పరిచర్య సేవకులు విలువైన సేవ చేస్తున్నారు
1 “వారు రాజ్యసేవాసక్తిలోను, ఇతరులను విశ్వాసమందు స్థిరపరచుటకు సహాయపడుటలోను వారి విశ్వాసమును స్పష్టముగా బయలుపరచుకొని నిజంగా సమర్పించుకొనిన పురుషులని తమకుతామే ప్రదర్శించారు” అని పరిచర్య సేవకుల గురించి మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము, 57వ పేజీలో చెబుతుంది. వాస్తవానికి, పరిచర్య సేవకులు ఉంచిన ఆధ్యాత్మిక మాదిరి అనుకరించదగినది. వారితోను, పెద్దలతోను కలిసి పనిచేయడం, ‘ప్రేమయందు . . . క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగ’ చేస్తుంది.—ఎఫె. 4:16.
2 సంఘంలో పరిచర్య సేవకులు ఒక ప్రాముఖ్యమైన పాత్రను వహిస్తారు. వారందించే విలువైన సేవలను గురించి ఆలోచించండి ! వారు సంఘ జమా లెక్కలు, సాహిత్యం, పత్రికలు, పత్రిక చందాలు, సేవా ప్రాంతాలు వంటి వాటియందు శ్రద్ధవహిస్తారు; అటెండెంట్లుగా పనిచేస్తారు, సౌండ్ పరికరాల బాగోగులను చూసుకుంటారు, రాజ్యమందిర నిర్వహణలో సహాయపడతారు. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలోను, సేవాకూటంలోను భాగం వహిస్తారు. వారిలో కొందరు బహుశ బహిరంగ ప్రసంగాలు ఇస్తారు లేక కొన్ని సంఘ కూటాలను నిర్వహిస్తారు. భౌతిక శరీర అవయవాలవలె పరిచర్య సేవకులు మనకు అవసరమైన సేవలను అందిస్తారు.—1 కొరిం. 12:12-26.
3 పరస్పర గౌరవంతో, అవగాహనతో పరిచర్య సేవకులు సేవక సభలో భాగంగా పెద్దలతో పొందిక కలిగి సహకరించడాన్ని చూడడం, ఇతరులు కూడా అలాగే చేసేలా ప్రోత్సహిస్తుంది. (కొలొ. 2:18, NW) ప్రతివారం తమ బాధ్యతలను నమ్మకంగా నిర్వర్తించడం ద్వారా, ఇతరులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించడం ద్వారా, వారు సంఘం ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి చెందడానికి చేయూతనిస్తారు.
4 కష్టించి పనిచేసే పరిచర్య సేవకుల పట్ల మన ప్రశంసను చూపించడానికి మనం ఏమి చేయగలం? మనం వారికి నియమించబడిన పనులతో పరిచయం కల్గివుండి, అవసరమైనప్పుడు మన సహకారం అందించడానికి సంసిద్ధతను చూపాలి. వారి పనిని మనం ప్రశంసిస్తున్నామని మన మాటల ద్వారా, చేతలద్వారా వారికి తెలియజేయాలి. (సామె. 15:23) మన కోసం ప్రయాసపడి పనిచేస్తున్న వారు, యథార్థమైన మన గుర్తింపుకు అర్హులై ఉన్నారు.—1 థెస్స. 5:12, 13.
5 పరిచర్య సేవకుల పాత్రను, అర్హతలను దేవుని వాక్యం ఏర్పరిచింది. (1 తిమో. 3:8-10, 12, 13, NW) సంఘ కార్యక్రమాలు సక్రమంగా సాగడానికి వారి విలువైన పవిత్రసేవ, ఎంతో ఆవశ్యకం. “ప్రభువు కార్యాభివృద్ధియందు ఎప్పటికిని ఆసక్తులు” అయి ఉండే అలాంటి పురుషులు, మన ఎడతెగని ప్రోత్సాహానికి పాత్రులు.—1 కొరిం. 15:58.