మీ విద్యార్థి హృదయాన్ని కదిలించండి
1 యేసు తాను పరలోకానికి ఆరోహణం అవ్వడానికి ముందు, తాను ఆజ్ఞాపించినవన్నీ “గైకొనవలెనని” ఇతరులకు బోధించాలని తన శిష్యులకు చెప్పాడు. (మత్త. 28:19, 20) ఎవరైనా సరే క్రీస్తు ఆజ్ఞల్ని ‘గైకొనాలంటే’ ఆ సమాచారం ఆయన హృదయాన్ని కదిలించాలి. (కీర్త. 119:112) మీరు బైబిలు అధ్యయనం చేస్తున్న వ్యక్తి హృదయాన్ని మీరెలా పురికొల్పగలరు?
2 యెహోవా నడిపింపు కోసం ప్రార్థించండి: శిష్యులను చేయడమనేది దేవుని పని. ఆ పనిలో విజయానికి మన సామర్థ్యాలు కాదు గానీ ఆయన ఆశీర్వాదాలే కీలకం. (అపొ. 16:14; 1 కొరిం. 3:7) కాబట్టి, ఇతరులకు సత్యాన్ని బోధించేటప్పుడు సహాయం కోసం యెహోవాను అర్థించడం ఎంతో ఆవశ్యకం.—యెష. 50:4.
3 విద్యార్థి ఏమి నమ్ముతున్నాడో గ్రహించండి: ప్రజలు ఏమి నమ్ముతున్నారో ఎందుకు నమ్ముతున్నారో తెలుసుకోవడం, మనం వారి హృదయాన్ని కదిలించేందుకు అవసరమైన అవగాహననిస్తుంది. ఒక విద్యార్థి పలాని బోధను మాత్రమే ఎందుకు ఇష్టపడతాడు? అది నమ్మదగిన విధంగా ఉందని ఆయన్ను ఒప్పించిందేమిటి? అలాంటి విషయాల్ని తెలుసుకోవడం మనం వివేచనగా మాట్లాడడానికి సహాయం చేస్తుంది.—అపొ. 17:22, 23.
4 తార్కికమైన, లేఖనాధారితమైన వాదనను వినిపించండి: విద్యార్థికి సత్యం సహేతుకంగా అనిపించాలి. (అపొ. 17:24-31) మన నిరీక్షణకు గల గట్టి హేతువును వారికి తెలియజేయాలి. (1 పేతు. 3:15) అయితే, ఎల్లప్పుడు మర్యాదపూర్వకంగా ఓర్పుగా చేయండి.
5 మీ బోధకు ఉపమానాల్ని జోడించండి: ఉపమానాలు విద్యార్థి అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేయడమే కాకుండా, అవి భావోద్రేకాల్ని రేకెత్తిస్తాయి. అవి అటు మనస్సునూ ఇటు హృదయాన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. యేసు వాటిని తరచుగా ఉపయోగించాడు. (మార్కు 4:33, 34) అయితే, ఉపమానాలు ప్రభావవంతంగా ఉండాలంటే అవి చర్చించబడుతున్న అంశానికి తగినట్లుగా ఉండాలి, విద్యార్థి జీవితానికి సంబంధించినదిగా ఉండాలి.
6 సత్యాన్ని స్వీకరించడంలోని ప్రయోజనాల్ని చూపించండి: తాము నేర్చుకుంటున్న వాటిని పాటిస్తే వచ్చే ప్రయోజనాలేమిటో తెలుసుకోవాలని ప్రజలు కోరుకుంటారు. 2 తిమోతి 3:14-17 లోని పౌలు మాటల్లోని జ్ఞానాన్ని గ్రహించేలా మీ విద్యార్థికి సహాయం చేయండి.
7 ఎవరైనా మీ బోధకు ప్రతిస్పందించకపోతే నిరుత్సాహం చెందకండి. అందరి హృదయాలూ ప్రతిస్పందించవు. (మత్త. 13:13-15) అయితే కొందరు తప్పకుండా విశ్వాసులౌతారు. (అపొ. 17:32-34) సువార్తతో ప్రజల హృదయాల్ని కదిలించాలని మీరు చేసే కృషి, అనేకులు యేసు ఆజ్ఞాపించినవాటిని అంగీకరించి, ‘గైకొనేలా’ సహాయం చేయునుగాక!