంలో పెరిగినప్పటికీ ఆయన 15 ఏళ్ళ వయస్సులో “తన పితరుడైన దావీదుయొక్క దేవునియొద్ద విచారించుటకు పూనుకొ[నెను].”—2 దిన. 34:3.
3. యువ క్రైస్తవులు నేడు యెహోవాను ఎలా వెదకవచ్చు?
3 మీరు యెహోవాను ఎలా వెదకవచ్చు? మీరు నమ్మేదాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవడం ద్వారా, అది నిజంగా సత్యమని ‘పరీక్షించి తెలుసుకోవడం’ ద్వారా అలా వెదకవచ్చు. (రోమా. 12:2) ఉదాహరణకు, రక్తం గురించి బైబిలు ఏమి చెబుతోందో మీరు వివరించగలరా లేక 1914లో దేవుని రాజ్యం పరలోకంలో పరిపాలన ప్రారంభించిందని నిరూపించగలరా? “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” సంపాదించుకోవడం, భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకోవడంలో ఒక ప్రాముఖ్యమైన భాగం.—1 తిమో. 2:3, 4.
4. బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు తమ పురోగతిని ఎలా ప్రదర్శించవచ్చు?
4 యోషీయా దేవుని కోసం చేసిన అన్వేషణకు మంచి ఫలితాలు లభించాయి. ఆయన 20 ఏళ్ళ వయస్సుకు చేరుకోక ముందే దేశంలో నుండి అబద్ధ ఆరాధనను నిర్మూలించడానికి ధైర్యంగా చర్య తీసుకున్నాడు. (2 దిన. 34:3-7) అదేవిధంగా మీ ఆధ్యాత్మిక పురోగతి మీ చర్యల ద్వారా వెల్లడవుతుంది. (1 తిమో. 4:15) మీరు బాప్తిస్మం తీసుకోని ప్రచారకులైతే, పరిచర్యలో మీ నైపుణ్యాన్ని మెరుగుపరచుకోవడానికి కృషి చేయండి. కేవలం సాహిత్యం ఇస్తే సరిపోతుందిలే అని సంతృప్తి పడకండి. బైబిలును ఉపయోగించడం, ప్రజలతో తర్కించడం, కనుగొన్న ఆసక్తిని వృద్ధి చేయడం మీ లక్ష్యంగా పెట్టుకోండి. (రోమా. 12:6-7) ఇది మీరు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయం చేస్తుంది.
5. బాప్తిస్మం తీసుకున్న క్రైస్తవులు తమ పరిచర్యను విస్తృతపరచుకోవడానికి వారికి ఏ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి?
5 మీకు సాధ్యమైనంత సర్వోత్తమమైనది యెహోవాకు ఇవ్వండి: బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యెహోవాకు మీరు చేసుకున్న సమర్పణను సూచించినప్పుడు, మీరు దేవుని నియమిత పరిచారకులవుతారు. (2 కొరిం. 3:5, 6) ఇది మీరు పూర్తికాలం యెహోవా సేవ చేయడానికి మీకు అవకాశాలనిస్తుంది. వీటిలో పయినీరుగా, బెతెల్లో, ప్రయాణపనిలో సేవ చేయడంవంటివి ఉన్నాయి. మీ పరిచర్యను విస్తృతపరచుకోవడానికి ఇతర మార్గాలు మరో భాష నేర్చుకోవడం, అవసరం ఎక్కువగా ఉన్న స్థలంలో సేవచేయడానికి వెళ్ళడం.
6. మనమందరం భవిష్యత్తు కోసం మంచి పునాది ఎలా వేసుకోవచ్చు?
6 అయితే అందరూ ఈ సేవాధిక్యతల కోసం తమను తాము అందుబాటులో ఉంచుకోలేరన్నది నిజమే గానీ మనలో ప్రతి ఒక్కరం మనకు సాధ్యమైనంత సర్వోత్తమమైనది యెహోవాకు ఇవ్వవచ్చు. (మత్త. 22:37) మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, యెహోవా సేవ చేయడాన్ని మీ జీవితంలో ప్రధాన విషయంగా చేసుకోండి. (కీర్త. 16:5) అలా చేయడం ద్వారా మీరు భవిష్యత్తు కోసం మంచి పునాది వేసుకుంటున్నట్లే.