మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తారు?
1 అనేక మతసంస్థలు, విద్యాభ్యాసం కోసం లేదా వైద్యపరమైన అవసరాలు తీర్చడం కోసం భవనాలను నిర్మించడం లేదా విరాళాలు ఇవ్వడం వంటి ధర్మక్రియలను ఘనంగా ఎంచుతాయి. అయితే యెహోవాసాక్షులు “ఉపకారమును ధర్మమును” చేయడం మరచిపోకుండానే ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు.—హెబ్రీ. 13:16.
2 మొదటి శతాబ్దపు మాదిరి: యేసు తన భూ పరిచర్యలో ఎన్నో మంచి పనులు చేశాడు, అయితే సత్యం గురించి సాక్ష్యమివ్వడమే ఆయన చేసిన ప్రాథమిక పని. (లూకా 4:43; యోహా. 18:37, 38; అపొ. 10:38) “కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; . . . వారికి బోధించుడి” అని ఆయన తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. (మత్త. 28:19, 20) తాను ప్రారంభించిన పనిని తనపై విశ్వాసముంచే ప్రజలు అధికస్థాయిలో చేస్తారని ఆయన సూచించాడు. (యోహా. 14:12) యేసు ప్రకటనా పనికి ప్రాధాన్యతనిచ్చాడు, ఎందుకంటే రక్షణ మార్గాన్ని తెలుసుకోవడానికి అది ప్రజలకు సహాయం చేస్తుంది.—యోహా. 17:3.
3 అపొస్తలుడైన పౌలు తన ప్రకటనా పనిని నిర్లక్ష్యం చేయకూడని ఒక “కర్తవ్యం”గా దృష్టించాడు. (1 కొరిం. 9:16, 17, ఈజీ-టు-రీడ్ వర్షన్) ఆయన తన పరిచర్యను పూర్తి చేసేందుకు ఏ త్యాగం చేయడానికైనా, ఎటువంటి కష్టాన్ని సహించడానికైనా లేదా ఏ బాధను అనుభవించడానికైనా సుముఖంగా ఉన్నాడు. (అపొ. 20:22-24) అపొస్తలుడైన పేతురు, ఆయన సహవాసులు అలాంటి స్ఫూర్తినే చూపించారు. చెరసాలలో వేయబడినప్పుడు, కొట్టబడినప్పుడు కూడా వారు “మానక బోధించుచు, యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి.”—అపొ. 5:40-42.
4 మన విషయమేమిటి? రాజ్య సువార్తను ప్రకటించే పనికి, శిష్యులను చేసే పనికి మనం ప్రాధాన్యతనిస్తున్నామా? “కాపరిలేని గొఱ్ఱెలవలె విసికి చెదరియున్న” ప్రజలపై యేసుకున్నట్లు మనకు కూడా నిజమైన శ్రద్ధ ఉందా? (మత్త. 9:36) ఈ దుష్ట విధానం త్వరలోనే అంతమవుతుందని ప్రస్తుత లోక సంఘటనలు, బైబిలు ప్రవచనం స్పష్టంగా రుజువుచేస్తున్నాయి! ప్రకటనా పని ప్రాముఖ్యతను స్పష్టంగా మనసులో ఉంచుకోవడం, మనం ఆసక్తితో ప్రకటించడానికి మనల్ని కదిలిస్తుంది.
5 మీ పరిస్థితులను పరిశీలించుకోండి: వ్యక్తిగత పరిస్థితులు తరచూ మారుతూ ఉంటాయి కనుక, ప్రకటనా పనిలో ఎక్కువగా భాగం వహించడానికి మనం ఏ సర్దుబాట్లను చేసుకోవచ్చు అనే విషయం గురించి అప్పుడప్పుడు ఆలోచించుకోవడం మంచిది. ఒక సహోదరి 1950లలో, 60లలో, 70లలో క్రమ పయినీరుగా సేవచేసింది, కానీ ఆ తర్వాత అనారోగ్య కారణంగా పయినీరు సేవను మానుకోవలసి వచ్చింది. అయితే కొద్దికాలానికి ఆమె ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇటీవలె తన పరిస్థితులను మరోసారి పరిశీలించుకొని తాను మళ్ళీ పయినీరు సేవ చేయగలననే నిర్ధారణకు వచ్చింది. 90 సంవత్సరాల వయస్సులో పయినీరు సేవా పాఠశాలకు హాజరవడానికి ఆమె ఎంతగా సంతోషించిందో! మీ విషయమేమిటి? మీరు ఉద్యోగవిరమణ పొందబోతున్నారా లేక మీ ఉన్నత విద్య ముగింపుకొచ్చిందా? మారిన మీ పరిస్థితులు మీరు పయినీరు సేవ చేయడానికి అనుమతిస్తాయా?
6 మార్త “విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరప[డడాన్ని]” యేసు గమనించినప్పుడు, ఆమె అనవసరమైన పనులను తగ్గించుకుంటే ఎన్నో గొప్ప ఆశీర్వాదాలను పొందవచ్చని ఆమెకు దయాపూర్వకంగా తెలియజేశాడు. (లూకా 10:40-42) మీరు మీ జీవిత విధానాన్ని నిరాడంబరంగా ఉంచుకోగలరా? భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయడం నిజంగా అవసరమా? సర్దుబాట్లు చేసుకుంటే మీ కుటుంబం కేవలం ఒక వ్యక్తి ఆదాయంపై జీవించగలదా? పరిచర్యలో ఎక్కువగా భాగం వహించడానికి వీలుగా సర్దుబాట్లు చేసుకున్న అనేకమంది ఆధ్యాత్మిక ప్రయోజనాలను పొందారు.
7 యేసు, అపొస్తలులు ఉంచిన మాదిరిని మనమందరం అనుసరిద్దాం! రాజ్య సువార్తను ప్రకటించడమనే ప్రాముఖ్యమైన పనిలో ఎక్కువగా భాగం వహించడానికి మనం చేసే యథార్థమైన కృషిని యెహోవా ఆశీర్వదిస్తాడని మనం నిశ్చయతతో ఉండవచ్చు.—లూకా 9:57-62.