చిన్నవారికి అందుబాటులో ఉన్న ఆధిక్యత
1 ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్న అనేకమంది, సత్యంలో పెరుగుతున్న పిల్లలుగా తాము ఆనందించిన ఒక ఆధిక్యతను ఇష్టపూర్వకంగా గుర్తుచేసుకుంటారు, అదే పత్రికాదిన కార్యక్రమం. ఆ పని 1949లో అన్ని సంఘాల్లోనూ ప్రారంభించబడింది. ప్రతి ఒక్కరూ వారానికి ఒకరోజు కావలికోట, తేజరిల్లు ! పత్రికలను వీధుల్లో, ఇంటింటా, దుకాణాల్లో, ఇతరమార్గాల్లో అందించడంపై అవధానాన్ని నిలపాలి. ప్రత్యేకించి చిన్న పిల్లలుగా ఉన్న ప్రచారకులు ఈ పనిలో పాల్గొనేందుకు ఎదురుచూసేవారు ఎందుకంటే, సంఘంలో ఉన్న పెద్దవాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు కూడా భాగం వహించే అవకాశాన్ని అది ఇచ్చేది. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అలాగే చేశారా?
2 మీ పిల్లలు పాల్గొనేలా చూడండి: ఇంటింటి సేవలో లేఖనాధార చర్చను చేయడానికి సిద్ధంగాలేని చిన్నపిల్లలు పత్రికలను అందించగలరు. అలా చేయడానికి చిన్న చిన్న వాక్యాలతో ఉన్న క్లుప్తమైన అందింపును నేర్చుకోవడం అవసరం. బహుశా ముఖచిత్రంపై చేసే క్లుప్త వ్యాఖ్యానమైనా సరిపోవచ్చు. చాలామంది మన చిన్న పిల్లలు ఇస్తున్న పత్రికలను వెంటనే తీసుకుంటారు, సాధారణంగా వాళ్ళు ఈ చిన్న పిల్లల నిజాయితీనీ మంచి ప్రవర్తననూ మెచ్చుకుంటారు. కాస్త సహాయం చేస్తే ఈ చిన్న పిల్లలు రాజ్యవర్తమానాన్ని వ్యాప్తి చేయడంలో విలువైన మద్దతునిస్తూ ఈ సేవను బాగా చేయగలుగుతారు. అయితే పిల్లలు పెద్దవాళ్లవుతుండగా, వారికున్న సాక్ష్యమిచ్చే నైపుణ్యాలను పెంచుకొనేందుకు తల్లిదండ్రులు సహాయం చేయవచ్చు.
3 మాన్వెల్ మూడేళ్ళ వయస్సులో ఇంటింటా ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని తల్లిదండ్రులు క్లుప్త అందింపును అతనికి కంఠతా పట్టించారు. అతడు వాళ్ళతోపాటు ఆసక్తితో ప్రకటిస్తూ అనేక పత్రికలను, బ్రోషూర్లను, కరపత్రాలను అందిస్తూ ఉండేవాడు. అనియతంగా కూడా సాక్ష్యం ఇచ్చేవాడు. ఒకసారి అతని తల్లిదండ్రులు అతన్ని ఒక పార్క్‌కు తీసుకువెళ్ళినప్పుడు, తనే చొరవ తీసుకుని అక్కడున్న ప్రజలకు కరపత్రాలను అందించాడు. మాన్వెల్ ఇంకా చాలా చిన్న పిల్లవాడే అయినప్పటికీ, పరిచర్య పట్ల అతనికి ఉన్న ఆసక్తి, అతని తల్లిదండ్రులకు అతని సంఘంలో ఉన్న వారందరికీ నిజమైన ప్రోత్సాహాన్నిచ్చింది.—సామె. 22:6.
4 ప్రతి శనివారం, 2000 యెహోవా సాక్షుల క్యాలెండరు (ఆంగ్లం)లో “పత్రికా దినము”గా నిర్దేశించబడింది. తల్లిదండ్రులారా, ఈ సేవాధిక్యతలో సాధ్యమైనంత క్రమంగా పాల్గొనేందుకు మీ పిల్లలకు సహాయం చేస్తూ ఈ పనిలో తిరిగి ఆసక్తిని వృద్ధిచేసుకోమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము.