పైనున్నవాటి మీద మీ మనస్సును ఉంచండి
1 మన చుట్టూ ఉన్న తరంపై మరియు భవిష్యత్తును గూర్చిన దాని దృక్కోణంపై వ్యాఖ్యానిస్తూ, డిశంబరు 31, 1994 ద న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక శీర్షిక ఇలా చెప్పింది: “వారు భవిష్యత్తును గూర్చి భయపడుతున్నారు. వారు ఉద్యోగాలను గూర్చి, వ్యాధిని గూర్చి, ఆర్థిక పరిస్థితులను గూర్చి, లోక పరిస్థితులను గూర్చి భయపడుతున్నారు.” మనం చూసే ప్రతిచోట జీవితాన్ని గూర్చిన అనిశ్చిత భావమే కనిపిస్తుంది. యెహోవాసాక్షులుగా మన పరిచర్య మనకు ఈ విధంగా భావించే ప్రజలను ప్రతిదినం పరిచయం చేస్తూ ఉంది. వాళ్ళు ఎదుర్కుంటున్నటువంటి అవే సమస్యలనే మనం ఎదుర్కుంటుండగా, దేవుని వాక్యమిచ్చే కచ్చితమైన వాగ్దానాల్లోని మన నమ్మకం మరియు విశ్వాసం జీవితాన్ని గూర్చి, మానవజాతి భవిష్యత్తును గూర్చి మరింత భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉండేందుకు మనకు సహాయం చేస్తున్నాయి.—యెష. 65:13, 14, 17.
2 మన ఆశావాదం మరియు కచ్చితమైన నిరీక్షణను గూర్చిన దృక్కోణం అనేక మంది యథార్థపరులైన ప్రజల కొరకు మనం తీసుకువెళ్తున్న వర్తమానాన్ని వారు వినేందుకు కారణమౌతుంది. నిరాశచెందిన, కృంగిపోయిన అనేకమంది వ్యక్తులు మనతో మాట్లాడితే ఉపశమనంగా ఉంటుందని కనుగొంటారు. ఎందుకంటే వారు వినేదానిని ఇష్టపడతారు, కొందరు మనతో బైబిలు పఠించేందుకు ఒప్పుకుంటారు. అయితే, కొన్నిసార్లు ప్రజలు మొదట తమ వ్యక్తిగత బాధలను దించుకోవాలని కోరుకుంటారు. ఒకరి వ్యక్తిగత వ్యాకులతలను గూర్చి వినడానికి కొంత సమయం గడిపినప్పటికీ, దేవుని వాక్యంలోని అనుకూలమైన సత్యాలను ప్రజలకు బోధించాలనే మన లక్ష్యంపై దృష్టిని మనం కోల్పోకూడదు.
3 కృంగిపోయిన వారిపై సహానుభూతి గలవారమై ఉండాలని మనం కోరుకుంటాం. మత్తయి 11:28లో వ్రాయబడినట్లు, “ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి” అని యేసు చెప్పినప్పుడు ఆయన దానికి మాదిరినుంచాడు. మనం కూడా అదే విధంగా ప్రజలను ప్రోత్సహించాలని ఇష్టపడతాం. అయితే, 28వ వచనం చివర్లో ‘నేను మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేతును’ అని యేసు చెప్పినదాన్ని గమనించండి. మన లక్ష్యం అదే అయ్యుండాలి. దేవుని వాక్యంలోని విశ్రాంతి కలుగజేసే వాగ్దానాలను పంచుకోవడం ద్వారా మనమలా చేస్తాము. మంచి శ్రోతగా ఉండడం మన వ్యక్తిగత ఆసక్తిని మరియు శ్రద్ధను కనబరుస్తుంది, అలాగే మానవుని సకల సమస్యలకు కచ్చితమైన పరిహారం రాజ్యం మాత్రమేనని గ్రహించడానికి ఇతరులకు సహాయపడుతూ రాజ్య వార్తను ప్రకటించే నియామకాన్ని నెరవేర్చేందుకు అది ప్రాముఖ్యం.—మత్త 24:14.
4 మనది వృత్తిపరమైన ఆరోగ్యసంరక్షణ నిపుణుల పని కాదు. బదులుగా, 1 తిమోతి 4:5, 6 నందు అపొస్తలుడైన పౌలు వివరించినట్లు “సుబోధ”పై, దేవుని వాక్యంలో కనుగొనబడిన బోధలపై శ్రద్ధ నిలిపే పరిచర్య అది. వ్యక్తిగత మరియు భావోద్రేక సంబంధమైన సమస్యలు కలవారు యెహోవాను ఆశ్రయించడాన్ని నేర్చుకోవడానికి ప్రోత్సహించబడవలసిన అవసరం ఉంది. రాజ్య నిరీక్షణకు సంబంధించినవాటి మీదనే—‘పైనున్నవాటి మీదనే మనస్సు పెట్టుకుని’ ఉండడానికి వారికి బోధించండి. (కొలొ. 3:2) దేవుని వాక్యం పై ప్రజలు శ్రద్ధను కేంద్రీకరించినప్పుడు, వారి జీవితాల్లో ఉన్న శక్తివంతమైన ప్రభావం ఫలితంగా వారు కట్టబడగలరు.—హెబ్రీయులు 4:12.
5 కనుక, ‘ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో’ వాటిపై తమ ఆలోచనలను కేంద్రీకరించడానికి ప్రజలకు సహాయపడడమే మన లక్ష్యం. (ఫిలి. 4:8) వారు రాజ్య నిరీక్షణపై శ్రద్ధ నిలుపుతున్నట్లయితే, ఆశీర్వాదాలను మనం పొందుతున్నట్లే వారు పొందుతారు. చివరికి యెహోవా తన రాజ్యం ద్వారా వారి సమస్యలనన్నింటినీ పరిహరిస్తాడనే జ్ఞానంతో వచ్చే సంతోషాన్ని వారు అనుభవిస్తారు.—కీర్త. 145:16.