వృద్ధులు నిర్విరామంగా ప్రకటిస్తున్నారు
1 చాలామంది ప్రజలు వృద్ధాప్యానికెదుగుతుండగా తమ లౌకిక ఉద్యోగ విరమణకొరకూ, శేష జీవితాన్ని ప్రశాంతంగా ఏ బాదరబందీలేకుండా గడిపేందుకూ ఎదురుచూస్తుంటారు. తాము చాలా కష్టపడి పనిచేసేశామనీ ఇక కాస్త విశ్రాంతి అవసరమనీ వారు భావించవచ్చు. లేకపోతే ఇక శేష జీవితాన్ని ఆనందంగా గడపాలనీ కోరుకోవచ్చు.—లూకా 12:19.
2 యెహోవా సమర్పిత సేవకులుగా, జీవితంపట్ల మనకు భిన్నమైన దృక్పథం ఉంది. దేవుని సేవనుండి విరమణ లేదని మనకు తెలుసు. మన ఆలోచనా సరళి అనుకూలమైనది, ఎందుకంటే మనం “నిత్యజీవాన్ని దృష్టిలో” పెట్టుకుంటాము. (యూదా 21, NW) సంవత్సరాల తరబడి సమకూర్చుకున్న జ్ఞానమూ, అనుభవమూ ఒక వ్యక్తియొక్క వివేచననూ అంతర్దృష్టినీ మెరుగుపర్చగలవు. ఇది ఒకనిని మరింత జ్ఞానవంతునిగా, మరింత సమతూకంగలవానిగా అయ్యేందుకూ, జీవం పట్ల మరింత లోతైన మెప్పుదలను ప్రదర్శించేందుకూ సమర్థున్ని చేయగలదు. ఈ గుణాలన్నీ సువార్త పరిచారకునికి గొప్ప ప్రయోజనాన్ని తేగలవు.
3 వయస్సు పెరగడం అంటే కేవలం శారీరకంగా వృద్ధులు కావడం మాత్రమే కాదు; అందులో ఒకరి మానసిక దృక్పథం కూడా ఇమిడివుంది. మీరు మరింత ఎక్కువకాలం జీవించాలని అపేక్షిస్తే, మీరు మీ ఆలోచనా దృక్పథంలో యౌవనంగా ఉండడానికి కృషిచేస్తే, మీరు ఎక్కువకాలం జీవించే అవకాశమూ, మనస్సును యౌవనంగా ఉంచుకునే అవకాశమూ పెరగగలదు. వృద్ధులు తమ ఆత్మీయ జ్ఞానాన్ని వృద్ధిచేసుకోవడం ద్వారా, ఆ జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా తమ జీవితాల్ని మరింత సుసంపన్నం చేసుకోవచ్చు.—1 కొరిం. 9:23.
4 నిజజీవిత అనుభవాలు: తాను 86 ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు ఒక సహోదరి ఇలా చెప్పింది: “నేను సత్యాన్ని నేర్చుకున్నప్పటినుండి ఇప్పటివరకూ గడిచిపోయిన 60 సంవత్సరాలను తలపోసుకున్నప్పుడు దేవుని దృఢమైన వాగ్దానం నా హృదయంలో ఉప్పొంగుతూ ఉంటుంది. అవును, యథార్థవంతులపట్ల యథార్థవంతునిగా ఉండే యెహోవా మనం అత్యంతానందభరితులుగా ఉండడాన్ని సాధ్యపరుస్తున్నాడు.” (కీర్త. 18:25) ఒక వృద్ధ సహోదరుడు తన భార్యావియోగం తనకు ఎంతో విఘాతాన్ని కలిగించినట్లు గుర్తుతెచ్చుకున్నాడు, దాని తర్వాత ఆయన ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనిలా అంటున్నాడు: “అయినా, యెహోవా నా యెడల చూపించిన అపాత్ర దయతో నేను తిరిగి కోలుకుని రెండు సంవత్సరాల తర్వాత పయినీరు సేవలో ప్రవేశించగల్గాను. ప్రకటనా కార్యకలాపంలో ఈ విధంగా ఎక్కువగా పాల్గొనడంతో నిజానికి నా ఆరోగ్యం మెరుగైనందుకు నేను యెహోవాకు ఎంతో కృతజ్ఞుడను!”
5 తమ ఆరోగ్యమూ తమ బలమూ అనుమతించినంత మేరకు యథాశక్తి ప్రకటనా పనిలో—నిర్విరామంగా—కొనసాగేందుకు అనేకమంది వృద్ధులు నిశ్చయించుకోవడం ఎంత మెచ్చుకోదగిన విషయం! వారిలా చెప్పేందుకు మంచి కారణం ఉంది: “దేవా, బాల్యమునుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని.”—కీర్త. 71:17.