పాఠశాలలో క్రైస్తవ నడవడి
1 మీరు ఇప్పటికీ పాఠశాలకు వెళ్తున్న క్రైస్తవ యౌవనస్థుడు(రాలు) అయితే, మీరు మీ యథార్థతను కాపాడుకోవడానికి మీకు దృఢమైన విశ్వాసము అవసరము. మీ విశ్వాసాన్ని శోధించే చెడు సహవాసులకు, పరిస్థితులకు మీరు గురి అవుతారు. “అన్యజనులు . . . మీ సత్‌క్రియలను చూచి, వాటినిబట్టి దర్శనదినమున దేవుని మహిమపరచునట్లు, వారి మధ్యను మంచి ప్రవర్తనగల వారై యుండవలెనని” చెప్పిన పేతురు ఉపదేశాన్ని మీరు అన్వర్తించుకోవడం ప్రాముఖ్యమై ఉంది. (1 పేతు. 2:12) మీరు ఈ సవాలును ఎదుర్కోవడానికి ధైర్యము మరియు కృతనిశ్చయము అవసరము.
2 పాఠశాలలోపల గాని, వెలుపల గాని వివాహమునకు ముందే లైంగిక సంబంధం కలిగి ఉండడం, దుర్భాష, పొగాకు మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి కలుషితం చేసే ప్రభావాలతో మీరు ముట్టడి చేయబడతారు. మీ మంచి నడవడికి గల పేరును పాడుచేయగల ప్రలోభాలను మీరు ప్రతిరోజు ఎదుర్కుంటారు. మీరు అలాంటి శోధనలను సహించాలంటే, పెద్దలవలె మీరు ‘విశ్వాసము కొరకు గట్టి పోరాటము పోరాడాలి.’—యూదా 3; జూలై 15, 1991, కావలికోట (ఆంగ్లం) పేజీలు 23-6 చూడండి.
3 పాఠశాల వద్ద, జాతీయ కార్యక్రమాలు మరియు లోకసంబంధమైన సెలవు దినాలను జరుపుకుంటాయి. మీ పాఠశాలలో జాతీయ మరియు మత సంబంధమైన ఏ సెలవు దినాలు ఆచరించబడుతున్నాయో మీకు తెలుసా? సవాలు చేసే పరిస్థితి ఎదురైతే, మీరు ‘దేనివిషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై . . మీ సత్‌ప్రవర్తన మీద అపనిందవేయువారు సిగ్గుపడునట్లు మంచి మనస్సాక్షిని’ కలిగి ఉండగలరా?—1 పేతు. 3:16.
4 మీరు ఆకర్షణీయమైన పాఠశాల క్రీడా కార్యక్రమాల చేత మరియు విద్యేతర కార్యక్రమాల చేత ప్రలోభపెట్టబడవచ్చు. ఆనందదాయకమైనవిగా కనిపించే కార్యక్రమాలు మీ విశ్వాసాన్ని ఎలా రాజీపరచగలవో గ్రహించేలా మీరు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు మరొకరి విశ్వాసము వలన బలపరచబడడానికి మీరు ‘పరస్పరం ప్రోత్సహించు’కోగల సహవాసులను ఎన్నుకోవలసిన అవసరముంది.—రోమా. 1:11.
5 మీరు యెహోవా సహాయంతో సహించగలరు: సాతాను ఎడతెగక మీ విశ్వాసాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. మీరు సహించవలసిన శోధనలు తీవ్రంగా ఉండగలవు, కాని ప్రతిఫలాలు వాటిని మరింత ప్రయోజనకరమైనవిగా చేస్తాయి. (1 పేతు. 1:6, 7) మీ అంతట మీరే సహించడంలో నెగ్గలేరు; మీరు సహాయం కొరకు యెహోవా వైపుకు చూడవలసిందే. యేసు తన శిష్యులను ఈ విధంగా పురికొల్పాడు: ‘మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉండుడి.’ (మత్త. 26:41) క్రమశిక్షణ మరియు ఆత్మనిగ్రహము ప్రాముఖ్యమైనవి.—1 కొరిం. 9:27.
6 మీరు మీ నడవడిని బట్టి యెహోవాకు లెక్కఒప్పజెప్పాలి అనే విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. (ప్రస. 11:9) మీరు ఏమి చేస్తున్నారనేది ఇతరులు గమనించకపోయినప్పటికీ, మీరు ఏమి చేస్తున్నారనేది యెహోవాకు తెలుసు, ఆయన తీర్పు తీరుస్తాడు. (హెబ్రీ. 4:13) ఆయనను ప్రీతిపరచాలనే మీ నిజమైన కోరిక మీరు ‘భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుటకు’ మిమ్మల్ని పురికొల్పాలి. (ఫిలి. 2:12) ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవడం గొప్ప సహాయకంగా ఉంటుంది. అది చక్కని ఉపదేశంతోను మరియు అనుకరించదగ్గ మంచి మాదిరులతోను నిండి ఉంది.—హెబ్రీ. 12:1-3.
7 తలిదండ్రులారా మీరు ముఖ్యపాత్ర వహిస్తారు. మీరు మీ పిల్లలపై శ్రద్ధవహించాలి, వారు ఎదుర్కునే సమస్యలను గూర్చి ఎరిగినవారై ఉండాలి, అవసరమైనప్పుడు సహాయం అందించాలి. మీరు మీ పిల్లలతో మంచి సంబంధం కలిగి ఉన్నారా? మీరు వారిలో దేవుని నియమాలు మరియు సూత్రాల ఎడల మెప్పుతో కూడిన అవగాహనను పెంపొందింపజేశారా? ఒత్తిళ్ళను, ప్రలోభాలను ఎదుర్కున్నప్పుడు, మీ పిల్లలు స్థిరంగా ఉంటున్నారా, లేదా వారు సులభంగా లొంగిపోతున్నారా? వారు తమ తోటివారికి భిన్నంగా ఉండవలసి వస్తున్నందువల్ల నిరుత్సాహం చెందుతారా? వారికి సహాయపడవలసిన బాధ్యత తలిదండ్రులుగా మీకుంది. (ద్వితీ. 6:6, 7) మీరు మీ పనిని బాగా చేస్తే, విశ్వాస పోరాటంలో విజయవంతులుగా ఉండుటకు మీరు వారికి సహాయం చేయగలరు.—సామె. 22:6.