అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి
1 అనేక దేశాల్లో జరుగుతున్న అద్భుతమైన అభివృద్ధిని గూర్చి చదవడంలో మనమెంత పులకించి పోతామో! అయినా, కొన్ని ప్రాంతాల్లోని రాజ్యప్రచారకులు తరచూ ఉదాసీనతను, నిర్లక్ష్యాన్ని, లేదా మన ప్రకటనా పనికి తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నట్లు మనకు తెలుసు. మన ప్రాంతంలో కూడా యిలాంటి పరిస్థితే ఉన్నట్లయితే, మనం అనుకూల దృక్పథాన్ని ఎలా కాపాడుకోగలం? మన సంతోషాన్ని దోచుకొనే లేదా శిష్యులను చేసే మన పనిలో ఆసక్తిని పోగొట్టే ప్రతికూల దృక్పథాన్ని ఎలా నిరోధించగలం?
2 అనుకూల దృక్పథం మన సమతుల్యతను కాపాడుకోడానికి సహాయపడుతుంది. శోధనలు వచ్చినప్పుడు కూడా, ప్రతికూలమైన తలంపులు మన ఉత్తరాపేక్షను అణచివేసేలా అనుమతించవద్దు. యేసు మనకొరకు పరిపూర్ణమైన మాదిరిని ఉంచాడు. ఆయన బోధించిన దానిని కొందరు మాత్రమే అంగీకరించారు. అనేకులు ఆయన బోధ విని అభ్యంతరపడ్డారు. తన సహనాన్ని కఠినంగా పరీక్షించిన పరిస్థితులను ఆయన ఎదుర్కొన్నాడు. మత నాయకులు ఆయన పనిని విమర్శించి, ఆయనను చంపడానికి కుట్ర పన్నారు. ఆయనపై ఉమ్మివేశారు, ఆయన దెబ్బలు తిన్నాడు, వెక్కిరించబడ్డాడు, కొట్టబడ్డాడు, చివరికి చంపబడ్డాడు. అయినప్పటికీ, ఆయన తాను చేస్తున్న పనిలో సంతోషాన్ని కనుగొన్నాడు. ఎందుకు? ఆయన దేవుని చిత్తాన్ని చేయడంలోని ప్రాముఖ్యతను గ్రహించి, దానిని విడిచిపెట్టలేదు.—యోహాను 4:34; 13:17; హెబ్రీ. 12:2.
3 మన పరిచర్యను గూర్చిన సరైన దృక్పథాన్ని కాపాడుకోండి: దీనిని చేయడానికి, మన మనస్సులో అనేక విషయాలను ఉంచుకోవలసిన అవసరముంది. అనేకులు నిర్లక్ష్యం చేసే లేదా వ్యతిరేకించే సందేశం మన దగ్గర ఉందని గుర్తుంచుకోండి. (మత్త. 13:14, 15) యేసు నామాన్నిబట్టి బోధించవద్దని అధికారికంగా అపొస్తలులకు ఆజ్ఞాపించబడినప్పటికీ, తమకప్పగించబడిన ప్రకటనాపనియెడల యథార్థంగా ఉన్నారు. దానికి ఫలితం లభిస్తూనే వచ్చింది. (అపొ. 5:28, 29; 6:7) కొన్ని ప్రాంతాల్లో కొద్దిమంది మాత్రమే వింటారని మనకు ముందే తెలుసు. (మత్త. 7:14) కనుక, మన ప్రాంతంలో ఒక వ్యక్తి మాత్రమే మన సందేశాన్ని వింటున్నప్పటికీ, మనకు సంతోషించడానికి కారణముంది. వ్యతిరేకించేవారికి కూడా వినే అవకాశాన్ని తప్పనిసరిగా యివ్వాలని కూడా గుర్తుంచుకోవాలి. (యెహె. 33:8) కొందరు వ్యతిరేకులు చివరికి మారి, యెహోవా ఆరాధికులయ్యారు. ఎవ్వరూ వినకపోయినప్పటికీ, సరైన విధంగా దృష్టించినప్పుడు, మన పరిచర్య, మనం ఏదో సాధించామన్న అనుభూతినిస్తుంది. మనం దేవునిరాజ్య సందేశంతో ప్రతి యింటి ద్వారం దగ్గరకు వెళ్ళడమే ఒక సాక్ష్యం.—యెహె. 2:4, 5.
4 మన పనిలో అనుకూలమైన దృక్పథాన్ని కలిగి ఉండడానికి మనకు మంచి కారణముంది. ప్రపంచవ్యాప్త పనిలోని అభివృద్ధి, మహాశ్రమలు సమీపించాయనడానికి పెరుగుతున్న రుజువు మనం దైవిక భక్తితో సేవలో సాధ్యమైనంత మట్టుకు చేయడానికి మనల్నందరినీ పురికొల్పాలి. (2 పేతు. 3:11, 14) ఆగష్టు నెలలో ఆసక్తితో పనిచేయడం మనం నేర్చుకున్న దాని యెడల మనకు గల మెప్పును ప్రదర్శించడానికి శ్రేష్ఠమైన మార్గం. మనతో కొత్తగా సహవసించే వారు కూడా తాము నేర్చుకున్న దాన్ని ఉపయోగించడంలో అనుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని మనం కోరుకుంటాం. మన బైబిలు విద్యార్థుల్లో కొందరు బాప్తిస్మం పొందని ప్రచారకులయ్యేంత ఉన్నతి సాధించినట్లయితే, వారు ప్రచారకులుగా పని ప్రారంభించడానికి ఆగష్టు నెల ఒక మంచి సమయం కావచ్చు.
5 మనం పయినీర్లుగా లేదా ప్రచారకులుగా సేవ చేస్తున్నా, యెహోవా మననుండి కోరేది భారమైనది కాదని జ్ఞాపకముంచుకోడం మనకందరికీ సహాయపడుతుంది. (1 యోహాను 5:3) ఆయన మనల్ని కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు. (హెబ్రీ. 13:5బి, 6) ప్రజలు ఉదాసీనంగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా, లేదా వ్యతిరేకించినా, మనం అనుకూల దృక్పథం కలిగి ఉండి, ప్రకటనా పని చేస్తూనే ఉండాలి, ఎందుకంటే మనం అలా చేయడం దేవుని చిత్తము.—1 తిమోతి 2:3, 4.