శిష్యుల్నిచేసే ఆవశ్యకమైన పనిని గూర్చిన పురోభివృద్ధికరమైన పరిశీలన
1 భూమిని విడిచివెళ్లక ముందు యేసు, “సమస్త జనులను శిష్యులనుగా చేయుడి” అని తన అనుచరులకు ఆజ్ఞాపించాడు. తీవ్రతరంగా ప్రకటించే, బోధించే ఉద్యమాన్ని వాళ్లు చేపట్టి, తమ కార్యకలాపాన్ని భూవ్యాప్తంగా విస్తరింప చేయాలి. (మత్త. 28:19, 20; అపొ. 1:8) మోయజాలనంత బరువుగా వాళ్లీ నియామకాన్ని దృష్టించారా? లేదని అపొస్తలుడైన యోహాను చెబుతున్నాడు. శిష్యుల్ని తయారుచేసే పనిలో 65 ఏళ్లు గడిపిన తర్వాత, ఆయనిలా రాశాడు: “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహా. 5:3.
2 యేసుక్రీస్తుకు శిష్యుల్నిచేసే తమ నియామకంలో తొలి క్రైస్తవులు అత్యవసరభావంతో పనిచేశారని వారి కార్యకలాపాల్ని గూర్చిన లేఖననివేదిక రుజువుచేస్తోంది. (2 తిమో. 4:1, 2) దాన్నొక కర్తవ్యంలా మాత్రమేగాక, దేవుణ్ణి స్తుతించాలనే, ఇతరులకు రక్షణ నిరీక్షణను తేవాలనే తమ ప్రేమపూర్వకమైన అభిలాషనుబట్టే వాళ్లు దాన్ని చేశారు. (అపొ. 13:47-49) శిష్యులైనవారంతా అటు తర్వాత శిష్యుల్ని తయారుచేసేవారిగా తయారైనందున, మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం త్వరత్వరగా పురోభివృద్ధి చెందింది.—అపొ. 5:14; 6:7; 16:5.
3 శిష్యుల్నిచేసే పని వేగవంతమౌతోంది: ఈ 20వ శతాబ్దంలోనే శిష్యుల్ని చేసే పని అధికంగా నెరవేర్చబడుతోంది! ఇంతవరకూ, లక్షలాదిమంది సువార్తను అంగీకరించి, దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు. (లూకా 8:15) ఈ విధానాంతం కొరకైన సమయం వేగంగా గతించిపోతోంది గనుక, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ యథార్థ హృదయులైన ప్రజలు సత్యాన్ని త్వరగా నేర్చుకోవడం సాధ్యమయ్యేలా చేసే ఉపకరణాల్ని మనకు ఇచ్చాడు.—మత్త. 24:45.
4 మనం 1995లో నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్నీ, 1996లో దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరునూ పొందాం. జ్ఞానము పుస్తకాన్ని గురించి జనవరి 15, 1996 సంచికలో 14వ పేజీనందు ఇలా చెప్పబడింది: “ఈ 192 పేజీల పుస్తకాన్ని పోల్చి చూస్తే తక్కువ కాలంలో పఠించవచ్చు, ‘నిత్యజీవమునకు నియమింపబడిన’ వారు దీన్ని పఠించడం ద్వారా, యెహోవాకు సమర్పించుకొని బాప్తిస్మం పొందడానికి తగినంత నేర్చుకొనగల్గుతారు.”—అపొ. 13:48.
5 మన రాజ్య పరిచర్య జూన్ 1996 “జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి” అనే ఇన్సర్ట్ మన ఎదుట ఈ లక్ష్యాన్ని ఉంచింది: “విద్యార్థి పరిస్థితులనుబట్టి, నేర్చుకునే సామర్థ్యాన్నిబట్టి, పఠనాన్ని తొందరపాటుతో ముగించకుండానే, ఒక గంట లేక అంతకు ఎక్కువ నిడివిగల ఒక్కో సందర్శనంలో ఒక అధ్యాయం చొప్పున, అనేక అధ్యాయాలు పూర్తి చేయడానికి మీకు వీలౌతుంది. బోధకుడు, విద్యార్థి, ఇద్దరూ ప్రతివారం నియమిత సమయంలో పఠనం జరుపుకోవడానికి నిర్ణయించుకుంటే విద్యార్థులు మంచి అభివృద్ధిని సాధిస్తారు.” ఆ శీర్షిక ఇంకా ఇలా చెబుతోంది: “జ్ఞానము పుస్తకంలో ఒక వ్యక్తి పఠనాన్ని ముగించే సమయానికి, ఆయన నిజాయితీ, దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయనకుగల ఆసక్తి యొక్క లోతు స్పష్టమౌతాయని అపేక్షించబడుతుంది.” మన రాజ్య పరిచర్య అక్టోబరు 1996 సంచికలోని ప్రశ్నాభాగము ఇలా వివరించింది: “చాలా కొద్ది కాల వ్యవధిలోనే, యథార్థహృదయుడైన సగటు విద్యార్థి యెహోవాను సేవించడానికి బుద్ధిపూర్వకమైన తీర్మానాన్ని తీసుకునేందుకు కావలసినంత జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు సమర్థుడైన ఉపాధ్యాయుడు తోడ్పడగలడని అపేక్షించబడుతుంది.”
6 జ్ఞానము పుస్తకం ఫలితాల్ని ఇస్తోంది: తాను బాప్తిస్మాన్ని తీసుకొనబోయే సందర్భంలో, జ్ఞానము పుస్తకాన్ని పఠించడాన్ని గురించి తానెలా భావించిందో ఒక యౌవన స్త్రీ తెలియజేసింది. కొంతకాలం, ఆమె నిరంతర జీవితము పుస్తకంలో నుండి పఠనం చేసింది. జ్ఞానము పుస్తకము విడుదలైనప్పుడు, ఆమెకు బైబిలు పఠనాన్ని నిర్వహిస్తున్న సహోదరి, ఆ బైబిలు పఠనాన్ని క్రొత్త పుస్తకం నుండి చేయడం మొదలుపెట్టింది. దీనికి, తనవైపునుండి ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆ విద్యార్థి త్వరలోనే గ్రహించగల్గింది. అలా గ్రహించినప్పటి నుండీ ఆమె త్వరితగతిని పురోభివృద్ధిచెందేందుకు ప్రేరేపించబడింది. ఇప్పుడు మన సహోదరియైన ఆ యౌవన స్త్రీ ఇలా అంటోంది: “నిరంతర జీవితము పుస్తకం నన్ను యెహోవాను ప్రేమించేలా చేసింది, కానీ జ్ఞానము పుస్తకము ఆయన సేవచేసేలా నిర్ణయాన్ని తీసుకునేందుకు నాకు సహాయపడింది.”
7 మరో స్త్రీ ఎంత త్వరగా సత్యాన్ని నేర్చుకుందో పరిశీలించండి. రెండవ పఠనం అయిపోయిన తర్వాత, ఆమె ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శన సమయంలో రాజ్యమందిరంలో జరిగే ఒక కూటానికి హాజరైంది. ఆ వారంలో, తన మూడవ పఠనమందు తాను యెహోవాకు సమర్పించుకున్నాననీ, బాప్తిస్మంపొందని ప్రచారకురాలినవ్వాలనీ అనుకుంటున్నానని ఆమె ఆయనతో చెప్పింది. ఆమె పెద్దలను కలుసుకుంది, వారు ఆమెను ప్రచారకురాలిగా ఆమోదించారు. ఆ మరుసటి వారంనుండి ఆమె క్షేత్రసేవలో పాల్గొనడం ప్రారంభించింది. బైబిలు పఠనంలో ఆమె ఎంతగానో నిమగ్నురాలైపోయింది, వారానికి రెండు లేదా మూడు సార్లు బైబిలు పఠనాన్ని చేయడానికీ, పరిచర్యలో మరింత సమయాన్ని గడపడానికీ ఆమె కొంతకాలం సెలవు తీసుకొంది. కొన్నిసార్లు, వాళ్లు రెండు లేదా మూడు అధ్యాయాల్ని ఒకేసారి పూర్తిచేసేవారు. ఆమె తాను నేర్చుకున్న వాటిని తన జీవనవిధానమంతటిలో అన్వయించుకోవడం మొదలుపెట్టింది, నాలుగు వారాల్లో జ్ఞానము పుస్తకాన్ని పఠించడం పూర్తిచేసింది, బాప్తిస్మంపొందే దిశగా పురోభివృద్ధి చెందింది.
8 ఒక సహోదరి భర్త తనను తాను ఒక “విలక్షణమైన అవిశ్వాసజత”గా వర్ణించుకుంటాడు. ఒకనాడు సహోదరుడొకరు, మొదటి పఠనం అయిపోయిన తర్వాతగానీ, అటు తర్వాత మరెప్పుడైనాగానీ పఠనాన్ని మానివేయవచ్చనే షరతుపై జ్ఞానము పుస్తకంలో నుండి బైబిలు పఠనాన్ని అతనికి ప్రతిపాదించాడు. చదువుకొనే రోజుల్లో చదువును పెద్దగా వంటబట్టించుకోకపోయినా, గత 20 ఏళ్లుగా మతపరమైన ఏ ఇతర సాహిత్యాల్నీ చదవకపోయినా సరే, ప్రయత్నించి చూద్దామని ఆమె భర్త దానికి సమ్మతించాడు. జ్ఞానము పుస్తకంలో నుండి పఠిస్తుండగా అతని ప్రతిస్పందన ఏమైవుంది? ఆయనిలా అన్నాడు: “ఈ బైబిలు సహాయక పుస్తకం అంత సరళమైన పదాల్లో రాయడం నిజంగా ఆహ్లాదకరంగా ఉంది. అందులో ఉన్న సమాచారం ఎంతో స్పష్టంగానూ, సహేతుకంగానూ ఉంది, త్వరలోనే నేను మా తర్వాతి పఠనం కోసం ఎదురు చూడడం మొదలుపెట్టాను. సొసైటీ తెలియజేసిన శిష్యుల్ని చేసే పనికి సంబంధించిన పద్ధతులను నా పఠననిర్వాహకుడు నైపుణ్యవంతంగా అనుసరించాడు, నాలుగు నెలల తర్వాత యెహోవా ఆత్మ సహాయంతో నేను బాప్తిస్మం తీసుకున్నాను. శిష్యుల్ని చేసే పని ఎడల మనం ప్రేమను పెంచుకుంటే, క్షేత్రసేవలో నీతి హృదయంగలవారి కోసం ఎడతెగకుండా అన్వేషిస్తూ ఉంటే, సొసైటీ సరఫరా చేస్తున్న జ్ఞానము పుస్తకాన్నీ, ఇతర బైబిలు సహాయకాల్నీ ఉపయోగిస్తున్నట్లైతే, మరి ముఖ్యంగా యెహోవా నడిపింపు కోసం ప్రార్థిస్తున్నట్లైతే, శిష్యల్ని చేయడానికి సహాయపడే ప్రత్యేకమైన ఆధిక్యతను మనం కల్గివుండగలమని నేను నిజంగా చెప్పగలను.” పై అనుభవాలు నిజంగా అరుదైన అనుభవాలు. మన విద్యార్థుల్లో అనేకులు ఇంత త్వరగా సత్యంలోనికి రారు.
9 విద్యార్థుల పురోభివృద్ధిచెందే వేగం వేర్వేరుగా ఉంటుంది: దేవుని వాక్య బోధకుల సామర్థ్యాలూ, దేవునివాక్య విద్యార్థుల సామర్థ్యాలూ చెప్పుకోదగినరీతిలో వేర్వేరుగా ఉంటాయని గుర్తించాలి. ఆధ్యాత్మిక పురోభివృద్ధి నెమ్మదిగానైనా లేదా వేగంగానైనా ఉండవచ్చు. ఇతరులు పురోభివృద్ధిచెందడానికి ఎక్కువకాలం పడితే, కొంతమంది విద్యార్థులు కొద్ది నెలల్లోనే పురోభివృద్ధిచెందుతారు. ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధి, ఆ వ్యక్తి యొక్క విద్యా నేపథ్యంపై, ఆధ్యాత్మిక విషయాల ఎడల అతనికున్న మెప్పుదల స్థాయిపై, యెహోవా ఎడల అతనికి ఎంత ప్రగాఢమైన భక్తి ఉందనేదానిపై ఆధారపడి ఉంటుంది. మనం పఠనంచేసే ప్రతీ వ్యక్తికీ, విశ్వాసులైన ప్రాచీన బెరయలోని వారివలే అనుదినమూ లేఖనాల్ని అధ్యయనం చేయడానికి “ఆసక్తి” ఉండకపోవొచ్చు.—అపొ. 17:11, 12.
10 అందుకే “కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు” అనే మన రాజ్య పరిచర్య మే 1998 సంచికలోని ఇన్సర్టు, ఈ వాస్తవిక నిర్దేశాన్ని ఇస్తోంది: “ప్రతీ బైబిలు విద్యార్థీ ఒకే వేగంతో పురోభివృద్ధి చెందకపోవచ్చనుకోండి. కొంతమంది ఆధ్యాత్మికంగా ఇతరులు మొగ్గుచూపించినంతగా చూపించకపోవచ్చు. లేక బోధించబడిన విషయాల్ని ఇతరులు అర్థంచేసుకొన్నంత త్వరగా అర్థంచేసుకోకపోవచ్చు. ఇతరులు ఎంతో బిజీగా ఉండి, వారానికొక అధ్యాయాన్ని పూర్తి చేయడానికి అవసరమైన సమయాన్ని కేటాయించలేకపోవచ్చు. కాబట్టి, కొందరి విషయంలో కొన్ని అధ్యాయాల్ని పూర్తి చేయడానికి ఒకటికన్నా మరెక్కువ పఠనాలు చేయాల్సిన అవసరముండవచ్చు, పుస్తకాన్ని పూర్తిచేయడానికి అదనంగా కొన్ని నెలలు పట్టవచ్చు.”
11 శిష్యుల్ని తయారుచేసే వారు సమతూకమైన దృక్పథాన్ని కల్గివుండాలి: విద్యార్థి పరిస్థితుల్నిబట్టీ, సామర్థ్యాన్నిబట్టీ పఠనవేగాన్ని మదింపుచేసుకోవడం అవసరం. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులో పఠనాల్ని ప్రారంభించమని మనం ప్రోత్సహించబడ్డాం గనుక, జ్ఞానము పుస్తకంలోనుండి పఠనం మొదలుపెట్టడానికి ముందు రెండు నుండి మూడు నెలలు, దాంట్లో నుండి పఠనం చేయడానికి పట్టవచ్చు. మన రాజ్య పరిచర్య జూన్ 1996 సంచికలోని ఇన్సర్ట్నందున్న సలహాలన్నింటినీ మనం ఉపయోగిస్తున్నట్లైతే, జ్ఞానము పుస్తకాన్ని ముగించడానికి మరో ఆరు నెలలనుండి తొమ్మిది నెలల వరకూ పట్టవచ్చు. ఈ మధ్యనే జ్ఞానము పుస్తకంలో పఠనాన్ని ప్రారంభించిన కొందరు, విద్యార్థి ప్రాథమిక బైబిలుసత్యాల్ని మరింత త్వరగా నేర్చుకోవడానికి సహాయపడేలా దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులోనికి తమ పఠనాన్ని మళ్లించారు. ఆపై జ్ఞానము పుస్తకంలోనుండి ఆ పఠనం పునఃప్రారంభించబడింది. ఒక బైబిలు పఠనం జ్ఞానము పుస్తకంలో నుండి ప్రారంభించబడి, చక్కగా పురోభివృద్ధిచెందుతుంటే, ఆ పుస్తకం పూర్తైపోయిన తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు నుండి పఠనం చేయడం ప్రయోజనకరంగా ఉండవచ్చు, అలా దేవుని వాక్యంలోని ప్రాథమిక సత్యాల్ని త్వరగా పునఃసమీక్షించవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ, విద్యార్థి పొందాల్సిన స్పష్టమైన అవగాహనను బలిపెట్టి పుస్తకాన్ని త్వరత్వరగా ముగించాలని మనం అనుకోకూడదు. దేవుని వాక్యంలో తాను కనుగొన్న క్రొత్త విశ్వాసానికి బలమైన ఆధారం ప్రతి విద్యార్థికీ అవసరం.
12 కాలవాహిణిలో మనమెక్కడున్నామో గ్రహించడాన్నిబట్టి, సత్యాన్ని నేర్చుకునేలా ఇతరులకు సహాయపడడం ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మరింత ఆవశ్యం. క్రొత్త బైబిలు పఠనాల్ని ప్రారంభించేందుకు ఎడతెగకుండా ప్రార్థిస్తుండడంతోపాటూ, మనతో ఇప్పటికే పఠిస్తున్నవారి కోసం కూడా ప్రార్థిద్దాం. “యుగసమాప్తి వరకు సదాకాలము” ఇంకా ఎక్కువమందిని శిష్యులకు బాప్తిస్మం పొందేలా చేయడం మన ఆనందమౌతుంది.—మత్త. 28:20.