మన దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టము
1 “మీ దేవుడైన యెహోవాకు భయపడి యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకొనునట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరిని పోగుచేయవలెను.” (ద్వితీ. 31:12) హెబ్రీయులు 10:24, 25 నందు క్రమంగా కూడుకోమని పౌలు క్రైస్తవులను ఉద్బోధించాడు కనుక, ప్రాచీన ఇశ్రాయేలీయుల జనాంగానికి ఇచ్చిన ఈ ఉద్బోధ నేడున్న క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. అందువల్ల మన ఆరాధనలో కూటాలన్నవి ప్రముఖ స్థానాన్ని వహిస్తాయి. అలా కూడుకోవడంలో ఉన్న సంకల్పమేమంటే, యెహోవానుండి విని నేర్చుకుని బోధించబడడమేనని స్పష్టమౌతోంది. (యెష. 54:13) ప్రాచీన ఇశ్రాయేలీయుల కాలంలోలా అలాంటి కూటాలు ఆనందమయమైన సందర్భాలు గలవి అంతేకాకుండా “యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని” అని రాసిన దావీదులో ఎలాంటి ప్రతిస్పందన కల్గిందో అలాంటి ప్రతిస్పందనను మనలో అది కలిగిస్తుంది. (కీర్త. 122:1) యెహోవా మందిరము విషయంలో నెహెమ్యాకు ఉన్న ఆసక్తి, “మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము” అని ఆయన అనేలా చేసింది.—నెహె. 10:39.
2 ఎంతో అందమైన నిర్మాణాకృతిగల కొన్ని క్రైస్తవమత సామ్రాజ్య చర్చీల్లా కాకుండా, యెహోవాసాక్షులు కలుసుకునే రాజ్యమందిరాలు అనబడేవి సామాన్యమైనవైనా అక్కడ జీవకళా ఉట్టిపడుతూ ఆప్యాయత కనిపించే స్థలాలుగా ఉంటాయి. 1935లో ఈ సంస్థ యొక్క నాటి అధ్యక్షుడైన జె.ఎఫ్. రూథర్‌ఫోర్డ్ హవాయి వెళ్లి అక్కడ కూటాలు జరుపుకునేందుకు ఓ భవనాన్ని నిర్మించడానికి కావలసిన ఏర్పాట్లను చేసినప్పుడు ఈ పేరును మొట్టమొదటిసారిగా ఉపయోగించినట్లుగా కనబడుతోంది. ఆ నాటినుండి ఈ రోజువరకూ ఆ పేరు భూవ్యాప్తంగా అలాగే నిలిచింది. 1961 వెబ్‌స్టర్స్ అన్బ్రిడ్జ్ డిక్షనరీ రాజ్యమందిరం అనే పదాన్ని “స్థానిక యెహోవాసాక్షులు కూడుకుని మతసేవలు నిర్వహించే స్థలం” అని నిర్వచించింది. ఆరాధనా స్థలమైన రాజ్యమందిరం డాంబికంగా ఎదుటివారిని ఆకట్టునేలా ఉండకూడదు. దాని నిర్మాణశైలి వివిధ ప్రాంతాల్లో వివిధరకాలుగా ఉండవచ్చు కానీ ఉపయోగపడాలన్నదే దాని సంకల్పం.—అపొ. 17:24.
ప్రతి సంఘం స్వంత రాజ్యమందిరం కల్గివుండాలా?
3 స్థానిక సంఘానికి స్వంత రాజ్యమందిరం కావాలా వద్దా అన్న విషయాన్ని సంస్థ నిర్ణయించదు. ఈ విషయాన్ని స్థానిక సంఘమే నిర్ణయించాలి. కొందరు తమ స్వంత రాజ్యమందిరాలను నిర్మించుకున్నారు; ఇతరులు తమ కూటాలను జరుపుకునేందుకు హాళ్లను అద్దెకు తీసుకున్నారు. ఏది ఏమైప్పటికీ, కూటాలు జరిగే స్థలం చక్కగానూ శుభ్రంగానూ యెహోవా ఆరాధన యొక్క ఉన్నత ప్రమాణాలను ప్రతిబింబించేదిగానూ ఉండాలి. దానిని ఉపయోగించేటప్పుడు దానిలో స్నేహపూరితమైన వాతావరణం కనిపించాలి. యెహోవాసాక్షుల రాజ్యమందిరాల్లో జరిగిన కూటాలకు ఓ యూనియన్ మెథడిస్టు పరిచారకుడు హాజరై, “ఈ ప్రజల నుండి యథార్థమైన అనురాగాన్ని మేము అపేక్షించలేదు. అయితే, వారినుండి ఏ విధమైన ఒత్తిడి రాలేదు కానీ అతి తక్కువ సమయంలోనే, విశ్రాంతి సంవత్సరం సంబంధంగా మేము దర్శించిన 20 సంఘాలతో పోల్చిచూస్తే వీరి నుండి మాకు ఎంతో యథార్థమైన స్వాగతం లభించిందని గ్రహించాము. ఆప్యాయతతో కూడిన చిరునవ్వులు చిందిస్తూ దేవుని వాక్యాన్ని గ్రహించేందుకు ఎంతో శ్రద్ధగా ప్రయత్నించినట్లుగానే ఒకరి ఎడల ఒకరు అలాగే వచ్చిన అపరిచితుని ఎడల కూడా వారు శ్రద్ధకల్గివున్నారు.”
4 ఎన్నో సంఘాలకు తమదైన ఓ హాలును ప్రస్తుతం నిర్మించుకునే ఆర్థిక స్తోమత లేదన్న విషయాన్ని అంగీకరించాల్సిందే. అంతేకాకుండా, కొన్ని ప్రాంతాల్లో హాలును కొనడం లేక నిర్మించుకోవడం కన్నా అద్దెకు తీసుకోవడమే అనుకూలం. అయితే, ఎక్కువ సంఘాలు స్థలాన్ని కొని తమ అవసరాలకు తగినట్లుగా రాజ్యమందిరాన్ని నిర్మించుకోవడాన్ని ఎక్కువగా ఇష్టపడ్డారు. లేక ఓ భవనాన్ని కొని దానికే మరమ్మతులు చేసి ఉపయోగించుకున్నారు. ప్రతి సంఘానికి కూటాలు జరుపుకునేందుకు స్వంత రాజ్యమందిరాన్ని కల్గివుంటే కచ్చితమైన ప్రయోజనాలుంటాయి. ఉదాహరణకు, కేరళలోని ఓ ప్రాంతీయ పైవిచారణకర్త ఇలా నివేదించాడు: రెండు సంఘాలు తమ స్వంత రాజ్యమందిరాలను నిర్మించుకున్నాయి మరి మొదటి సంవత్సరంలోనే ఆ సంఘాలు వేర్వేరు సమయాల్లో రెండుగా కూటాలు జరుపుకునేంతగా వాటి హాజరు పెరిగింది. రాజ్యమందిర నిర్మాణానికి ఆర్థికంగా సహాయపడడం మాత్రమే కాకుండా దాని నిర్మాణానికి, తర్వాత దాన్ని శుభ్రంగానూ చక్కగానూ మంచి కండీషన్‌లోనూ ఉంచడానికి అంటే దాని నిర్వహణకు కూడా తమ సేవను స్వచ్ఛందంగా అందించడాన్ని ఓ ఆధిక్యతగా సాక్షులు పరిగణించాలి. లోపలా వెలుపలా రాజ్యమందిరాలు యెహోవాకూ ఆయన సంస్థకూ ప్రాతినిధ్యం వహించేవిగా ఉండాలి.
5 ఒక సంఘం, తాము స్వంత రాజ్యమందిరాన్ని కల్గివుండగల స్థానంలో ఉందని భావించినట్లైతే అప్పుడేమి చేయాలి? ఈ విషయాన్ని స్థానిక సహోదరులు నిర్ణయించాలి. స్థలాన్ని కొనేటప్పుడు, ప్లాన్ వేసేటప్పుడు హాలును నిర్మించేటప్పుడు క్రమంగా అనుసరించవల్సిన అనేక పద్ధతులను సంస్థ ఇచ్చింది. మొదట, సంఘంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతారు ఈ పనిని చేసేందుకు ఆమోదాన్ని పొందాలి, ఆ తర్వాత సంస్థ యొక్క రాజ్యమందిర విభాగం నుండి నిర్దేశాలను తెలుసుకోవాలి. సంఘం స్థలాన్ని లేక భవనాన్ని కొనే ముందు అనేక ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాలి. ఆ ప్రాంత నియమాలు, నిర్మాణాలకు సంబంధించిన చట్టాలు, మతపరమైన ఉద్దేశంకొరకు నిర్మించేందుకు అనుమతి పొందడం వంటివి తెలుసుకోవల్సిన ప్రాథమికమైన వాటిలో కొన్ని.
ప్రాంతీయ నిర్మాణ కమిటీ పాత్ర
6 స్థానిక నిర్మాణ కమిటీని (స్థానిక) సంస్థ ఏర్పాటు చేసింది. దీనిలో రాజ్యమందిరాల నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో నడిపింపునూ సహాయాన్ని ఇవ్వగల ఆత్మీయ పరిపక్వతగల పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఐదుగురు సభ్యులున్న ఈ కమిటీ, సంఘంలోని ఆర్థిక పరిస్థితిని అవసరమైన పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ మీ ప్రాంతానికి అనుగుణమైన రాజ్యమందిరాలను కొనడం లేక నిర్మించడం విషయంలో నిర్దేశాలనిస్తుంది. ప్రాంతీయ నిర్మాణ కమిటీ, స్థానిక రాజ్యమందిర నిర్మాణ కమిటీ స్థానాన్ని తీసుకోదుకానీ నిర్మాణ కార్యక్రమానికి సహాయపడుతుంది. స్థానిక నిర్మాణ కమిటీ స్థలాన్ని కొనకముందే సలహాలకొరకు స్థానికను సంప్రదించడం మంచిది. ధర మరియు నిర్మాణ విషయాల్లోని వివిధ రంగాల్లో నిపుణతగల సమర్థులైన పురుషులు ఈ స్థానికలో ఉన్నారు కనుక అలాంటి కార్యాల్లో వారి సహాయం విలువైందిగా ఉంటుంది.
7 ముందుగా మంచి పథకం వేసుకోవడం అవసరమయ్యే ప్రాముఖ్యమైనవాటిలో రాజ్యమందిరం ఎంత పెద్దగా ఉండాలి, అంటే దాని ప్లానూ ఎంతమంది కూర్చోగల్గుతారు అనే విషయం ఒకటి. సామాన్యమైనప్పటికీ ఆచరణాత్మకమైన పథకం శ్రేష్ఠమైనది. స్థానిక వద్ద అలాంటి నిర్మాణ ప్లానులు ఎన్నో ఉన్నాయి కానీ, 100, 150 మరియు 250 మంది కూర్చోగల హాళ్లకు మూడు రకాల ప్లానులను అందిస్తుంది. హాలు విస్తీర్ణం ఓ ఫార్ములా మీద ఆధారపడివుంటుంది. ఉదాహరణకు, హాలులో కూర్చునేవారి సంఖ్యను 1.8 చదరపు మీటర్లతో గుణిస్తే వచ్చే సంఖ్యే దాని విస్తీర్ణం. ఉదాహరణకు, 100 మంది కూర్చోగల హాలు కావాలనుకుంటే 180 చదరపు మీటర్లు కావాలి. దీనిలో మరుగుదొడ్డులు, పత్రికలూ సాహిత్యాల కౌంటర్లు, రెండవ పాఠశాల వంటి ఇతర అవసరాలకు కావల్సిన స్థలం ఉంటుంది. అలాంటి లెక్కలూ పథకాలూ రాజ్యమందిరాలను సౌకర్యవంతంగా ఉంచి ఇరుకు లేకుండా చేస్తుంది. దానికి తగిన వేదిక, సౌండ్ సిస్టమ్ ఎక్కడ ఉండాలి, లైట్లూ ఫ్యాన్లూ వంటి ఇతర ఎలక్ట్రికల్ పరికరాలు ఏ పొజిషన్లో ఉండాలి అనే వివరాలను గూర్చీ జనరేటర్ గది, ప్లంబింగ్, డ్రైనేజీ సిస్టమ్ మొదలగు వాటిని గూర్చీ ఈ స్థానిక నిర్మాణ కమిటీ సలహాలనిచ్చే సామర్థ్యాన్ని కల్గివుంది.
8 కొన్ని ప్రాంతాల్లో ఒకే రాజ్యమందిరాన్ని రెండు మూడు సంఘాలు కలిసి ఉపయోగించుకునే సందర్భాలున్నాయి. అలా చేయడం, వారు ఉన్న వసతులను పూర్తిగా వినియోగించుకునే విధంగానూ, ఆర్థిక భారాన్ని ఎక్కువమంది వ్యక్తులు భరించేట్లుగానూ చేస్తుంది. ఖర్చులను తగ్గించుకుంటారు. రెండు మూడు సంఘాలమధ్య అలాంటి సహకారం నిర్మాణ కార్యక్రమంలో చెప్పుకోదగినంత డబ్బు సరఫరాను పెంచుతుంది. అయితే, డబ్బు అడ్వాన్సూ, మరితర ఏర్పాట్ల విషయం వచ్చేసరికి సంస్థ కేవలం ఒక సంఘంతోనే వ్యవహరిస్తుంది. సంఘాలు ఏయే సమయాల్లో కూటాలను జరుపుకుంటాయి వంటి వివరాలను ఆ హాలును పంచుకునే సంఘాల్లోని పెద్దల సభలు నిర్ణయిస్తాయి.
రాజ్యమందిరానికి ఆర్థిక సహాయాన్ని అందించడం
9 రాజ్యమందిరం కొరకు స్థలాన్ని కొనేందుకు సంస్థ డబ్బును ఇవ్వదన్న విషయాన్ని గమనించాలి. అయితే మంచి పురోభివృద్ధి ఉన్న పట్టణాల్లో రెండు లేక అంతకన్నా ఎక్కువ సంఘాలు ఒక హాలును ఉపయోగించుకోగల్గిన సందర్భాల్లో స్థలాన్ని కొనేందుకు సంస్థ ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. “ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలెనని ఇది చెప్పుటలేదు గాని హెచ్చుగా కూర్చుకొనినవానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకొనినవానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరియొకప్పుడు వారి సమృద్ధి మీ యక్కరకును సహాయమై యుండవలెనని ఈలాగు చెప్పుచున్నాను” అని 2 కొరింథీయులు 8:13-15 నందు పౌలు ప్రోత్సహించినట్లుగా యెహోవా ఆధునిక సేవకులు అలాంటి స్ఫూర్తినే కనబరుస్తారు. కొత్త రాజ్యమందిరాలను నిర్మించేందుకు మన సమయాన్నీ వనరులనూ వినియోగించడం యెహోవాను గౌరవించడంలో ఓ శ్రేష్ఠమైన విధానం.—సామె. 3:9.
10 దాదాపు 3,500 సంవత్సరాలక్రితం, విరివిగా విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి. తన ఆరాధన కొరకు ఒక గుడారాన్ని లేక ‘కూటాల కొరకు గుడారమును’ నిర్మించమని యెహోవా మోషేకు ఆజ్ఞనిచ్చాడు. దైవికంగా ఇచ్చిన ఆ రూపకల్పనకు వివిధరకాల అమూల్యమైన వస్తువులు అవసరమయ్యాయి. యెహోవా ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు మీలోనుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధిపుట్టిన ప్రతివాడు యెహోవా సేవనిమిత్తము . . . తీసికొని రావలెను.” (నిర్గ. 35:4-9) ప్రజలు ఎలా ప్రతిస్పందించారు? “తరువాత ఎవని హృదయము వాని రేపెనో, ఎవని మనస్సు వాని ప్రేరేపించెనో వారందరు వచ్చి, ప్రత్యక్షపు గుడారముయొక్క పని కొరకును దాని సమస్త సేవకొరకును ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి” అని ఆ వృత్తాంతం మనకు తెలియజేస్తుంది. స్వచ్ఛందంగా ఇచ్చిన ఈ అర్పణ క్రమేపీ, యెహోవా ఆజ్ఞాపించిన పనికి “కావలసిన దానికంటె బహు విస్తారము”గా సమకూడింది. (నిర్గ. 35:21-29; 36:3-5) స్వార్థరహితమైన విశాలహృదయాన్ని ఈ ప్రజలు ఎంత చక్కని రీతిలో కనపర్చారోకదా!
11 సుమారు 500 సంవత్సరాల తర్వాత విరివిగా విరాళాలిమ్మంటూ ఇశ్రాయేలీయులను కోరడం జరిగింది. యెహోవా కొరకు శాశ్వతమైన మందిరాన్ని నిర్మించాలన్న రాజైన దావీదు కోరిక తన కుమారుడైన సొలొమోను ద్వారా నెరవేరింది. దానికవసరమైనవాటినన్నిటినీ దావీదు స్వయంగానే సమకూర్చి విరాళంగా ఇచ్చాడు. “యెహోవాకు బహుమతులను (NW)” తీసుకురమ్మని చెప్పినప్పుడు ఇతరులు కూడా ఆయనతో చేరారు. దాని ఫలితం? “వారు పూర్ణమనస్సుతో యెహోవాకు ఇచ్చియుండిరి గనుక వారు ఆలాగు మనఃపూర్వకముగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి రాజైన దావీదు కూడను బహుగా సంతోషపడెను.” (1 దిన. 22:14; 29:3-10) ఈ నాటి విలువనుబట్టి చూస్తే ఈ లెక్కల ప్రకారం కేవలం వెండి బంగారాలే సుమారు 20 లక్షల కోట్ల డాలర్ల విలువ ఉంటుంది!—2 దిన. 5:1.
12 ఆధునిక కాలాల్లో సహితం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లోని సహోదరులు అలాంటి స్ఫూర్తినే కనపరుస్తున్నారు. మన సహోదరులు ‘మనఃపూర్వకముగా’ ఇచ్చారని చూపించే ఉత్సాహభరితమైన అనుభవాలతో మన సర్వోన్నత ప్రభువైన యెహోవాను ఆరాధించేందుకు ఓ కట్టడాన్ని నిర్మించాలనే కోరికను కల్గివున్నారని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరం. ఉదాహరణకు, పోలండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సహోదరులు రాజ్యమందిరాన్ని సరైన సమయానికి నిర్మించేందుకుగా డబ్బును సంపాదించేందుకుగానూ పొలాలను కౌలుకు తీసుకుని సేద్యం చేసేవారు, పండించినవాటిని అమ్మేవారు లేక బెర్రీ పండ్లను ఏరేవారు. అలాంటి ప్రాజెక్టుల కొరకు కొందరు డబ్బునిచ్చారు, ఇతరులు తమ నగలను ఆస్తులనూ ఇచ్చారు. అనేక మంది పిల్లలు తమవద్ద ఉన్న కొంచెం డబ్బునివ్వడం ద్వారా నిర్మాణ ప్రాజెక్టులపై వారికిగల మెప్పును కనపర్చారు. లోకుల దృష్టిలో అవి చాలా తక్కువైనప్పటికీ యెహోవా దృష్టిలో ఎంతో విలువగలవి.
13 ఆర్థిక సహాయాన్నివ్వడం లేఖనాధారమైనదే. “చందా” అని అనువదించబడిన హెబ్రీపద భావం “పరిశుద్ధమైన భాగము.” (నిర్గ. 25:2, NW, రెఫరెన్స్ బైబిలు, అథఃస్సూచి.) రాజ్యాసక్తుల పురోభివృద్ధికొరకు క్రైస్తవులు తమ సమయాన్ని, శక్తినీ వస్తుసంపదను అందించాలని కోరుకోవడం సరైనదే. సంఘం రాజ్యమందిరాన్ని నిర్మించాలని పథకం వేసినప్పుడు, ఆ ప్రాజెక్టుకు వెంటనే విరాళాన్ని ఇవ్వడమో లేక తమకు ప్రస్తుతం అవసరంలేని డబ్బును అప్పుగా ఇవ్వడమో వీలౌతుందని కొందరు వ్యక్తిగతంగా కనుగొన్నారు. దానికి తోడు, అందరూ తాము ప్రతి నెలా క్రమంగా ఎంత ఇవ్వగలరో నిర్ణయించుకోవచ్చు. ఇది ఏ దశమ భాగమో లేక తప్పనిసరో కాదు, ఇది పూర్తిగా స్వచ్ఛందంగానే ఇవ్వవల్సింది కనుక పెద్దలు ప్లానులు వేసుకోవడానికి సహాయపడే విధంగా సంఘంలోని సభ్యులనుండి దీనిని గూర్చిన సమాచారాన్ని పొందవచ్చు. ఇలా అంచనా వేసేందుకు, తమ సంతకం చేయకుండా కాగితంపై తామివ్వాలనుకున్న మొత్తాన్ని రాసిచ్చినట్లైతే సరిపోతుంది.
14 రాజ్యమందిర నిర్మాణానికి నిధిని సమకూర్చేందుకు ఓ ఆచరణ యోగ్యమైన విధానమేమంటే ‘నిర్మాణ నిధి’ అని రాసివున్న ఓ చందా పెట్టెను రాజ్యమందిరంలో పెట్టి, అందునిమిత్తం చందాలను వేయమని సహోదరులను ప్రోత్సహించడమే. 1995 ఆగస్టులో అలాంటి చందా పెట్టెను పెట్టమని సంస్థ అన్ని సంఘాలనూ ప్రోత్సహించింది. రాజ్యమందిరముండి దాని మొత్తాన్ని కట్టేసిన సంఘాలు, లేక ప్రస్తుతం రాజ్యమందిర నిర్మాణాన్ని చేపట్టని సంఘాలు, అలాంటి ప్రాజెక్టును రానున్న భవిష్యత్తులో చేపట్టాలని ఆలోచించదలచిన సంఘాలు ఈ పెట్టెలో వేసిన నిధినంతటినీ ప్రతి నెలా సంస్థకు పంపాలి. ఇలా పంపిన చందాలు ‘జాతీయ రాజ్యమందిర నిధి’ అని నియమించిన దానిలోకి చేరుతుంది. ఈ ఎన్‌కెహెచ్‌ఎఫ్ అంటే ‘రివాల్వింగ్ ఫండ్.’ దానినుండి దేశవ్యాప్తంగా ఉన్న సంఘాలకు వాటి రాజ్యమందిర ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్నిచ్చేందుకు అడ్వాన్సులు ఇవ్వడం జరుగుతుంది. ఇవి తిరిగి చెల్లించే అడ్వాన్సులు. వీటి నిర్వహణా ఖర్చులు మరియు ఇతర హాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు నామమాత్రపు మూడు శాతం అదనపు చార్జీలతో తిరిగి చెల్లించాల్సివుంటుంది. స్థానిక సంఘ ఖర్చులకు తాము ఇచ్చే చందాలేకాక తమతమ స్తోమత మరియు కోరికనుబట్టి ప్రతి ఒక్కరూ క్రమంగా ఈ నిధి కొరకు కొంత మొత్తాన్ని ప్రక్కనుంచమని అందరినీ ప్రోత్సహించవచ్చు. (1 కొరింథీయులు 16:1-4 పోల్చండి.) చరిత్రకారుడైన టెర్టూలియన్ క్రైస్తవ సంఘాన్ని గూర్చి ఇలా రాశాడు: “ప్రతి ఒక్కరూ నెలకొకసారి లేక తనకిష్టమైనప్పుడు కొంత మొత్తాన్ని తీసుకొచ్చేవాడు, అదీ అతను అలా ఇష్టపడి ఇవ్వగల్గితేనే; ఎందుకంటే ఎవరినీ ఒత్తిడి చేసేవారు కాదు. అది స్వచ్ఛంద అర్పణే.” చందాలను ఇవ్వాల్సిందేనని చందా పళ్లాలను ఒకరి తర్వాత ఒకరికి అందించే అనేక మతాల్లా కాకుండా, క్రైస్తవ సంఘంలోని వస్తు సంబంధమైనవి హృదయపూర్వకంగా ఇచ్చిన స్వచ్ఛంద అర్పణలే.—2 కొరిం. 9:7.
15 స్థానిక ఇచ్చిన సలహాలను అమలుపర్చిన తర్వాత, స్థానిక పెద్దల సభ నిర్మాణ పని కొరకైన పథకాలను ఒకసారి అంగీకరించినట్లైతే, ప్రాంతీయ నిర్మాణ కమిటీ సహాయంతో మరోసారి ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చునంతటినీ అంచనావేసి చూసుకోవాలి. అప్పటికల్లా స్థానికంగా ఎంత డబ్బువారి వద్ద ఉందో కూడా సంఘం తెలుసుకుని ఉండాలి. ఈ తరుణంలో, ఒకవేళ సంఘానికి అడ్వాన్స్ అవసరమైతే సంస్థకు రాయవచ్చు. సంస్థ ఆ అభ్యర్థనను పరిశీలించి, నెలసరి వాయిదా పద్ధతిలో పది సంవత్సరాల కాలంలో దాన్ని తిరిగిచ్చేటట్లుగా ఆ అడ్వాన్స్‌ను మంజూరు చేయాలా వద్దా అని పరిశీలిస్తుంది. ఒకే ప్రాజెక్టుకొరకు మరలా మరలా అడ్వాన్సులను అడగకుండా ఉండేందుకు అడ్వాన్స్‌ను సంస్థనుండి అడిగేముందు సహోదరులు కూర్చుని దానికవసరమైన ఖర్చులను కచ్చితంగానూ వాస్తవికంగానూ లెక్కవేసుకోవాలి. (లూకా 14:28) రాజ్యమందిరం కొరకు ఓ ఫ్లాట్‌ని కొనడానికి గానీ లేక ఓ భవనానికి మరమ్మతులు చేయడానికి గానీ వేసే ప్లాన్ ఆచరణయోగ్యమైనదైతే వాటికొరకు రిక్వెస్ట్ చేసిన అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
రాజ్యమందిర సహాయ ఏర్పాటు
16 మీరు ఒక రాజ్యమందిరాన్ని కొనుక్కున్నా లేక అద్దెకు తీసుకున్నా, ఆ భవనాన్ని దానిలో ఉన్న చరాస్తులనూ కాపాడుకోవాలంటే సంస్థవద్ద రాజ్యమందిర సహాయ ఏర్పాటు (రాసఏ) ఉంది. దీనిని గూర్చిన సమాచారం అన్ని సంఘాలకూ పంపించడం జరిగింది. మనం జీవిస్తున్న ఈ క్లిష్టమైన కాలాల్లో దొంగతనాలూ ఇతర దోపిడీలూ ఎక్కువగా జరిగే అవకాశాలున్న దృష్ట్యా ఈ ఏర్పాటు ఎంతో ఉపయుక్తమైనది. ప్రతి సంవత్సరమూ కొద్ది మొత్తం చందాను చెల్లించడం ద్వారా, కోల్పోయిన ఆస్తిని లేక విలువైన వస్తువులను భర్తీ చేసుకోవడానికి సహాయాన్ని పొందే స్థితిలో అంటే సంస్థ వాటికి నిర్ణయించిన నిర్ణీత మొత్తాన్ని పొందే స్థితిలో సంఘం ఉంటుంది. ఆ విధంగా సౌండ్ సిస్టమ్ ఫర్నీచరు వంటి ఖరీదైన వస్తువులను కాపాడుకోవచ్చు. ఇది ఎంతో ప్రేమపూర్వకమైన ఏర్పాటు మరి సంఘాలన్నీ దీనిని ఉపయోగించుకోవాలని ప్రోత్సహించబడుతున్నాయి.
17 ఇవ్వాలనే స్ఫూర్తి యెహోవా దేవునినుండి వస్తుంది. భూమిపైనున్న తన పిల్లలకు శ్రేష్ఠమైన ప్రతి యీవియు సంపూర్ణమైన ప్రతి వరమును ఎంతో ఉదారంగా ఇస్తాడు. (యాకో. 1:17) ఆయన అద్భుతమైన వాటన్నింటిని ఇచ్చాడు గనుక ఆయన మననుండి ఏమి అపేక్షిస్తున్నాడు? కీర్తన గ్రంథకర్త “యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?” అని అదే ప్రశ్నను లేవదీశాడు. (కీర్త. 116:12) ఆయన కృపాతిశయమూ నిత్యజీవ ఉత్తరాపేక్షలన్నింటినిబట్టి మనం యెహోవాకు ఏమి ఇవ్వగలం? దానికి జవాబుగా కీర్తన గ్రంథకర్త స్వయంగా ఇలా చెప్పాడు: “రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను.” (కీర్త. 116:13, 17) అవును, ఆయన నామాన ప్రార్థన చేయడం ద్వారా అలాగే మన ప్రాంతంలో స్వచ్ఛమైన ఆరాధనను ప్రబోధించడం ద్వారా మనం చూపించే అచంచలమైన విధేయతే యెహోవాకు మనం ఇవ్వగల అత్యంత అమూల్యమైన బహుమానం. “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతోకూడ వత్తుమని చెప్పుదురు” అని చెబుతూ ప్రజలు వచ్చే రాజ్యమందిరాలను మనం స్వంతంగా కల్గివుండడమే దీనిని చేసే ఓ శ్రేష్ఠమైన మార్గం.—జెక. 8:23.
[6వ పేజీలోని బాక్సు]
రాజ్యమందిర నిర్మాణానికి మీరు విరాళమిచ్చేందుకు మీ హృదయం మిమ్మల్ని పురికొల్పుతుందా?
రాజ్యమందిరాన్ని నిర్మించేందుకు మీరు మీ మెప్పుదలనూ కోరికనూ కనపర్చడంలో అనేక మార్గాలున్నాయి. అలాంటి ప్రాజెక్టులకు ఆర్థిక సహాయాన్ని అందించేందుకు సంస్థకు జాతీయ రాజ్యమందిర నిర్మాణ నిధి ఒకటి ఉంది. మీరు ఈ క్రింది విధానాల్లో దీనికి సహాయపడగలరు:
1. బహుమతులు: స్వచ్ఛంద విరాళాలను నేరుగా వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటికి పంపించవచ్చు. ఆభరణాలను, ఇతర విలువైన వస్తువులను సహితం విరాళంగా ఇవ్వవచ్చు. ఈ చందాలతో పాటు, జాతీయ రాజ్యమందిర నిధి కొరకు మాత్రమే అని తెలియజేసే ఒక చిన్న లేఖను కూడ పంపాలి.
2. షరతుపై విరాళమిచ్చే ఏర్పాటు: వ్యక్తిగత అవసరం ఏర్పడినప్పుడు దాతకు ఆ డబ్బు తిరిగి ఇచ్చే ఏర్పాటుతో, దాత మరణపర్యంతం వాచ్‌టవర్ సొసైటీ ట్రస్టుకు డబ్బు ఇవ్వవచ్చు. ఈ డబ్బు పైన చెప్పిన నిధికేనని స్పష్టంగా తెలియపర్చాలి.
3. బ్యాంకు ఖాతాలు: స్థానిక బ్యాంకు నియమాలను అనుసరించి బ్యాంకు ఖాతాలను డిపాజిట్ సర్టిఫికెట్లను లేదా వ్యక్తిగత ఉద్యోగవిరమణ ఖాతాలనూ వాచ్‌టవర్ సొసైటీ ట్రస్టు కొరకు లేదా మరణానంతరం వాటిని ఆ సొసైటీకే చెల్లించే ఏర్పాటును చేయవచ్చు. ఈ మొత్తాలను, పైన పేర్కొన్న నిధి కొరకే ఉపయోగించాలని కచ్చితంగా తెలియజేయండి. అలాంటి ఏ ఏర్పాటునైనా సొసైటీకి తెలియజేయాలి.
4. స్టాక్‌లు మరియు షేర్లు: పూర్తిగా ఒక బహుమతిగా లేదా ఆదాయాన్ని ఎప్పుడూ దాతకు చెల్లించే ఏర్పాటుతో స్టాక్‌లను మరియు షేర్లను వాచ్‌టవర్ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. వీటిలో లాభాలేమైనా ఉన్నట్లైతే సంస్థచేతిలో ఉన్న రాజ్యమందిర నిధికే ప్రత్యేకించారని సూచించాలి.
5. ఇళ్లస్థలాలు: పూర్తిగా ఒక బహుమతిగా లేక తాను జీవించినంత కాలం ఆ స్థలంలో నివసించే ఏర్పాటుతో పూర్తిగా అమ్మదగిన ఇళ్లస్థలాలను వాచ్‌టవర్ సొసైటీకి విరాళంగా ఇవ్వవచ్చు. ఇలాంటివాటికి సంబంధించిన పత్రాలను రాయకముందు సొసైటీని సంప్రదించాలి. వీటినుండి వచ్చే డబ్బు రాజ్యమందిర నిధికేనని స్పష్టంచేయాలి.
6. వీలునామాలు, ట్రస్టులు: ఆస్తిని వీలునామాను లేదా డబ్బు వీలునామాను చట్టబద్ధంగా వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ పేర రాయవచ్చు, లేక ఒక ట్రస్టు ఏర్పాటుయొక్క లబ్దిదారుగా సొసైటీ పేరు వ్రాయవచ్చు. ఒక మత సంస్థకు లాభం చేకూర్చే ట్రస్టుకు పన్నులు చెల్లించే విషయంలో కొన్ని ప్రత్యేక ప్రయోజనాలను ఇవ్వవచ్చు. వీలునామా లేదా ట్రస్టు ఏర్పాటుకు సంబంధించిన ఒక కాపీని సొసైటీకి పంపాలి అంతేకాకుండా ఆ వీలునామా లేక ట్రస్టు రాజ్యమందిర నిధికేనని స్పష్టంగా తెలియజేయాలి.
ఇటువంటి విషయాలను గూర్చి మరింత సమాచారము కొరకు, Watch Tower Bible and Tract Society of India, H-58 Old Khandala Road, Lonavla 410 401, MAH., INDIAకు రాయండి