సహాయాన్ని అడగండి
1 “అపాయకరమైన” అనే ప్రేరేపిత మాటలు మన క్లిష్టమైన కాలాల్ని సరిగ్గానే వర్ణిస్తున్నాయి. (2 తిమో. 3:1) కాబట్టి, మీరు ఎదుర్కోలేనని భావించే కష్టమైన ఆధ్యాత్మిక సవాళ్లను ఎదుర్కున్నప్పుడు మీరు ఏమి చేయవచ్చు?
2 సంఘంలో ఆధ్యాత్మికంగా అభివృద్ధిచెందిన సభ్యునితో మాట్లాడటానికి మీరు ఇష్టపడతారా? ఇబ్బందిగా భావిస్తూ కొందరు అలా చేయటానికి సంకోచించవచ్చు. అనవసరంగా ఇతరులమీద భారం వేయటం ఎందుకని వారు భావిస్తుండవచ్చు, లేక నిజంగా ఎవరైనా సహాయం చేయగలరా అని సందేహిస్తుండవచ్చు. నిజమే, మన వ్యక్తిగత బాధ్యతల గురించి శ్రద్ధ వహించటానికి మన యథాశక్తి మనం ప్రయత్నించాలి, కానీ మన ఆధ్యాత్మిక సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో సహాయం పొందటానికి మనం ఎప్పుడూ వెనుకాడకూడదు.—గల. 6:2, 5.
3 ఎక్కడ మొదలుపెట్టాలి: బహుశ పుస్తక పఠన నిర్వాహకుని దగ్గరికి వెళ్లి, మీరు ఆయనతో కలసి క్షేత్రసేవలో పాల్గొనవచ్చేమో ఆయనను అడుగవచ్చు. ఆధ్యాత్మికంగా ఎదగాలనే మీ కోరికను అతనితో చెప్పేందుకు ఇది మీకు అవకాశాన్నిస్తుంది. ఆయన పరిచర్య సేవకుడైనట్లైతే, మీకు కావల్సిన ఆధ్యాత్మిక సహాయాన్ని గూర్చి అతనికి తెలియజేయండి, అప్పుడతడు మీకు సహాయం చేయమని పెద్దలను కోరుతాడు. లేదా మీకు చింతకల్గిస్తున్న విషయాల్ని గూర్చి మాట్లాడేందుకు పెద్దలలో ఒకర్ని కలిసి మీరే మాట్లాడవచ్చు.
4 మీకు ఎలాంటి సహాయం అవసరం? ఏదైనా మీ ఉత్సాహాన్ని చల్లబరిచిందా? మీ పిల్లల్ని సంఘానికి సన్నిహితంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్న ఒంటరి తల్లి/తండ్రా మీరు? సహాయం అవసరమైన పెద్దవయస్సులో ఉన్నవారా మీరు? లేక మిమ్మల్ని ఏదైనా సమస్య నిరుత్సాహపరుస్తుందా? మన క్లిష్టకాలాల్తో వ్యవహరించటం కష్టం కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. సహాయం అందుబాటులో ఉంది.
5 పెద్దలైనవారు ఎలా సహాయం చేస్తారు: పెద్దలు నిజంగా శ్రద్ధ తీసుకుంటారు. వారు మీ చింతలను వింటారు. ఇతర ప్రచారకులు అలాంటి అవాంతరాలనే ఎదుర్కొంటున్నట్లైతే, కాపరులుగా సంఘాన్ని కాసేటప్పుడు, సంఘంలో బోధించేటప్పుడు పెద్దలు దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. “మందకు మాదిరులుగా” వారు, ఆనందంగా మీతో కలిసి పనిచేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. (1 పేతు. 5:3) అనుభవజ్ఞులైన ఈ సహోదరులు బైబిలు సూత్రాల గురించి తర్కిస్తుండగా వినటం మీ పరిచర్యను మెరుగుపర్చగలదు, మీ వ్యక్తిగత జీవితంలో మీకు సహాయపడగలదు.—2 తిమో. 3:16, 17.
6 యేసు మనకు అనేకమందిని “మనుష్యులలో ఈవులను”గా అనుగ్రహించాడు. (ఎఫెసీయులు 4:8, NW) దీనర్థం పెద్దలు మీ సేవకై ఉన్నారు. మీకు సహాయం చేయటానికి వారు అందుబాటులో ఉన్నారు, ఒక విధంగా చెప్పాలంటే వారు ‘మీ వారై ఉన్నారు.’ (1 కొరిం. 3:21-23) కాబట్టి ఊరకుండే బదులు మాట్లాడండి. మీకు అవసరమైన సహాయాన్ని అడగండి.