దేవుని నామమును నిండుగా స్తుతించుము
1 యెహోవా యిచ్చు అనేక ఆశీర్వాదముల విషయమై మనమెంతగా ఆనందింతుము! ఇండియాలో ఈ సేవాసంవత్సరమందు ప్రచారకులు, పయనీర్లు, మరియు గృహ బైబిలు పఠనములందు క్రొత్త శిఖరాగ్ర సంఖ్యలు కలవు. అంతేకాకుండ జ్ఞాపకార్థదినమునకు 28,866 మంది హాజరైరి. ఇది కూడ చక్కని విషయము. వివిధ ప్రాంతములలో ప్రత్యేక సమావేశములకు వేలాదిమంది ప్రచారకులు హాజరైరి, మరియు మనమందరము మన ప్రాంతీయ మరియు ప్రత్యేకదిన సమావేశ కార్యక్రమములలో సమృద్ధిగా దయచేయబడిన ఆత్మీయాహారమునుండి ప్రయోజనము పొందితిమి. ఇంకా అనేక ఇతర ఆశీర్వాదములను మనము పొందితిమి.
2 యెహోవా మనకొరకు చేసిన యావత్తుకును మన మెప్పును మనమెట్లు చూపించగలము? దేవుని నామమును నిండుగా స్తుతించుటద్వారా మనము దీనిని చేయగలము!—కీర్త. 145:21.
దేవుని నామమును ఎడతెగక స్తుతించుము
3 సెప్టెంబరు నెలలో మనము ఎట్లు యెహోవా నామమును నిండుగా స్తుతించగలము? మనము ఇంకను పత్రిక సైజు బ్రొషూరును అందించుటలో కొనసాగుదము. ప్రాంతీయసేవ కొరకు పట్టుదలతో సిద్ధపడుట మరియు ఎంపికచేసికొనిన ఈ బ్రొషూర్లను తీసికొని వెళ్లుటద్వారా, మనము యెహోవాను స్తుతించుటకు సంసిద్ధులమగుదుము మరియు సాధ్యమైతే ఇతరులను ఆయనను స్తుతించుటను నేర్చుకొనుటకు వారికి సహాయపడిన వారమగుదుము.
4 “ఒక నూతన లోకము—ఎవరిద్వారా?” అనుదిన మన సంభాషణ అంశము. రీజనింగ్ పుస్తకములోని 9-15 పుటలలో గల సమాచారముపై ఆధారపడి సరియైన ఉపోద్ఘాతములను మనము సిద్ధము చేసికొనవచ్చును. లోకమును మరింత చక్కదిద్దుటకు ప్రస్తుతమున్న ఆశలను గూర్చి లోకనాయకులు ఏమి చెప్పుచున్నారో మీతో చర్చించుటకు కొంతమంది గృహస్థులు సిద్ధముగా ఉండవచ్చు. అనేకమంది ప్రజలు సమాధానకరమైన పరిస్థితుల కొరకు ఇచ్చయించుచున్నను, మానవుడు తన స్వంత సమస్యలను తీర్చుకొనలేడని యిర్మీయా 10:23 చూపించుచున్నది. ఈనాటి లోక పరిస్థితుల విషయమై ఏదో చేయనైయున్న దేవుని వాగ్దానము విఫలమము కాదని తెలిసికొనుట అభయమిచ్చునదై యున్నది. ఈ వాగ్దానమును మనము 2 పేతురు 3:13లో కనుగొందుము. ఆ పిమ్మట సరియైన బ్రోషూరును అందించుము.
చక్కగా సిద్ధపడుము
5 ఇతరులకు బోధించుటలో మనము ప్రభావశీలముగా ఉండవలెనంటే సిద్ధపాటు ప్రాముఖ్యము. మీకు సత్యము నేర్పిన వారితో, కుటుంబ సభ్యులలో ఒకరితో లేక మీ పుస్తక పఠన గుంపులో ఒకరితో ఎందుకు సిద్ధపడకూడదు? మీ ప్రసంగమును అభ్యాసము చేయుటద్వారా, మీరు స్థిర నమ్మకముగల వారిగా భావించుటయే కాకుండ ప్రాంతమందలి ప్రజలతో మాట్లాడునప్పుడు వ్యక్తిగత అంగీకారమును ప్రదర్శించువారగుదురు.
6 మన ప్రసంగాలు ప్రజలయందలి మన శ్రద్ధను ప్రదర్శింపవలెను. కృంగినవారికి మరియు నిరుత్సాహము పొందినవారికి నిరీక్షణ కల్గించుటకై ఒక నూతన లోకము కొరకైన బైబిలు వాగ్దానమును నొక్కితెల్పుము. గృహస్థుడు బ్రోషూరును అంగీకరించినప్పుడు, మన బైబిలు పఠన కార్యక్రమమును మీరు ప్రదర్శించవచ్చును. లేక పునర్దర్శనమందు దానిని చేయుట సరియని మీరు తీర్మానించుకొనవచ్చును.
7 సేవ సంవత్సర ముగింపుతో, యెహోవా అనుగ్రహించు ఆశీర్వాదములను గ్రహించువారమగుట ఎంత సంతోషదాయకము! క్రొత్త సేవా సంవత్సరములో మనము ప్రవేశించుచుండగా, యెహోవా నూతన లోకములో ఆయనను నిత్యము సేవించుటకు ఎదురుచూస్తు యెహోవా నామమును నిండుగా స్తుతించుదము గాక.