బైబిలు విద్యార్థులను పరిచర్యకు సిద్ధం చేయండి
1 బైబిలు పఠనాల అంతిమ లక్ష్యమేంటంటే, కొత్త శిష్యులను అనగా, యితరులకు బోధించడంలో మనతో కలిసి పనిచేసేవారిని తయారు చేయడమే. (మత్త. 28:19, 20) కాబట్టి, బైబిలు పఠన ఉద్దేశం జ్ఞానాన్ని అందజేయడం మాత్రమే కాదు; అది మన విద్యార్థుల్లో హృదయపూర్వక విశ్వాసాన్ని కలిగించి, తమ నిరీక్షణను యితరులతో పంచుకోడానికి వారిని సంసిద్ధులను చేయాలి. (2 కొరిం. 4:13) వారు యితరులకు బోధించడానికి అర్హులు కావాలంటే ఏ ఆచరణాత్మకమైన విధాల్లో మనం వారికి సహాయం చేయగలం?—2 తిమో. 2:2.
2 పరిచర్యను ఒక లక్ష్యంగా ఉంచండి: ఆరంభం నుండే, ‘రక్షణ కలిగేందుకు బహిరంగంగా ఒప్పుకోవడం’ సత్యారాధనలో భాగమని స్పష్టం చేయండి. (రోమా. 10:10) యెహోవాసాక్షులు అనే మన పేరు, మనం యితరులతో తప్పకుండా మాట్లాడాలని సూచిస్తుంది. వాళ్ళు నేర్చుకునేది వారి రక్షణకొరకు మాత్రమే కాదని వారు గ్రహించడానికి వారికి సహాయం చేయండి. వారు కూడా బోధకులైనప్పుడు, వారు చెప్పేది వినేవారు కూడా రక్షణ పొందే అవకాశాన్ని పొందుతారు.—1 తిమో. 4:16.
3 నేర్చుకున్నదాన్ని పునఃసమీక్షించండి: నేర్చుకున్నవాటిని అప్పుడప్పుడు పునఃసమీక్షించడం ఒక విలువైన బోధనా సహాయము. కొత్తగా నేర్చుకున్న సత్యాలు విద్యార్థి మనస్సులోను, హృదయంలోను నాటుకునే కొలది, ఆయనకు ఆత్మీయంగా ఎదగడానికి అవి సహాయపడతాయి. కావలికోట పఠనంలో చేర్చబడిన పునఃసమీక్ష ప్రశ్నలకు జవాబు చెప్పేటప్పుడు మనం కూడా దీన్ని అనుభవించాం. మీ విద్యార్థి తన స్వంత మాటల్లో జవాబు చెప్పేందుకు తగినట్లుగా సరళమైన, సూటియైన ప్రశ్నలను తయారు చేయండి.
4 మీ పునఃసమీక్ష ప్రాంతీయ పరిచర్యలోని సన్నివేశంలాగే ఉండవచ్చు. సాధారణంగా యితరులకు సాక్ష్యమిచ్చేటప్పుడు ఎదురయ్యే పరిస్థితులను వివరించండి లేదా ఒక ప్రశ్న అడగండి. మీరు గృహస్థునిలా నటిస్తూ, మీ విద్యార్థి ఏం చెప్తాడో, ఆయనను ప్రదర్శించనివ్వండి. ఆయన చక్కగా చేసిన దానిని మెచ్చుకోండి, యీ సారి మరింత ఫలవంతంగా ఉండడానికి సహాయపడే ఆచరణాత్మకమైన సలహాలివ్వండి. ఈ తర్ఫీదు, తాను నేర్చుకున్నదాన్ని ఎలా ఉపయోగించాలో, బైబిలును ఉపయోగించే సామర్థ్యాన్ని ఎలా వృద్ధిచేసుకోవాలో అతనికి బోధిస్తుంది.
5 రీజనింగ్ పుస్తకం: మీ విద్యార్థికి రీజనింగ్ పుస్తకముందని రూఢి చేసుకోండి, దాన్ని ఎలా ఉపయోగించాలో అతనికి తర్ఫీదునివ్వండి. సంభాషణలను ఆరంభించడంలో, బైబిలు ప్రశ్నలకు జవాబివ్వడంలో, అభ్యంతరాలను అధిగమించడంలో అది ఏ సలహాలను యిస్తుందో చూపించండి. ఇతరులను ఒప్పించే విధంగా మాట్లాడవలసిన విధానాలను పఠనంలో ప్రదర్శించడానికి యీ పుస్తకాన్ని ఉపయోగించండి. ఈ పుస్తకం అతనికి నమ్మకాన్ని కలిగించి, రాజ్య సువార్తను ప్రకటించేందుకు తగిన చొరవ తీసుకోడానికి ప్రేరేపిస్తుంది.
6 కూటాల ప్రాముఖ్యతను నొక్కి తెలపండి: సంఘ కూటాలు, ముఖ్యంగా సేవా కూటం, దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల ప్రాంతీయ పరిచర్యకు మనలను సంసిద్ధులనుగా చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి. ఫలవంతమైన సాక్ష్యానికి మూలాధారమైనవన్నింటిని అనుభవంగల సామర్థ్యంగల సహోదరులు పునఃసమీక్షించి, ప్రదర్శిస్తారు. కూటాల ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి, వారు హాజరు కావడానికి మీరు చేయగల సహాయం చేయండి. క్రమంగా హాజరు కావడం, యేసు నిజమైన శిష్యులవ్వడానికి మీ విద్యార్థికి కావలసిన ప్రేరణను యివ్వగలదు.
7 మీ వ్యక్తిగత మాదిరి నిర్లక్ష్యం చేయకూడనిది. ప్రకటన పనిలో మీ సిద్ధమనస్సు, మీరు క్రమం తప్పకుండా ఉండడం సత్యంయెడల మీకు గల లోతైన మెప్పును చూపిస్తాయి. అలా చేయడం, మీ విద్యార్థి తన విశ్వాసాన్ని ప్రదర్శించేలా ఎక్కువగా కృషి చేయడానికి, అతనికి ప్రోత్సాహాన్నిస్తుంది. (లూకా 6:40) పరిచర్య ఒక ఆధిక్యతయని దృష్టించడానికి, దానిలో భాగం వహించగలుగుతున్నందుకు కృతజ్ఞత కలిగివుండడానికి, ఇదంతా కొత్త వ్యక్తికి తోడ్పడగలదు.—1 తిమో. 1:12.