దేవుని ఆశ్చర్య కార్యాలకు అవధానాన్ని ఇవ్వండి
1 ప్రతిఫలదాయకమైన మూడు రోజులపాటు, “దేవుని వాక్యప్రకారం ప్రవర్తించేవారు” జిల్లా సమావేశంలో మనం సమకూడాం. దైనందిన విషయాలనుంచి మన అవధానాన్ని మళ్లించి, యెహోవా ఆశ్చర్య కార్యాలపై మనస్సును కేంద్రీకరించాం. దేవునిపైనా ఆయన వాక్యంపైనా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకునేందుకూ, ఆయనతో మనకున్న సంబంధాన్ని పటిష్ఠపర్చుకునేందుకూ, పరిచర్యపట్ల మన ఆసక్తిని తీవ్రతరం చేసుకునేందుకూ ఆ కార్యక్రమం రూపొందించబడింది. మనకు నేర్పించబడిన వాటి నుంచి మనం ఎలా ప్రయోజనం పొందుతున్నాం?—యోహా. 13:17.
2 కుటుంబాలు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాయి: “దేవుని వాక్యానికి విధేయులై ఉండండి” అన్న గోష్టి మన కుటుంబాల ఆధ్యాత్మిక స్థితిని పరిశీలించుకునేలా మనకు సహాయపడింది. పిల్లలు నేర్చుకోడానికి ఇష్టపడతారు. కాబట్టి, కుటుంబ బైబిలు అధ్యయనాన్ని ఆధ్యాత్మికంగా బలమైన ఒక కుటుంబాన్ని నిర్మించుకునేందుకైన పునాదిగా చేసుకోమని దైవభక్తిగల తల్లిదండ్రులను ప్రోత్సహించడం జరిగింది. అది, యెహోవాతో ఒక సంతోషకరమైన, సురక్షితమైన సంబంధాన్ని పెంపొందించుకునేందుకు వారికి సహాయపడుతుంది. తల్లిదండ్రులారా, దేవుని భావాలకు అవధానాన్ని ఎలా ఇవ్వాలో మీ పిల్లలకు బోధించండి. యెహోవా పట్లా, ఆయన కార్యాల పట్లా మీకున్న ప్రేమను వ్యక్తం చేయండి. (కీర్త. 103:2) ఆధ్యాత్మిక లక్ష్యాల్ని పెట్టుకొని వాటిని చేరుకోవడంలోనూ, యెహోవా సేవ చేయడంలో పూర్తిగా నిమగ్నులవ్వడంలోనూ కలిసి పనిచేయండి.
3 దేవుని వాక్యం మన త్రోవకు వెలుగునిస్తోంది: యెషయా ప్రవచనము—సర్వమానవాళి కోసమైన వెలుగు I (ఆంగ్లం) క్రొత్త పుస్తకాన్ని పొందినందుకు మనమెంతో ఆనందించాం! దాని మొదటి సంపుటిని మీరెంత మేరకు చదవడం పూర్తిచేశారు? యెషయా గ్రంథం, భక్తిహీన జనాంగాల కోసం ఘోరమైన తీర్పుల్నీ అలాగే దేవుని ప్రజల కోసం తేజోమయమైన రాజ్య ఆశీర్వాదాల్నీ ముందుగానే తెలియజేసింది. (యెష. 34:2; 35:9) ఆ గ్రంథం యెహోవాపైనా, ఆయన పనులు చేసే విధానంపైనా మన విశ్వాసాన్నీ, నమ్మకాన్నీ కూడా పెంపొందిస్తుంది.—యెష. 12:2-5.
4 యెషయా ప్రవచనము I పుస్తకాన్ని చదువుతున్నప్పుడు, యెషయా చుట్టూ దుష్టత్వం ప్రబలి ఉన్నప్పటికీ ఆయన యెహోవా పట్ల తనకున్న యథార్థతను ఎలా కాపాడుకున్నాడో మీరు ప్రారంభం నుండే గ్రహించవచ్చు. దేవుని సందేశకునిగా ఉండమని ఆహ్వానం ఇవ్వబడినప్పుడు, ఆయన ఇలా ప్రత్యుత్తరం ఇచ్చాడు: “నేనున్నాను నన్ను పంపు[ము]”. (యెష. 6:8) ఆయన చూపించిన ఇష్టపూర్వక స్ఫూర్తిని గురించి ధ్యానించడం, ‘సకల జనములకు సాక్ష్యమిచ్చే’ పనిలో పూర్తి భాగాన్ని వహిస్తూ రాజ్య సువార్తను ప్రకటించడంలో కొనసాగేలా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది.—మత్త. 24:14.
5 యెహోవా కార్యాలకు మన అవధానాన్ని ఇవ్వడం, ఆయన మహోన్నతత్వాన్ని అధికం చేస్తుంది. కాబట్టి దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించేవారిగా మీకున్న ఆధిక్యతను విలువైందిగా ఎంచండి!