“పరీక్షింపబడవలెను”—ఎలా?
1 యెహోవా సంస్థ పెరుగుతూ ఉంది గనుక, పరిచర్య సేవకులుగా సేవచేసేందుకు అర్హతగల సహోదరుల అవసరం ఎంతో ఉంది. ఇంకా నియమించబడని ఎంతోమంది సహోదరులు, టీనేజర్లు కూడా సంఘంలో సేవ చేయాలనే కోరికను కలిగివున్నారు. వాళ్ళకు అదనపు పనిని అప్పగించినప్పుడు, తాము అవసరమైన వారమనీ సఫలులమయ్యామనీ భావిస్తారు. వాళ్ళ సామర్థ్యం ‘పరీక్షించబడటంపైనే’ వాళ్ళు సాధించే ప్రగతి ఆధారపడివుంటుంది. (1 తిమో. 3:10) ఆ ప్రగతినెలా సాధించవచ్చు?
2 పెద్దల పాత్ర: 1 తిమోతి 3:8-13లో పేర్కొనబడిన, పరిచర్య సేవకులకు ఉండవల్సిన లేఖనాధార అర్హతల ద్వారా పెద్దలు ఒక సహోదరుడి సామర్థ్యాన్ని అంచనా వేయడమే కాక, బాధ్యతలను చేపట్టడంలో ఆయనకున్న సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. వారు ఆయనకు పత్రికలు సాహిత్యాలు పంచే పని, మైక్రోఫోన్ హాండిల్ చేయడం, రాజ్యమందిరాన్ని గురించి శ్రద్ధ వహించడం వంటివాటికి సంబంధించిన సహాయకరమైన పనులను అప్పగించవచ్చు. తనకు అప్పగించబడిన పనులకు ఆయన ఎలా ప్రతిస్పందిస్తాడు, వాటిని ఎలా నిర్వహిస్తాడు అనేది పెద్దలు గమనిస్తారు. ఆయన నమ్మదగినవాడా, సమయాన్ని పాటించేవాడా, పట్టుదల, అణకువ గలవాడా, పని పట్ల సుముఖత ఉన్న వ్యక్తా, ఇతరులతో సర్దుకుపోయే సామర్థ్యముందా అని పరిశీలిస్తారు. (ఫిలి. 2:20) వస్త్రధారణ, కేశాలంకరణలలో మాదిరికరంగా ఉన్నాడా? బాధ్యతాయుతమైన వ్యక్తా? ఆయన ‘జ్ఞానముతో కూడిన సాత్వికమైన క్రియలలో యోగ్య ప్రవర్తనను’ చూపిస్తున్నాడా అని వాళ్ళు చూడాలనుకుంటారు. (యాకో. 3:13) సంఘంలో సహాయం చేయడానికి నిజంగా సుముఖత చూపిస్తున్నాడా? ఆసక్తితో క్షేత్ర పరిచర్యలో పాల్గొనడం ద్వారా, “జనులను శిష్యులనుగా” చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞను అనుసరిస్తున్నాడా?—మత్త. 28:19; కావలికోట సెప్టెంబరు 1, 1990, 18-28 పేజీలు చూడండి.
3 ఒక వ్యక్తిని పరిచర్య సేవకుడిగా నియమించడానికి బైబిలు ఒక పరిమిత వయస్సును నిర్దేశించకపోయినప్పటికీ, అది అలాంటి సహోదరులను “పురుషులు” అని సంబోధిస్తుంది. వారికి భార్యా పిల్లలు ఉండే సాధ్యత గురించి ప్రస్తావించబడింది గనుక వాళ్లు మరీ చిన్న వయస్సువారై ఉంటారనుకోవడం సబబుకాదు. (1 తిమో. 3:12, 13) అలాంటి పురుషులు “యౌవనేచ్ఛల”కు లొంగిపోకూడదు గానీ, దేవుని ఎదుటా మనుష్యుల ఎదుటా మంచి పేరు, నిష్కళంకమైన మనస్సాక్షి కలిగి, మాన్యులై ఉండాలి.—2 తిమో. 2:22.
4 సహజసిద్ధమైన సామర్థ్యం ప్రయోజనకరమైనదే అయినప్పటికీ ఒకరి దృక్పథం వైఖరులు ప్రాముఖ్యమైనవి. ఒక సహోదరుడు దేవుని స్తుతించాలనీ, తన సహోదరులకు సేవ చేయాలనీ వినయంగా కోరుకుంటున్నాడా? అలాగైతే సంఘంలో అభివృద్ధి సాధించాలన్న ఆయన కృషిని యెహోవా ఆశీర్వదిస్తాడు.