మహాగొప్ప మనిషిని అనుసరించడానికి ఇతరులను ఆహ్వానించండి
1 మత్తయి 5:14 లో వ్రాయబడినట్లు యేసు తన శిష్యులతో యిలా అన్నాడు: “మీరు లోకమునకు వెలుగైయున్నారు.” యేసు అనుచరులు అన్నిచోట్ల ఉన్న ప్రజలతో యెహోవా రాజ్యాన్ని గూర్చి, ఆయన ప్రేమపూర్వకంగా యేసు ద్వారా రక్షణకొరకు చేసిన ఏర్పాటును గూర్చి చెప్పవలసి ఉండేది. ఆ ఆజ్ఞను మనస్సులో పెట్టుకొని, డిశంబరు నెలలో జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని అందించాలని మనం ఎదురు చూస్తున్నాం. బహుశా, మీరు ఉపయోగించుకోవాలనుకునే సలహాలు యీ క్రింద ఉన్నాయి.
2 మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తర్వాత, యీ క్రింది దాన్ని మీ స్వంత మాటల్లో చెప్పవచ్చు:
◼ “యేసు భూమిమీద మనిషిగా జీవించినప్పుడు ఎలా ఉండేవాడోనని అనేకులు ఆలోచించారు. ఆయన ఏ విధాల్లో యితరుల నుండి భిన్నంగా ఉన్నాడని మీరనుకుంటున్నారు? [జవాబు చెప్పనివ్వండి.] జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే ఈ ఆసక్తికరమైన పుస్తకము, ఆయన జీవితంలోని, మరియు పరిచర్యలోని ప్రముఖ సంఘటనలను గూర్చి చెబుతుంది, మరియు ఆయన ఎలాంటి మనిషి అనే విషయాన్ని గూర్చిన అంతర్దృష్టినిస్తుంది. కొందరు దాన్ని చదివిన తర్వాత, వ్యక్తిగతంగా ఆయనతో సహవసించే అవకాశం కలిగినట్లుగాను, ఆయన కష్టాలను పంచుకున్నట్లుగాను, ప్రత్యక్షంగా ఆయన పరిచర్యను చూసినట్లుగాను భావించారు.” శీర్షికను నొక్కిచెప్పే, పుస్తకంలోని మొదటి చిత్రాన్ని చూపించండి. తర్వాత ఉపోద్ఘాతం దగ్గరకు వెళ్ళి, “ఆయననుగూర్చి నేర్చుకొనుటద్వారా కలుగు ప్రయోజనము” అనే ఉపశీర్షికకు క్రిందవున్న రెండవ పేరాను చదవండి. ఈ పుస్తకాన్ని రూ. 45.00 చందాకు అందించండి.
3 లేదా మీరు యీ విధంగా ప్పవచ్చు:
◼ “క్రిస్టమస్ సమయమంతటిలో, మనం తరచూ యేసును గూర్చి ఎంతో వింటూ ఉంటాము. అయినప్పటికీ, ఎన్నో చెడు సంగతులు లోకమంతటా జరుగుతూ ఉన్నందున, యేసు నిజంగా మనయెడల శ్రద్ధ కలిగియున్నాడా లేదా మనకొరకు ఏమైనా చేయగలడా? అని కొందరు ఆశ్చర్యపోవచ్చు. దాని గురించి మీరేమనుకుంటున్నారు?” జవాబివ్వనివ్వండి. మహాగొప్ప మనిషి అనే పుస్తకంలో 24 వ అధ్యాయానికి తిప్పి, యేసు భూమిమీదికి ఎందుకు వచ్చాడో క్లుప్తంగా చర్చించండి. ఇతరుల యెడల యేసుకు గల నిజమైన ప్రేమను నొక్కిచెబుతూ యోహా. 15:13 చదవండి. ఈ పుస్తకాన్ని తీసుకోనట్లయితే, అందించడానికి క్రొత్త పత్రికలను, ఒక బ్రోషూర్ను లేదా లభ్యమవుతున్న తగిన కరపత్రాన్ని దగ్గర ఉంచుకోవాలని గుర్తుంచుకోండి.
4 మరొక సలహా:
◼ “అనేకమంది యౌవనస్థులు తాము అనుకరించడానికి తగిన మాదిరుల కొరకు చూస్తున్నారు, కాని మంచి మాదిరులను కనుగొనడం కష్టం. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు పరిపూర్ణమైన మాదిరినుంచాడు. [1 పేతు. 2:21 చదవండి.] ఆయన జీవితమంతా తన పరలోక తండ్రి ఆరాధనపై కేంద్రీకరించబడింది. అనేకమంది ప్రజలు ఆయనను అనుకరించడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని మీరనుకుంటున్నారు?” జవాబివ్వనివ్వండి. ఈ పుస్తకంలో, వెనుకనుండి రెండవ పేజీలోని ఆయన ప్రత్యేక గుణాలను వర్ణించే మూడవ పేరాను చదవండి. మంచి వ్యక్తులు కావడానికి మహాగొప్ప మనిషి అనే పుస్తకం మనకందరికీ ఎలా సహాయపడగలదో వివరించండి.
5 ఈ విధంగా చెప్పడానికి మీరు ఇష్టపడవచ్చు:
◼ “ఎవరైనా యేసుక్రీస్తును గూర్చి చెబుతున్నప్పుడు, అనేకమంది ప్రజలు ఆయనను బాలునిగా లేదా వేదననుభవిస్తూ చనిపోబోతున్నవానిగా తలస్తారు. యేసును గూర్చిన వారి ఉద్దేశంలో ఆయన జనన మరణాలు మాత్రమే ఉన్నాయి. ఆయన తన జీవితకాలంలో చెప్పిన విషయాలు, చేసిన పనులు గుర్తించబడకుండా పోతున్నాయి. ఆయన సాధించినది భూమిమీద జీవించిన ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతుంది. అందుకే, మన కోసం ఆయన చేసిన అద్భుతమైన విషయాలను మనము నేర్చుకోగలిగినంతవరకు నేర్చుకోవడం ప్రాముఖ్యము.” యోహా. 17:3 చదవండి. మహాగొప్ప మనిషి అనే పుస్తకంలోని ఉపోద్ఘాతమున్న మొదటి పేజీని తెరిచి, నాలుగవ పేరాను చదవండి. ఈ పుస్తకాన్ని అందించి, వ్యక్తిగత పఠనానికి అది ఎలా ఉపయోగపడగలదో వివరించండి.
6 ఆసక్తిగలవారిని, సాహిత్యాలను తీసుకున్నవారిని పునర్దర్శనాల ద్వారా మళ్ళీ కలుసుకునేలా, వారి వివరాలను రాసుకోవాలని నిర్ణయించుకోండి. అలా ఇంకా సమయముండగానే, యథార్థహృదయులైన ప్రజలను ఆసక్తితో వెదుకుదాం, వారు మన రక్షకుడైన యేసుక్రీస్తు అనుచరులగుటకు సహాయపడుదాము.—మత్త. 16:24.