“వ్యర్థమైనవాటిని” వెంబడించడాన్ని నివారించండి
1 నేడు ప్రజాదరణ పొందిన ఒక సమాచార మాధ్యమం ఇ-మెయిల్. ఈ మాధ్యమం ద్వారా కుటుంబ సభ్యులతో స్నేహితులతో వ్యక్తిగత అనుభవాలను తలంపులను పంచుకోవడం సముచితమే అయినప్పటికీ, ఇ-మెయిల్‌ను ఒక హద్దంటూ లేకుండా ఉపయోగించడంతో ఎటువంటి “వ్యర్థమైనవాటిని” జతచేయవచ్చు?—సామె. 12:11.
2 ఇ-మెయిల్ గురించిన జాగ్రత్తలు: కొందరు తాము ఇ-మెయిల్ ద్వారా తాజా సమాచారాన్ని పొందడం వల్లనే యెహోవా సంస్థతో చక్కగా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నట్లు భావిస్తామని చెప్పుకుంటారు. ఆ సమాచారంలో అనుభవాలు, బేతేలులో జరిగిన సంఘటనలను గురించిన నోట్సు, విపత్తుల లేదా హింసల నివేదికలు, చివరికి రాజ్య పరిచర్య పాఠశాలల్లో విడుదలైన ఆంతరంగిక సమాచారం వంటివి కూడా చేరి ఉండవచ్చు. తమ స్నేహితులకు తామే ముందుగా సమాచారాన్ని వెల్లడి చేయాలనే ఆశతో అలాంటి సందేశాలను పంపడానికి ఇతరులు మరీ అతిగా ఆసక్తి కలిగి ఉంటున్నట్లు అనిపిస్తోంది.
3 కొన్నిసార్లు సమాచారము, అనుభవాలు వక్రీకరించి చెప్పబడ్డాయి లేదా గోరంతలు కొండంతలుగా చేసి చెప్పబడ్డాయి. లేదా బహుశా సంచలనాత్మకంగా ఉండాలనే ప్రయత్నంతో కొందరు తప్పుడు భావాన్ని అందజేశారు. అలాంటి విషయాలను వెల్లడి చేయాలని తొందరపడే వారి దగ్గర అన్నిసార్లూ వాస్తవాలన్నీ ఉండవు. (సామె. 29:20) కొన్ని సందర్భాల్లో, ఒక కథ నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ కేవలం ఉత్సుకతతో అది అందరికీ అందజేయబడుతుంది. అలాంటి సరికాని లేదా తప్పుదోవ పట్టించే నివేదికలు “ముచ్చటల”తో సమానం, అవి నిజమైన దైవభక్తిని పెంపొందించవు.—1 తిమో. 4:6, 7.
4 సరైనదికాదని ఆ తర్వాత నిరూపించబడిన సమాచారాన్ని మీరు ఇతరులకు చేరవేస్తే, అది కలిగించగల బాధకు లేదా గందరగోళానికి మీరు కొంతమేరకు బాధ్యులవుతారు. దావీదుకు ఆయన కుమారులందరూ చనిపోయారన్న అతిశయోక్తితో కూడిన వార్త అందినప్పుడు ఆయన వేదనతో తన ‘వస్త్రములు చింపుకున్నాడు.’ అయితే వాస్తవానికి ఆయన కుమారులలో కేవలం ఒకడే మరణించాడు. అది కూడా ఎంతో వేదనను కలిగించే విషయమే, కానీ ఈ అతిశయోక్తి దావీదుకు మరింత వేదనను కలిగించింది. (2 సమూ. 13:30-33) మన సహోదరులలో ఎవరినైనా గానీ తప్పుదోవ పట్టించేదీ లేదా నిరుత్సాహపరిచేదీ ఏదైనా చెప్పాలని మనం కోరుకోము.
5 దేవుడు నియమించిన మాధ్యమం: మన పరలోక తండ్రికి ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ ఒక నియమిత సమాచార మాధ్యమంగా పని చేస్తున్నాడని గుర్తుంచుకోండి. విశ్వాస గృహానికి ఏ సమాచారాన్ని అందజేయాలో, అలాగే అది అందజేయబడవలసిన ‘తగిన వేళ’ ఏదో నిశ్చయపర్చుకోవలసిన బాధ్యత ఆ ‘దాసునికి’ ఉంది. ఈ ఆధ్యాత్మిక ఆహారం కేవలం దైవపరిపాలనా సంస్థ ద్వారానే అందజేయబడుతుంది. నమ్మదగిన సమాచారం కోసం మనం ఎల్లప్పుడూ దేవుడు నియమించిన మాధ్యమం పైనే ఆధారపడాలి గానీ ఇంటర్నెట్ యూజర్ల నెట్‌వర్క్‌పైన కాదు.—మత్త. 24:45.
6 ఇంటర్నెట్ వెబ్ సైట్లు: మనకు ఆధికారికంగా ఒక ఇంటర్నెట్ వెబ్సైట్ ఉంది: www.watchtower.org. ఈ సైట్ ప్రజలకు సమాచారాన్ని తగిన విధంగా అందజేయడానికి సంసిద్ధంగా ఉంది. యెహోవాసాక్షుల గురించి ఏ వ్యక్తులో కమిటీనో లేదా సంఘమో వెబ్ పేజీని సిద్ధం చేయవలసిన అవసరం లేదు. కొందరు లేఖనాలన్నింటితోనూ రెఫరెన్సులన్నింటితోనూ మన ప్రచురణల్లోని సమాచారాన్నంతటినీ వెబ్‌పై పోస్టు చేసి, చివరికి చందా చెల్లిస్తే సమావేశాలలోని సమాచారాన్ని కూడా అందజేస్తామని చెప్పారు. దీంట్లో లాభం ఇమిడి ఉన్నా లేకపోయినా యెహోవాసాక్షుల ప్రచురణలను ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ల రూపంలో పునరుత్పత్తి చేయడం, పంచిపెట్టడం వంటివి చేస్తే కాపీరైట్ నియమాలను ఉల్లంఘించినట్లే అవుతుంది. తాము సహోదరులకు చేస్తున్న సేవగా కొందరు దీన్ని దృష్టించినప్పటికీ, ఇది ఆమోదయోగ్యం కాదు, దీన్ని కొనసాగించకూడదు.
7 ఎలక్ట్రానిక్ మాధ్యమాన్ని ఉపయోగించుకునేటప్పుడు సరైన వివేచననూ అవగాహననూ ఉపయోగించడం, మన మనస్సులు “విలువగల రమ్యమైన సర్వ సంపదలతో” నింపబడి ఉన్నాయని వెల్లడి చేస్తుంది.—సామె. 24:4.