మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకోగలరా?
1 సా.శ.పూ. 778వ సంవత్సరంలో ఒక అసాధారణ సంఘటన జరిగింది. యెషయా ప్రవక్త ఒక దర్శనంలో “అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు [యెహోవా] ఆసీసుడైయుండగా” చూశాడు. సెరాపులు, “సైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు” అంటూ యెహోవా మహిమ వైపుకు అవధానం మళ్ళించడాన్ని విన్నాడు. అదెంత సంభ్రమాశ్చర్యం కలిగించే విషయమో కదా! ఆ సందర్భంలో, యెహోవా ఒక సవాలుదాయకమైన ప్రశ్న వేశాడు: “నేను ఎవని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును?” అయితే, పని ఎలాంటిదనేదాని గురించి గానీ, ఆ పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వ్యక్తికి ఏమి లభిస్తుందనేదాని గురించి గానీ ఎలాంటి వివరణ ఇవ్వబడలేదు. అయినప్పటికీ యెషయా నిస్సంకోచంగా ఇలా ప్రతిస్పందించాడు: “చిత్తగించుము నేనున్నాను! నన్ను పంపుము.”—యెష. 6:1, 3, 8.
2 యెహోవా కోరేదేదైనా చేయాలనే ఇష్టపూర్వకమైన ఈ స్ఫూర్తి, ఆయన ప్రజల్లో ప్రత్యేకంగా కనబడే లక్షణం. (కీర్త. 110:3) తమను తాము అందుబాటులో ఉంచుకోగలవారి కోసం ఇప్పుడొక ప్రత్యేకమైన పిలుపు వెలువడుతోంది. మీరు యెషయాలాంటి ఇష్టపూర్వకమైన స్ఫూర్తితో ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నారా?
3 బెతెల్‌లో సేవ చేయడానికి సహోదరుల అవసరత ఎంతగానో ఉంది. దీనికోసం, సహోదరులకు రాజ్యానికి సంబంధించిన విషయాలకు ప్రాధాన్యతనివ్వాలనే ప్రగాఢమైన కోరిక, ప్రపంచవ్యాప్త ప్రకటనా పనికి మద్దతునిచ్చేందుకు ఏది అవసరమైతే అది చేయాలనే సుముఖత ఉండాలి. (మత్త. 6:33) వాస్తవానికి, బెతెల్ కుటుంబ సభ్యులుగా సేవ చేయడం, పూర్ణాత్మతో యెహోవా సేవ చేసే ప్రత్యేకమైన అవకాశాన్నిస్తుంది. అదెలా?
4 బెతెల్‌లో జరుగుతున్న పని: కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులోవున్న బెతెల్ కాంప్లెక్స్‌లో క్రమంగా చేయబడుతున్న పనంతటి గురించి ఒకసారి ఆలోచించండి. ప్రపంచవ్యాప్త క్షేత్రంలోనూ వ్యక్తిగత అధ్యయనంలోనూ ఉపయోగించుకునేందుకు బైబిలు సాహిత్యాన్ని ఉత్పత్తి చేయడానికి నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని తరగతికి, దాని పరిపాలక సభకు సూటిగా మద్దతునివ్వడంలో నిమగ్నమైవుండే ఆధిక్యత బెతెల్ కుటుంబ సభ్యులుగావున్న 220 మంది సహోదర సహోదరీలకు ఉంది. (మత్త. 24:45) ఉదాహరణకు, బెంగుళూరు బెతెల్ కుటుంబ సమిష్టి కృషి ఫలితంగా గత సేవా సంవత్సరంలో 75,207 పుస్తకాలు, 2,63,784 చిన్నపుస్తకాలు మరియు బ్రోషుర్లు, 15,665 క్యాలెండర్లు, 20,20,021 పత్రికలు, 33,39,239 కరపత్రాలు, 1,033 వీడియో క్యాసెట్లు ఉత్పత్తి చేయబడి పంపిణీ చేయబడ్డాయి. ఈ ప్రచురణల కోసం ‘యింపైన మాటలను, యథార్థభావముతో సత్యమునుగూర్చిన మాటలను’ ఎంపిక చేయడానికి, పరిశోధించడానికి తీవ్ర కృషి జరిగింది. (ప్రసం. 12:9, 10) సాహిత్యాలను 25 కంటే ఎక్కువ భాషల్లో ఉత్పత్తి చేయడానికి సహాయం చేసే దాదాపు 70 మంది అనువాదకులకు నిర్దేశం కూడా ఇవ్వబడుతోంది. సాహిత్యాలను ముద్రించి రవాణాచేయడానికి, క్లీనింగ్‌కి, మరమ్మత్తులకు, ఆహారం సిద్ధంచేయడానికి, కొనుగోలుకు, ఆరోగ్య సంరక్షణకు, బెతెల్‌లోని అనేక ఇతర పనుల నిర్వహణకు సుముఖతగల అనేకమంది స్వచ్ఛంద సేవకుల అవసరత ఉంది.
5 ఈ పనిని సాధించడం బృహత్‌కార్యమే అయినా అది ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చే కార్యం. మన శక్తిసామర్థ్యాలన్నీ ప్రకటనా బోధనా కార్యకలాపాలకు మద్దతునిచ్చేందుకు ఉపయోగించబడుతున్నాయని తెలుసుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. బెతెల్ సేవ యెహోవా సంస్థను మరింత వివరంగా తెలుసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. కీర్తనకర్త తన కాలంలో దైవపరిపాలనకు భూసంబంధ కేంద్రంగా ఉన్నదాన్ని మరింత సన్నిహితంగా తెలుసుకొమ్మని ఇశ్రాయేలీయులను ప్రోత్సహించాడని మనకు గుర్తుచేయబడుతోంది.—కీర్త. 48:12, 13.
6 బెతెల్ సేవలో లభించే ఆశీర్వాదాలు: బెతెల్ సేవ చేస్తున్నవారు తమకు లభించిన సేవాధిక్యతల గురించి ఎలా భావిస్తున్నారు? బెతెల్ కుటుంబ సభ్యులైన యౌవనులు, వృద్ధులు చేసిన ఈ క్రింది వ్యాఖ్యానాలను గమనించండి. బెతెల్ సేవలో మూడు సంవత్సరాలు గడిపిన ఒక బెతెల్ కుటుంబ సభ్యురాలు ఇలా అంటోంది: “బెతెల్‌లో ఉండడం యెహోవాతో నా సంబంధాన్ని బలపరచింది. నేను ఇక్కడ ఎంత ఎక్కువకాలం సేవ చేస్తే బెతెల్ ఎలా పనిచేస్తుందో నేను అంత ఎక్కువగా తెలుసుకుంటాను, అది నాకు యెహోవా వ్యక్తిత్వం గురించి అంతగా బోధిస్తుంది. యెహోవా అన్నిరకాలైన ప్రజలను ఉపయోగించుకుంటాడని తెలుసుకోవడానికి కూడా బెతెల్ సేవ నాకు సహాయం చేసింది. యెహోవా మనల్ని అంగీకరించాలంటే మనం పరిపూర్ణులమై ఉండవలసిన అవసరం లేదు.”
7 యౌవనస్థుడైన ఒక సహోదరుడు ఇలా గుర్తు తెచ్చుకుంటున్నాడు: “నాలో నేనిలా ఆలోచించుకోవడం నాకు గుర్తుంది, ‘నూతనలోకంలోకి ప్రవేశించి, ఈ లోకంలో డబ్బు సంపాదించే బదులు నేను ఎంతోకాలం బెతెల్ సేవలో గడిపానని ప్రాచీన కాలానికి చెందిన నమ్మకమైనవారితో చెప్పగలగడం ఎంత బాగుంటుందో కదా.’”
8 యౌవనస్థుడైన ఒక సహోదరుడు తాను పొందిన తర్ఫీదు గురించి మననం చేసుకుంటూ ఇలా అంటున్నాడు: “నా గురించి నేను తెలుసుకోవడం, నేను ఎక్కడ మెరుగుపరచుకోవాలో తెలుసుకోవడం, ఆ తర్వాత ఆ లక్షణాలను వృద్ధి చేసుకోవడం గొప్ప ఆశీర్వాదకరం. నేను ఇప్పుడు మరింత చక్కగా యెహోవా సేవ చేయగలుగుతున్నానని భావిస్తున్నాను. నాకిప్పుడు మరికాస్త ఎక్కువ సహనం, ఇంకొంచెం ఎక్కువ ఆత్మనిగ్రహం ఉన్నాయని, నేను ఎంతో అధికంగా ప్రేమను చూపించగలుగుతున్నానని నాకు అనిపిస్తోంది.”
9 ఒక సహోదరి తానింతవరకు పొందిన ఆశీర్వాదాల గురించి ఇలా భావిస్తోంది: “ఇక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నాకు యెహోవా గురించి, నేను తలంపుల్లోనూ భావాల్లోనూ చర్యల్లోనూ ఆయనను ఎలా అనుకరించవచ్చుననే దాని గురించి నాకు బోధించాయి. తర్ఫీదు క్రమంగా కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఆశీర్వాదాలు కూడా లభిస్తూనే ఉంటాయి.”
10 పూర్తికాల సేవలో 59 సంవత్సరాలు గడిపి వాటిలో 43 కంటే ఎక్కువ సంవత్సరాలు బెతెల్ సేవలో గడిపిన ఒక సహోదరుడు ఇలా అన్నాడు: “కొందరు అనుకునేలా బెతెల్ సాధువుల మఠంలాంటిది కాదు. ప్రణాళిక ప్రకారం నడిచే మా దినచర్య మూలంగా మేమెంతో సాధిస్తాము . . . నేను పని చేయడానికి వచ్చి ఆరోజు నేను చేసినదాన్ని బట్టి ఆనందించని రోజంటూ లేదు. ఎందుకు? ఎందుకంటే మనల్ని మనం పూర్ణాత్మతో యెహోవా కోసం వెచ్చించుకున్నప్పుడు, ‘మనం చేయవలసినవే చేస్తున్నామని’ తెలుసుకోవడం వల్లకలిగే సంతృప్తి మనకు లభిస్తుంది.”—లూకా 17:10.
11 బెతెల్‌లో 62 సంవత్సరాలపాటు సేవ చేసిన మరో సహోదరుడు ఇలా చెబుతున్నాడు: “రానున్న భూపరదైసుకు ఇటువైపున భూమిపైవున్న అత్యంత శ్రేష్ఠమైన స్థలం బెతెల్ అని నేను గట్టిగా నమ్ముతున్నాను. పూర్తికాల సేవను నా జీవిత గమ్యంగా చేసుకున్నందుకు నేనెన్నడూ విచారించలేదు. యెహోవా భూ సంస్థలో జరుగుతున్న అతిగొప్ప పెరుగుదలను చూడడం, దానిలో భాగంవహించడం ఎంతటి ఆనందమో గదా! యెహోవా సహాయంతో బెతెల్‌ను నా గృహంగా చేసుకుని రాజ్యానికి సంబంధించిన విషయాలను పెంపొందింపజేయడంలో పూర్ణాత్మతో సేవించాలన్నదే నా కృతనిశ్చయం.”
12 బెతెల్ సేవ కోసం మిమ్మల్ని మీరు అందుబాటులో ఉంచుకుంటే మీరు అనుభవించగల అనేక ఆశీర్వాదాల్లో కేవలం కొన్నింటిని మాత్రమే ఈ బెతెల్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అన్ని సేవాధిక్యతల విషయంలోలాగే దీని కోసం కూడా ముందు మీరు అర్హులు కావాలి. బెతెల్ కుటుంబ సభ్యునిగా సేవచేయడానికి ఉండవలసిన కొన్ని అర్హతలేమిటి?
13 బెతెల్ సేవకు అర్హతలు: బెతెల్ సేవ చేయడానికి దరఖాస్తు పెట్టుకునేవారికి ఉండవలసిన కనీస అర్హతలు దీనిలో ఇవ్వబడిన బాక్సులో చూపించబడ్డాయి. అదనంగా, వారు “సుఖానుభవము నెక్కువగా ప్రేమించు”వారిగాకాక కష్టపడి పనిచేయడానికి సుముఖత కలిగివుండడం ప్రాముఖ్యం. (2 తిమో. 3:4; 1 కొరిం. 13:11) బెతెల్ కుటుంబ సభ్యులు చక్కని వ్యక్తిగత అధ్యయన అలవాట్లు అలవరచుకొని, “మేలు కీడులను వివేచించుటకు” తమ గ్రహణ శక్తులకు తర్ఫీదిచ్చుకున్న ఆధ్యాత్మిక స్త్రీ పురుషులై ఉండాలి. (హెబ్రీ. 5:14) తమ వస్త్రధారణ, శుచిశుభ్రత, సంగీత వినోదాల ఎంపిక వంటివాటితో సహా జీవితంలోని అన్ని రంగాల్లో ఇప్పటికే వారి క్రైస్తవ పరిణతి కనిపిస్తుండాలి. ఇష్ట హృదయంగల బెతెల్ కుటుంబ సభ్యులు ఎక్కడ అవసరమైతే అక్కడ సేవచేస్తారు. యౌవనస్థులకు సాధారణంగా ముద్రణ, సాహిత్యాలను సిద్ధం చేసి రవాణా చేయడం, నిర్వహణ, హౌస్‌కీపింగ్, క్లీనింగ్, లాండ్రీ, ఆహారం తయారుచేయడం వంటివాటితో సహా శారీరకంగా పరిశ్రమించే పనులు ఇవ్వబడతాయి. (సామె. 20:29) అయితే లోకసంబంధమైన పనుల్లోలా కాక ఇక్కడి ప్రతిపని గొప్ప సంతృప్తినిస్తుంది, ఎందుకంటే అది యెహోవాకు మహిమను తెచ్చే పవిత్ర సేవ.—కొలొ. 3:23.
14 బెతెల్ సేవ చేయడానికి ఆహ్వానించబడేవారు కనీసం ఒక సంవత్సరం బెతెల్‌లోనే ఉండాలి. ఇది వారు ఫలవంతమైన పనివారిగా తయారవడానికి కావలసిన తర్ఫీదునిస్తుంది. వారు బెతెల్‌ను తమ గృహంగా చేసుకోగలుగుతారని ఆశించబడుతోంది. బెతెల్ కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత విషయాలకంటే రాజ్య పనికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడానికి యెహోవాపట్ల వారికున్న ప్రేమ వారిని పురికొల్పుతుంది, అది యెహోవాకు ఎంతో ఇష్టమైనది.—మత్త. 16:24.
15 ప్రస్తుత అవసరాలు: బెతెల్‌లో జరిగే పని నైజం దృష్ట్యా, ప్రస్తుతం అవివాహిత సహోదరుల అవసరత ఎక్కువగా ఉంది. బెతెల్‌లో ప్రవేశించడానికి క్రమ పయినీరు సేవ చేయడమన్నది ఒక అర్హతగా పరిగణించబడకపోయినా వారు ఇప్పటికే పూర్తికాల సేవలో ఉన్నారు కాబట్టి, వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. కొన్నిసార్లు బెతెల్‌కు అవసరమైన నిర్దిష్ట నైపుణ్యాలున్న, 19 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సులోవున్న అవివాహిత సహోదరీలను, వివాహిత జంటలను పిలిచే అవకాశం ఉంది. అంతేగాక, 35 సంవత్సరాల కన్నా కాస్త ఎక్కువ వయస్సున్నా, బెతెల్‌లో ఉపయోగపడగల ప్రత్యేక నైపుణ్యాలున్న, తర్ఫీదుపొందిన కొంతమంది సహోదర సహోదరీలు కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చని ప్రోత్సహించబడుతున్నారు. అలాంటి వారిలో డెంటిస్ట్‌లు, డాక్టర్లు, సర్టిఫైడ్ అక్కౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లు, రిజిస్టర్డ్ నర్సులు, ఆటోమోబైల్ మెకానిక్‌లు, లేదా ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లు వంటి వారుండవచ్చు. అయితే, బెతెల్‌కు పిలువబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ఈ విధమైన విద్య గానీ తర్ఫీదు గానీ పొందడాన్ని మేము ప్రోత్సహించడం లేదు. బహుశా సత్యంలోకి రాకముందే ఈ ప్రావీణ్యతల్లో తర్ఫీదు పొందినవారు అందుకు సంబంధించిన రెస్యూమే (విషయాల క్లుప్త, సవివర పట్టిక) తయారుచేసి బెతెల్ దరఖాస్తుకు జతచేసి పంపించవచ్చు.
16 మీరు దరఖాస్తు పెట్టాక బెతెల్‌కు పిలువబడకపోతే నిరుత్సాహపడకండి. ప్రతి సంవత్సరం మీ దరఖాస్తును రెన్యువల్ చేసుకోవడానికి మీరు ఆలోచించవచ్చు. బెతెల్‌కు అవసరంకాగల ప్రత్యేకమైన తర్ఫీదు, నైపుణ్యాలు ఉన్న కొంతమంది సహోదరులు తాత్కాలికంగా స్వచ్ఛంద సేవచేయడానికి ముందుకు వచ్చారు. వారు బెతెల్‌లో తాత్కాలికంగా ఒకటి, రెండు, మూడు లేదా నాలుగు వారాలపాటు లేదా మూడు నెలలపాటు సేవ చేయడానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఈ విధంగా సహాయం చేయడంలో ఆసక్తిగలవారి కోసం సంఘ కార్యదర్శి వద్ద తాత్కాలిక స్వచ్ఛంద సేవకుల దరఖాస్తు ఫామ్ ఉంటుంది. అంతేగాక, తాత్కాలిక స్వచ్ఛంద సేవకుల దరఖాస్తు ఫామ్‌ల కోసం లిటరేచర్ రిక్వెస్ట్ ఫామ్‌పై ఆర్డర్ చేయవచ్చు.
17 బెతెల్‌లో పనిచేసే వారికి క్రీస్తు సహోదరుల సన్నిహిత సహచర్యంలో యెహోవా సేవ చేసే ప్రత్యేకమైన ఆధిక్యత ఉంటుంది. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వ అవసరాలను తీర్చడానికి తమను తాము అందుబాటులో ఉంచుకునే వారందరి స్వయంత్యాగ స్ఫూర్తిని పరిపాలక సభ విలువైనదిగా ఎంచుతుంది.—ఫిలి. 2:20-22; 2 తిమో. 4:11.
18 బాలలారా—ఇప్పుడే మిమ్మల్ని మీరు బెతెల్ సేవకు సిద్ధంచేసుకోండి: బెతెల్ సేవకోసం సిద్ధపడడం, అవసరమగు 19 సంవత్సరాల కనీస వయస్సుకు చేరుకోవడానికి ముందే అంటే చిన్నతనం నుండే ప్రారంభమవుతుంది. బెతెల్ సేవ కోసం తమను తాము సిద్ధం చేసుకునేందుకు బాలలు ఏమి చేయవచ్చు? యేసు ఇలా అన్నాడు: “మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల . . . తగులుబడి మొదట లెక్క చూచుకొనడా?” (లూకా 14:28) ఏ నిర్మాణ ప్రణాళిక విజయానికైనా సిద్ధపాటు, పథకం వేసుకోవడం ఆవశ్యకం కాబట్టి, యౌవనస్థులు యెహోవా సేవలో తమ భవిష్యత్తును ఎలా నిర్మించుకుంటున్నామనే దానికి జాగ్రత్తగా అవధానం ఇవ్వడం ఎంత ప్రాముఖ్యమో కదా! వారు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి జీవితపు తొలిప్రాయంలోనే గట్టి పునాది వేయాలి. పిల్లలుగా మీరు మీ పునాదిని ఎంత చక్కగా వేసుకుంటున్నారు? మీరు బెతెల్‌లో సేవ చేయాలనుకుంటే, ఈ క్రిందివాటిని జాగ్రత్తగా పరిశీలించడం మీకు ప్రయోజనకరం.
19 ఈ ప్రత్యేకమైన సేవాధిక్యత కోసం ‘వీలుకలుగజేసుకోండి’: మత్తయి 19:12, NWలో వ్రాయబడివున్నట్లు, అవివాహితులుగా ఉండడానికి ‘వీలుకలుగజేసుకోమని’ యేసు తన శిష్యులను ప్రోత్సహించాడు. ఎందుకు? వ్యక్తిగత కారణాలను బట్టి కాదు గానీ “పరలోక రాజ్యము నిమిత్తము.” అదేవిధంగా పౌలు కూడా “తొందర యేమియు లేక ప్రభువు సన్నిధానవర్తనులై” ఉండే అలాంటి విధానాన్ని ప్రోత్సహించాడు. (1 కొరిం. 7:32-35) విచారకరంగా, చిన్న వయస్సులోనే వివాహం చేసుకోవాలనుకోవడంతో చాలామంది అవివాహితులుగా బెతెల్ సేవ చేసే ఆధిక్యతను కోల్పోతున్నారు. కుటుంబ బాధ్యతలు లేకుండా ఉన్నప్పుడే పూర్తికాల పరిచర్య చేపట్టడానికి తమ బలాన్ని వినియోగించుకొమ్మని యౌవన సహోదరులను ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాము. అప్పుడు కొంతకాలం తర్వాత వాళ్ళు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నా, జీవితంలోనూ క్రైస్తవ పరిచర్యలోనూ ఎక్కువ అనుభవాన్ని సంపాదించుకున్నందున వారు మంచి భర్తలుగా ఉంటారు. బెతెల్‌లో అనేక సంవత్సరాలపాటు సేవ చేసిన తర్వాత, కొంతమంది వివాహం చేసుకున్నారు, అక్కడ వివాహిత దంపతులుగా సేవచేయడంలో కొనసాగగలుగుతున్నారు. వారికి ఆ తర్వాత ప్రాంతీయ, జిల్లా పని వంటి ఇతర ఆధిక్యతలు లభించినా, బెతెల్ సేవ చేయడానికి వీలుగా కేటాయించిన సమయాన్ని బట్టి వారు నిస్సంశయంగా ఎన్నడూ విచారించరు.
20 వస్తుసంపదల పరుగులోపడి మీ అవధానాన్ని ప్రక్కకు మళ్ళనివ్వకండి: ప్రతి యౌవనస్థుడు ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘విద్యాభ్యాసం ముగించిన తర్వాత నా లక్ష్యం ఏమిటి, పూర్తికాల లౌకిక ఉద్యోగం సంపాదించుకోవడమా లేక పూర్తికాలం యెహోవా సేవ చేయడమా?’ నిజమే ఈ రెండవ చర్య చేపట్టడానికి ఎన్నో త్యాగాలు చేయవలసి ఉంటుంది. అయితే లౌకిక ఉద్యోగాన్ని చేపట్టడానికి కూడా అలా త్యాగాలు చేయక తప్పదు! చివరికి, ఏది నిజంగా నిరంతరం నిలిచే, ప్రయోజనకరమైన ఫలితాలను తీసుకువస్తుంది? యేసు స్పష్టమైన జవాబునిచ్చాడు. మత్తయి 6:19-21 ప్రకారం, ఆయనిలా అన్నాడు: “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు; ఇక్కడ చిమ్మెటయు, తుప్పును తినివేయును, దొంగలు కన్నమువేసి దొంగిలెదరు. పరలోకమందు మీకొరకు ధనమును కూర్చుకొనుడి; అచ్చట చిమ్మెటయైనను, తుప్పైనను దాని తినివేయదు, దొంగలు కన్నమువేసి దొంగిలరు. నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.” యెహోవాకు పూర్ణాత్మతో సేవ చేసేబదులు లౌకిక ఉద్యోగం లేదా వస్తు సంపదలు సంపాదించుకునేలా మన హృదయాలు మనల్ని నడిపించడానికి ఎన్నడూ అనుమతించకుందాము. సంపాదించుకోదగిన ఏకైక సంపద యెహోవాతో మంచి సంబంధం ఏర్పరచుకుని తద్వారా ఆయన హృదయాన్ని సంతోషపరచడమని మనమందరం గుర్తించాలి. (సామె. 27:11) యౌవనులుగా ఉన్నప్పుడే మన జీవితంలో యెహోవాకు ప్రథమ స్థానం ఇవ్వడం ద్వారా, మనకు విలువైనవేమిటో, రాజ్యం మనకు ఎంత ప్రాముఖ్యమైనదో చూపిస్తాము. “యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టముచేత ఆ యాశీర్వాదము ఎక్కువకాదు” అని గుర్తుంచుకోండి. (సామె. 10:22) యెహోవా తమకు చేసినదానంతటిని బట్టి ఆయనకు విలువైనదొకటి తిరిగి ఇవ్వడం ద్వారా తమ హృదయాలు ఎక్కడున్నాయనేది చూపించడానికి యౌవనస్థులకు ఒక చక్కని అవకాశం ఉంది. అర్హులైనవారికి బెతెల్ సేవ అలాంటి అద్భుతమైన అవకాశాన్నిస్తుంది.
21 బెతెల్‌లో సేవచేసేవారు నైతికంగా పరిశుభ్రంగా ఉండాలి: “యౌవనులు దేనిచేత తమ నడత శుద్ధిపరచుకొందురు?” అని కీర్తనకర్త అడిగాడు. దానికి “నీ [యెహోవా] వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే” అని ఆయనే సమాధానమిచ్చాడు. (కీర్త. 119:9) అంటే సాతాను విధానంలోని నైతిక భ్రష్టత్వమంతటి నుండి దూరంగా ఉండడమని దానర్థం. ఇంటర్నెట్ అశ్లీలత, అసభ్య ప్రవర్తన, నీచమైన సంగీతం, దిగజారిన వినోదం, చిన్నప్పటినుండే త్రాగుడు వంటివి యౌవనస్థులు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోకుండా చేసేందుకు సాతాను ఉపయోగించే ఉరులలో కేవలం కొన్ని మాత్రమే. ఈ కుయుక్తులను ఎదిరించడానికి దృఢనిశ్చయం అవసరం. యౌవనస్థులుగా మీరు వీటిలో ఏదైనా చేస్తున్నట్లు మీకనిపిస్తే మీ సంఘంలోని పెద్దలతో మాట్లాడి, బెతెల్ సేవకు దరఖాస్తు పెట్టుకోక ముందే ఈ సమస్యలను పరిష్కరించుకోండి. సంపూర్ణంగా యెహోవా సేవ చేయడానికి పరిశుభ్రమైన మనస్సాక్షి అత్యంత ప్రాముఖ్యం.—1 తిమో. 1:5.
22 ఇతరులతో సర్దుకుపోవడం నేర్చుకోండి: బెతెల్ సేవలో విజయవంతంగా కొనసాగడానికి ఇతరులతో సర్దుకుపోవడాన్ని నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. బెంగుళూరులోని బెతెల్ కుటుంబంలో అన్ని రకాల జీవన నేపథ్యాల నుండి వచ్చిన సహోదర సహోదరీలు ఉన్నారు. ఇలాంటి విభిన్న వ్యక్తిత్వాలు బెతెల్ సౌందర్యాన్ని ఇనుమడింపజేసినా, కొన్నిసార్లు అది సవాళ్ళను కూడా తీసుకువస్తుంది. మీరు బెతెల్‌లో సేవ చేయాలని అనుకుంటుంటే, మిమ్మల్ని మీరిలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘ఇతరులకు నావంటి అభిప్రాయమే లేనప్పుడు నేను సుళువుగా అభ్యంతరపడతానా? ఇతరులు నాతో వ్యవహరించడం సులభమే అన్నట్లు భావిస్తారా?’ అలాంటి విషయాల్లో మీరు మెరుగుపరచుకోవలసిన అవసరం ఉంటే, ఇప్పుడే ఆ విషయంపై పని చేయడం ప్రారంభించండి. అలా చేయడం, బెతెల్ కుటుంబంలోని సభ్యులతో కలిసి జీవించడానికి, పనిచేయడానికి మీరు సుళువుగా సర్దుకుపోయేందుకు మీకు సహాయం చేస్తుంది.
23 యెహోవాతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవడం ద్వారా ఆధ్యాత్మిక వ్యక్తిగా ఉండేందుకు కృషి చేయండి. మంచి వ్యక్తిగత అధ్యయన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోండి, దానిలో బైబిలు ప్రతిరోజు చదవడం ఒక భాగమై ఉండాలి. ఇతరులతో సువార్త పంచుకోవడంలో చురుగ్గా పాల్గొనండి. వీటిని ఆచరణలో పెట్టడం ద్వారా మీరు మీ ఆధ్యాత్మిక అభివృద్ధిని వెల్లడి చేస్తారు. (1 తిమో. 4:15) పూర్తికాల సేవలో కొనసాగడానికి ఇప్పుడే తమను తాము సిద్ధం చేసుకునేవారికి ఎంత అద్భుతమైన ఉత్తరాపేక్షలు వేచివున్నాయోకదా!
24 తల్లిదండ్రులారా, మీ పిల్లలకు తర్ఫీదివ్వండి: యౌవనస్థులు పూర్తికాల పరిచర్యను చేపట్టేలా ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఏమి చేయవచ్చు? యేసు ఇలా అన్నాడు: “సిద్ధుడైన ప్రతివాడును తన బోధకునివలె ఉండును.” (లూకా 6:40) సంపూర్ణంగా శిక్షణ పొందిన శిష్యుడు సహజంగానే, అంకితభావంగల తన బోధకుడి చక్కని లక్షణాలను ప్రదర్శిస్తాడు. క్రైస్తవ తల్లిదండ్రులు తమ పిల్లలకు “దేవభక్తి విషయములో” తర్ఫీదిచ్చేందుకు తీవ్రంగా కృషి చేసేటప్పుడు ఈ సూత్రాన్ని మనస్సులో ఉంచుకోవాలి. (1 తిమో. 4:7) పిల్లలు ఆధ్యాత్మిక విషయాలపట్ల తమ తల్లిదండ్రులకున్న దృక్పథాన్ని ప్రతిబింబించే అవకాశం ఉంది కాబట్టి, తల్లిదండ్రులు తమను తాము ఇలా ప్రశ్నించుకోవడం మంచిది: ‘యెహోవా సత్యారాధనను పెంపొందింపజేయడానికి బెతెల్‌లో జరిగే పనిని వ్యక్తిగతంగా మేము విలువైనదిగా ఎంచుతున్నామా? బెతెల్ ఏర్పాటుపై యెహోవా ఆశీర్వాదాన్ని మనం గుర్తిస్తున్నామా? యెహోవా సేవలో గడిపే జీవితం మన పిల్లలు ఎంపిక చేసుకోగల అత్యంత శ్రేష్ఠమైన జీవితవిధానమని మనం విశ్వసిస్తున్నామా?’ బెతెల్ సేవపట్ల అక్కడ జరుగుతున్న పనిపట్ల మనకున్న హృదయపూర్వక మెప్పు, మన పిల్లల్లో అదేవిధమైన మెప్పును నాటడానికి మనకు సహాయం చేస్తుంది.
25 ఎల్కానా హన్నాలకు సత్యారాధన పట్ల ప్రగాఢమైన కృతజ్ఞత ఉంది. వారు నేటి క్రైస్తవ తల్లిదండ్రులకు గమనార్హమైన మాదిరిని ఉంచారు. ప్రాచీన ఇశ్రాయేలులో, కేవలం ఇశ్రాయేలు పురుషులు మాత్రమే సంవత్సరానికి మూడుసార్లు గుడారంలో “ప్రభువైన యెహోవా సన్నిధిని కనబడవలెను” అనే నియమం ఉండేది. అయినప్పటికీ ఎల్కానా, యెహోవా ఆరాధనా కేంద్రంలో బలి ఇవ్వడానికి “ఏటేట” మొత్తం కుటుంబాన్ని తీసుకుని దాదాపు 30 కిలోమీటర్లు బహుశా కాలినడకన వెళ్ళేవాడు. (నిర్గ. 23:17; 1 సమూ. 1:3, 4, 9, 19; 2:19) ఈ కుటుంబ శిరస్సు తన కుటుంబమంతా ఆధ్యాత్మిక విషయాలపట్ల తనకున్న శ్రద్ధనే కలిగివుండాలని కోరుకున్నట్లు స్పష్టమవుతోంది.
26 హన్నాకు సత్యారాధనపట్ల తన భర్తకున్నంత ఆసక్తే ఉండేది. ఆలయ గుడారం వద్ద సత్యారాధనకు మద్దతునివ్వడానికి తాను దోహదపడవలసిన బాధ్యత ఉందని ఆమె ఎంతగానో భావించింది. యెహోవా తనకు ఒక కుమారుడ్ని అనుగ్రహిస్తే, అతడిని ఆలయ గుడార సేవలో ఉంచుతానని ఆమె యెహోవాకు మ్రొక్కుబడి చేసుకుంది. (1 సమూ. 1:11) మోషే ధర్మశాస్త్రం, తన భార్య చేసుకున్న అనుచితమైన మ్రొక్కుబడిని కొట్టివేసే హక్కును భర్తకు ఇచ్చింది. (సంఖ్యా. 30:6-8) అయితే ఎల్కానా హన్నా చేసుకున్న మ్రొక్కుబడిని బలపరిచాడని తెలుస్తోంది, తద్వారా ఆయన సత్యారాధనకు సంబంధించిన ఆ వ్యక్తీకరణను తానూ సమర్థిస్తున్నట్లు చూపించాడు.—1 సమూ. 1:22, 23.
27 ఆ తల్లిదండ్రులు చూపించిన ప్రశంస, చక్కని స్ఫూర్తి వారి కుమారుడైన సమూయేలుపై ప్రయోజనకరమైన విధంగా ప్రభావం చూపిందా? అవును, చూపింది. బాలునిగా సమూయేలు తన నియామకాల గురించి ఇష్టపూర్వకంగా, నమ్మకంగా శ్రద్ధ తీసుకుంటూ దేవుని సేవలో మరిన్ని విలువైన ఆధిక్యతల కోసం తర్ఫీదుపొందాడు. సమూయేలు ఆలయ గుడారంలో సేవ చేయడంపట్ల ఎల్కానా, హన్నా చూపించిన ఆసక్తి, ఆయన తన బాధ్యతలను చేపట్టడంతో తగ్గిపోలేదు. ఆయన పూర్తికాల సేవలో కొనసాగుతుండగా ఆయనకు ప్రోత్సాహాన్ని మద్దతును ఇవ్వడానికి వారు ఆయనను క్రమంగా సందర్శించడం కొనసాగించారు.—1 సమూ. 2:18, 19.
28 నేటి క్రైస్తవ తల్లిదండ్రులకు ఎల్కానా, హన్నా ఎంత విశేషమైన మాదిరిని ఉంచారో కదా! బెతెల్ సేవ అనే ఆధిక్యతపట్ల మనం హృదయపూర్వకంగా ప్రశంసించడాన్ని మన పిల్లలు విన్నప్పుడు, రాజ్యానికి సంబంధించిన విషయాలను పెంపొందింపజేయడంలో మనం చూపించే స్వయంత్యాగ స్ఫూర్తిని వారు చూసినప్పుడు వారు కూడా ఇతరులకు సేవ చేయాలనే కోరికను వృద్ధి చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఈ విధమైన కోరికను విజయవంతంగా నాటుతున్నారు. ఏడు సంవత్సరాల ఒక బాలిక ఇలా వ్రాసింది: “నేను పెద్దైన తర్వాత, బెతెల్‌కు వెళ్తాను, అక్కడ నేను చేయాలని కోరుకునేవి కొన్ని ఉన్నాయి. (1) కావలికోట తేజరిల్లు! పత్రికల సమాచారాన్ని టైపు చేయడం, (2) ఆర్ట్ సెక్షన్‌లో పనిచేయడం, (3) బట్టలు మడతపెట్టడం. ఏది వీలైతే అది చేస్తాను. వీటిలో ఏదైనా ఫరవాలేదు.” మన పిల్లల హృదయాల్లో అలాంటి ఇష్టపూర్వకమైన స్ఫూర్తి వృద్ధికావడాన్ని చూడడం హృదయాన్ని ఎంతగా ఉత్తేజపరుస్తుందో కదా!
29 యౌవనస్థులారా, “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును” అని గుర్తుంచుకోండి. (1 యోహా. 2:17) బెతెల్ సేవ అనే ప్రత్యేక ఆధిక్యతతో సహా ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేస్తూ ఉండండి. తల్లిదండ్రులారా, గతంలో దైవభక్తిని పెంపొందింపజేసుకోవడానికి తమ పిల్లలను ప్రోత్సహించిన నమ్మకమైనవారి మాదిరిని అనుకరించండి. (2 పేతు. 3:11) మన ఘనమైన సృష్టికర్తను సాధ్యమైనంత సంపూర్ణంగా సేవించేందుకు మన యౌవన సహోదర సహోదరీలకు సహాయం చేయడంలో మన వంతు మనం చేద్దాము, ఎందుకంటే అది “యిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది.”—1 తిమో. 4:8; ప్రసం. 12:1.
[4వ పేజీలోని బాక్సు]
బెతెల్ సేవకు కావలసిన కనీస అర్హతలు
● బాప్తిస్మం తీసుకుని కనీసం ఒక సంవత్సరం గడిచివుండాలి
● యెహోవాపట్ల ఆయన సంస్థపట్ల ప్రగాఢమైన ప్రేమవున్న ఆధ్యాత్మిక వ్యక్తియై ఉండాలి
● మంచి ఆధ్యాత్మిక, మానసిక, భావోద్రేక, శారీరక ఆరోగ్యం కలిగివుండాలి
● భారతదేశ పౌరులుగా లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసులుగా ఉండాలి
● ఇంగ్లీషు బాగా చదవడం, వ్రాయడం, మాట్లాడడం వచ్చివుండాలి
● 19-35 సంవత్సరాల మధ్య వయస్సులో ఉండాలి