క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమము
“యెహోవా దినాన్ని మనస్సునందు ఉంచుకోవడం” అనేది రాబోయే సంవత్సరం తొలిభాగం నుండి ప్రారంభమయ్యే రెండురోజుల ప్రాంతీయ సమావేశ కార్యక్రమం ప్రధాన అంశం. (2 పేతు. 3:12) మనలో అత్యవసరతా భావాన్ని రేకెత్తించడానికి అది రూపొందించబడింది. భూనివాసులు త్వరలోనే యెహోవా తీర్పులను పొందుతారు. “సర్వాధికారియైన దేవుని మహాదినము”ను తప్పించుకుని ఎవరు జీవిస్తారు? ఆధ్యాత్మికంగా మేల్కొనివుండి, “పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను” కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉండేవారు మాత్రమే.—ప్రక. 16:14; 2 పేతు. 3:11, 12.
యెహోవా దినాన్ని తప్పించుకుని జీవించాలంటే ఒక వ్యక్తి బాప్తిస్మము పొందడం ప్రాముఖ్యము. (1 పేతు. 3:21) సమావేశంవద్ద బాప్తిస్మం పొందగోరేవారు సంఘ పైవిచారణకర్తకు చెప్పాలి, ఆయన అవసరమైన ఏర్పాట్లను చేస్తాడు.
“మనమెలాంటి వ్యక్తులమై ఉండాలి” అనే నాలుగుభాగాల గోష్ఠి, యెహోవా దిన ప్రత్యక్షతను మనస్సులో ఉంచుకోవడంలో ఎటువంటి క్రియలు ఇమిడివున్నాయనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. మనం యెహోవా దినాన్ని తప్పించుకునే వారిగా ఉండేందుకు ‘యెహోవాను వెదకి, వినయము కలిగి, నీతిని అనుసరించాలి.’ అసలు అలా చేయడంలో ఏమి ఇమిడివుందో “యెహోవా దినం సమీపిస్తుండగా జ్ఞానయుక్తంగా ప్రవర్తించడం” అనే బహిరంగ ప్రసంగం వివరిస్తుంది.—జెఫ. 2:3.
ప్రయాణ పైవిచారణకర్తలు ఇచ్చే ఈ క్రింది రెండు ప్రసంగాలతో సర్క్యూట్ సమావేశం ముగుస్తుంది: “మీ జీవితం సత్యం చుట్టూ కేంద్రీకరించబడుతుందా?,” “యెహోవా దినాన్ని మనస్సునందు ఉంచుకొని ముందుగా ప్రణాళికవేసుకోవడం.” ఈ ప్రసంగాలు మన జీవితాన్ని పరిశీలించుకుని, అవసరమైన మార్పులు చేసుకోవడానికి మనల్ని కదిలిస్తాయి. యెహోవా దినం దగ్గరగా ఉందని బైబిలు ప్రవచనాలూ, ప్రపంచ సంఘటనలు స్పష్టంగా సూచిస్తున్నాయి. ‘నిబ్బరమైన బుద్ధిగలవారమై, మెలకువగా ఉండమని’ ఈ సమావేశ కార్యక్రమము మనల్ని ప్రోత్సహిస్తుంది. (1 పేతు. 5:8) రెండు రోజులూ హాజరవ్వడానికి నిర్దిష్టమైన ప్రణాళికలను వేసుకోండి.