1997 “దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశం
1 “నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినములకంటె శ్రేష్ఠము.” (కీర్త. 84:10) కీర్తనల గ్రంథకర్త యెహోవా ఆలయంలో ఆరాధించినప్పుడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుని సాన్నిధ్యాన్ని అనుభవించగలిగాడు. వార్షిక పండుగల కొరకు జనాంగం సమకూడి సత్యారాధికులతో యెరూషలేము క్రిక్కిరిసిపోయినప్పుడు, ఇశ్రాయేలీయులు ఆలయ ఆవరణంలో సమావేశమైనప్పుడు వాళ్లు ఆహ్లాదకరమైన సౌభ్రాతృత్వాన్ని కనుగొనేవారు. యెహోవా తన ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని కుమ్మరించిన ఏకైక జనాంగంగా వారికి తమ జాతీయ ఐక్యత జ్ఞాపకం చేయబడేది. ప్రతి సంవత్సరం, వేల సంఖ్యలోని మన సహోదర సహోదరీల అలాంటి ఐక్యతానంద భావాలలో పాలుపంచుకునే అవకాశం మనకుంది. మన కాలంలో, ఉపదేశ సహవాసాల కొరకు యెహోవా తన ప్రజలను సమకూర్చడానికైన మార్గాల్లో వార్షిక జిల్లా సమావేశాలు ఒకటి.
2 పండుగలు జరిగే కాలంలో యెరూషలేములోను దాని చుట్టుప్రక్కలా నివసించే అసంఖ్యాకులైన యెహోవా ప్రజల గురించి శ్రద్ధ వహించడానికి సంస్థీకరణ అవసరమైంది. శాంతిభద్రతలను కాపాడేందుకు నివాస స్థలాల గురించీ, కూటాల సమయాల గురించీ, ఇతర ఏర్పాట్ల గురించీ ఉపదేశాలు ఇవ్వవలసిన అవసరం ఏర్పడి ఉండవచ్చు. ఈ విషయాలు ఇశ్రాయేలీయుల సత్యారాధనకు సంబంధించినవి కాబట్టి వారు ఆనందంగా ఈ ఉపదేశాలను అనుసరించేవారు.—కీర్త. 42:4; 122:1.
3 ‘ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగిందని’ అపొస్తలుడైన పౌలు తిమోతికి గుర్తుచేశాడు. (2 తిమో. 3:16) దేవుని వాక్యం దైవావేశము వలన కలిగింది గనుక, దానియందు విశ్వాసముంచడానికి మనకు ప్రతి కారణం ఉంది. ఈ సంవత్సరపు జిల్లా సమావేశ ముఖ్యాంశం “దేవుని వాక్యంలో విశ్వాసం.” మనకు ఎన్నో సంవత్సరాల నుండి సత్యం తెలిసినప్పటికీ లేక యెహోవా సంస్థతో ఇటీవలనే పరిచయం ఏర్పడినప్పటికీ ఆ కార్యక్రమం బైబిలు నందలి మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. మనమందరం కార్యక్రమమంతటికి హాజరుకావడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న క్రొత్త వారు, ప్రత్యేకంగా మనం ఎవరితో బైబిలు పఠనం నిర్వహిస్తున్నామో వారు మనతో పాటు హాజరుకావడం ఎంత ప్రోత్సాహకరంగా ఉంటుందో కదా!
4 సమావేశపు విభాగాల్ని సంస్థీకరించడానికి చాలామంది సహోదరులు ఎన్నో గంటలు వెచ్చించారు. ఒక సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన అనేక వివరాలను సమన్వయపర్చడానికి ఈ సహోదరులు సంస్థ సమావేశ కార్యాలయంతో సన్నిహితంగా కలిసి పనిచేస్తారు. మన వార్షిక జిల్లా సమావేశాల కొరకు వెచ్చించబడే అత్యధిక సమయం, కృషి, ఖర్చులను మనం వ్యక్తిగతంగా చూడకపోవచ్చు, కాని ఈ నమ్మకమైన సహోదరులలో ప్రతి ఒక్కరూ చూపిస్తున్న స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని మనమందరం తప్పకుండా మెచ్చుకుంటాము, మెచ్చుకోమా?
5 మన 1997 “దేవుని వాక్యంలో విశ్వాసం” జిల్లా సమావేశానికి సిద్ధపాట్లు జరుగుతుండగా, మీరు దయతో అవధానం నిలపవలసిన, గంభీరంగా పరిగణించవలసిన కొన్ని విషయాలు మనకున్నాయి. మీకోసం చేయబడిన అన్ని ఏర్పాట్లకు మీరిచ్చే సహకారం మీ వ్యక్తిగత మెప్పును చూపిస్తుంది. ఈ విషయాల్లో కొన్ని మునుపు చర్చించబడినప్పటికీ, మన సమావేశ ఏర్పాట్లకు మద్దతునివ్వడంలో యెహోవా ఎదుట మనకున్న బాధ్యతను మనలో ప్రతి ఒక్కరం స్పష్టంగా చూడడం ప్రాముఖ్యం.
6 మూడు రోజుల సమావేశము: ఈ సంవత్సరం మూడు రోజుల జిల్లా సమావేశ కార్యక్రమం మన ప్రయోజనం కొరకు ఏర్పాటు చేయబడింది; ప్రతి రోజు ఉదయం 9:30కి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇండియాలో జరిగే 18 సమావేశాలను, అవి నిర్వహించబడే భాషలను జూన్ 8, 1997, తేజరిల్లు! తెలియజేస్తుంది. మీరు ఏ సమావేశానికి హాజరవుతారో ఇప్పటికి మీకు తెలిసి ఉండాలి, కార్యక్రమం ఉన్న మూడు రోజులూ హాజరవ్వడానికి మీరు నిర్దిష్టమైన ప్రణాళికలను వేసుకొని ఉండవచ్చు. అందుకు అవసరమైన సెలవు కొరకు మీరు మీ యజమానిని కలిశారా? పాఠశాలలో చదువుకునే పిల్లలు మీకుంటే, పాఠశాల జరుగుతున్న కాలంలోనే సమావేశం జరుగుతున్నట్లయితే, తమ మత సంబంధ తర్ఫీదులోని ఈ ముఖ్య భాగం కొరకు వారు ఫలానా రోజులలో పాఠశాలకు హాజరు కారని ఉపాధ్యాయులకు సవినయంగా తెలియజేశారా?—ద్వితీ. 31:12.
7 శ్రద్ధనిలపడం మేలు: చీకటిగల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్న ప్రవచన వాక్యంపై శ్రద్ధనిలపడం మేలని అపొస్తలుడైన పేతురు మొదటి శతాబ్దపు క్రైస్తవులకు గుర్తుచేసాడు. (2 పేతు. 1:19) మన విషయంలో కూడా అది నిజమైయున్నది. సాతాను అధీనంలో ఉన్న ఈ పాత లోకంలో జీవించడం చీకటిగల ప్రదేశంలో ఉన్నట్లుంటుంది. ఆత్మీయ అంధకారం నుండి వెలుపలికి పిలువబడినందుకు మనం కృతజ్ఞులం. (కొలొ. 1:13; 1 పేతు. 2:9; 1 యోహా. 5:19) వెలుగులోనే నిలిచి ఉండడానికి, యెహోవా ప్రేరేపిత వాక్యంపై శ్రద్ధనిలపడం ద్వారా మన విశ్వాసాన్ని దృఢ పరచుకోవలసిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మన జిల్లా సమావేశం మనం అదే చేయడానికి ప్రోత్సహిస్తుంది.
8 కార్యక్రమంపై లక్ష్యముంచాలంటే మనం కృషి చేయవలసి ఉంటుంది, అయితే మనం అలా చేస్తే తప్పకుండా ఆశీర్వదించబడతాము. కార్యక్రమం జరుగుతున్నప్పుడు చురుగ్గా ఉండేలా బాగా విశ్రాంతి తీసుకొని సమావేశ స్థలానికి రావడానికి కృషిచేయాలి. కార్యక్రమం ప్రారంభం కాకముందే మీ సీట్లో ఉండేందుకుగాను ప్రతి రోజు సమావేశ స్థలానికి తగినంత ముందుగానే రండి. ప్రతి దిన కార్యక్రమారంభంలో ఉండే ప్రారంభ పాటలోను, ప్రార్థనలోను పాల్గొనండి. పెద్దవారు మాదిరినుంచాలి, తలిదండ్రులు తమ పిల్లలకు తర్ఫీదునివ్వాలి.—ఎఫె. 6:4.
9 ఆనాటి కార్యక్రమం ప్రారంభం కాకముందే మనం కార్యక్రమ శీర్షికలను చూసినట్లయితే, కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఏ అంశాలు అందజేయబడతాయో నిరీక్షించడానికి ప్రయత్నించవచ్చు. సమాచారం అందజేయబడుతున్నప్పుడు దానియందు మన ఆసక్తిని అది అధికం చేస్తుంది. మనం దేవున్నీ, తనను ఎడతెగక వెదికే వారికి ప్రతిఫలం ఇస్తాననే ఆయన ఖచ్చితమైన వాగ్దానాన్నీ ఎందుకు విశ్వసిస్తామో ఇతరులకు తెలియజేయడానికి మనకు సహాయంచేసే అంశాల కొరకు ఎదురుచూడవచ్చు. (హెబ్రీ. 11:1, 6) కార్యక్రమ ముఖ్యాంశాలను గుర్తుంచుకోవడానికి మనకు సహాయంచేసే క్లుప్త నోట్సు మనం తీసుకోవాలని సిఫార్సు చేయబడుతుంది. మనం ఎక్కువ నోట్సు తీసుకుంటే, వ్రాయడంపైనే మన అవధానముంటుంది కాబట్టి మనం కొన్ని ముఖ్యాంశాలను తప్పిపోవచ్చు.
10 మన ప్రయోజనం కొరకు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు” అందిస్తున్న వాటిని వినడానికి బదులు, చాలామంది పెద్దవారు మరియు యౌవనులు కార్యక్రమం జరుగుతుండగా కారిడార్లలో అనవసరంగా నడవడాన్నీ, బయట కలసి తిరగడాన్నీ, ఇతరులతో పిచ్చాపాటి మాట్లాడుకోవడాన్నీ గత సంవత్సరం మళ్లీ గమనించడం జరిగింది. తగిన సమయంలో ఆత్మీయాహారం ఇస్తానని యేసు మనకు వాగ్దానం చేశాడు. (మత్త. 24:45-47) కాబట్టి, ఆ ఆహారంనుండి ప్రయోజనం పొందడానికీ, మన మెప్పును కనబర్చడానికీ మనం అక్కడుండాలి. (2 కొరిం. 6:1) కొంతమంది పిల్లలు తమకు విసుగ్గా ఉన్నప్పుడు, లేచివెళ్లి బయట తిరగడానికో సాకుగా టాయ్‌లెట్‌కి వెళ్తామని తరచూ అడుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇంటి దగ్గర సరియైన శిక్షణనిచ్చినట్లయితే పదే పదే టాయ్‌లెట్‌కి వెళ్లే అవసరం ఉండదు. కొన్నిసార్లు, యౌవనస్థులు ఏకాంతంగా ఉండే స్థలాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ, గుసగుసలాడుకుంటూ, ఒకరికొకరు చిట్టీలు రాసి అందజేసుకుంటూ ఉంటారు. నేడు ఎన్నో ఒత్తిడులను ఎదుర్కుంటున్న మన యౌవనస్థులు కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇతర పనులు చేయకుండా, అందజేయబడుతున్న సమాచారంపై అవధానముంచాల్సిన అవసరత ఉంది. బైబిలు సూత్రాలతో పొందికలేని యౌవనేచ్ఛలను విసర్జించాలి. (2 తిమో. 2:22 పోల్చండి.) పెద్దలైనా, పిన్నలైనా అవధానముంచడం యెహోవాను ఘనపర్చి, ఆయనను సంతోషపరుస్తుంది.
11 ఈ విషయాల్లో, అటెండెంట్లలో ఒకరు ఎవరికైనా సలహా ఇవ్వవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని యెహోవా ప్రేమపూర్వకమైన ఏర్పాటుగా అంగీకరించాలి. (గల. 6:1) సమావేశానికి హాజరుకావడానికి మనం శ్రమ పడుతున్నది ‘విని నేర్చుకోవడం కోసమేనని’ అందరూ గుర్తుంచుకోవడం అవసరం. (ద్వితీ. 31:12) అంతేగాక, “జ్ఞానముగలవాడు విని పాండిత్యము వృద్ధిచేసికొనును.” (సామె. 1:5) కార్యక్రమం నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి హాల్లో కలిసి కూర్చోవలసిన అవసరత గురించి, కార్యక్రమం జరుగుతున్నప్పుడు సీట్లలోనే కూర్చొని ఉండవలసిన అవసరత గురించి, అధిక శ్రద్ధనివ్వవలసిన అవసరత గురించి సమావేశానికి హాజరవ్వడానికి ముందు రోజుల్లో కుటుంబంగా చర్చించండి.
12 యెహోవాను ప్రీతిపర్చే అలంకరణ: లోకమంతా యెహోవా ప్రజలను ఆసక్తిగా చూస్తుంది. (1 కొరిం. 4:9) వస్త్రధారణ మరియు కేశాలంకరణ విషయాల్లో మన మంచి ప్రమాణాన్ని బట్టి మనం పేరుపొందాము. అనేకులు 1 తిమోతి 2:9, 10 మరియు 1 పేతురు 3:3, 4 నందు కనుగొనబడే లేఖనాధార సూత్రాలను అన్వయించుకోవడం మూలంగా, క్రైస్తవ సంఘంతో వారు సహవసించడం ప్రారంభించినప్పుడున్న దానితో పోలిస్తే ఇప్పుడు వారి అలంకరణలో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రపంచంలో నేడు మనం చూస్తున్న వస్త్రధారణ మరియు కేశాలంకరణ విషయాల్లో క్రమంగా దిగజారిపోతున్న ప్రమాణాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. వికారమైన బట్టలు వేసుకుంటూ, కేశాలంకరణ విషయంలో లోకసంబంధమైన ఫ్యాషన్లను అనుకరిస్తూ, లేక అసభ్యమైన వస్త్రాలను ధరిస్తూ మన అలంకరణలో మనం లోకాన్నిపోలి ఉండకుండా జాగ్రత్త వహించాలి. క్రైస్తవులు తమను తాము ఎలా అలంకరించుకోవాలనేది తెలుసుకోవడానికి మన మాదిరికరమైన వస్త్రధారణ మరియు కేశాలంకరణ సమావేశానికి హాజరయ్యే క్రొత్త వారికి సహాయం చేస్తాయి.
13 గత సంవత్సర సమావేశాల ఫలితంగా ఎంతో అనుకూలమైన అభిప్రాయం ఏర్పడినప్పటికీ, ప్రాముఖ్యంగా సమావేశ కార్యక్రమం ముగిసిన తరువాతి తీరిక సమయంలో, కొంతమంది సహోదర సహోదరీలు వస్త్రధారణ మరియు కేశాలంకరణ విషయాల్లో ఇంకా లోకవిధానాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తుంది. మనం సమావేశానికి హాజరవ్వడానికి పథకాలు వేసుకొనేటప్పుడు, మన వస్త్రధారణ మరియు కేశాలంకరణకు సంబంధించి మనకై మనం విశ్లేషించుకోవాలి. తలిదండ్రులారా, మీ చిన్నపిల్లలు మరియు యౌవనస్థులు ఏమి ధరించబోతున్నారో జ్ఞానయుక్తంగా పర్యవేక్షించండి. లోకంలోని స్టైళ్ళూ మరియు ఫ్యాషన్లూ క్రైస్తవ వేశభూషణపై చెడు ప్రభావాన్ని చూపించకుండా జాగ్రత్త వహించండి.
14 మంచి ప్రవర్తన కలిగి ఉండండి: మంచి ప్రవర్తన నిజమైన క్రైస్తవులకు చిహ్నం. (1 పేతు. 2:12) మనమెక్కడున్నప్పటికీ—సమావేశంలో, రెస్టారెంట్లలో, హోటల్స్‌లో, అలాగే ప్రయాణించేటప్పుడు—మన ప్రవర్తన మంచి సాక్ష్యాన్నివ్వగలదు మరియు దేవునియందలి ఆయన వాక్యమందలి విశ్వాసం ప్రజలకు ఏమి చేస్తుందో తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయగలదు. ఇది కొంతమందిని యెహోవా గురించి తెలుసుకోవడానికి పురికొల్పవచ్చు. (1 పేతురు 3:1, 2 పోల్చండి.) మన ప్రవర్తన ద్వారా దేవున్ని మహిమపర్చే ఆధిక్యత మనకుంది. మన వాళ్లు “తామింతవరకు వసతినిచ్చిన వారిలోకెల్లా ఎంతో మంచివాళ్లని, మంచిప్రవర్తన కలవారని” ఒక హోటల్ మేనేజ్మెంట్ తెలియజేసింది. వారు ఇంకా ఇలా అన్నారు: “భవిష్యత్తులో మీరు మళ్ళీ రావటం ఒక ఆధిక్యతగా భావిస్తాము.” వేరోక ప్రాంతంలోని ఒక పర్యాటక అధికారి ఇలా వ్రాశాడు: “ప్రతి సంవత్సరం, వాచ్‌టవర్ సంస్థ యొక్క సమావేశాల కొరకు మేమంతా ఆసక్తితో ఎదురుచూస్తాము. మీ ప్రజలు నిజంగా ఆహ్లాదకరమైనవారు. వారు ఎంతో గౌరవప్రదంగా మరియు మర్యాదగా ప్రవర్తిస్తారు. మా వ్యాపారస్తులు దీనిని గుర్తిస్తారు, ప్రతి సంవత్సరం తమ అతిథుల ‘కుటుంబ’ పునరాగమనాన్ని విలువైనదిగా ఎంచుతారు.” ఇలాంటి నివేదికలను చదవడం సంతోషంగా ఉంటుంది, కాదంటారా? అయితే యెహోవా ప్రజలకున్న మంచి పేరును కాపాడగలిగేలా, జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది.
15 ఇతర అతిథులకు అంతరాయం కలిగిస్తూ ఒంటరిగా హోటళ్లలో పరుగెట్టకుండా పిల్లలను అదుపుచేయడం గురించి ఎన్నో జ్ఞాపికలు ఇవ్వబడ్డాయి. మన పిల్లల్లో కొంతమందిని పర్యవేక్షించకపోడంవల్ల వాళ్లు హోటల్ వసారాల్లోనూ, ఇతర స్థలాల్లోనూ పరిగెత్తుతూ కనిపించినట్లు సొసైటీకి ప్రతి సంవత్సరం నివేదికలందుతున్నాయి. మన పిల్లలు ఇతర సాక్షులకొరకు చూస్తూ ప్రతి గది తలుపు కొట్టడం వల్ల, తన హోటల్లో పడుకున్న ఒక మేనేజరుకు రాత్రి 11.00 గంటల తరవాత రెండుసార్లు మెలకువ వచ్చింది. మన సహోదరులతో సహవసించడానికి, కలవడానికి సమావేశాలు అవకాశం కల్పించినప్పటికీ, తాము తమ పిల్లలను ఎల్లవేళల పర్యవేక్షించడం తమ బాధ్యతని తలిదండ్రులు మనస్సులో ఉంచుకోవాలి. ఇది తలిదండ్రులందరికీ యెహోవా ఇచ్చిన బాధ్యత. (సామె. 1:8; ఎఫె. 6:4) మంచి పేరును సంపాదించుకోవడానికి ఇతర యెహోవాసాక్షులు చేసిన కృషిని, పర్యవేక్షణలేని పిల్లల చర్యలు నిష్ఫలంచేయవచ్చు.—సామె. 29:15.
16 మీరు హోటల్లో బస చేసి ఉన్నట్లయితే, వంట చేసుకోవడానికి వంట గది ఉంటే తప్ప హోటల్ గదుల్లో వంట చేయకూడదని గుర్తుంచుకోండి. వ్యక్తిగత సేవను మీరు పొందినప్పుడు టిప్పు ఇవ్వడం తగినదని మనస్సులో ఉంచుకోండి, ఎందుకంటే హోటల్ సిబ్బందీ, వెయిటర్లూ, స్వీపర్లూ వంటి అనేకమంది జీవనం ఎక్కువ మట్టుకు టిప్పులపైనే ఆధారపడి ఉంటుంది. యెహోవాసాక్షులుగా మనం ఈ విషయంలో కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలని కోరుకుంటాము.—తేజరిల్లు! (ఆంగ్లం) జూన్ 22 1986, నందలి 24-7 పేజీలను చూడండి.
17 సమావేశపు ఖర్చులకు సహాయపడడం: సమావేశాలకు హాజరవ్వడానికి సంబంధించిన ఖర్చులు మనందరికీ ఉంటాయి. మనం పరిగణనలోకి తీసుకోవలసిన మరో ఖర్చు కూడా ఉంది. సమావేశాల కొరకు ఉపయోగించే సౌకర్యాలు ఖరీదైనవి. పరిగణించవలసిన ఇతర ఖర్చులు కూడా ఉన్నాయి. సమావేశాలలో మనం ఉదారంగా ఇచ్చే చందాలు ఎంతో మెచ్చుకోబడతాయి.—అపొ. 20:35; 2 కొరిం. 9:7, 11, 13.
18 సీట్లు: మీ కుటుంబంలోని వారికి, మీ గుంపులో మీతో పాటు ప్రయాణం చేసేవారికి మాత్రమే సీట్లను ఉంచాలి అని సంవత్సరాలుగా ఇవ్వబడుతున్న నిర్దేశకాలు ఇప్పటికీ వర్తిస్తాయి. ఇటీవలి సంవత్సరాల్లో, చాలామంది ఈ నిర్దేశాలకనుగుణంగా నడుచుకోవడాన్ని గమనించడం సంతోషం కలిగించింది, ఇది సమావేశాల్లో కనిపించే ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని అధికం చేసింది. చాలా స్థలాల్లో కొన్ని సీట్లు మిగిలినవాటికన్నా కూర్చోవడానికి ఎక్కువ అనువుగా ఉంటాయి. దయచేసి కనికరం చూపించి, ఎక్కువ అనుకూలంగా ఉండే సీట్లను అలాంటివి అవసరమైన వారి కొరకు ఉంచండి.
19 కెమెరాలు, వీడియో కెమెరాలు మరియు టేప్ రికార్డర్లు: సమావేశాల్లో కెమెరాలను, రికార్డింగ్ పరికరాలను ఉపయోగించవచ్చు. అయితే, వాటి ఉపయోగం హాజరైన వారిలో ఇతరులకు అవరోధం కలిగించ కూడదు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోటోలు తీస్తూ చుట్టూ తిరగకూడదు, అది కార్యక్రమంపై ధ్యానముంచాలని ప్రయత్నించే వారికి భంగం కలుగజేస్తుంది. ఏ విధమైన రికార్డింగ్ పరికరాలను ఎలక్ట్రికల్ లేదా సౌండ్ సిస్టమ్‌కు కనెక్ట్ చేయకూడదు, లేదా ఆ రికార్డింగ్ పరికరం దారికి, నడవాకు లేదా ఇతరులు చూడడానికి ఆటంకం కలిగించకూడదు.
20 ప్రథమ చికిత్స: ప్రథమ చికిత్స విభాగము అత్యవసర పరిస్థితులకు మాత్రమే. ధీర్ఘకాల రోగాల గురించి అది శ్రద్ధ వహించలేదు. అందుకే మీ యొక్క మరియు మీ కుటుంబం యొక్క ఆరోగ్య అవసరతల గురించి ముందే శ్రద్ధ వహించాలి. దయచేసి మీ సొంత ఆస్ప్రిన్లను, జీర్ణసంబంధ మందులను, బాండేజ్లను, పిన్నులను, అలాంటి ఇతర వస్తువులను మీరు తెచ్చుకోండి, ఎందుకంటే అవి సమావేశం వద్ద లభించవు. సీజర్లు, ఇన్సులిన్ షాక్, హృద్రోగ సమస్యలు మొదలైన అనారోగ్యాలున్న వారెవరైనా తమ అవసరతలను వీలైనంతమట్టుకు ముందుగానే గమనించుకోవాలి. వారు అవసరమైన మందును వెంట ఉంచుకోవాలి, వారి పరిస్థితిని అర్థం చేసుకొనే కుటుంబ సభ్యులెవరైనా లేక సంఘంలోని వారెవరైనా అవసరమైన సహాయం అందించటానికి ఎల్లవేళలా వారి దగ్గర ఉండాలి. ధీర్ఘకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారు సమావేశాల్లో ఒంటరిగా విడిచిపెట్టబడి, అస్వస్థులైనప్పుడు సమస్యలు తలెత్తాయి. ప్రత్యేక ఆరోగ్యావసరతలున్న కొంతమందికి తమకు సహాయం చేయగల కుటుంబ సభ్యులులేనప్పుడు, సంఘ పెద్దలు పరిస్థితిని గమనించి సహాయం కొరకు అవసరమైన ఏర్పాట్లను చేయవలసిన అవసరం ఉంది.
21 సమావేశం వద్ద ఆహారం: కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవడం మూలంగా, సమావేశాల్లో భోజన సరఫరా కార్యక్రమం లేకపోవడం మూలంగా, అన్ని కార్యక్రమాలలోనూ ఆత్మీయ ఆహారంపై ధ్యానముంచటానికి చాలామందికి వీలయ్యింది. ఈ ఏర్పాటు చేయబడినప్పటి నుండి ఈ సరళీకరణ యెడల ఎంతో మెప్పు వ్యక్తం చేయబడింది. అవసరమని ఎవరైనా తలంచినప్పుడు, వారు 1995 జూలై మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్లో సూచించబడిన పోషకాహార పదార్థాలను మధ్యాహ్నం కొరకు తెచ్చుకోవడానికి పథకాలు వేసుకోవాలి. గాజు సీసాలను లేదా మద్యపానీయాలను సమావేశ స్థలానికి తీసుకురాకూడదు. టిఫిన్లు మరియు త్రాగేనీటి పాత్రలు సీటు క్రింద పట్టేటంత చిన్నవిగా ఉండాలి. కార్యక్రమం జరుగుతున్నప్పుడు ప్రేక్షకుల్లో కొంతమంది తింటూ, తాగుతూ ఉన్నట్లు గమనించడం జరిగింది. ఇలా చేయటం అమర్యాదకరమైనది. సమావేశ స్థలం లోపల లేక బయట ఉన్న ఆహార దుకాణాల్లో కొంతమంది సహోదరులు సమావేశము జరుగుతున్న సమయంలో కొనుగోలు చేస్తున్నట్లుగా గమనించడం జరిగింది. అలాంటి అలవాటు యుక్తమైనది కాదు. మన ఆత్మీయ విందునూ, స్వల్పకాల మధ్యాహ్న విరామ సమయంలోని మన సహవాసం యొక్క విశ్రాంతికరమైన మరియు సమాధానకరమైన వాతావరణాన్నీ మనం నిజంగా మెచ్చుకుంటాము. ఈ ఏర్పాటు యొక్క ఉద్దేశానికి అనుగుణ్యంగా మీ సహోదర సహోదరీల సహవాసాన్ని ఆనందించడానికి సమయాన్ని ఉపయోగించుకోండి.
22 “దేవుని వాక్యంలో విశ్వాసం” అనే జిల్లా సమావేశం త్వరలో ప్రారంభమౌతున్నందుకు మనకు ఎంత ఆనందంగా ఉందో కదా! యెహోవా తన సంస్థ ద్వారా సిద్ధపరచిన మంచి ఆత్మీయ విందును మనం పూర్తిగా ఆనందించగలిగేలా కార్యక్రమమంతటికీ హాజరుకావడానికి మనమందరం తప్పకుండా సిద్ధపాట్లు చేసుకోవాలనుకుంటాము. ఆ విధంగా రాబోయే దినాల్లో మనం “ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి”న వారమౌతాము.—2 తిమో. 3:17.
[6వ పేజీలోని బాక్సు]
జిల్లా సమావేశ జ్ఞాపికలు
బాప్తిస్మం: బాప్తిస్మ అభ్యర్థులు శనివారం ఉదయం కార్యక్రమం ఆరంభమయ్యే ముందు నియమించబడిన సెక్షన్లో కూర్చోవాలి. బాప్తిస్మం పొందాలని పథకం వేసుకుంటున్న ప్రతి ఒక్కరు పొందికైన వస్త్రాలనూ, టవల్నూ తెచ్చుకోవాలి. బాప్తిస్మ అభ్యర్థులతో మన పరిచర్య పుస్తకంలోని ప్రశ్నలను పునఃసమీక్షించే సంఘ పెద్దలు ప్రతి ఒక్కరు ఈ అంశాలను అర్థం చేసుకున్నారని నిశ్చయపరచుకోవాలి. ప్రసంగీకుడు బాప్తిస్మ ప్రసంగమిచ్చి, ప్రార్థన చేసిన తరువాత కార్యక్రమాధ్యక్షుడు పాట పాడ్డానికి ఆహ్వానిస్తాడు. చివరి పల్లవి తరువాత, అటెండెంట్లు బాప్తిస్మ అభ్యర్థులను బాప్తిస్మ స్థలానికి నడిపిస్తారు. ఒకరి సమర్పణకు సూచనయైన బాప్తిస్మం అనేది ఆ వ్యక్తికి యెహోవాకు మధ్యనుండే అంతరంగికమైన, వ్యక్తిగతమైన విషయం. గనుక, అభ్యర్థులు బాప్తిస్మం తీసుకొనేటప్పుడు ఒకరినొకరు కౌగిలించుకోవడం లేక చేతులు పట్టుకోవడం యుక్తము కాదు.
బ్యాడ్జ్ కార్డులు: దయచేసి సమావేశ సమయంలోను, సమావేశ స్థలానికి వచ్చేటప్పుడు వెళ్లేటప్పుడు 1997 బ్యాడ్జ్ కార్డు ధరించండి. ఇది చక్కని సాక్ష్యమివ్వడానికి తరచూ మనకు అవకాశాలను కల్పిస్తుంది. బ్యాడ్జ్ కార్డులు మరియు వాటి హోల్డర్లను మీ సంఘం ద్వారా పొందవచ్చు, ఎందుకంటే అవి సమావేశంలో లభ్యం కావు. మీ కొరకు మీ కుటుంబం కొరకు బ్యాడ్జ్ కార్డులను కోరేందుకు సమావేశానికి కొన్ని రోజుల ముందు వరకు వేచి ఉండండి. మీ నవీకరించబడిన అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్/రిలీస్ కార్డ్‌ను మీతోపాటు ఉంచుకోవడాన్ని గుర్తుంచుకోండి.
వసతి: ఈ విషయంలో మీకు సమస్య ఎదురైనట్లైతే, మీరు ఇంకా సమావేశ స్థలంలో ఉండగానే ఆ సమస్యను గురించి సమావేశ రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలియజేయడానికి సందేహించకండి. అలా వాళ్లు మీ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడానికి మీకు సహాయపడగలుగుతారు. సంఘ కార్యదర్శులు రూమ్ రిక్వెస్ట్ ఫారమ్‌లు సరైన సమావేశ చిరునామాలకు సత్వరమే పంపించేలా నిశ్చయపరచుకోవాలి. మీరు ఒక వసతిని వద్దనుకుంటే, మీరు వెంటనే రూమింగ్ డిపార్ట్మెంట్కు తెలపాలి, అలాగైతే వారు దానిని మరొకరికి నియమించగల్గుతారు.
స్వచ్ఛంద సేవ: సమావేశమందు ఒక విభాగంలో సహాయపడేందుకు మీరు కొంత సమయం కేటాయించగలరా? మన సహోదరులకు సేవచేయడం కేవలం కొన్ని గంటలే అయినప్పటికీ ఎంతో సహాయకరంగా ఉండి, మరింత సంతృప్తినివ్వగలదు. మీరు సహాయపడగలిగితే, దయచేసి సమావేశంలోని స్వచ్ఛంద సేవా విభాగానికి తెలియజేయండి. 16 ఏండ్ల కన్నా తక్కువ వయస్సు గల పిల్లలు తలిదండ్రుల లేదా బాధ్యతగల వేరెవరైనా పెద్దవారి పర్యవేక్షణలో పనిచేయడం చక్కని తోడ్పాటు కాగలదు.
హెచ్చరికా మాటలు: అనవసరమైన కష్టాన్ని నివారించేందుకు, రాగల సమస్యలను గూర్చి అప్రమత్తంగా ఉండండి. తరచూ దొంగలు మరియు అనీతిమంతులు తమ ఇంటి పరిసరాలనుండి దూరంగా ఉన్న ప్రజలపై తమ అవధానాన్ని నిలుపుతారు. దొంగలు, జేబు దొంగలు పెద్ద సమావేశాలపై శ్రద్ధ కేంద్రీకరిస్తారు. మీ సీట్లో విలువైనవాటిని వదిలిపెట్టి వెళ్లడం జ్ఞానపూర్వకం కాదు. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు క్రైస్తవులే అన్న హామీ మీకు లేదు. ఎందుకు శోధించాలి? కొందరు బయటి వ్యక్తులు పిల్లలను దూరంగా తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేసినట్లు నివేదికలు అందాయి. మీ పిల్లలపై మీ దృష్టిని ఎల్లప్పుడూ ఉంచండి.
అనేక హోటళ్ళలో లభ్యమయ్యే దూరదర్శిని లేదా వీడియో సర్వీసులు తరచూ దుష్టత్వాన్ని, అశ్లీలమైన కార్యక్రమాలను చూపిస్తాయి. ఈ ఉరిని గూర్చి అప్రమత్తంగా ఉండండి, పర్యవేక్షణ లేకుండా పిల్లలను గదిలోని దూరదర్శిని దగ్గరకు వెళ్ళనివ్వకండి.
దయచేసి, సమావేశ విషయాల గురించి సమావేశ హాలు కార్యనిర్వాహక వర్గానికి ఫోను చేయడంగానీ లేక రాయడంగానీ చేయకండి. పెద్దల నుండి సమాచారం లభించనట్లైతే, జూలై 1997 మన రాజ్య పరిచర్యలో ఉన్న నిర్దిష్ట పట్టికలోని సమావేశ స్థల చిరునామాకు మీరు వ్రాయవచ్చు.