ప్రశ్నా భాగం
◼ ప్రసంగం ఇస్తున్నప్పుడు ప్రసంగీకుడు చూడమన్న లేఖనాలను చూడడం వల్ల ప్రేక్షకులకు ఎటువంటి ప్రయోజనముంది?
ప్రేక్షకులను ఏయే లేఖనాలు చూడమనాలన్నది, చర్చించే విషయాన్ని బట్టి, చర్చించే విషయం బైబిల్లోని కొంత భాగంలో ఉన్న ప్రతి వచనం ఆధారంగానా అనే దాన్ని బట్టి, నిర్ణయించడం జరుగుతుంది.
బైబిలు లేఖనాలను తెరిచి చూడడానికి ఒక కారణం, చర్చించే విషయం బైబిలు నుండే నని రుజువుపర్చుకోవడానికన్నది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. (అపొ. 17:11) చర్చించే విషయానికి లేఖనాధారాలు చూడడం ద్వారా మనందరి విశ్వాసం ధృడమౌతుందనేది ఇంకో కారణం. ఒక కీలకమైన అంశాన్ని చదివేటప్పుడు బైబిలు ఏమి చెప్తుందో చూడడం ద్వారా మనసుల్లో గట్టి ముద్ర పడుతుంది. లేఖనాలు చూడడంతో పాటు నోట్స్ తీసుకోవడం, ప్రసంగీకుడు వ్యక్తపరచే భావాలతోపాటు మనమూ ముందుకు వెళ్ళడం ప్రయోజనకరంగా ఉంటుంది.
సంస్థ అందజేసిన సంక్షిప్తప్రతిలో ప్రసంగంలోని విషయాభివృద్ధికై ఎన్నో లేఖనాలున్నా, అవి ప్రసంగం సిద్ధపడుతున్నప్పుడు ప్రసంగీకుని ప్రయోజనార్థమై అందించబడ్డాయి. ఈ లేఖనాలు ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు ఆ సమాచార పూర్వాపరాలను లేదా ప్రధానమైన లేఖన సూత్రాలను చక్కగా గ్రహించేందుకు, విషయాన్ని ఎలా అభివృద్ధి చేయాలో అర్థం చేసుకోవడానికి సహాయపడగలవు. విషయాన్ని అభివృద్ధి చేయడానికి ఏ లేఖనాలు ముఖ్యమైనవో ప్రసంగీకుడు నిర్ణయించుకుని తనతో పాటు తమ బైబిళ్ళలో చూడమని ప్రేక్షకులను ఆహ్వానించి వాటిని చదివి వివరిస్తాడు. చర్చించే విషయాన్ని సమర్థించడానికి ఇతర లేఖనాలను సూచించవచ్చు, లేదా లేఖనాల్లోని తలంపులను క్లుప్తంగా తన సొంత మాటల్లో వివరించవచ్చు, అటువంటి సందర్భాల్లో వాటిని ప్రేక్షకులు చూడాల్సిన అవసరము లేదు.
ఎంపిక చేసుకున్న లేఖనాలను ప్రసంగీకుడు చదివేటప్పుడు కంప్యూటర్ నుండి ముద్రించబడిన కాగితం నుండి కాక బైబిలు నుండి సూటిగా చదవాలి. ప్రేక్షకులను తమతోపాటు చదవమని ఆహ్వానించినప్పుడు, స్పష్టంగా బైబిలు పుస్తకము, అధ్యాయము, లేఖనము(లు) తెలియజేయాలి. లేఖనం చదవడానికి ముందు ఎందుకు చదువుతున్నాము అన్న ప్రశ్నను వేయడం లేక క్లుప్తంగా ఆ సందర్భాన్ని గురించి చెప్పడం వల్ల లభించే కొద్ది సమయం ప్రేక్షకులు లేఖనం వెదకడానికి సహాయపడుతుంది. పలుమార్లు ప్రస్తావించడం వలన ప్రేక్షకులు లేఖనాలను గుర్తుంచుకోవడటానికి సహాయపడుతుంది. ప్రేక్షకులు వాడే బైబిళ్ళు వేర్వేరు ఎడిషన్లు అయి ఉండవచ్చు గనుక, పేజీ నెంబరు చెప్పకుండా ఉంటే మంచిది. ప్రసంగీకుడు లేఖనాలు చూడమని ఆహ్వానించినప్పుడు వాటిని చూడడం ద్వారా, అలాగే అవి వివరించబడేటప్పుడు, దేవుని వాక్యములోని శక్తి నుండి ప్రేక్షకులు ప్రయోజనం పొందవచ్చు.—హెబ్రీ. 4:12.