మన రాజ్య ఐక్యతను కాపాడుకొనుట
1 దేవుని రాజ్యం శక్తి మరియు అధికారం గల వాస్తవమైన ప్రభుత్వం. అది యేసు ప్రకటన అంశంగా ఉండేది. (మత్త. 4:17) ఇతరులకు బోధించడం మరియు రాజ్య సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడం యేసు పరిచర్య యొక్క ముఖ్య భాగం. రాజ్యం కొరకు ప్రార్థించాలని, దానిని మొదట వెదకాలని ఆయన మనకు బోధించాడు. (మత్త. 6:9, 10, 33) యెహోవాకు, ఆయన సంస్థకు సన్నిహితంగా ఉండడం, మన ప్రకటనా బాధ్యతను నెరవేర్చడం మరియు లోకం నుండి వేరుగా ఉండడం మనం మన రాజ్య ఐక్యతను కాపాడుకోవడాన్ని సాధ్యం చేస్తాయి. మన క్రియల ద్వారా, మాటల ద్వారా మనం రాజ్యం పక్షాన ఉన్నామని మనం చూపిస్తాము.—యోహా. 18:37.
2 లక్షలాది మంది ప్రజలకు రాజ్యం 1914 నుండి వాస్తవమైనదిగా మారింది. రాజ్యం యొక్క ఈ ప్రజలు కనబరచే ఐక్యత విభాగించబడిన లోకానికి పూర్తి విరుద్ధంగా నిలబడుతుంది. రాజ్యం అనేది ఐక్యపరచే శక్తిగా ఉండాలంటే, మన జీవితాల్లో మనం దానిని వాస్తవమైనదిగా ఎంచాలి. ఏది మనకు దాన్ని వాస్తవమైనదిగా చేస్తుంది?
3 ఇతర ప్రభుత్వాల్లాగే, ఈ రాజ్యానికి నియమావళి ఉంది. అయితే, వ్యత్యాసమేంటంటే, దాని నియమాలు బైబిలులో కనుగొనబడ్డాయి. దేవుని వాక్యాన్ని క్రమంగా చదవడం, రాజ్య ప్రజలముగా మన నుండి కోరబడిన వాటిని గూర్చిన అవసరమైన జ్ఞాపికలను మనకిస్తుంది. దేవుని నియమాలను మన ప్రతిదిన జీవితాల్లో అన్వయించుకోవడానికి, మన ప్రచురణల వ్యక్తిగత పఠనం మరియు “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” నడిపింపు మనకు సహాయపడతాయి. (మత్త. 24:45) మనం అలాంటి వ్యక్తిగత అన్వయింపును చేసుకొంటుండగా, రాజ్యం మనలను ప్రపంచవ్యాప్త సహోదరత్వానికి మరింత సమీపస్థులనుగా చేస్తూ, యేసు పరిపాలన క్రింద మనలను ఆరాధికుల ఐక్య కుటుంబంగా చేస్తూ, అది మనకు మరింత వాస్తవమైనదౌతుంది.
4 రాజ్య ప్రకటన ద్వారా ఐక్యత: రాజ్య సువార్తను “భూదిగంతముల వరకు” ప్రకటించడమే మన నియామకమై ఉన్నది. (అపొ. 1:8) మనం యెహోవాను “మహిమ పరుచు” నిమిత్తం శ్రమపడుతుండగా, “మనస్సు కలిసినవారై” ప్రకటించడం మనలను ఐక్యపరుస్తుంది. (రోమా 15:5, 6) భూవ్యాప్తంగావున్న మన తోటి పనివారితో ఆసక్తిగా పాల్గొనడం మన విశ్వాసాన్ని బలపరుస్తుంది, యెహోవా చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఆత్మ మన ద్వారా పనిచేయడాన్ని అనుమతిస్తుంది. ‘ప్రభువు కార్యమునందు ఎంతో చేయడానికి ఉండడం’ మనలను ‘స్థిరులనుగాను, కదలనివారినిగాను’ చేస్తుంది.—1 కొరిం. 15:58.
5 అనేక దేశాల్లో సాతాను మన ప్రకటనా పనిని ఆటంకపరుస్తూ, మన ఐక్యతకు భంగం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విభేదాలను పుట్టించడానికి, అపార్థాలను కలుగజేయడానికి, జగడములను, కలహములను రేపేందుకు ప్రయత్నించడానికి అతడు తన దగ్గరున్న ప్రతి మార్గాన్ని ఉపయోగిస్తున్నాడు. (సామె. 6:19; గల. 5:19-21, 26) మనం లోక వివాదాల్లో చిక్కుకోవాలని, రాజకీయ మరియు సాంఘిక వివాదాంశాల్లో మనం ఏదైనా ఒక పక్షం వహించాలని కూడా అతడు ఇష్టపడతాడు. (యాకో. 3:14-16) అతడి ప్రభావాన్ని ఎదిరించాలని లేఖనాలు మనకు ఉద్బోధిస్తున్నాయి; లేకపోతే, అతడు మనలను తన ఎరగా మ్రింగివేస్తాడు. (1 పేతు. 5:8, 9) రాజ్య నిరీక్షణ యొక్క వాస్తవికత మన హృదయాల్లోను, మనస్సుల్లోను మసకబారడానికి అనుమతించబడకూడదు.
6 మన ఐక్యతను కాపాడుకోవడానికి స్వస్థబుద్ధి మరియు పైనుండి వచ్చే జ్ఞానం అవసరం. కష్టాలు ఎదురైనప్పుడు, ముఖ్యంగా మన సహోదరులు వాటిలో ఇమిడి ఉన్నప్పుడు, మనం శాంతిని కాపాడుకోవడానికి ఆత్మ ఫలాలను కనబరచాలి. గర్వం, అసూయ, అహంకారం వంటి లౌకిక లక్షణాలు అనైక్యతను కలిగిస్తాయి, మరి వాటిని తప్పనిసరిగా అధిగమించాలి. (ఎఫె. 4:1-3; కొలొ. 3:5-10, 12-14) మనం మన మనస్సులను అనుకూలమైన, క్షేమాభివృద్ధికరమైన తలంపులతో నింపి ఉంచుకోవలసిన అవసరముంది. మన జీవితాల్లో రాజ్యం వాస్తవమైనది! మనం దానిని అలాగే ఉంచుకోవడానికి మెలకువ గలవారమై ఉండాలి!—ఎఫె. 6:11, 13.
7 మన అద్భుతమైన రాజ్య నిరీక్షణయనే వాస్తవం మనలను ఎన్నడూ సమసిపోని ఏకీభావంలో ఐక్యపరుస్తుంది.—కీర్త. 133:1.