ప్రకటించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి
1 యేసు ఒక “రాజుగాను అధిపతిగాను,” తన శిష్యుల ముందున్న విస్తృతమైన ప్రకటనా పని కోసం వారికి శిక్షణనిచ్చాడు. (యెష. 55:4; లూకా 10:1-12; అపొ. 1:8) యేసు తమకిచ్చిన పనిని అపొస్తలుడైన పేతురు ఈ మాటల్లో వర్ణించాడు: “దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని [“సంపూర్ణంగా సాక్ష్యమివ్వాలని,” NW] మాకు ఆజ్ఞాపించెను.” (అపొ. 10:42) సంపూర్ణంగా సాక్ష్యమివ్వాలంటే ఏమి చేయాలి?
2 అపొస్తలుడైన పౌలు మాదిరిని పరిగణలోకి తీసుకోవడం ద్వారా మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఆయన ఎఫెసు సంఘంలోని పెద్దలను కలిసినప్పుడు, వారికిలా గుర్తుచేశాడు: “ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు, దేవుని యెదుట మారుమనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని, యూదులకును గ్రీసుదేశస్థులకును ఏలాగు సాక్ష్యమిచ్చుచుంటినో [“సంపూర్ణంగా సాక్ష్యమిచ్చుచుంటినో,” NW] యిదంతయు మీకు తెలియును.” (ఇటాలిక్కులు మావి.) పౌలు తాను స్వయంగా కష్టాలను సహిస్తున్నప్పటికీ సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలకు సువార్త తెలియజేసేందుకు బాగా కృషి చేశాడు. ఆయన తన శ్రోతలతో కేవలం ప్రాథమిక సత్యాలను పంచుకోవడంతోనే తృప్తిపడక “దేవుని సంకల్పమంతయు” వారికి తెలియజేయడానికి కృషి చేశాడు. ఆయన దాన్ని సాధించేందుకు కృషి చేయడానికి, త్యాగాలు చేయడానికి సుముఖంగా ఉండేవాడు. ఆయన ఇంకా ఇలా తెలియజేశాడు: “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు [“సంపూర్ణంగా సాక్ష్యమివ్వడంలో,” NW] నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.” (ఇటాలిక్కులు మావి.) —అపొ. 20:20, 21, 24, 27.
3 నేడు మనం పౌలు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (1 కొరిం. 11:1) మనం కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ అర్హులైన ప్రజల కోసం కుటుంబాల కోసం వెదకడం ద్వారా, అన్ని నేపథ్యాల వారికి అన్ని భాషల వారికి సువార్త తెలియజేయడానికి కష్టపడడం ద్వారా, మనం కలిసిన ఆసక్తిగల ప్రజలకు శ్రద్ధతో సహాయం చేయడం ద్వారా మనం ఆయనను అనుకరించవచ్చు. (మత్త. 10:12, 13) అలా చేయడానికి సమయం, కృషి, ప్రజలపట్ల ప్రేమ అవసరం.
4 మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి మార్చి, ఏప్రిల్ నెలలు మీకు చక్కని అవకాశాన్నివ్వగలవు. గత సంవత్సరం సహాయ పయినీరు సేవ చేయడానికి ఎంతో మంది ప్రచారకులు ప్రత్యేకమైన కృషి చేశారన్న విషయం ఎంత ప్రోత్సాహకరం!
5 ఎన్నో ఆరోగ్య సమస్యలున్న 80 సంవత్సరాల వయస్సుగల ఒక సహోదరి యెహోవా సంస్థ నుండి వచ్చిన ప్రోత్సాహం చేత ప్రేరేపించబడింది. “అది నా హృదయంలో ఎంతో కాలంగా ఉన్న కోరికను పునరుజ్జీవింపజేసింది, కనీసం ఇంకొక్కసారైనా సహాయ పయినీరు సేవ చేయాలని నేను భావించేలా చేసింది.” ఆమె మార్చి నెలలో సహాయ పయినీరు సేవ చేయడాన్ని తన లక్ష్యంగా పెట్టుకుంది. “మొదట నేను కూర్చొని పరిస్థితులను పరిశీలించుకున్నాను. నాకు నా కూతురు సహాయం అవసరమవుతుంది కాబట్టి నా ప్రణాళిక గురించి ఆమెతో చర్చించాను. నా కూతురు తాను కూడా సహాయ పయినీరు సేవ చేయడానికి దరఖాస్తు పెట్టడం ద్వారా నన్ను ఆశ్చర్యపరిచింది” అని ఆమె చెబుతోంది. ఆ నెలలో ఈ వృద్ధ సహోదరి పరిచర్యలో 52 గంటలు గడిపింది. “నేను అలసిపోతున్నాను అని నాకు అనిపించినప్పుడల్లా నా శక్తిని పునరుజ్జీవింపజేయమని అడుగుతూ యెహోవాకు ఎన్నోసార్లు ప్రార్థించాను. నెల ముగిసేసరికి నేను ఎంతో సంతోషంగా సంతృప్తిగా భావించాను, నాకు సహాయం చేసినందుకు నేను యెహోవాకు అనేకసార్లు కృతజ్ఞతలు తెలియజేశాను. నేను మళ్ళీ సహాయ పయినీరు సేవ చేయడానికి ఇష్టపడతాను” అని ఆమె అంటోంది. గంభీరమైన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సహాయ పయినీరు సేవ చేయాలని ఎంతగానో కోరుకునే ఇతరులను ఈ సహోదరి సంతోషకరమైన అనుభవం ప్రోత్సహించవచ్చు.
6 అనుకోకుండా ఉద్యోగంలో నుండి తీసివేయబడిన ఒక సహాదరుడు, ఆ అవకాశాన్ని సహాయ పయినీరు సేవ చేయడానికి ఉపయోగించుకున్నాడు. నెల గడుస్తున్నకొద్ది ఆయన ప్రకటనా పనిలో మరింత ఆసక్తిగా పనిచేశాడు, నెల ముగిసేసరికి ఆయన ఒక కొత్త బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించాడు. ఆయన తన అనుభవం గురించి ఆలోచిస్తూ, “అది ఎంతో ప్రతిఫలదాయకమైన నెల!” అని అన్నాడు. యెహోవా తనకు మార్గదర్శకాన్ని, సహాయాన్ని అందజేసినందుకు ఆయన ఎంత ఉప్పొంగిపోయాడో! అవును పరిచర్య చేయడం కోసం ఆ సహోదరుడు చేసిన అదనపు కృషి ఫలితంగా యెహోవా ఆయనపై గొప్ప ఆశీర్వాదాన్ని కుమ్మరించాడు, ఆయన మిమ్మల్ని కూడా అదేవిధంగా ఆశీర్వదిస్తాడు.—మలా. 3:10.
7 చాలామంది ప్రచారకులకు సహాయ పయినీరు సేవ చేయడం అంత సులభం కాదు. అయితే ఉద్యోగపరమైన కుటుంబపరమైన బాధ్యతలు, వ్యక్తిగత సమస్యలు ఉన్నప్పటికీ ఎంతోమంది సహోదర సహోదరీలు సహాయ పయినీరు సేవ చేయగలిగారు. సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి తరచూ మన విలువైన సమయాన్ని శక్తిని త్యాగం చేయవలసి ఉంటుంది కానీ దానివల్ల వచ్చే ఆశీర్వాదాలు సాటిలేనివి.—సామె. 10:22.
8 సహాయ పయినీరు సేవ చేయడానికి మార్చి ఏప్రిల్ నెలలు సరైన సమయాలు. మార్చిలో ఐదు వారాంతాలు ఉన్నాయి. పూర్తికాల ఉద్యోగం చేసేవారు ఆ వారాంతాల్లో, సాయంత్రపు సమయాల్లో ప్రకటనా పని చేయడం ద్వారా సహాయ పయినీరు సేవ చేయగలిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో వచ్చే సెలవు దినాల్లో కూడా మీరు ప్రకటించవచ్చు. కొంతమందికి స్కూల్లో లేక ఉద్యోగంలో సెలవులు ఉంటుండవచ్చు, 50 గంటలను పూర్తిచేయడానికి అవి సహాయపడతాయి. మార్చి లేక ఏప్రిల్ నెలల్లో 50 గంటలు చేరుకోవడానికి, ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన సహాయ పయినీరు సేవ మాదిరి ప్రణాళికలలో ఒకదానిని మీరు ఉపయోగించుకోగలరా? మీ ప్రణాళిక గురించి ఇతరులతో చర్చించండి; మీతోపాటు పరిచర్యలో భాగం వహించడానికి కొంతమంది తప్పకుండా ప్రోత్సహించబడతారు. మీరు సహాయ పయినీరు సేవ చేయలేకపోతే, ఈ నెలల కోసం ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని పయినీరు సేవ చేయగలుగుతున్న ఇతరులతో కలిసి పనిచేయండి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రకటనా పనిని ఎక్కువగా చేయడానికి మీరు ఇప్పుడే ప్రణాళిక వేసుకోండి.
9 జ్ఞాపకార్థ ఆచరణపట్ల కృతజ్ఞత చూపించండి: ప్రతి సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, సహాయ పయినీర్లుగా ఉండేందుకు ‘సమయమును సద్వినియోగము’ చేసుకోవడానికి విమోచన క్రయధనంపట్ల వారికున్న కృతజ్ఞత వేలాదిమందిని కదిలిస్తుంది. (ఎఫె. 5:15, 16) గత సంవత్సరం ఇండియాలో మార్చి నెలలో 2,509 మంది, ఏప్రిల్ నెలలో 1,349 మంది సహాయ పయినీరు సేవ చేశారు. అంటే ఈ రెండు నెలల్లో ప్రతి నెలకూ సగటున 1,929 మంది పయినీరు సేవ చేశారు. ఆ సేవా సంవత్సరంలో అంతకుముందు నెలల్లో సహాయ పయినీరు సేవ చేసిన 657 మంది కంటే ఆ సంఖ్య ఎంతో ఎక్కువ. క్షేత్ర పరిచర్యలో మనం ఎక్కువగా భాగం వహించడం ద్వారా క్రీస్తు విమోచన క్రయధన బలిపట్ల మనకున్న యథార్థమైన కృతజ్ఞతను చూపించడానికి ఈ సంవత్సరపు జ్ఞాపకార్థ ఆచరణ కాలం మరో చక్కని అవకాశం.
10 ఏప్రిల్ 16వ తేది సమీపిస్తుండగా, జ్ఞాపకార్థ ఆచరణ మీకు ఏ భావాన్నిస్తుందో ఆలోచించండి. క్రీస్తు మరణానికి దారి తీసిన సంఘటనల గురించి, ఆయనను తీవ్రంగా కలతపెట్టిన తలంపుల గురించి ఆలోచించండి. యేసు ముందు ఉంచబడిన ఆనందం గురించి, దుష్ప్రవర్తనను సహించడానికి ఆ ఆనందం ఆయనకు ఎలా సహాయపడిందనే విషయం గురించి కూడా ధ్యానించండి. ప్రకటనా పనిని శిష్యులను చేసే పనిని పర్యవేక్షిస్తూ ప్రస్తుతం సంఘ శిరస్సుగా ఉన్న ఆయన స్థానం గురించి ఆలోచించండి. (1 కొరిం. 11:3; హెబ్రీ. 12:1, 2; ప్రక. 14:14-16) మీ పరిస్థితులు అనుమతించినంతవరకూ సాధ్యమైనంత ఎక్కువగా పరిచర్యలో పాల్గొనడం ద్వారా క్రీస్తు మనకోసం చేసినవాటన్నింటికీ మీ కృతజ్ఞతను చూపించండి.
11 సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి ఇతరులను ప్రోత్సహించండి: సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా సంఘంలోని ఇతరులను ప్రోత్సహించడానికి పెద్దలకూ పరిచర్య సేవకులకూ చక్కని అవకాశం ఉంటుంది. క్షేత్ర పరిచర్యలో ప్రచారకులతోపాటు పనిచేస్తున్నప్పుడు, కాపరి సందర్శనాలు చేస్తున్నప్పుడు, ఈ ప్రత్యేకమైన పనిలో పూర్తిగా భాగం వహించేందుకు ఇతరులకు సహాయం చేయడానికి వారికి వ్యక్తిగతంగా చక్కని అవకాశాలు లభిస్తాయి. మనమందరము ఈ విషయం గురించి ప్రార్థించి, సంపూర్ణంగా సాక్ష్యమివ్వడంలో మనం ఐక్యంగా చేసే కృషిని అధికం చేసుకుందాము.
12 మార్చి, ఏప్రిల్ నెలల్లో పరిచర్యలో ఎక్కువగా భాగం వహించేందుకు సంఘం చేసే ఏర్పాట్లకు పెద్దలు పరిచర్య సేవకులు అందరూ మద్దతునిచ్చిప్పటికీ, ఈ ప్రచార పని కోసం తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రత్యేకించి సేవా పైవిచారణకర్త శ్రద్ధ తీసుకోవాలి. ఆయన క్షేత్ర పరిచర్య కూటాలను నిర్వహించడానికి ప్రచారకుల్లో అధిక శాతం మందికి అనుకూలమైన ప్రాంతాలను, రోజులను, సమయాలను వ్యవస్థీకరించాలి, వాటిగురించి సేవా కూటాల్లో క్రమంగా ప్రకటించాలి. సంఘంలోని ప్రతి ఒక్కరు వివిధ రకాలుగా సాక్ష్యమిచ్చేందుకు వీలుగా రోజులోని వేర్వేరు సమయాల్లో కలుసుకోవడానికి ఏర్పాట్లు చేయవచ్చు. వ్యాపార క్షేత్రంలో పనిచేయడం, వీధిలో సాక్ష్యమివ్వడం, ఇంటింటి పరిచర్య చేయడం, పునర్దర్శనాలు చేయడం, టెలిఫోన్ ద్వారా సాక్ష్యమివ్వడం వంటి వాటికి ఏర్పాట్లు చేయవచ్చు. అంతేకాకుండా ఆ నెలల్లో సాహిత్యం, పత్రికలు, క్షేత్రం సమృద్ధిగా ఉండేటట్లు ఆయన ఏర్పాటు చేసుకోవాలి.
13 మార్చి నెలలో బైబిలు అధ్యయనాలను ప్రారంభించే లక్ష్యంతో జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించవలసి ఉంటుంది. జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించేందుకు జనవరి 2002 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లో చక్కని సలహాలు ఇవ్వబడ్డాయి. ఏప్రిల్ నెలలో కావలికోట, తేజరిల్లు! పత్రికలను ప్రతిపాదించాలి. “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” అనే కాలమ్‌లో ఇవ్వబడే ప్రతిపాదనలను ఉపయోగించడానికి ప్రయత్నించండి. సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి చక్కగా సిద్ధపడేందుకు అందరూ సమయాన్ని వెచ్చించాలి.
14 సంఘ శిరస్సు అయిన క్రీస్తు యేసు ఆధ్వర్యంలో పనిచేయడానికి, ఇతరులతో సువార్తను పంచుకునే ఆధిక్యతను కలిగివుండడానికి మనం ఎంత ధన్యులము! మార్చి, ఏప్రిల్ నెలలు సమీపిస్తుండగా ప్రకటించమని, సంపూర్ణంగా సాక్ష్యమివ్వమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా ఆ నెలలను ప్రతిఫలదాయకమైనవిగా చేయడానికి మనం మరోసారి కృషి చేద్దాం.
[4వ పేజీలోని బాక్సు]
2003 మార్చి, ఏప్రిల్ నెలల్లో సహాయ పయినీరు సేవ చేయడానికి వివిధ ప్రణాళికలు
రోజు గంటలు
సోమవారం 1 2 — — 2 —
మంగళవారం 1 — 3 — — —
బుధవారం 1 2 — 5 — —
గురువారం 1 — 3 — — —
శుక్రవారం 1 2 — — — —
శనివారం 5 4 3 5 6 7
ఆదివారం 2 2 3 2 2 3
మార్చి 56 56 54 55 50 50
ఏప్రిల్ 50 50 51 53 — —
ఈ ప్రణాళికలలో ఏదైనా ఒకటి మీకు ఉపయోగపడుతుందా?