మన పేరు వెనుకనున్న సంస్థకు విద్యార్థులను నడిపించండి
1 “ఈ సందేశం 200 కంటే ఎక్కువ భాషల్లో అందించడం జరుగుతుంది. 210 కంటే ఎక్కువ దేశాల్లో దాన్ని వినడం జరుగుతుంది. ప్రజలు ఎక్కడ కనిపించినా వ్యక్తిగతంగా వారికి ఈ సందేశాన్ని అందించడం జరుగుతుంది. ప్రపంచం ఇంతవరకూ ఎరుగని గొప్ప ప్రకటనా పనిలో అదంతా ఓ భాగం, ఆ సందేశం ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొలది మందిని ఐక్యపరుస్తూ ఉంది. యెహోవాసాక్షులు ఈ పనిని సాధించేందుకు వంద కంటే ఎక్కువ సంవత్సరాల నుండి సంస్థీకరించబడివున్నారు!”
2 యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం) అనే వీడియోలోని వ్యాఖ్యానం అలా ప్రారంభమౌతుంది. అది ఈ కింది ప్రశ్నలకు జవాబులనిస్తుంది: యెహోవాసాక్షులంటే అసలు ఎవరు? వారి పని ఎలా సంస్థీకరించబడుతుంది? ఎలా నడిపించబడుతుంది? ఆర్థిక సహాయం ఎలా లభిస్తుంది? “తమ పొరుగువారు బైబిలులో విశ్వాసాన్ని పెంచుకునేలా వారికి సహాయం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న యెహోవాసాక్షులకు ఓ సంస్థగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది” అన్న వాస్తవం చూసేవారిని ముగ్ధులను చేస్తుంది. మన పేరు వెనుకనున్న సంస్థను వారే స్వయంగా చూసేందుకు అది వారిని ప్రోత్సహిస్తుంది. ఈ వీడియోను చూసిన తర్వాత, పఠనం చేస్తున్న ఓ స్త్రీ మెప్పుదలతోకూడిన ఆనందబాష్పాలను ఆపుకోలేక, “నిజమైన దేవుడైన యెహోవా సంస్థ ఇదే అని ఎవరైనా ఎలా గ్రహించకుండా ఉంటారు?” అని అంటుంది.—1 కొరింథీయులు 14:24, 25 పోల్చండి.
3 మరో స్త్రీ ఎంతో కాలంవరకూ బైబిలును అప్పుడప్పుడూ పఠిస్తూ ఉండేది కానీ త్రిత్వం అబద్ధ సిద్ధాంతమన్న వాస్తవాన్ని ఆమె గ్రహించలేకపోయింది. అప్పుడు ఆమెకూ ఆమె భర్తకూ మన వీడియో చూపించడం జరిగింది. అది చూసి వారు ఎంతో ముగ్ధులై అదే రోజు రాత్రి దాన్ని మళ్లీ రెండుసార్లు చూశారు. తర్వాతి పఠనం సమయంలో, సాక్షి అవ్వాలన్న తన కోరికను భార్య వ్యక్తపర్చింది. తన అవధానాన్ని మన సంస్థపై దానిలోని ప్రజలపై నిలపలేకపోయానని, త్రిత్వంలోని తన విశ్వాసంపై కేంద్రీకరిస్తూ వచ్చానని ఆమె చెప్పింది. ఆ వీడియో ద్వారా తాను దేవుని నిజమైన సంస్థను కనుగొన్నానని ఆమె గ్రహించింది. అమె ఇంటింటి ప్రచారాన్ని వెంటనే ప్రారంభించాలనుకుంది. బాప్తిస్మం పొందని ప్రచారకురాలయ్యేందుకు తీసుకోవల్సిన చర్యను గూర్చి ఆమెకు వివరించినప్పుడు, “నేను వెంటనే ఆ చర్యను తీసుకుంటాను” అంది. ఆమె చర్చికి రాజీనామా చేసి, ప్రాంతీయ సేవా పనిని ప్రారంభించి, త్రిత్వం తప్పని నిరూపించడంలో ప్రవీణురాలైంది.
4 బైబిలు విద్యార్థులు యెహోవా సంస్థను గుర్తించి దానితో సహవసించినప్పుడు, వారు ఆత్మీయంగా మంచి పురోభివృద్ధిని సాధించి చాలా త్వరగా పరిణతి చెందుతారన్నది సుస్థాపితమైంది. ప్రాముఖ్యంగా, పెంతెకొస్తునాడు 3,000 మంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత, ‘వారు అపొస్తలుల బోధయందును సహవాసమందును, రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి.’ (అపొ. 2:42) కనుక మన విద్యార్థులు అలా చేసేందుకు మనం వారికి సహాయం చేయడం అవసరం. మనం ఎలా సహాయం చేయవచ్చు?
5 బాధ్యతను తీసుకోండి: బైబిలు విద్యార్థిని దేవుని సంస్థవైపుకు మరల్చడం తన బాధ్యతని శిష్యులను చేసే ప్రతి వ్యక్తీ గుర్తించాలి. (1 తిమో. 4:16) కొత్త వ్యక్తి తాను యెహోవాకు సమర్పించుకున్నాడనేందుకు సూచనగా నీటి బాప్తిస్మాన్ని తీసుకునే ఆనందమయ రోజుకు ప్రతి పఠనమూ ఓ మెట్టని భావించాలి. బాప్తిస్మం తీసుకునే సందర్భంలో అతన్ని అడిగే ప్రశ్నల్లో ఒకటి: “మీ సమర్పణ, బాప్తిస్మం మిమ్మల్ని దేవుని ఆత్మనిర్దేశిత సంస్థ సహవాసంలో యెహోవాసాక్షులలో ఒకరిగా గుర్తిస్తుందని మీరు అర్థం చేసుకుంటున్నారా?” కాబట్టి, నిజ క్రైస్తవ సంఘంతో చురుకుగా సహవసించకుండా తాను దేవున్ని సేవించలేడని అతను గ్రహించడం ప్రాముఖ్యం.—మత్త. 24:45-47; యోహా. 6:68; 2 కొరిం. 5:20.
6 స్థానిక సంఘాన్ని గూర్చీ యెహోవాసాక్షుల వెనుకనున్న అంతర్జాతీయ సంస్థను గూర్చీ ఆ విద్యార్థికి చెబుతూ ఉండాలి. మొదటిసారి బైబిలు పఠించినప్పటి నుండి అలా ప్రతి బైబిలు పఠన సమయంలోనూ చెప్పండి. ప్రారంభం నుండే, ఆ విద్యార్థిని కూటాలకు రమ్మని ఆహ్వానించండి, అలా ఆహ్వానిస్తూనే ఉండండి.—ప్రక. 22:17.
7 అందించబడిన పనిముట్లను ఉపయోగించండి: గృహబైబిలు పఠనాలను నిర్వహించేందుకు చక్కని ప్రచురణలేవంటే, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? మరియు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము. ఇవి రెండూ సంఘంతో సహవసించే అవసరతను ఉన్నతపరుస్తున్నాయి. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరులోని 5వ పాఠంలోని చివరి భాగం ఇలా తెలియజేస్తోంది: “మీరు యెహోవా గురించి నేర్చుకుంటూ, ఆయన కోరేవాటిని చేస్తూ ఉండడం అవసరం. అలా చేయడానికి, యెహోవాసాక్షుల స్థానిక రాజ్య మందిరంలో జరిగే కూటాలకు హాజరుకావడం మీకు సహాయం చేస్తుంది.” జ్ఞానము పుస్తకం, కూటాలలో ఇతరులతో సహవసించమని విద్యార్థిని పదే పదే ప్రోత్సహిస్తుంది. 5వ అధ్యాయం 22వ పేరా ఇలా అహ్వానిస్తోంది: “యెహోవాసాక్షులు . . . దేవున్ని ‘ఆత్మతోను సత్యముతోను’ ఆరాధించడంలో వారితో భాగం వహించుమని వారు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరతారు. (యోహా. 4:24)” 12వ అధ్యాయం 16వ పేరా ఇలా పేర్కొంటోంది: “మీరు ఈ పఠనాన్ని కొనసాగిస్తుండగా, యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడాన్ని ఒక అలవాటుగా చేసుకోండి, నిశ్చయంగా మీ విశ్వాసం ఇంకా బలపర్చబడుతుంది.” 16వ అధ్యాయం 20వ పేరా ఇలా అంటోంది: “యెహోవాసాక్షుల కూటాలకు హాజరు కావడానికి మీరు అలవాటు చేసుకోండి.” ఇంకా ఇలా కూడా అంటుంది: “దేవుని గూర్చిన జ్ఞానాన్ని అర్థంచేసుకొని, దాన్ని మీ జీవితంలో అన్వయించుకొనేందుకు ఇది మీకు సహాయం చేస్తుంది, మీకు సంతోషాన్ని తెస్తుంది. ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంలో భాగమై ఉండడం యెహోవాకు సన్నిహితంగా ఉండడానికి మీకు సహాయం చేస్తుంది.” దేవుని ప్రజల నడుమ ఒక వ్యక్తి భద్రతను ఎలా కనుగొంటాడనే విషయాన్ని 17వ అధ్యాయం పూర్తిగా వివరిస్తుంది. మనం ఇతరులతో పఠించేటప్పుడు, ఈ సమాచారంలో ఉన్న ఈ భాగాలను నొక్కి చెప్పడం మన బాధ్యత.
8 యెహోవాసాక్షులు—ప్రపంచమంతట ఐక్యంగా దేవుని చిత్తాన్ని చేస్తున్నారు అనే బ్రొషూరు యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చేందుకు నేడు ఉపయోగించే ఏకైక దృశ్య సంస్థతో ప్రజలు పరిచయం కల్గివుండేందుకు తయారు చేసిన చక్కని పరికరం. మన పరిచర్య, కూటాలూ, సంస్థలను గూర్చిన వివరణాత్మక సమాచారం, దేవున్ని ఆరాధించడంలో మనతో సహవసించేందుకు చదువరిని ప్రోత్సహిస్తుంది. ఒకసారి బైబిలు పఠనం స్థాపించబడిన తర్వాత, విద్యార్థి తనంతట తానుగా ఈ బ్రోషూరును చదువుకునేందుకు దాన్ని అతనికి ఇవ్వమని సిఫారసు చేయడం జరుగుతుంది. గతంలో చేసినట్లుగా మరలా పఠించవల్సిన అవసరంలేదు.
9 మన పేరు వెనుకనున్న సంస్థకు విద్యార్థులను మరల్చేందుకు సంస్థ తయారుచేసిన వీడియోల్లో కొన్ని చక్కని పరికరాలుగా పనిచేస్తాయి. వారు ఈ క్రిందివాటిని చూడగల్గితే బాగుంటుంది: (1) కార్యాచరణలో ఉన్న నూతనలోక సంస్థ (ఆంగ్లం). ఇది యెహోవా సంస్థ ఎంత సాఫీగానూ సమర్థవంతంగానూ ప్రేమపూర్వక స్ఫూర్తితోనూ పనిచేస్తుందో చూపించే 1954 ఫిలిమ్ యొక్క వీడియో; (2) భూదిగంతముల వరకు (ఆంగ్లం). ఇది వాచ్‌టవర్ బైబిల్ స్కూల్ ఆఫ్ గిలియడ్ 50వ వార్షికోత్సవాన్ని గుర్తు చేస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ప్రకటనా పనిపై మిషనరీలు చూపించిన ప్రభావాన్ని అది చూపిస్తుంది; (3) యెహోవాసాక్షులు నాజీల దాడి సమయంలో స్థిరంగా నిలబడ్డారు (ఆంగ్లం). హిట్లరు మూలంగా క్రూరమైన హింసను అనుభవించినప్పుడు సాక్షులు కనపర్చిన ధైర్యాన్ని వారు సాధించిన విజయాన్ని గూర్చిన స్పందింపజేసే కథను ఇది చెబుతుంది; (4) దైవిక బోధచే ఐక్యమవ్వడం (ఆంగ్లం). ఉత్తర యూరప్, దక్షిణమెరికా, ఆఫ్రికా, ఆసియాల్లో జరిగిన అంతర్జాతీయ సమావేశాల్లో కనపర్చిన శాంతియుతమైన ఐక్యతను ఇది పరిశీలిస్తుంది. మరి ఇక (5) యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం). ఈ చివరి రెండూ ఇండియాలో లభ్యమౌతున్నాయి, వీటిని సంఘం ద్వారా తెప్పించుకోవచ్చు. కానీ అనేకమంది సహోదరులు ఇతర మూడింటిని కూడా విదేశాల నుండి స్వంతంగా తెప్పించుకున్నారు, బైబిలు విద్యార్థులను సంస్థవైపుకు నడిపించేందుకు వీటిని బాగా ఉపయోగించవచ్చు.
10 కూటాలకు సంబంధించి ప్రగతిశీల లక్ష్యాలను ఏర్పర్చుకోండి: బైబిలు పఠనం ద్వారా అందించే ప్రైవేటు క్లాసులూ దానికి తోడు సంఘకూటాల్లో అందించే పాఠశాల చర్చలూ అవసరమని విద్యార్థులకు వివరించాలి. (యోహా. 6:45) ఒక కొత్త వ్యక్తి లేఖనాల అవగాహనలోనూ సంస్థను గురించిన అవగాహనలోనూ సమానంగా ప్రగతిని సాధించాల్సిన అవసరం ఉంది. దాన్ని సాధించేందుకుగాను కూటాలకు హాజరవ్వడం తప్ప వేరే మార్గం లేదు. (హెబ్రీ. 10:23-25) వెంటనే ఆ వ్యక్తిని కూటాలకు రమ్మని ఆహ్వానించండి. కొంతమంది ఆసక్తిగల కొత్తవారు గృహ బైబిలు పఠనాన్ని క్రమంగా ప్రారంభించకముందే కూటాలకు హాజర్వడం ప్రారంభించారు. మనం క్రమంగా కూటాలకు హాజరౌతూ, మనమే స్వయంగా ఓ మంచి మాదిరి కనపర్చాలనుకుంటాము.—లూకా 6:40; ఫిలి. 3:17.
11 మొదటిసారి కూటాలకు హాజరయ్యేటప్పుడు విద్యార్థి ఇబ్బందిగా భావించకుండా ఉండేందుకు, కూటాలను గూర్చి అవి ఎలా నిర్వహించబడతాయన్న దాని గూర్చి కావల్సినంత సమాచారాన్ని ఆ విద్యార్థికి ఇవ్వండి. కొందరు వ్యక్తులు మొదటిసారి కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా ఇబ్బందిగా భావిస్తుంటారు కనుక, ఓ విద్యార్థి కూటాలకు మొట్టమొదటిసారిగా హాజరయ్యేటప్పుడు రాజ్యమందిరానికి అతనితో కలిసి వెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుంది. అతను సంఘంలోని వ్యక్తులను కలిసేటప్పుడు మీరు అతనితో ఉంటే అతను ఇబ్బందిగా భావించడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా, మీ అతిథికి మీరు మంచి ఆతిథేయునిగా ఉండండి, అతను ఆహ్వానితుడని భావించేలా, ఇబ్బందిగా భావించకుండా ఉండేలా చూడండి.—మత్త. 7:12; ఫిలి. 2:1-4.
12 ప్రత్యేక సమావేశ దినానికి, ప్రాంతీయ సమావేశానికీ లేక జిల్లా సమావేశానికీ హాజరుకమ్మని విద్యార్థిని మొదటి అవకాశంలోనే ఆహ్వానించండి. రవాణా కొరకు మీరు చేసుకున్న ఏర్పాట్లలో బహుశా అతన్ని కూడా మీరు చేర్చవచ్చు.
13 హృదయపూర్వక మెప్పుదలను నాటండి: మన పరిచర్యను నెరవేర్చుటకు సంస్థీకరింపబడియున్నాము అనే పుస్తకంలో 92వ పేజీ ఇలా వివరిస్తుంది: “ఆసక్తిగలవారితో నీ సంభాషణలో యెహోవా యెడల నీకున్న ప్రగాఢ అభినందనను ప్రతిబింబిస్తే వారును ప్రశంస దిశలో పెరుగుటకు వీలౌతుంది మరియు యెహోవాను గూర్చి తెలుసుకొనుటలో మంచి అభివృద్ధి సాధించుటకది వారిని పురికొల్పుతుంది.” మీ స్థానిక సంఘాన్ని గూర్చి ఎల్లప్పుడూ మంచిగా మాట్లాడండి కాని ప్రతికూలంగా మాట్లాడకండి. (కీర్త. 84:10; 133:1, 3బి) బైబిలు పఠనాల్లో మీరు చేసే ప్రార్థనల్లో, సంఘాన్ని గూర్చీ మరి విద్యార్థులు దానికి క్రమంగా హాజరు కావాల్సిన అవసరతను గూర్చీ ప్రస్తావించండి.—ఎఫె. 1:15-17.
14 కొత్తవారు దేవుని ప్రజల మధ్య కనిపించే ఆనందదాయకమైన సహవాసం ఎడల ఆత్మీయ భద్రత ఎడల హృదయపూర్వక మెప్పును పెంచుకోవాలని మనం తప్పక కోరుకుంటాము. (1 తిమో. 3:15; 1 పేతు. 2:17; 5:9) యెహోవాసాక్షులముగా మనం, దేవుని వాక్యపు విద్యార్థులను మన పేరు వెనుకనున్న సంస్థవైపుకు నడిపించేందుకు మనకు వీలయ్యేదంతా చేద్దాము.
[3వ పేజీలోని బ్లర్బ్]
విద్యార్థులు తమంతట తామే సంస్థను చూసినప్పుడు త్వరగా ఆత్మీయ ప్రగతిని సాధిస్తారు
[4వ పేజీలోని బ్లర్బ్]
కూటాలకు హాజరుకమ్మని విద్యార్థులను ఆహ్వానించడంలో ఆలస్యం చేయకండి