దానియేలు ప్రవచనం పఠనం
1 ఏప్రిల్ 17తో ప్రారంభమయ్యే వారం నుంచి కొన్ని సంఘాలు దానియేలు ప్రవచనానికి అవధానమివ్వండి! (ఆంగ్లం) అనే పుస్తకాన్ని సంఘ పుస్తక పఠనంలో పఠిస్తాయి. ఇప్పటికే అనేకమంది ఈ కట్టిపడవేసే పుస్తకాన్ని చదివేశారు, అయితే సమాచారాన్ని గుంపుగా చర్చించటంవల్ల వచ్చే ప్రయోజనాలను ఆనందించే అవకాశం ఇప్పుడు మనకుంది. బైబిలు పుస్తకమైన దానియేలుపై లోతైన పఠనానికి ప్రతివారం హాజరవటానికి ప్రచారకులందరూ, ఆసక్తిగలవారూ, పిల్లలూ ఆహ్వానించబడుతున్నారు, అవును ప్రోత్సహించబడుతున్నారు కూడా.—ద్వితీ. 31:12, 13.
2 పఠన పట్టిక, ఆదేశాలు: దానియేలు ప్రవచనం పుస్తకపు పూర్తి పఠన పట్టిక ఈ మన రాజ్య పరిచర్యలో ఉంది. దాని కాపీని మీ పఠన పుస్తకంలో తప్పక ఉంచుకోండి. ప్రతి వారం చర్చించబోయే ఆ పుస్తకంలోని అధ్యాయాన్ని, పేరాలను అలాగే దానియేలు గ్రంథంలో నుండి వచనాలను ఆ పట్టిక చూపిస్తుంది. ఆ పుస్తకంలోని కొంత సమాచారం ఎప్పుడు, ఎలా పరిశీలించబడుతుందో పాదవచనాలు వివరిస్తాయి. ప్రతివారం పఠన ముగింపులో, ఆ వారం కోసం పట్టిక వేయబడిన దానియేలు గ్రంథంలోని నిర్దిష్ట వచనాలను గుంపుతోపాటు పునఃసమీక్షించమని పఠన నిర్వాహకుని ప్రోత్సహిస్తున్నాము. సమయం అనుమతిస్తే, వచనాలు చదివి వాటిపై వ్యాఖ్యానించవచ్చు. వచనాల అన్వయింపును మనం పరిశీలిస్తూనే ఉంటాము గనుక, కొన్ని వచనాలు ఒక వారంలో ఉన్నవే మరో వారంలోనూ ఉండవచ్చు.
3 సమగ్ర పఠనం కోసం సిద్ధపడండి: నియమిత సమాచారాన్ని తొందరేమీ లేకుండా చర్చించేందుకుగానూ ప్రతి వారం కోసం తగినంత సమయాన్ని కేటాయించడానికి కృషి చేయడం జరిగింది. నాలుగు పాఠాలు చాలా చిన్నవే. కాబట్టి, జూన్ 5తో ప్రారంభమయ్యే వారపు పఠన ముగింపులో, పఠన నిర్వాహకుడు దానియేలు 2:1-40 వచనాల పునఃసమీక్ష చేయవచ్చు. జూన్ 26తో ప్రారంభమయ్యే వారంలో, ఆయన దానియేలు 3:1-30 వచనాల పునఃసమీక్ష చేయవచ్చు. సెప్టెంబరు 4తో ప్రారంభమయ్యే వారంలో 139వ పేజీలో ఉన్న చిత్రాలను లేఖనాలను గూర్చిన సమగ్రమైన చర్చను చేయాలి. అక్టోబరు 2తో ప్రారంభమయ్యే వారపు పఠనంలో 188, 189 పేజీల్లో ఉన్న చార్టును చర్చించాలి.
4 ప్రతివారం పఠనం కోసం చక్కగా సిద్ధపడండి, అందులో భాగం వహించడాన్ని ఆనందించండి. యెహోవా దృశ్య సంస్థతో సహవసించేందుకూ, ఆయన నమ్మకమైన అభిషిక్తులు అందిస్తున్న అవగాహనా అంతర్దృష్టిల నుండి ప్రయోజనం పొందేందుకూ మీకున్న ఆధిక్యత పట్ల మెప్పుదల కల్గివుండండి. (దాని. 12:3, 4) పుస్తక పఠనానికి క్రమంగా హాజరవమని ఇతరులను దయతో ప్రోత్సహించండి. సంభ్రమాశ్చర్యాలను పుట్టించే దానియేలు పుస్తకంలో బయల్పర్చబడినట్లుగా దేవుని ప్రవచన వాక్యానికి మనమందరం అవధానమిద్దాము.—హెబ్రీ. 10:23-25; 2 పేతు. 1:19.