యెహోవా చూపిస్తున్న సహనం పట్ల మీకు మెప్పుదల ఉందా?
1 యెహోవా గనుక గత 10, 20, లేదా ఇంకా ఎక్కువ సంవత్సరాలుగా సహనాన్ని కనబరుస్తూ సాక్ష్యపు పనిని ఇంకా విస్తృతం చేస్తూ ఉండకపోయినట్లైతే, మీరు సత్యాన్ని నేర్చుకుని ఉండేవారా? ఎంతోమంది ప్రజలు “మారుమనస్సు పొందవలెనని” ఆయన సమయాన్ని అనుమతించినందుకు మనమెంత కృతజ్ఞత కలిగివున్నాము! అయితే, యెహోవా తీర్పుతీర్చే మహాదినము “దొంగవచ్చినట్లు” వస్తుంది. (2 పేతు. 3:9, 10) అందుకని దేవుని దీర్ఘశాంతానికి, ఈ విధానాన్ని అంతం చేయడంలో ఆలస్యం చేస్తున్నాడని తప్పుగా అర్థం చేసుకోకూడదు.—హబ. 2:3.
2 ప్రజలమీద జాలిపడండి: యెహోవా దీర్ఘశాంతాన్ని మన గ్రహణశక్తులు గ్రహించలేవు. అయితే, మనం దాని వెనుకగల ఉద్దేశాన్ని విస్మరించకూడదు. (యోనా 4:1-4, 11) మానవజాతి దుస్థితిని యెహోవా చూస్తాడు, మానవుల పట్ల ఆయనకు కనికరం ఉంది. యేసులో కూడా అలాంటి భావాలే ఉన్నాయి. తాను ప్రకటించిన జనసమూహాల పట్ల ఆయన కనికరపడ్డాడు. అందుకనే, నిత్య జీవాన్ని పొందే అవకాశం ఇంకా అనేకులకు లభించేలా ప్రకటనా పని విస్తరించాలని కూడా ఆయన కోరుకున్నాడు.—మత్త. 9:35-38.
3 దుర్ఘటనలూ విపత్తులూ సంభవించినప్పుడు, ఆ బాధితుల్లో సత్యం తెలియని వారిని చూసి మన కళ్ళు చెమర్చవా? నేడు ప్రజలు “కాపరిలేని గొఱ్ఱెలవలె” ఉన్నారు, వారు అల్లకల్లోలంగా ఉన్న ఈ లోకాన్ని అర్థంచేసుకోవడానికి దానితో వేగడానికి విఫలయత్నం చేస్తున్నారు. (మార్కు 6:34) మనం సువార్తను అత్యంత ఆసక్తితో ప్రకటించడం ద్వారా, యథార్థ హృదయుల్ని ఓదారుస్తాము, యెహోవా చూపిస్తున్న సహనం పట్ల మెప్పుదలను కనపరుస్తాము.—అపొ. 13:48.
4 మన పని అత్యవసరమైంది: గత సంవత్సరం, 3,23,439 మంది బాప్తిస్మం పొందారు, 1,40,00,000 మందికిపైగా జ్ఞాపకార్థ దినానికి హాజరయ్యారు. ఈ దుష్ట విధాన నాశనాన్ని తప్పించుకునే అవకాశం ఇంకా ఎంతోమందికి ఉన్నదనడానికి ఎంతటి నిదర్శనమిది! “గొప్పసమూహము” ఎంత పెద్దదిగా ఉంటుందో మనకు తెలియదు. (ప్రక. 7:9) మన ప్రకటనా పని ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో కూడా మనకు తెలియదు. కానీ యెహోవాకు తెలుసు. సువార్త ఆయన సంతృప్తి మేరకు ప్రకటించబడుతుంది, “అటుతరువాత అంతము వచ్చును.”—మత్త. 24:14.
5 దేవుని దినం త్వరలో రానైయుంది. అది రావడానికి ముందు మిగిలివున్న సమయం బహు కొంచెముగా ఉంది. (1 కొరిం. 7:29 ఎ; హెబ్రీ. 10:37) నిస్సందేహంగా, “మనము విశ్వాసులమైనప్పటికంటె ఇప్పుడు, రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది.” (రోమా. 13:11) కాబట్టి, దైవిక సహనం వెనుక ఉన్న ఉద్దేశాన్ని మనం విస్మరించకుందాము. బదులుగా, మనం అత్యవసర భావంతో ప్రకటిద్దాము, అలా చేసినప్పుడే నీతి కోసం పరితపించే ప్రజలు మరింత మంది యెహోవా యొక్క గొప్ప కనికరాన్ని అనుభవిస్తారు.