మనం ఎందుకు తిరిగివెళ్తూనే ఉంటాము?
1 మీరెప్పుడైనా ఆ ప్రశ్నను వేసుకున్నారా, బహుశ మీరు ఏదైనా ఒకరోజు సేవకు సిద్ధపడుతుండగా ఆ ప్రశ్నను వేసుకున్నారా? సంఘం ఇప్పుడు ఒక్క సంవత్సరంలో పూర్తి చేయగల ప్రాంతాన్ని మాత్రమే సొసైటీని కోరాలని ఇండియాలోని సంఘాలు అడగబడ్డాయి కాబట్టి, క్రొత్త ప్రాంతాల్లో మళ్లీ మళ్లీ పనిచేయడానికి అలవాటుపడ్డ మనలోని కొంతమంది ప్రతి సంవత్సరం అదే ప్రాంతానికి తిరిగివెళ్లడం అసాధారణంగా ఉన్నట్లు కనుగొనవచ్చు. మళ్లీమళ్లీ పనిచేసిన ప్రాంతంలో ఇంటియజమానులు మనమెవరమో గుర్తుపట్టి వెంటనే మనల్ని వెనక్కి తిప్పి పంపించివేయవచ్చు. కొద్దిమంది మాత్రమే అనుకూలంగా ప్రతిస్పందించవచ్చు. అయినా మనం తిరిగివెళ్తూనే ఉండడానికి శక్తిమంతమైన కారణాలు చాలా ఉన్నాయి.
2 మొట్టమొదటిగా, అంతం వచ్చేంతవరకూ రాజ్య సందేశాన్ని ప్రకటించడంలో కొనసాగాలని మనకు ఆజ్ఞాపించబడింది. (మత్త. 24:14; 28:19, 20) ప్రవక్తయైన యెషయా తానెంతకాలం తన ప్రకటనాపనిని కొనసాగించవలసి ఉంటుందని అడిగాడు. ఆయనకు లభించిన సమాధానం యెషయా 6:11లో నమోదు చేయబడింది. అందులో సందేహమేమీ లేదు—ఆయన దేవుని సందేశాన్ని ప్రజలదగ్గరికి తీసుకుని వెళ్తూనే ఉండాలని ఆయనకు చెప్పబడింది. నేడు కూడా అదే విధంగా, అనేకమంది మనల్ని వెనక్కితిప్పి పంపించేస్తున్నా, మన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలదగ్గరికి మనం వెళ్లాలని యెహోవా అపేక్షిస్తున్నాడు. (యెహె. 3:10, 11) ఇది మనకు అప్పగించబడినటువంటి ఒక పవిత్రమైన బాధ్యత.—1 కొరిం. 9:17.
3 మనం తిరిగివెళ్తునే ఉండడానికి మరొక కారణం ఏమిటంటే అలా చేయడం యెహోవాపట్ల మనకున్న భక్తి ఎంత ప్రగాఢమైనదో చూపించడానికి ఇదొక అవకాశాన్నిస్తుంది. (1 యోహా. 5:3) దానికితోడు, మానవజాతికి సమీప భవిష్యత్తులో ఏమి సంభవించనైయుందన్న దానిపై మనం ధ్యానించినప్పుడు, మనం మన పొరుగువారిని ప్రేమపూర్వకంగా హెచ్చరించకుండా ఎలా ఉండగలం? (2 తిమో. 4:2; యాకో. 2:8) మన పని నియామకాన్ని నిర్వర్తించడంలో విశ్వసనీయంగా ఉండడం, దేవుని రక్షణా సందేశానికి ప్రతిస్పందించేందుకు వారికి మళ్లీ మళ్లీ అవకాశాలను ఇస్తుంది, ఆ విధంగా వారు తాము హెచ్చరించబడలేదని చెప్పే అవకాశం ఉండదు.—యెహె. 5:13.
4 దానికితోడు, కొంతమంది హృదయాలు ఎప్పుడు పరివర్తనం చెందుతాయో మనకసలు తెలియదు. అది తమ వ్యక్తిగత పరిస్థితుల్లో మార్పుద్వారానో, తమ కుటుంబంలో విషాదకర సంఘటన సంభవించడంతోనో, లేక తమ భవిష్యత్తును గూర్చి గంభీరంగా ఆలోచించేలా చేసే లోక పరిస్థితుల మూలానో వారి హృదయం పరివర్తనం చెందవచ్చు. మరోవైపు, వారి ఇంటిదగ్గర మనం చెప్పే ఏదైనా విషయం వారు అనుకూలంగా ప్రతిస్పందించేలా చేయవచ్చు. (ప్రసం. 9:11; 1 కొరిం. 7:31) అంతేకాకుండా, ప్రజలు ఇళ్లు మారుతూ ఉంటారు. మన ప్రాంతంలో సువార్తకు చక్కగా ప్రతిస్పందించే క్రొత్త నివాసులను మనం కనుగొనవచ్చు—బహుశా ఈ పాటికి ఉద్యోగాలు చేస్తూ తమ స్వంతకాళ్లపై నిల్చుని, జీవితంలోని సంకల్పం ఏమిటాని వెదుకుతున్న యువతరాన్ని కనుగొనవచ్చు.
5 ఇండియాలోని ప్రాంతం కొన్నిసార్లు అపరిమితంగా ఉన్నట్లుగా కన్పించినా ఇక్కడ, పునర్దర్శనాలు చేయడంపై సరైన అవధానముంచి ప్రతి సంవత్సరం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి పనిచేయడంద్వారా చక్కని ఫలితాలు దక్కినట్లు గమనించబడింది. ఇలా చేయడం తమ ఇళ్లనుండి ఎక్కడో దూరాన పునర్దర్శనాలు చేయడం సులభంకాని క్రొత్త ప్రాంతాలకు వెళ్తూ ఉండడంకన్నా ఎక్కువ ఫలితాలను తెస్తున్నట్లు గమనించబడింది. మనం జీవితంలో ఒక్కసారి మాత్రమే కనపడి మాట్లాడడంకన్నా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా క్రమంగా తమను కలుస్తుండడం ప్రజలు చూసినప్పుడు అది విభిన్నమైన, శ్రేష్ఠమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సకాలంలో ప్రచారకుల సంఖ్య పెరుగుతుండగా సంఘం సొసైటీని మరింత ప్రాంతం కొరకు అయితే ఒక్క సంవత్సరంలో మాత్రమే పూర్తి చేయగల ప్రాంతం కొరకు కోరవచ్చు.
6 మనం తిరిగివెళ్తూ ఉండడాన్ని కొనసాగిస్తామా? తప్పకుండా! ప్రజలదగ్గరికి మళ్లీ మళ్లీ తిరిగి వెళ్లడానికై లేఖనాలు మనకు కావాల్సినంత పురికొల్పునిస్తున్నాయి. ప్రకటనా పని ముగించబడినప్పుడు, అంతంలో, పరిచర్యలోని మన కొనసాగిత ప్రయత్నాలకు యెహోవా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాక, రాజ్య సువార్తకు కృతజ్ఞతాపూర్వకంగా ప్రతిస్పందించినవారినీ ఆయన ఆశీర్వదిస్తాడు.—1 తిమో. 4:16.