‘ఔదార్యముగలవారిగా, ఇతరులతో పంచుకునేవారిగా ఉండండి’
1 తన తోటి క్రైస్తవులు “మేలుచేయువారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యముగలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై యుండవలెనని” వారిని ప్రోత్సహించుమని శతాబ్దాల క్రితం అపొస్తలుడైన పౌలు తిమోతికి ఉపదేశించాడు. (1 తిమో. 6:18, 19) ‘ఉపకారము ధర్మము’ చేయడం మర్చిపోకండి అని హెబ్రీ క్రైస్తవులకు కూడా పౌలు గుర్తుచేశాడు. (హెబ్రీ. 13:16) ఆయన ఇటువంటి నడిపింపును ఎందుకిచ్చాడు? ఎందుకంటే, “సత్ క్రియ చేయు ప్రతివానికి, . . . మహిమయు ఘనతయు సమాధానమును కలుగును” అని ఆయనకు తెలుసు గనుకనే.—రోమా. 2:10.
2 యెహోవా దేవుడు సృష్టికర్త గనుక సమస్తానికీ ఆయనే యజమాని. (ప్రక. 4:10, 11) ఆయన తన సృష్టిని మనకోసం ఎలా ఉపయోగిస్తున్నాడో చూసి అందుకు తప్పకుండా మెప్పుదలను కనపరుస్తాము. మానవజాతిలో అత్యధికులు కృతఘ్నులుగా ఉంటున్నప్పటికీ సర్వోన్నత ప్రభువు, జీవరక్షకమైన తన ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందేందుకు ఔదార్యంగా అందరినీ అనుమతిస్తూ ఉన్నాడు. (మత్త. 5:45) చివరికి ఆయన తన ప్రియమైన కుమారుణ్ని కూడా, మనం నిత్యజీవం పొందాలని బలిగా ఇచ్చాడు. మనపట్ల ప్రదర్శితమైన ఈ ప్రేమకు ప్రతిగా, మనమూ మన తోటి మానవుల పట్ల ఔదార్యంగా ఉంటూ మన కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించవద్దా?—2 కొరిం. 5:14, 15.
3 ఇతరులతో మనమేమి పంచుకోగలము? దేవుణ్ని ప్రీతిపర్చే ఏ మార్గంలోనైనా మనం మనకున్న ఏ ఆస్తులనైనా ఉపయోగించడం యుక్తం. ప్రపంచవ్యాప్త రాజ్య పనికి వస్తుపరంగాను ఆధ్యాత్మికంగాను మద్దతునివ్వాలని మనం నిశ్చయంగా కోరుకుంటాము. అయితే, ఏ వ్యక్తి అయినా కల్గివుండగల అత్యంత గొప్ప ఐశ్వర్యము సువార్త, ఎందుకంటే “రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తియై యున్నది.” (రోమా. 1:16) మనం మన సమయాన్నీ, వనరుల్నీ, ప్రతి నెలా ఔదార్యంగా ఉపయోగిస్తూ ప్రకటనా బోధనా పనుల్లో భాగం వహించడం ద్వారా, మనమీ ఆధ్యాత్మిక ఐశ్వర్యాన్ని ఇతరులతో పంచుకోగలము, తద్వారా వారు నిత్యజీవాన్ని పొందగలరు.
4 బీదలైన వారికి మనం సహాయం చేసినప్పుడు యెహోవా ఎంతో ఆనందిస్తాడు. అందుకు ఆయన ఆశీర్వాదాలిస్తానని వాగ్దానం చేస్తున్నాడు, ఇంకా ఇలా గుర్తుచేస్తున్నాడు కూడా: “ఉగ్రతదినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణమునుండి రక్షించును.” (సామె. 11:4; 19:17) రాజ్య పనికి వస్తుపరమైన విరాళాలతో మద్దతునివ్వడం, సువార్త ప్రకటనా పనిలో పూర్తిగా భాగం వహించడం మనం నిజంగా ఔదార్యం గలవారమనీ ఇతరులతో పంచుకోవటానికి సిద్ధంగా ఉన్నవారమనీ చూపిస్తాయి.