యేసును గురించిన సత్యాన్ని తెలియజేయండి
1 వేరే గొర్రెలకు చెందిన తమ సహచరుల సహాయంతో “యేసునుగూర్చి సాక్ష్యమి[చ్చే]” పని అభిషిక్త క్రైస్తవులకు ఉంది. (ప్రక. 12:17) కేవలం యేసు ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది కాబట్టి, ఈ పని ఒక ప్రాముఖ్యమైన నియామకం.—యోహా. 17:3; అపొ. 4:12.
2 “మార్గమును, సత్యమును, జీవమును”: “నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అని యేసు అన్నాడు. (యోహా. 14:6) ‘మార్గమైన’ యేసు ద్వారా మాత్రమే మనం దేవుణ్ణి ప్రార్థనలో సమీపించి, ఆయనతో అంగీకారయోగ్యమైన సంబంధాన్ని కలిగివుండవచ్చు. (యోహా. 15:16) హీబ్రూ లేఖనాలలో ఉన్న ప్రవచనాలు, ఛాయలు యేసులోనే వాస్తవమవుతాయి కనుక ఆయనే “సత్యము.” (యోహా. 1:17; కొలొ. 2:16, 17) నిజానికి, నిజమైన ప్రవచనపు ప్రధాన ఉద్దేశం, దేవుని సంకల్పం నెరవేర్చడంలో యేసుకున్న కీలకమైన పాత్ర మీద మరింత వెలుగును ప్రసరింపజేయడమే. (ప్రక. 19:10) అంతేకాకుండా, యేసు “జీవము.” నిత్యజీవమనే బహుమానాన్ని పొందాలంటే, అందరూ ఆయన విమోచన క్రయధన బలి యందు విశ్వాసముంచాలి.—యోహా. 3:16, 36; హెబ్రీ. 2:9.
3 శిరస్సు, పరిపాలిస్తున్న రాజు: యెహోవా తన కుమారునికి ఇచ్చిన గొప్ప కార్యనిర్వాహక అధికారాన్ని కూడా ప్రజలు గ్రహించాలి. యేసు దేవుని రాజ్యానికి రాజుగా ప్రతిష్ఠించబడ్డాడు—“ప్రజలు అతనికి విధేయులై” ఉండాలి. (ఆది. 49:10) అంతేకాకుండా, యెహోవా ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించాడు. (ఎఫె. 1:22, 23) యేసు సంఘాన్ని ఎలా పర్యవేక్షిస్తాడో, “తగినవేళ” ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించడానికి “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసు[డిని]” ఎలా ఉపయోగించుకుంటాడో అర్థం చేసుకోవడానికి మనం మన బైబిలు విద్యార్థులకు సహాయం చేయవలసిన అవసరం ఉంది.—మత్త. 24:45-47.
4 కనికరంగల ప్రధాన యాజకుడు: మానవునిగా కష్టాలను బాధలను అనుభవించినందువల్ల, యేసు ‘శోధింపబడువారికి సహాయము చేయగలవాడై యున్నాడు.’ (హెబ్రీ. 2:17, 18) యేసు తమ బలహీనతలపట్ల సహానుభూతి కలిగివున్నాడనీ తమ కొరకు ఆయన దయతో విజ్ఞాపన చేస్తాడనీ తెలుసుకోవడం అపరిపూర్ణ మానవులకు ఎంత ఉల్లాసకరంగా ఉంటుందో కదా! (రోమా. 8:34) యేసు బలి ఆధారంగా, ప్రధాన యాజకునిగా ఆయన సేవల ద్వారా, “సమయోచితమైన సహాయము” పొందడానికి మనం యెహోవాను “ధైర్యముతో” సమీపించవచ్చు.—హెబ్రీ. 4:15, 16.
5 ఇతరులకు యేసును గురించిన సత్యము తెలియజేయాలని మనం చేస్తున్న కృషి, వారు మనతో పాటు యేసుకు విధేయత చూపించి ఆయనను సేవించడానికి వారిని కదిలించును గాక.—యోహా. 14:15, 21.