ఒక హిందువుతో మీరు ఏమని చెబుతారు?
1 ఈ దేశంలో పరిచర్యలో మనం కలిసేవాళ్ళలో అధిక సంఖ్యాకులు హిందూ నేపథ్యానికి చెందినవారేనన్న విషయం మీకు తెలుసు. మీరు వాళ్ళను కలుసుకున్నప్పుడు ఎలా వ్యవహరిస్తారు?
2 ఈ పాయింట్లను గుర్తుంచుకోండి: సరళంగానూ, లౌక్యంగానూ సత్యాన్ని తెలియజేయడం వల్ల తరచూ అనుకూలమైన ప్రతిస్పందన వస్తుంది. మొదట, కుటుంబ పెద్దతో మాట్లాడాలని వచ్చామని చెప్పండి. ఆయన ప్రతిస్పందన అనుకూలంగా ఉంటే, మీరు ఆ కుటుంబ సభ్యుల్లో మిగతా వారికి సాక్ష్యమివ్వడం మరింత సులభమౌతుంది. హిందూ సంస్కృతి సకల జీవులకు గౌరవాన్నిస్తుంది, ప్రజల్లో ఆసక్తిని చూపిస్తుంది. కనుక, ప్రస్తుతం ప్రజలందరినీ వ్యాకులపరుస్తున్న విషయాలను గురించి మాట్లాడండి. ఇది అర్థవంతమైన సంభాషణకు, పరస్పర ప్రయోజనకరమైన సంభాషణకు దారి తీయవచ్చు. హిందూ మతం ఆధ్యాత్మికతను ప్రోత్సహిస్తుంది. అందుకే, హిందువులు తాము వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాన్ని అనుభవించగల దేవుడ్ని ఆరాధించాలని వాంఛిస్తారు. కనుక, మీరు వారితో ఏకీభవించగల పాయింట్లను ఉపయోగించండి, మానవుని సృష్టికర్తతో స్నేహాన్ని వృద్ధి చేసుకునేందుకు బైబిలూ, మన సాహిత్యాలూ సహాయపడతాయని చూపించండి. హిందువులు దాదాపు అందరూ కూడా వినమ్రులు, స్నేహశీలులు. మనం కూడా అలాగే ఉండవలసిన అవసరం ఉంది. వాగ్వివాదాలను నివారించవలసిన అవసరం ఉంది. హిందూ మతాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయనవసరం లేకపోయినప్పటికీ, వాళ్ళ నమ్మకాలను గురించి కొంత అవగాహన ఉండడం సహాయకరంగా ఉంటుంది.
3 రైన పరికరాలను ఉపయోగించండి: హిందువులను దృష్టిలో పెట్టుకుని, అనేక ప్రచురణలు తయారు చేయబడ్డాయి. మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అనే బ్రోషూర్ ఇంగ్లీష్లోనే కాక, 13 భారతీయ భాషల్లో ముద్రించబడింది. “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అలాగే, “దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?” అనే బ్రోషూర్లు హిందూ నేపథ్యం గలవారికి సాక్ష్యమివ్వడంలో చాలా ఫలకరంగా ఉంటాయని నిరూపించబడ్డాయి. కురుక్షేత్రం నుండి అర్మగిద్దోను వరకు—మరియు మీరు తప్పించుకొనుట అనే చిన్న పుస్తకం బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, కన్నడ, మలయాళం, పంజాబీ భాషల్లో లభ్యమౌతుంది. మరణంపై విజయం—అది మీకు సాధ్యమేనా? అనే చిన్నపుస్తకం ఇంగ్లీష్లోను, గుజరాతీలోను, నేపాలీలోను, పంజాబీలోను, విడుదలకు నడుపు దైవీక సత్య మార్గము అనే చిన్నపుస్తకం ఇంగ్లీష్లోను, మలయాళంలోను, మిజోలోను, తెలుగులోను, ఉర్దూలోను లభ్యమౌతుంది. బైబిలు పఠనాలను నిర్వహించేందుకు దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూర్నూ, జ్ఞానము పుస్తకాన్నీ ఫలవంతంగా ఉపయోగించవచ్చు.
4 హిందువులతో మాట్లాడడానికి ఒక పునాదిని వేయండి: ఇదంత కష్టమేమీ కాదు. దుష్టత్వం తారాస్థాయికి చేరుకుని ఉన్న కాలంలో మనం జీవిస్తున్నామనీ, దేవుడు ఒక గొప్ప నాశనాన్ని తేవడం ద్వారా ఈ లోకాన్ని సమస్యల నుండి విడిపించిన తర్వాత, సత్యయుగం వస్తుందనీ వాళ్ళు నమ్ముతారు. చివరి దినాలను గురించిన, మహా శ్రమలను గురించిన, రానున్న క్రొత్తలోకాన్ని గురించిన బైబిలు బోధలతో ఈ నమ్మకాలను ఎంత సులభంగా ముడిపెట్టవచ్చో మీరు చూడగలరు. చాలా మంది హిందువులు, జీవితాన్ని పరిష్కారాలు లేని సమస్యల పరంపరగా దృష్టిస్తారు గనుక, కుటుంబ జీవితం, నేరం, సురక్షితత్వం, మరణించినప్పుడు ఏమి జరుగుతుంది అనే అంశాలపై వాళ్ళకు ఆసక్తి ఉంటుంది. ఈ క్రింద ఇవ్వబడిన రెండు నమూనా అందింపులను మీరు ప్రయత్నించవచ్చు.
5 ఒక కుటుంబీకునికి ఇది ఆకర్షణీయంగా ఉండవచ్చు:
◼ “నేడు అనేక దేశాల్లో ఉన్న కుటుంబ పరిస్థితిని గురించి చింతించే ప్రజలను నేను సందర్శిస్తున్నాను. కుటుంబాన్ని ఐక్యంగా ఉంచేందుకు ఏది సహాయపడుతుందని మీరు అనుకుంటారు? [ప్రతిస్పందించనివ్వండి.] కుటుంబాన్ని గురించి హిందువుల పవిత్ర గ్రంథాలు ఏమి చెబుతున్నాయో కొందరికి తెలుసు. కానీ, ఇదే అంశంపై బైబిలు ఏం మాట్లాడుతుందనే విషయాన్ని దానితో తారతమ్యం చేసి చూసే అవకాశం వాళ్ళకు దొరకలేదు. కొలస్సయులు 3:12-14 వచనాల్లోని తలంపును మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను.” ఆ లేఖనాన్ని చదివిన తర్వాత, జ్ఞానము పుస్తకంలోని 15వ అధ్యాయాన్ని గృహస్థునికి చూపించి, “నేను కొంచెంసేపు మీతో ఈ అధ్యాయాన్ని చదవడానికి ఇష్టపడతాను” అని చెప్పండి.
6 ఒక యౌవనస్థుడు దీనికి ప్రతిస్పందించవచ్చు:
◼ “దేవుడున్నాడని మీరు నమ్ముతారనడంలో సందేహం లేదు. మన విషయంలో దేవుని ఉద్దేశమేమిటని మీరనుకుంటున్నారు?” ప్రతిస్పందించనివ్వండి. ఆదికాండము 1:28 చదివి, “భూమిమీది అనేక ప్రాంతాల్లో జనాభా అమితంగా పెరుగుతోంది, సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. మన సమస్యలను పరిష్కరించుకోవడంలో, సృష్టికర్త మనకు సహాయపడడానికి సుముఖత చూపిస్తాడని మీరనుకుంటున్నారా?” అని అడగండి. ప్రతిస్పందనను విన్న తర్వాత, సరైన ప్రచురణను తీయండి.
7 సత్ఫలితాలను పొందండి: మార్కెట్లో సాక్ష్యమిస్తున్న ఒక సహోదరి దగ్గరికి, 22 ఏండ్లవాడైన ఒక హిందూ యువకుడు వచ్చి, తనకు బైబిలు పఠనం కావాలని కోరాడు. ఎనిమిది సంవత్సరాల క్రితం తన తల్లీ, ఆ సహోదరీ, బైబిలు చర్చ చేస్తుండగా తను విన్నాడనీ, మానవుని సమస్యలకు బైబిలిచ్చే ఆచరణాత్మకమైన పరిష్కారాలు తన మనస్సులో ముద్రించబడినప్పటికీ, తన తల్లి ఆసక్తి చూపించకపోవడంతో, సత్యాన్ని తనంతట తాను చేపట్టేంత వయస్సు తనకు లేదని భావించాడనీ, ఇప్పుడు ఒక వయోజనుడుగా, మరెక్కువగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాడనీ వివరించాడు. ఆ యువకుడు సమయాన్ని ఏ మాత్రం వృథా చేయలేదు. కేవలం 23 రోజుల్లో, ఆయన జ్ఞానము పుస్తక పఠనాన్ని పూర్తి చేశాడు. మార్కెట్లో ఆ సహోదరిని కలిసిన నాలుగు నెలలకే, బాప్తిస్మం పొందాలని కోరాడు!
8 ఒక సహోదరుడు, తాను ట్రెయిన్లో కలిసిన హిందూ వ్యక్తితో పఠనాన్ని ప్రారంభించాడు. ఆయన తన వివాహ జీవితంలో, ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు. ఆయనకు త్రాగుడు అలవాటు కూడా ఉంది. ఆ సాక్షి తన ఇంటికి వచ్చి, కుటుంబ జీవితంపై బైబిలు సలహాను తెలియజేసేందుకు ఒప్పుకున్నాడు. బైబిలులోని నైతిక బోధలు ఆయనను ఆకట్టుకున్నాయి. ఆయన బైబిలు పఠనానికి అంగీకరించాడు. ఆయన కుటుంబసమేతంగా కూటాలకు హాజరు కానారంభించాడు. తర్వాత, వాళ్ళు సత్యాన్ని స్నేహితులతోను, బంధువులతోను పంచుకున్నారు. ఇప్పటికి, వారిలో ఆరుగురు సత్యాన్ని స్వీకరించారు!
9 “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె”నన్నది దేవుని చిత్తమైయుంది. (1 తిమోతి 2:4) వారిలో, హిందువుల్లా, మేం క్రైస్తవులం కాము అని చెప్పే స్త్రీపురుషులందరూ ఇమిడి ఉన్నారు. మీ టెరిటరీలో నివసిస్తున్న హిందువులను మీరు సందర్శించినప్పుడు, ఈ శీర్షికలో ఇవ్వబడిన కొన్ని సూచనలను ఎందుకు ఉపయోగించకూడదు?