అభివృద్ధికై యెహోవాపై ఆధారపడండి
1 “ఒక క్రొత్త సంఘాన్ని స్థాపించడానికి సహాయపడే అసమానమైన ఆనందాన్ని నేను మొట్టమొదటి సారిగా అనుభవించాను. ఇందుకు రెండు సంవత్సరాల కష్టం, ఎడతెగక ప్రార్థించడం, ‘వృద్ధి కలుగజేసే’ యెహోవాపై ఆధారపడడం అవసరమైంది.” అలా అని మనఃపూర్వకంగా పయినీరు సేవచేసే ఒక వ్యక్తి, అభివృద్ధికై యెహోవాపై ఆధారపడవలసిన అవసరతను గ్రహించి వ్రాశాడు. (1 కొరిం. 3:5-9) ఆత్మీయ చింతగల వ్యక్తుల కొరకైన మన అన్వేషణలో, మన పరిచర్య ఫలించాలంటే మనకు కూడా దేవుని మద్దతు అవసరం.—సామె. 3:5, 6.
2 అభివృద్ధి కొరకు సాగుచేయడం అవసరం: సత్యపు విత్తనం అభివృద్ధి చెందాలంటే సాగుచేయాల్సిన అవసరం ఉంది. మొదటిసారి కలిసిన తర్వాత ఒకటి లేక రెండు రోజుల్లోనే తిరిగి సందర్శించడం తరచూ మంచి ఫలితాల్ని తెస్తుంది. హృదయాల్ని చేరే విధంగానూ, స్నేహపూర్వకంగానూ ఉండండి. అవతలి వ్యక్తి ఇబ్బందికరంగా భావించేలా చేయకండి. అంతా మీరే మాట్లాడేయకండి. ఆయన మీ గురించి తెల్సుకునేందుకు అనుమతించండి, ఒక వ్యక్తిగా ఆయన ఎడల మీకు ఆసక్తి ఉందని చూపించండి.
3 జూలైలోనూ, ఆగస్టులోనూ మనం కలిసే ప్రజలకు వేర్వేరు బ్రోషూర్లను ప్రతిపాదించడంపై అవధానాన్ని నిల్పుతున్నాము. అయితే, మనం కనుగొన్న ఆసక్తిని అభివృద్ధి చేయడానికి, సాహిత్యాన్ని అందించిన చోట్లకు తిరిగి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. మనం దీన్ని పునర్దర్శనాలు చేయడం ద్వారా, బైబిలు పఠనాలు అందించడం ద్వారా చేస్తాము. (మత్త. 28:19, 20) ఇందునిమిత్తం, పఠనాలు ప్రారంభించడానికి దేవుడు కోరుతున్నాడు బ్రోషూరు ఉపయోగించవచ్చు. ఈ క్రింది నాలుగు సలహాలు మీకు సహాయకరంగా ఉండవచ్చు.
4 లోకం పోకడ విషయమై చింతిస్తున్న వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు, మీరు సంభాషణని ఇలా అనడంద్వారా తిరిగి ప్రారంభించవచ్చు:
◼ “మానవ సమాజంలో దిగజారిపోతున్న నైతిక విలువలపట్ల మీరూ నాలాగే చింతిస్తున్నారని నేననుకుంటున్నాను. గృహంలో పెరిగిపోతున్న హింసను గురించిన కలవరపర్చే నివేదికలు మనం వింటుంటాము. ఈ హింసమూలాన పిల్లలు, తలిదండ్రులు, వివాహజతలు దురాచారానికి గురౌతుంటారు. అంతేగాక చాలామంది ప్రజలు కేవలం తమ స్వంత కోర్కెలను తృప్తిపర్చుకోవడానికి అబద్ధమాడడం, దొంగతనం చేయడం తప్పు కాదని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. అసలు ప్రజలు ఎలా జీవిస్తున్నారన్న విషయంలో దేవునికి పట్టింపు ఉందనుకుంటున్నారా? [ప్రతిస్పందించనివ్వండి.] మానవుడు జీవించడానికి దేవుడు కొన్ని ప్రమాణాల్ని స్థాపించాడు, మరి అవి నిజానికి మనకంత భారమైనవేమీ కావు.” 1 యోహాను 5:3 చదవండి. తర్వాత దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును అందించి, దాన్ని పాఠం 10కి తెరవండి. మొదటి పేరాను చదవండి. 2-6 పేరాల్లోని ప్రారంభంలో ఇటాలిక్కుల్లో ఉన్న పదాల్నీ, మాటల్నీ చూపించి, సమాజానికి అత్యంత హానికరంగా ఉంటుందని తాను భావిస్తున్న అలవాటు ఏమిటో ఇంటి యజమానిని అడగండి. దానికి సంబంధించిన పేరాను చదివి అవకాశం అనుమతిస్తే ఒకటి లేక రెండు లేఖనాలను చదవండి. 7వ పేరాను చదివి ముగించండి. తర్వాత చర్చను మళ్లీ కొనసాగించడానికి తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
5 కుటుంబాన్ని గురించి శ్రద్ధకల్గివున్నవారిని కలిసినప్పుడు మీరు ఇలా ఏమైనా చెప్పవచ్చు:
◼ “ఒక విజయవంతమైన కుటుంబాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన ఉపకరణాలను సృష్టికర్త మనకు ఇస్తాడని మనం అపేక్షించడం సహేతుకమని మీరు అనుకుంటున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును పరిచయం చేయండి, పాఠం 8కి త్రిప్పి, కుటుంబంలోని ప్రతి సభ్యునికొరకూ బైబిలునుండి తీసుకోబడిన సూత్రాలు ఈ బ్రోషూరులో ఉన్నాయని వివరించండి. ఈ బ్రోషూరునుండి పూర్తి ప్రయోజనం పొందడానికి దీనిని బైబిలుతో ఎలా ఉపయోగించవచ్చో ప్రదర్శిస్తానని చెప్పండి. బ్రోషూరులోని రెండవ పేజీలో ఉన్న సూచనలను అనుసరించండి. ఆ పాఠంలో పఠనాన్ని కొనసాగించడానికి తిరిగి వెళ్లడానికీ, మీరు ఆ పాఠాన్ని ముగించినట్లైతే ఇంటియజమాని ఎంపిక చేసుకున్న మరొక పాఠాన్ని ఈ బ్రోషూరులోనుండి పఠించడానికీ ఏర్పాట్లు చేసుకోండి.
6 బైబిలు పఠన కార్యక్రమాన్ని ప్రతిపాదించడానికి మీరు ఉపయోగించగల ఒక సూటైన విధానం ఇక్కడుంది. “దేవుడు కోరుతున్నాడు” బ్రోషూరును చూపించి, ఇలా చెప్పండి:
◼ “ఈ బ్రోషూరులో బైబిలులోని ప్రాథమిక బోధలన్నింటితో కూడిన ఒక సంపూర్ణ పఠన కోర్సు ఉంది. ఒక్కొక్క పేజీలో, ప్రజల్ని శతాబ్దాలపాటు వేధించిన ప్రశ్నలకు జవాబుల్ని మీరు కనుగొంటారు. ఉదాహరణకు, భూమి గురించి దేవుని సంకల్పమేమిటి?” పాఠం 5కి త్రిప్పి, పాఠం ప్రారంభంలో ఉన్న ప్రశ్నల్ని చదవండి. ఇంటియజమానికి అత్యంత ఆసక్తికరంగా ఉన్నదేమిటో అడిగి, యుక్తమైన లేఖనాల్ని చదువుతూ, ఆ పేరా(ల)ను చదవండి. ఇతర ప్రశ్నలకు సంతృప్తికరమైన జవాబుల్ని ఇంతే సులభంగా కనుగొనవచ్చని వివరించండి. మీరు మరో ప్రశ్నను, జవాబును చర్చించడానికి తిరిగివస్తామని చెప్పండి.
7 లేక మీరు ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించేందుకు ఒక సులభతరమైన విధానాన్ని ప్రయత్నించడానికి ఇష్టపడవచ్చు, ఇలా చెప్పండి:
◼ “కేవలం కొద్ది నిముషాలు వెచ్చించడం ద్వారా మీరు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబును తెల్సుకోవచ్చని మీకు తెలుసా? ఉదాహరణకు, . . .” తర్వాత ఆ వ్యక్తిని ఆకట్టుకుంటుందని మీకు అనిపించిన ఒక ప్రశ్నను బ్రోషూరులోని ఏదైనా ఒక పాఠం ప్రారంభంనుండి పేర్కొనండి. మీరు ఉపయోగించగల ప్రశ్నలను గూర్చిన కొన్ని తలంపుల కొరకు, 1997 మార్చి మన రాజ్య పరిచర్యలోని “పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి” అనే పేరుగల ఇన్సర్ట్లోని 15, 16 పేరాలను చూడండి.
8 పునర్దర్శనాలను చేస్తూ బైబిలు పఠనాలను నిర్వహించే సవాలును ఆనందంతో స్వీకరించడం, దేవుని “జతపనివారమై” ఉండడంలో ఒక భాగమై ఉంది. (1 కొరిం. 3:9) మనం కనుగొన్న ఆసక్తిని పెంపొందించడానికి కష్టపడి పని చేస్తూ అభివృద్ధి కొరకు యెహోవాపై ఆధారపడితే, ఏ ఇతర పనీ ఇవ్వలేని నిజమైన సంతృప్తిని మనం అనుభవిస్తాము.