ఒక ముస్లిమ్‌తో మీరేమని చెప్తారు?
1 ముస్లిమ్‌కు సాక్ష్యమిచ్చిన అనుభవం మీకుందా? అలాగయితే, ముస్లిమ్‌లకు దేవునిపైన దృఢ నమ్మకం ఉంటుందని మీరు తెలుసుకొనే ఉంటారు. అయితే, యెహోవా ప్రవక్తల ద్వారా ముందుగానే చెప్పబడినట్లు భూమి మీదకు రాబోయే పరదైసు గురించి వాళ్ళకు అంతగా తెలియదు, కాబట్టి మనం ఆ నిరీక్షణను వాళ్ళతో పంచుకోవాలనుకుంటాము. (1 తిమో. 2:3, 4) ఈ క్రింది సమాచారం మంచి సాక్ష్యమిచ్చేందుకు మీకు సహాయపడుతుంది.
2 ముస్లిమ్‌లు అల్లాఃని, అంటే దేవుణ్ని నమ్ముతారు, మహమ్మద్ దేవుని ప్రవక్త అని నమ్ముతారు. వారి పవిత్ర గ్రంథం ఖురాన్, వారి మతం ఇస్లామ్ అని పిలువబడుతుంది, ఇస్లామ్ అంటే “విధేయత” అని అర్థం. అబద్ధమాడటం, విగ్రహారాధన చేయడం తప్పనీ, దేవుడు ఒక్కడేననీ, ఆయన త్రిత్వంలో భాగం కాదనీ ఖురాన్ చెప్తుంది. ఇంకా అది, ఆత్మ అమర్త్యతను, నరకాగ్నిని, పరలోక పరదైసును బోధిస్తుంది. బైబిలు దేవుని వాక్యమని వాళ్ళు అంగీకరిస్తారు కానీ దానిలో మార్పులు జరిగాయనీ, ఖురాన్ అయితే, మూలభాషలోనే ఉంది కాబట్టి అది స్వచ్ఛంగానే ఉందని నమ్ముతారు.
3 స్నేహపూర్వకంగా, యుక్తిగా, వివేచనతో మాట్లాడండి: ముస్లిమ్లతో సంభాషిస్తున్నప్పుడు, స్నేహపూర్వకంగానూ, యుక్తిగానూ ఉండండి. (సామె. 25:15) ముస్లిమ్‌ల నమ్మకాలు గట్టిగా పాతుకొని ఉంటాయనీ, అవన్నీ చాలామటుకు కంఠతా పట్టి నేర్చుకున్నవనీ మనస్సులో ఉంచుకోండి. కాబట్టి, మత బోధల గురించి తర్కించడమూ, దేవుని చిత్తమేంటో తమకు తాము నిరూపించుకోవడమూ వారి ఆధ్యాత్మిక పెరుగుదలలో ఒక భాగం కాదు. (రోమా. 12:2) ముస్లిమ్‌లకు సహాయం చేసేందుకు సహనం, అర్థం చేసుకునే మనస్సు ప్రాముఖ్యం.—1 కొరిం. 9:19-23.
4 మీరు క్రైస్తవమత సామ్రాజ్యానికి సంబంధించినవారనే అపోహను కలిగించే మాటలు మాట్లాడకుండా జాగ్రత్తపడండి. మీకు క్యాథలిక్ మతంతో గానీ, ప్రొటస్టెంటు మతంతో గానీ ఎలాంటి సంబంధమూ లేదనీ, మీరు భిన్నమైనవారనీ వాళ్ళకు స్పష్టం చేయండి. బైబిలును దేవుని వాక్యంగా పేర్కొనండి. ముస్లిమ్‌లు “దేవుని కుమారుడు” అన్న పదం అంటే అయిష్టతను చూపిస్తారు కాబట్టి, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించేంత వరకూ ఆ పదాన్ని ఉపయోగించకుండా ఉండటం, ఆ విషయాన్ని చర్చించకుండా ఉండటం మంచిది. మీరు యేసును ఒక ప్రవక్తగా లేక ఒక సందేశకునిగా ప్రస్తావించవచ్చు. వాదించవద్దు. వాళ్లకు కోపం వస్తోందని మీరు గమనిస్తే, వెంటనే మర్యాదపూర్వకంగా అక్కడ నుండి వచ్చేయండి.
5 గుంపుతో కాక ఒక వ్యక్తితోనే మాట్లాడటం మంచిది. సాధారణంగా, స్త్రీలకు స్త్రీలు సాక్ష్యమివ్వాలనీ, పురుషులకు పురుషులు సాక్ష్యమివ్వాలనీ సిఫారసు చేయబడుతుంది. అయితే దీనికి మినహాయింపులు ఉన్నాయన్నది స్పష్టమే, కానీ సరియైన వివేచనను ఉపయోగించడం అవసరం. స్త్రీలకు సంబంధించి ఏది సరైన వస్త్రధారణ, ఏది సరైన కేశాలంకరణ అనే విషయంలో చాలామంది ముస్లిమ్‌లు ఎంతో సున్నితమైన భావాలను కలిగివుంటారు. సహోదరీలు ఈ విషయాన్ని తెలుసుకొనివుండాలి.—1 కొరిం. 10:31-33.
6 ఏ విషయాల గురించి మాట్లాడాలి: దేవుని గొప్పతనాన్ని గూర్చి ఆయన ప్రేమను గూర్చి నిస్సంకోచంగా మాట్లాడండి. మీరు నిజమైన విశ్వాసి అని చెప్పడానికీ, దేవుడు ఒక్కడే (త్రిత్వంలో భాగం కాదు) అని చెప్పడానికీ, విగ్రహారాధన తప్పు అని చెప్పడానికీ వెనుకాడవద్దు. నేడు యుద్ధాలు, అల్లకల్లోలాలు, జాతి విద్వేషాలు, అనేక మతాల వారి మధ్య ఉన్న వేషధారణ వంటి, ప్రపంచంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి మాట్లాడండి.
7 దేవుని మార్గదర్శనము—పరదైసుకు మన మార్గము (ఆంగ్లం) అనే బ్రోషూరు ముస్లిమ్లతో సంభాషణను ప్రారంభించేందుకు ఉపయోగపడే విషయాలపై మరింత అంతర్దృష్టిని ఇస్తుంది. బైబిలు పఠించేందుకు స్వేచ్ఛవున్న వాతావరణంలో నివసించే ముస్లిమ్‌ల కోసం ఇది తయారుచేయబడింది.
8 ఒక అందింపుగా మీరిలా చెప్పవచ్చు:
◼ “నేను ముస్లిమ్లతో మాట్లాడేందుకు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నాను. నేను మీ మతం గురించి చదువుతూ ఉన్నాను, ముస్లిమ్‌లు ఒకే సత్య దేవుణ్ణి నమ్ముతారనీ ప్రవక్తలనందర్నీ నమ్ముతారనీ నేను అనుకోవడం నిజమే కదూ? [ప్రతిస్పందించ నివ్వండి.] ఈ భూమి ఒక పరదైసుగా మారుతుందని చెప్పే ఒక ప్రాచీన ప్రవచనం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ప్రవక్త ఏమి వ్రాశాడో నేను మీ కోసం చదవనా? [యెషయా 11:6-9 చదవండి.] ఈ ప్రవచనం, ఈ బ్రోషూర్‌లో ఉన్న, ఖురాన్ నుండి ఎత్తివ్రాయబడిన లేఖనాన్ని గురించి నేను ఆలోచించేలా చేస్తుంది. దేవుని మార్గదర్శనము బ్రోషూర్ 9వ పేజీకి త్రిప్పి, నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొనే విషయానికి సంబంధించి ముద్దక్షరాల్లో ఉన్న దాన్ని చదవండి. ఆసక్తి చూపిస్తే, ప్రక్క పేజీలోవున్న 7-9 పేరాలను చర్చిస్తూ సంభాషణను కొనసాగించండి. బ్రోషూర్ ఇచ్చి, పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకోండి.—మరో అందింపు కోసం ఫిబ్రవరి 1998 మన రాజ్య పరిచర్య 6వ పేజి, 23వ పేరాను చూడండి.
9 ఎవరినైనా దేవుని మార్గదర్శనము బ్రోషూర్ పరిశీలించేందుకు ఆహ్వానించేటప్పుడు, దాన్ని బైబిలు పఠనం అని కాక చర్చ అని పిలవడం మంచిది. మీరు బ్రోషూర్ పూర్తి చేసేటప్పటికి ఆ విద్యార్థి దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ను గానీ జ్ఞానము పుస్తకాన్ని గానీ పఠించేందుకు సిద్ధంగా ఉండాలి. ఫిర్దౌసుకు నడిపే మార్గాన్ని కనుగొనడమెలా అనే కరపత్రం, దేవునికి నిజమైన విధేయతను చూపించవలసిన సమయం (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం ప్రత్యేకంగా ముస్లిమ్‌ల కోసం తయారుచేయబడిన ఇతర ప్రచురణలు.
10 ఇస్లామ్ మత నమ్మకాలూ, ఉద్దేశాలను గూర్చిన ఈ జ్ఞానంతో ఏ సాహిత్యాలను వారికి అందివ్వాలి, ఎలా వారికి సాక్ష్యమివ్వాలి అనేవి ఎంపిక చేసుకొనేందుకు వివేచనను ఉపయోగించవచ్చు. అన్ని రకాల ప్రజలు ఆయన నామాన్ని ప్రార్థించి, రక్షించబడేలా సహాయం చేసేందుకు, మనం చేసే ప్రతి ప్రయత్నాన్నీ యెహోవా ఆశీర్వదించును గాక.—అపొ. 2:21.