‘మనుష్యులలో ఈవులు’ దేవుని మందను సిద్ధమనస్సుతో కాస్తారు
1 తన కుమారుని ద్వారా ‘మనుష్యులలో ఈవులను’ అనుగ్రహించడంవల్ల యెహోవా ఎంతటి ప్రేమపూర్వకమైన సహాయాన్ని అందించాడో కదా! (ఎఫె. 4:8, 11, 12) చురుకుగా, సిద్ధమనస్సుతో దేవుని మందను కాయడంతోపాటు, వారికి అనేక బాధ్యతలున్నాయి. (1 పేతు 5:2, 3) ఎంతో అవసరమైన ఈ సహాయం ద్వారా మనమందరం ప్రయోజనం పొందుతాము. సంఘంలో కొందరు కష్టాలను ఎదుర్కొంటున్నా, ఇటీవలనే సంఘంతో సహవసిస్తున్నా, లేదా నిర్దిష్టమైన బలహీనతలున్నా, లేదా దారితప్పినా ఈ మనుష్యులు, అందరి ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపిస్తారు.—ఫిలి. 2:4; 1 థెస్స. 5:12-14.
2 కలతపరిచే ప్రపంచ సంఘటనలు భయం కలిగించినప్పుడు ఈ ఉపకాపరులు “గాలికి మరుగైనచోటువలెను గాలివానకు చాటైన చోటువలెను” ఉంటారు. మనము అలసిపోయి లేదా భారము మోస్తూ, ఓదార్పు కావాలని కోరుకున్నప్పుడు, వారు “ఎండినచోట నీళ్లకాలువలవలె” లేక “అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలె” మనకు నూతనోత్తేజాన్ని ఇస్తారు.—యెష. 32:2.
3 నిష్క్రియులను ప్రోత్సహించడం: పరిచర్యలో క్రమంగా పాల్గొననివారు, నిష్క్రియులైపోయినవారు మళ్ళీ సంఘ కార్యకలాపాలన్నిట్లో క్రమంగా భాగంవహించడానికి వారికి సహాయంచేస్తూ వారిని ప్రోత్సహించడానికి పెద్దలు ప్రత్యేకమైన కృషిచేస్తారు. ప్రేమపూర్వక కాపరి సందర్శనాలు, చాలామంది సంఘ కూటాలకు క్రమంగా హాజరుకావడానికి మరియు క్షేత్ర పరిచర్యలో మళ్ళీ భాగం వహించేంతగా ఆధ్యాత్మికంగా పెంపొందించబడడానికి సహాయపడ్డాయి. పెద్దలు చేసే ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా, యెహోవా ప్రేమపూర్వక శ్రద్ధను మరియు యేసుక్రీస్తు యొక్క చురుకైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. దారితప్పిన లేక పూర్తిగా తప్పిపోయిన తన గొర్రెలపై శ్రద్ధ చూపే విషయంలో ఆయన మనకు మాదిరిని ఉంచాడు.—మత్త. 18:12-14; యోహా. 10:16, 27-29.
4 కొందరు ఆధ్యాత్మికంగా తొట్రుపడుతున్నారని సూచించే సూచనల కోసం ఉపకాపరులు చూస్తారు. ఎవరైనా నిరుత్సాహపడుతున్నట్లు కనిపిస్తే, కూటాలకు క్రమంగా హాజరవ్వకపోతే, లేక క్షేత్ర సేవలో పాల్గొనడం తగ్గించేస్తే, వారికి ఆధ్యాత్మిక సహాయం అవసరం. లోక సంబంధమైన వస్త్రధారణ మరియు కేశాలంకరణ వైపు మొగ్గుచూపించడం మొదలుపెట్టే వారికి లేక సంఘం యెడల విమర్శనాత్మకమైన దృక్పథాన్ని పెంపొందించుకున్నవారికి సహాయం చేయడానికి పెద్దలు సిద్ధమనస్సును కలిగివున్నారు. యథార్థమైన ఆసక్తి, ఆప్యాయతానురాగాలతో, ఇలాంటి వారిలో యెహోవా యెడల ఉన్న ప్రేమను పునరుజ్జీవింపజేసే ప్రయత్నంలో, శ్రద్ధగల పైవిచారణకర్తలు తమ స్వంత “ప్రాణములనుకూడ” ఇష్టపూర్వకముగా ఇస్తారు.—1 థెస్స. 2:8.
5 గతంలో కొంతమంది సమర్పించుకున్న క్రైస్తవులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ ఒత్తిళ్ళు తమను ముంచెత్తడం వల్ల సంఘంతో సహవసించడం మానివేసి ఆధ్యాత్మిక నిష్క్రియత్వంలోకి జారిపోయారు. విమర్శనాత్మకంగా ఉండకుండా, యెహోవా తన గొర్రెలందరి యెడల శ్రద్ధ కలిగి ఉంటాడని, కష్ట సమయాల్లో వారిని కాపాడతాడని పెద్దలు దయాపూర్వకమైన హామీ ఇస్తారు. (కీర్త. 55:22; 1 పేతు. 5:7) ‘వారు దేవునియొద్దకు వస్తే, ఆయన వారియొద్దకు వస్తాడని’ గ్రహించేందుకు మందలోని వారికి సహాయం చేయడం ద్వారా, అప్రమత్తంగా ఉన్న మందకాపరులు వారికి ఓదార్పునిచ్చి, సేదదీరుస్తారు.—యాకో. 4:8; కీర్త. 23:3, 4.
6 బలహీనులకు ప్రాధాన్యతనివ్వడం: ప్రేమపూర్వక ఉపకాపరులు కూడా, నిర్లక్ష్యం చేయబడగలవారిపై శ్రద్ధను కలిగివుంటారు. శారీరకంగా బలహీనులైన, నర్సింగ్ హోమ్లకే పరిమితమైపోయిన, లేక ఇతర కారణాల వల్ల అశక్తులైన కొందరు అనేక సంఘాలలో ఉన్నారు. వారు తమ పరిస్థితులవల్ల, రాజ్య సందేశాన్ని ప్రకటించే పనిలో ఎక్కువగా భాగం వహించలేకపోవడమన్నది అర్థం చేసుకోదగినదే. వారికి బహుశా, తమను సందర్శించేవారికి, ఇతర రోగులకు, లేదా తమను చూసుకునేవారికి మాత్రమే సాక్ష్యము ఇచ్చే అవకాశం ఉండవచ్చు. అయితే, వారు ఏ మాత్రం చేసినా, దాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రకటనా పనికి విలువైన మద్దతుగా ఎంచాలి. (మత్త. 25:15) వారు కేవలం 15 నిమిషాలు సాక్ష్యమిచ్చినప్పటికీ, అది రిపోర్టు చేయబడాలి, వారు క్రమ రాజ్య ప్రచారకులుగానే లెక్కించబడతారు.
7 ‘మనుష్యులలో ఈవులు’ ప్రత్యేకంగా, సంవత్సరపు ఈ కాలంలో అంటే జ్ఞాపకార్థ కాలంలో తమ సహోదరుల ఆధ్యాత్మిక అవసరాలను తెలుసుకొని ఉంటారు. దారి తప్పిపోయినవారికి, సంఘంతో ప్రేమపూర్వకంగా సహవసించడం వల్ల కలిగే ఆనందాన్ని, మనశ్శాంతినీ మళ్ళీ అనుభవించడానికి సహాయపడేందుకుగాను పెద్దలు ప్రత్యేకమైన కృషి చేయడానికి ఇదెంత తగిన సమయమో కదా! మనతోపాటు “విశ్వాసగృహమునకు చేరిన” ఇటువంటి వారు, విమోచన క్రయధనబలి యందు తమకున్న విశ్వాసాన్ని తిరిగి ధృడపరచుకుంటూ సంఘ కూటాలకు హాజరవ్వడం, పరిచర్యలో పాల్గొనడం చూసినప్పుడు మనము సంతోషిస్తాము.—గల. 6:10; లూకా 15:4-7; యోహా. 10:11, 14.