తల్లిదండ్రులారా—మీ పిల్లల్లో ఉపయోగకరమైన అలవాట్లను నాటండి
1 ఉపయోగకరమైన అలవాట్లు పుట్టుకతోనే అబ్బవు, లేదా అనుకోకుండా అలవడవు. అంతేగాక, పిల్లల్లో మంచి అలవాట్లను నాటడానికి సమయం పడుతుంది. “నాటడం” అని అనువదించబడిన ఆంగ్ల పదానికి “క్రమక్రమంగా చొప్పించు” లేదా “చుక్కలు చుక్కలుగా ప్రవేశించేలా చేయడం” అని అర్థం. “ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను [తమ పిల్లలను] పెంచ”డానికి తల్లిదండ్రులు వారికి ఎప్పుడూ ఒకేలా క్రమశిక్షణనివ్వడం అవసరం.—ఎఫె. 6:4.
2 శిశుప్రాయం నుంచి ప్రారంభించండి: క్రొత్త వాటిని నేర్చుకునేందుకు, చేయగల్గేందుకు పసి పిల్లలకున్న సామర్థ్యం గమనార్హమైనది. ఒక క్రొత్త భాషను నేర్చుకోవడం పెద్దవాళ్లకు కష్టం అనిపించినా, ఇంకా స్కూళ్లలో చేరని చిన్న పిల్లలు రెండు మూడు భాషలను ఏకకాలంలో నేర్చుకోగలరు. మీ పిల్లవాడు మంచి అలవాట్లను పెంపొందించుకోలేనంత పసివాడని ఎన్నడూ భావించకండి. బైబిలు సత్యాన్ని ఉపదేశించడం పసితనంలోనే ప్రారంభించి, కొనసాగించినట్లైతే, పిల్లవానికి కొంత ప్రాయం వచ్చేసరికి వాడి మనస్సు జ్ఞానంతో నింపబడుతుంది; అది పిల్లవాన్ని “రక్షణార్థమైన జ్ఞానము”గలవానిగా చేస్తుంది.—2 తిమో. 3:14,15.
3 క్షేత్రసేవను ఒక అలవాటుగా చేయండి: తీర్చిదిద్దే వయస్సులో పిల్లవానియందు నాటాల్సిన ఒక ఉపయోగకరమైన అలవాటు ఏమిటంటే, దేవుని రాజ్య సువార్తను క్రమంగా ప్రకటించడమే. అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లలు శిశుప్రాయంలో ఉండగానే ఇంటింటి పరిచర్యకు తమతోపాటు వారిని తీసుకెళ్లడం ద్వారా దాన్ని ప్రారంభిస్తారు. సాక్ష్యమిచ్చే పనిలో తల్లిదండ్రులు క్రమంగా పాల్గొనడం, వారి పిల్లలు పరిచర్య పట్ల మెప్పుదలనూ, ఆసక్తినీ పెంపొందించుకునేలా సహాయపడుతుంది. క్షేత్ర సేవలోని వివిధ రంగాల్లో సాక్ష్యమివ్వడంలో ఎలా భాగంవహించవచ్చో తల్లిదండ్రులు పిల్లలకు చూపించవచ్చు.
4 దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో భాగంవహించడం కూడా పిల్లలకు సహాయపడుతుంది. మంచి అధ్యయన అలవాట్లనూ, అవగాహనచేసుకుంటూ ఎలా చదవాలనేదాన్నీ అది వారికి బోధిస్తుంది. వాళ్లు బైబిల్ని గురించి మాట్లాడడం, పునర్దర్శనాల్ని చేయడం, బైబిలు పఠనాలను నిర్వహించడం నేర్చుకుంటారు. పయినీరు సేవను చేపట్టడానికి, ప్రత్యేక సేవాధిక్యతల కోసం అర్హతను సంపాదించుకోవడానికి అలాంటి శిక్షణ వారిని ప్రేరేపించవచ్చు. అనేకమంది బేతేలు సభ్యులు, ప్రత్యేక పయినీర్లు దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో తమ తొలి నాళ్లను మక్కువతో గుర్తుచేసుకుంటారు; ఉపయోగకరమైన అలవాట్లను పెంపొందించుకునేందుకు వారికి సహాయపడిన ఒక ఏర్పాటుగా దాన్ని పరిగణిస్తారు.
5 మనమంతా మహాగొప్ప కుమ్మరియైన యెహోవా చేతిలో జిగట మన్ను వంటి వారం. (యెష. 64:8) జిగటమన్ను ఎంత తడిగా ఉంటే, అంత సులభంగా మలచబడుతుంది. అది ఎండిపోయేకొద్దీ, గట్టిగా తయారౌతుంది. ప్రజల విషయంలో కూడా అంతే. వాళ్లు పిల్లలుగా ఉన్నప్పుడు, మరింత సులభంగా మలచబడతారు—ఎంత లేత వయస్సులో ఉంటే ఫలితాలు అంత బేషుగ్గా ఉంటాయి. మంచికైనా చెడుకైనా సరే మలచడం జరిగేటప్పుడు వారి లేత ప్రాయమనేది తీర్చిదిద్దే ప్రాయమవుతుంది. శ్రద్ధగల తల్లిదండ్రులుగా, క్రైస్తవ పరిచర్యలో ఉపయోగకరమైన అలవాట్లను పసితనంలోనే మీ పిల్లల్లో నాటడానికి ప్రారంభించండి.