దేవుడు చూపిన దయపట్ల కృతజ్ఞత
1 అపొస్తలుడైన పౌలు క్రైస్తవుడిగా మారకముందు, క్రైస్తవత్వం వ్యాప్తి చెందడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కానీ, ఆయన తెలియక అలా చేశాడు కాబట్టి ఆయనకు దయ చూపబడింది. యెహోవా అనర్హదయ చూపి పౌలుకు ప్రకటించే నియామకాన్నిచ్చాడు. ఆయన ఆ నియామకాన్ని ఎంతో విలువైనదిగా ఎంచాడు. (అపొ. 26:9-18; 1 తిమో. 1:12-14) యెహోవా చూపిన దయపట్ల పౌలుకున్న కృతజ్ఞత, ఆయన తన పరిచర్యలో స్వయంత్యాగపూరిత స్వభావంతో పనిచేసేలా కదిలించింది.—2 కొరిం. 12:15.
2 దేవుని దయాసంకల్పం చొప్పున మనకు కూడా ఒక పరిచర్య ఇవ్వబడింది. (2 కొరిం. 4:1) పౌలువలే మనం కూడా ఇతరుల ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడేందుకు కృషిచేయడం ద్వారా, ఆ దయపట్ల మన కృతజ్ఞతను ప్రదర్శించవచ్చు. మనమలా చేయడానికి ఒక మార్గం, బైబిలు అధ్యయనాలను ప్రారంభించి వాటిని నిర్వహించడమే.
3 బైబిలు అధ్యయనాలను ప్రారంభించడం: బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి ఒక విధానమేమిటంటే, పత్రికా మార్గాన్ని ఏర్పాటు చేసుకోవడం. పత్రికా మార్గంలోని వారిని మనం క్రమంగా సందర్శించినప్పుడు వారికున్న చింతలేమిటో మనకు మరెక్కువగా తెలుస్తాయి. చివరకు, మనం వారికిచ్చే పత్రికల్లోని ఒకానొక ఆర్టికల్, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి సహాయపడవచ్చు. తర్వాతి సందర్శనాల్లో గృహస్థునికి పత్రికలు అందించినప్పుడు దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్ నుండి చర్చలు కొనసాగించడం సాధ్యపడవచ్చు.
4 ప్రార్థనాపూర్వకంగా కృషి చేయాలి: మన ప్రార్థనలకు హృదయపూర్వక కృషి తోడైతే అది మన ప్రకటనా పనిని మెరుగుపరుస్తుంది. ఒక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్న పయినీరు సహోదరి, తనకు మరిన్ని బైబిలు అధ్యయనాలు లభించేలా ఆశీర్వదించమని యెహోవాకు ప్రార్థించింది. ఆమె తన ప్రార్థనలకు అనుగుణంగా కూడా పనిచేసింది. ఆమె తన పరిచర్యను పరిశీలించుకొని, తను పునర్దర్శనాలు చేసినప్పుడు బైబిలు అధ్యయనాలను ప్రతిపాదించడంలేదని గ్రహించింది. ఆమె అలా చేయడం ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే మరో రెండు అధ్యయనాలను ప్రారంభించగలిగింది.
5 ‘దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిస్తున్నందుకు’ మనమెంత ధన్యులమో కదా! (అపొ. 20:24) దేవుడు చూపిన దయపట్ల మనకున్న కృతజ్ఞత, యెహోవా అనర్హదయనుండి ఇతరులు ప్రయోజనం పొందేందుకు వారికి సహాయం చేయడంలో మరింత కృషిచేయడానికి మనల్ని కదిలించును గాక.