దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడో ఇతరులకు బోధించండి
1 ‘యెహోవా మాటను వినేందుకు’ ఆత్మీయ భావంలో అవకాశంలేని అనేకమంది ప్రజలను ఇంకా కనుగొనవచ్చు. (ఆమో. 8:11) దేవుడు ఉన్నాడని కొందరు నమ్మినప్పటికీ ఆయన సంకల్పాన్ని గూర్చీ ఆయన కోరే విషయాలను గూర్చీ వారికి తెలియదు. కనుక, ప్రాణరక్షకమైన రాజ్య సువార్తను వారికి బోధించాల్సిన అవసరం మనకుంది. ప్రతి అవకాశంలోనూ సాక్ష్యమిచ్చేందుకు చక్కగా ఆయత్తంగానూ సిద్ధంగాను ఉండడం ద్వారా, యెహోవా ఏమి కోరుతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారిని మనం కనుగొనవచ్చు.
2 ఏప్రిల్, మే నెలల్లో పంపకం చేసేందుకూ పత్రిక చందాలను ప్రతిపాదించేటప్పుడు ఉపయోగించేందుకు సమయానుకూలమైన కావలికోట, తేజరిల్లు! సంచికలు మనకు ఉంటాయి. దానికి తోడు మొట్టమొదటిసారిగా, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును మనం అందిస్తాము. ఆకర్షణీయమైన చిత్రాలూ ఆలోచింపజేసే ప్రశ్నలూ ఈ బ్రోషూరును ఎందరో ఇష్టపడేలా చేస్తాయి. ఈ కింద ఇచ్చిన సలహాలు మన చక్కని ప్రచురణలను ప్రభావవంతంగా ఉపయోగించడంలో సహాయం చేసేందుకు ఇవ్వబడ్డాయి.
3 ప్రజలను వెదకడం: ఇంటింటికి వెళ్లినప్పుడు ఎక్కువమంది ఇళ్లలో లేని ప్రాంతాల్లో, ప్రజలు ఎక్కడ కనిపిస్తారో అక్కడ వారిని కనుగొని, వారితో మాట్లాడడం ప్రయోజనకరంగా ఉంటుందని తేలింది. మనం అన్ని ప్రాంతాల్లోనూ అంటే వీధుల్లో, ప్రజా రవాణాల్లో, పార్కుల్లో, పార్కింగ్ చేసే ప్రాంతాల్లో, వ్యాపార స్థలాల్లో సువార్తను ప్రకటించమని నవంబరు 1996 మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్ ప్రోత్సహించింది. అనియతంగా ప్రకటించే అవకాశాలను సృష్టించే అవసరతను మనకు చూపింది. దీనికి ఉదాహరణగా, ఓ పయినీరు సహోదరి జూ పార్కుకు వెళుతూ “అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న జంతువులు—ఎందుకు శ్రద్ధకలిగివుండాలి?” అనే శీర్షికా పరంపరవున్న ఆగస్టు 8, 1996 తేజరిల్లు! (ఆంగ్ల) పత్రికలను తీసుకువెళ్లింది. ఒక్క గంటలోనే, ఎంతో మెప్పుగల వన్య మృగ ప్రియులకు 40 పత్రికలను అందించింది! ప్రతిచోటా సువార్తను ప్రకటించడంలో మీరు ఇంతవరకూ ఎలాంటి విజయాన్ని చవిచూశారు? కావలికోట, తేజరిల్లు! అలాగే దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరు అన్ని విధాలైన సాక్ష్యాలకూ సరిపోతాయి, ఎందుకంటే ప్రజల జీవితాలను తాకేటువంటి మరియు ఆలోచనా సామర్థ్యాన్ని పెంచేటువంటి సమాచారం వాటిలో ఉంది.
4 భాషణలను ప్రారంభించడం: అక్టోబరు 1996 మన రాజ్య పరిచర్యలోని వెనుక పేజీ, మీరు కావలికోట, తేజరిల్లు! పత్రికలను అందించేందుకు ఎలా సిద్ధపడాలి అనేదాని గురించిన వివరాలను ఇస్తుంది. దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరును అందించడానికి మీరు సిద్ధపడుతున్నప్పుడు ఆ సలహాలే చక్కగా పనిచేస్తాయి. మనం చెప్పేది కొన్ని వాక్యాల్లో చెప్పేంత సంక్షిప్తంగానైనా ఉండవచ్చు లేక ఒక లేఖనాధార తలంపును చేర్చగలిగినంత పెద్దగానైనా ఉండవచ్చు. ప్రారంభ వాక్యాలను జాగ్రత్తగా ఎన్నుకోవడం ప్రాముఖ్యం, ఎందుకంటే మీరు ఏ వ్యక్తితో మాట్లాడబోతున్నారో ఆ వ్యక్తి వింటాడా లేదా అన్నది వాటిమీద ఆధారపడవచ్చు. “నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉండిన ఒక శీర్షికను నేను చదివాను, దాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను” అనే ప్రారంభవాక్యాన్ని ఉపయోగించి కొందరు సఫలులయ్యారు. లేదా ఎదుటివ్యక్తిని సంభాషణలోకి దించేందుకు ఓ ఆసక్తికరమైన ప్రశ్నను అడగవచ్చు.
5 మీ ప్రాంతంలో యుక్తంగావున్నట్లైతే, ఈ నెలలో ఈ క్రింది ప్రశ్నలను మీరు అడగడానికి ప్రయత్నించవచ్చు:
◼ “ఈ రోజుల్లో మనం గోడపై రాతలనూ చెత్తనూ కాలుష్యాన్నీ గొప్ప పరిమాణంలో చూస్తున్నాము. ఈ భూమిని శుభ్రంచేసి, నివాసయోగ్యమైన చక్కని ప్రాంతంగా తయారుచేయాలంటే ఏమి అవసరం?” వారిని ప్రతిస్పందించనిచ్చి, భూమి ఎప్పుడు ఎలా భూవ్యాప్త ఉద్యానవనంగా తయారౌతుందనే దాని గురించి మనకు హామీ ఇచ్చే సమాచారం మీ దగ్గర ఉందని వివరించండి. ప్రత్యేకంగా ఎన్నుకున్న ఓ వ్యాఖ్యానాన్నీ క్లుప్త లేఖనాన్నీ ఆకర్షణీయమైన చిత్రాన్నీ తాజా పత్రికనుండి చూపించి, ఈ పత్రికను క్రమంగా ఎలా తెప్పించుకోవచ్చో వివరించండి. ఈ పత్రిక చందా ప్రతిపాదనను నిరాకరించినట్లైతే, ఈ పత్రికలో కొన్ని విడి పత్రులను తప్పక అందించండి. ఈ సంభాషణను ముగించే ముందు, మరో సారి దీన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోండి.
◼ “మనం ఈ రోజుల్లో ఎదుర్కొంటున్న సమస్యలతోనే జీవించాలన్నది దేవుని ఉద్దేశమని మీరనుకుంటున్నారా?” ఆ వ్యక్తి జవాబు చెప్పిన తర్వాత మీరు ఇలా చెప్పవచ్చు: “దేవుని రాజ్యం రావాలి అని కోరుతూ ప్రార్థించాలని యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థనను గూర్చి మీరు వినేవుంటారు. దేవుని ఆ రాజ్యం ఏమిటో తెలుసుకోవాలని మీకు ఆసక్తి ఉందా?” దేవుడు కోరుతున్నాడు అనే బ్రొషూరులోని 6వ పాఠానికి తెరిచి, ఆ పాఠం ప్రారంభంలో వేసిన ప్రశ్నలను అడగండి. ఆ తర్వాత, మీరు 1వ పేరాను చదువుతుండగా, మొదటి ప్రశ్నకు జవాబును సూచించండి. మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇలాగే క్లుప్తంగా ఇవ్వబడ్డాయని వివరించండి. బ్రోషూరును అందించి, రాజ్యాన్ని గూర్చిన మరెక్కువ సమాచారాన్ని తెలిపేందుకు మరలా కలుస్తానని చెప్పండి.
◼ “అనేకమంది ఆలోచనాపరులైన ప్రజలు, ప్రపంచంలోని మతాలు మానవుని సమస్యలకు పరిష్కారం కాకపోగా అవే కారణం అని భావించనారంభిస్తున్నారు. దాన్ని గూర్చి మీ అభిప్రాయమేంటంటారండీ?” ఆ వ్యక్తి అభిప్రాయాన్ని విన్న తర్వాత, ఇటీవలి పత్రికలనుండి అబద్ధ మతం విఫలమవ్వడాన్ని గానీ లేక సమీపిస్తున్న దాని పతనాన్ని గూర్చీ గానీ ఆతని ఆసక్తిని ఆకట్టుకునే ఓ విషయాన్ని అతనికి చూపించండి. పత్రిక చందాను ప్రతిపాదించండి. మీ పేరు అతనికి చెప్పి అతని పేరు మీరు తెలుసుకుని, నిజమైన మతం మానవజాతిని నిరుత్సాహపర్చలేదని వివరించేందుకు మరలా కలుస్తానని చెప్పండి.
◼ “నేడు కుటుంబజీవితంలో ఇన్ని సమస్యలుండగా, కుటుంబం సంతోషాన్ని పొందడానికిగల కీలకం ఏమిటని మీరు ఆలోచించారా?” ప్రతిస్పందించేంతవరకూ ఆగి ఆ తర్వాత, దేవుడు బైబిలు ద్వారా కుటుంబ సంతోషానికిగల నిజమైన కీలకాన్ని బయల్పర్చాడని వివరించండి. బహుశ మీరు యెషయా 48:17 చదవవచ్చు. తర్వాత దేవుడు కోరుతున్నాడు అనే బ్రోషూరులోని 8వ పాఠానికి తిప్పి, కుటుంబంలోని ప్రతి సభ్యునికీ నమ్మదగిన నడిపింపునిచ్చే బైబిల్లోని కొన్ని వచనాలను మీరు చూపించండి. ఈ పాఠం ప్రారంభంలో ఉన్న ప్రశ్నలను చదవండి. వాటి జవాబులను ఆ వ్యక్తి చదవాలనుకుంటున్నాడేమో కనుక్కోండి. అతనికి బ్రోషూరు ప్రతిపాదించి, ఆనందమయమైన కుటుంబ జీవితానికి బైబిలులో ఉన్న ఆచరణాత్మకమైన నడిపింపును గూర్చి ఇంకా చెప్పేందుకు మరలా వస్తానని చెప్పండి.
6 పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి అని 1997 మార్చి, మన రాజ్య పరిచర్యలోని ఇన్సర్ట్ మనల్ని ప్రోత్సహించింది. బైబిలు పఠనాలను నిర్వహించేందుకు దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును ఉపయోగించమని సిఫారసు చేసింది, మొదటిసారి కలిసినప్పుడు కాకపోతే ఆ పైసారి కలిసినప్పుడు ఉపయోగించవచ్చు. మానవజాతికి అవసరమైన అతి ముఖ్యమైన విషయమేమిటంటే దేవుడు ఏమి కోరుతున్నాడు అన్నది తెలుసుకోవడం, ఆ తర్వాత దాన్ని ఆచరించడం. (కొలొ. 1:9-12) మనం జీవాన్ని పొందాలంటే దాని కొరకు యెహోవా మన నుండి ఏమి కోరుతున్నాడనేదాని గురించి మనకు తెలిసినవాటిని ఇతరులకు బోధించడం ప్రారంభించగలిగితే, ఏప్రిల్, మే నెలల్లో మనం వారికి ఎంతగానో ప్రయోజనాన్ని చేకూరుస్తాము.—1 కొరిం. 9:23.