క్రైస్తవ సాంగత్యం ఎంత ప్రాముఖ్యమైనది?
1 “ఇతరుల నుండి పూర్తిగా వేరుపడి ఉండాలని ఎవ్వరూ కోరుకోరు.” 17వ శతాబ్దంలోని ఒక కవి చేసిన ఆ వ్యాఖ్యానం, మానవుని ప్రధాన అవసరాల్లో ఒకటైన సాంగత్యం గురించి బైబిలు చెప్పినదాన్ని కేవలం ప్రతిధ్వనిస్తోంది. (సామె. 18:1) మన క్రైస్తవ సాంగత్యం ఆ అవసరాన్ని తీరుస్తుంది. ఎటువంటి ప్రయోజనకరమైన మార్గాల్లో తీరుస్తుంది?
2 పరిచర్యలో: ప్రధానమైన ఒక ప్రయోజనమేమిటంటే, బహిరంగ పరిచర్యలో మన సహోదరులు మనలను బలపరుస్తూ మద్దతునిచ్చే విధానం. ప్రకటించడానికి యేసు తన శిష్యులను “ఇద్దరిద్దరినిగా” పంపించాడు. (మార్కు 6:7; లూకా 10:1) ఆ మాదిరిని అనుసరిస్తూ, మనం ఇతరులతో క్షేత్ర సేవ చేస్తున్నప్పుడు, ప్రసంగి 4:9, 10లోని నిజాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకొంటాం. మనం మన పరిచర్యను కలిసి చేస్తుండగా విశ్వాసం, విధేయతతోపాటు మన తోటివారి ప్రేమ మనకు ధైర్యాన్నిస్తూ మన ఆసక్తిని పునర్నూతనం చేస్తుంది.
3 వ్యక్తిగత సహాయం కోసం: మన సౌభ్రాత్రుత్వం కూడా ఒత్తిడులను, శోధనలను అధిగమించడానికి ప్రోత్సాహాన్నీ, నడిపింపునూ ఇచ్చే ఆధారంగా ఉంటుంది. మన క్రైస్తవ సహచరులు మనకు వ్యక్తిగతంగా సహాయపడే లేఖనాలపైకి మన అవధానం తీసుకువస్తుండవచ్చు. మనం వారి కోసం ప్రార్థన చేసినట్లే మన తరపున వారు కూడా చేస్తుండవచ్చు. (2 కొరిం. 1:11) వారి మంచి మాదిరి మనం మేలైన పనులు చేయడానికి మనలను ప్రేరేపించడమేగాక మనలను తప్పకుండా బలపరుస్తుంది.
4 కూటాల్లో: మనం క్రమంగా సంఘ కూటాలకు హాజరైనప్పుడు క్రైస్తవ సాంగత్యంలోని ఆశీర్వాదాలను అనుభవించవచ్చు. (హెబ్రీ. 10:24, 25) ఆ కార్యక్రమం సమృద్ధికరమైన ఆధ్యాత్మిక ఆదేశాలతో ఉంటుంది, మనం కూటాలకు హాజరవడం వల్ల తోటి విశ్వాసులకు సన్నిహితులమౌతాము. ఈ కూటాలు మనకు, వేదికపై నుండి లేక ప్రేక్షకుల్లో నుండి మన సహోదర సహోదరీలు చేసే విశ్వాసపూరితమైన వ్యాఖ్యానాలను వినే అవకాశమిస్తాయి. (రోమా. 1:12) కూటాలకు ముందు, తరువాత మాట్లాడుకోవడం వల్ల మన సాంగత్యపు బంధం గాఢమవుతుంది. అటువంటి సందర్భాలు విశ్వాసాన్ని బలపరిచే మన సొంత అనుభవాలను తెలియజేసే అవకాశాలనిస్తాయి. యెహోవాను, ఆయన వాక్యాన్ని, ఆయన పనిని, ఆయన ప్రజలను ప్రేమించేవారితో చనువుగా సహచరించడంవల్ల మన వ్యక్తిత్వాలు ప్రయోజనాత్మకంగా ప్రభావితమవుతాయి.—ఫిలి. 2:1, 2.
5 మనకు మన క్రైస్తవ సహచరుల అవసరముంది. వారి తోడులేకుండా, జీవానికి నడిపే ఇరుకైన మార్గంలో నడవడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ, వారి ప్రేమ, ప్రోత్సాహాలతో మనం యెహోవా నీతివంతమైన నూతన లోకమువైపు క్రమంగా సాగిపోగలం.—మత్త. 7:14.