మనం ‘వాక్యమును ప్రకటించుదాము’
1 “అంత్యదినములను” గురించి బైబిలు వర్ణనకు తగినట్లుగానే నేడు అనేకులు “పైకి” మాత్రం “భక్తి గలవారివలె” ఉన్నారు. (2 తిమో. 3:1, 5) ఎందుకంటే మతనాయకులు తమ ప్రజలకు యథార్థమైన ఆత్మీయ నడిపింపునివ్వడంలో విఫలులయ్యారు. క్రైస్తవ మతసామ్రాజ్యపు మత గురువులు బైబిలును సమర్ధించరు. దేవుని వాక్యాన్ని ప్రకటించడం కన్నా, తత్త్వ వేదాంత బోధలను వల్లెవేయడానికీ లేక సామాజిక రాజకీయ వివాదాంశాలను చర్చించేందుకే ఎక్కువగా ఇష్టపడతారు. అనేక మంది మతనాయకులు బైబిలును నమ్మరు. అది పాతబడిపోయిందని వారి భావన, అందుకని గొప్ప సృష్టికర్తను గూర్చిన బైబిలు బోధను బోధించడం కంటే, పరిణామ సిద్ధాంతాన్ని మొండిగా ప్రబోధిస్తారు. అనేకమంది మతగురువులు దేవుని వ్యక్తిగత నామాన్ని సహితం ఉపయోగించడంలేదు ఆధునిక బైబిలు అనువాదాలనుండి దాన్ని తీసివేసినా వారు ఏమీ అడ్డు చెప్పరు.
2 యేసు కాలంలోని మతనాయకుల రోజుల్లోలా, ఈనాటి మతగురువుల బోధ కూడా వ్యర్థమే. (మత్త. 15:7) “అది అన్న పానములు లేకపోవుటచేత కలుగు క్షామముకాక యెహోవా మాటను వినకపోవుటవలన కలుగు క్షామముగా ఉండును” అని ప్రవక్తయైన ఆమోసు ప్రవచించినట్లుగానే ఉంది. (ఆమో. 8:11) మరి దేనికన్నా దేవుని వాక్యంలోని ఆత్మీయ ఆహారం ప్రజలకు అవసరం.
3 ప్రజల ఆత్మీయ అవసరతలను ఎలా తీర్చాలి: “రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధలేఖనములను” హత్తుకుని ఉండమని పౌలు తిమోతిని ఉద్బోధించాడు, అంతేకాకుండా ఇతరులకు “వాక్యమును ప్రకటించుము” అని అతనికి ఆజ్ఞనిచ్చాడు. (2 తిమో. 3:14, 15; 4:2) యెహోవాసాక్షులుగా మనం ప్రకటించేటప్పుడు బైబిలు బోధించే విషయాలను మనం హత్తుకుని ఉండాలి, అలా మన మాదిరికర్తయైన యేసును మనం అనుకరిస్తాము. ఆయన ఇలా అన్నాడు: “నేను చేయు బోధ నాది కాదు; నన్ను పంపినవానిదే.” (యోహా. 7:16) దేవుని వాక్యాన్ని మనం మన బోధకు ఆధారంగా ఉపయోగిస్తాము ఎందుచేతనంటే, దానిలో దైవిక జ్ఞానముందని మనం గ్రహించాము అంతేకాకుండా ప్రజలతో మనం పంచుకునే సమాచార మూలాన్ని వారు తెలుసుకోవాలని మనం కోరుకుంటున్నాము.—1 కొరిం. 2:4-7.
4 ప్రజలు యెహోవాను గూర్చి తెలుసుకుని ఆయనను విశ్వసించేందుకుగాను ప్రప్రథమంగా బైబిలులోని సత్యాన్ని వారు వినాలి. సహేతుకంగానే పౌలు ఇలా వ్రాశాడు: “విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమా. 10:14) దేవుని వాక్యాన్ని ప్రకటించడంవల్ల ఇతరులు కచ్చితమైన జ్ఞానం ద్వారా విశ్వాసాన్ని పొందేందుకు మనం సహాయం చేస్తాము. అలాంటి జ్ఞానం జీవితాలను మెరుగుపర్చగలదు మెరుగపరుస్తోంది కూడా. బైబిలును గూర్చి ఆంగ్ల రచయితయైన చార్ల్‌స్ డికెన్స్ ఇలా రాశాడు: “ప్రపంచంలో ఇంతవరకూ ఉన్న పుస్తకాల్లోకెల్లా లేక రానున్న పుస్తకాలన్నింటిలోకెల్లా ఇది అత్యుత్తమమైన పుస్తకం, ఎందుకంటే సత్యసంధుడుగాను నమ్మకమైనవానిగానూ ఉండేందుకు ప్రయత్నించే ఏ మానవునినైనా నడిపించగల శ్రేష్ఠమైన పాఠాలను ఇది నేర్పిస్తుంది.”
5 ఆత్మీయ సత్యం విషయంలో ఆకలిగలవారు, దీనికి దేవుని వాక్య అధికారిక మద్దతు ఉందని గ్రహించారు. 1913నందు, కాలేజీ చదువుతున్న ఓ యువ విద్యార్థిగా ఫ్రెడ్రిక్ డబ్ల్యు. ఫ్రాన్స్‌కి మరణించినవారు ఎక్కడ ఉన్నారు? (ఆంగ్లం) అనే చిన్నపుస్తకం ఇవ్వడం జరిగింది. ఈ ప్రశ్నకు బైబిలిచ్చిన సమాధానాన్ని ఎంతో ఆసక్తితో చదివి ఆయన ఇలా చెప్పాడు: “ఇదే సత్యం.” లక్షలాదిమంది సత్యాన్వేషకులు ఇదే విధంగా భావించారు. వాక్యాన్ని మనం శ్రద్ధతోనూ అత్యంత ఆసక్తితోనూ ప్రకటించడంలో కొనసాగి, తద్వారా “ఇదే సత్యం” అని ఇతరులు చెబుతుండగా వినే ఆనందాన్ని పంచుకుందాం.