అతిప్రాముఖ్యమైన విషయాలకు మొదటిస్థానం ఇవ్వండి
1 మన ఆత్మీయ క్షేమానికి ఆవశ్యకమైన కొన్ని ముఖ్య విషయాలు ఏవి? వ్యక్తిగత పఠనం, కూటాలకు హాజరు కావడం, పట్టుదలతో కూడిన ప్రార్థన, మంచి సహవాసం మరియు క్రైస్తవ పరిచర్యా ఆ ముఖ్యమైన విషయాల్లో తప్పక ఇమిడివుంటాయి. మన జీవితాల్లో ముఖ్య విషయాలకు ప్రాధాన్యతనివ్వకపోతే, మనం మంచి ఆత్మీయ ఆరోగ్యాన్ని కాపాడుకోలేము.
2 అయితే, మనమంతా శారీరక కోరికలకు వ్యతిరేకంగా పోరాడవలసి ఉంది, మనం క్రమశిక్షణ కొరకైన అవసరాన్ని కల్గివున్నాం. (గలతీ. 5:17) స్వార్థపూరిత ఆసక్తులను వెంబడించడం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందగలమని మనమెన్నడూ భావించకూడదు. (యిర్మీ. 17:9) కాబట్టి, మనం మన హృదయాన్ని కాపాడుకుని మోసగించబడకుండా ఉండాలంటే, క్రమమైన స్వయం పరిశీలన అత్యావశ్యకం.—సామె. 4:23; 2 కొరిం. 13:5.
3 మీ సొంత హృదయమును పరిశీలించుకోండి: మీకు మీరు ఇలా నిష్పక్షపాతంగా కొన్ని ప్రశ్నలు వేసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు పరశీలించుకోవచ్చు: దేవుని వాక్యాన్ని చదవాలని నేను అపేక్షిస్తానా? (1 పేతు. 2:2) సంఘ కూటాలన్నిటికీ హాజరు కావడం యొక్క ప్రాముఖ్యతను నేను గుణగ్రహిస్తానా? (హెబ్రీ. 10:24, 25) నేను ప్రార్థనలో పట్టుదల కలిగివుంటానా? (రోమా. 12:12) ఆత్మీయ విషయాల్లో ఆసక్తిగల ప్రజల సహవాసాన్ని నేను కోరుకుంటానా? (రోమా. 1:11, 12) సువార్త ప్రకటించడాన్ని నేను నా వ్యక్తిగత బాధ్యతగా భావిస్తానా? (1 కొరిం. 9:16) అనుకూలమైన జవాబులు, అతిప్రాముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడానికి మీరు ఇష్టపడుతున్నారని చూపిస్తాయి.
4 మీ అనుదిన కార్యకలాపాలను పరిశీలించుకోండి: సమయాన్ని వినియోగించుకొనే విషయంలో మీరు మీ హృదయ కోరికలను పరిశీలించుకున్న తరువాత ప్రాధాన్యతలను ఏర్పరచుకోవలసిన అవసరం ఉంటుంది. బైబిలు చదవడానికీ, కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల ప్రతి సంచికను చదవడానికీ, అలాగే కూటాలకు సిద్ధపడడానికీ సమయాన్ని క్రమంగా కేటాయించుకోవడం ఇందులో ఇమిడివుంటుంది. కుటుంబమంతా కలిసి పఠించడానికీ, ప్రార్థించడానికీ కూడా సమయాన్ని కేటాయించుకోవాలి. టీవి చూడడానికీ లేక ఇతర రకాలైన వినోదాల కొరకూ వెచ్చించే సమయాన్ని పరిమితం చేసుకోవాలి. సంఘ కూటాలన్నిటికీ హాజరు కావాలని నిశ్చయించుకొని, దానికి అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. ప్రతివారం కుటుంబమంతా కలిసి ప్రాంతీయ సేవలో భాగం వహించేందుకు పథకం వేసుకోండి.
5 నిస్సందేహంగా, మన జీవితంలో అతి ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యతనివ్వడం ఆనందానికి కారణమౌతుంది.