జీవిత కథ
అమూల్యమైన క్రైస్తవ వారసత్వం వల్ల వర్ధిల్లాను
అది అర్ధరాత్రి, నేనూ మరో సహోదరుడు నైజర్ నది ఒడ్డున ఉన్నాం. ఆ నది చాలా పెద్దది, దాని వెడల్పు సుమారు ఒక మైలు (1.6 కి.మీ), నది నీళ్లు వేగంగా ప్రవహిస్తున్నాయి. నైజీరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది కాబట్టి నైజర్ నదిని దాటడం ప్రాణాలతో చెలగాటం ఆడడమే. అయినాసరే మేము దాన్ని దాటితీరాలి, అలా చాలాసార్లు చేశాం. ఇంతకీ మాకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది తెలుసుకోవాలంటే, నేను పుట్టడానికి కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్లాలి.
1913లో మా నాన్న జాన్ మిల్స్ న్యూయార్క్‌లో బాప్తిస్మం తీసుకున్నాడు, అప్పుడు ఆయనకు 25 ఏళ్లు. సహోదరుడు రస్సెల్ బాప్తిస్మ ప్రసంగాన్ని ఇచ్చాడు. కొంతకాలానికి నాన్న ట్రినిడాడ్ ద్వీపానికి వెళ్లిపోయాడు, అక్కడ కాన్‌స్టెన్స్ ఫామర్ అనే ఉత్సాహవంతురాలైన బైబిలు విద్యార్థిని పెళ్లిచేసుకున్నాడు. నాన్న తన స్నేహితుడైన సహోదరుడు విల్యమ్ ఆర్. బ్రౌన్‌కు “ఫోటో డ్రామా ఆఫ్ క్రియేషన్” ప్రదర్శించే పనిలో సహాయం చేసేవాడు. బ్రౌన్ దంపతుల్ని 1923లో పశ్చిమ ఆఫ్రికాకు నియమించే వరకు నాన్న అలా సహాయం చేశాడు. తర్వాత అమ్మానాన్నలు ట్రినిడాడ్‌లోనే సేవచేశారు, వాళ్లిద్దరికీ పరలోక నిరీక్షణ ఉంది.
మమ్మల్ని ప్రేమించిన మా అమ్మానాన్నలు
మా అమ్మానాన్నలకు తొమ్మిదిమంది పిల్లలు, మొదటి కొడుక్కి వాచ్‌టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ అధ్యక్షుడైన రూథర్‌ఫర్డ్ పేరు పెట్టారు. నేను 1922 డిసెంబరు 30న పుట్టాను, నాకు గోల్డెన్ ఏజ్ (ఇప్పుడు, తేజరిల్లు!) ఎడిటర్ అయిన క్లేటన్ జె. ఉడ్వర్త్ పేరు పెట్టారు. మా అమ్మానాన్నలు పిల్లలందరికీ ప్రాథమిక విద్యను అందించారు, అయితే వాళ్లు ముఖ్యంగా ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి నొక్కిచెప్పేవాళ్లు. అమ్మకు, లేఖనాల్ని ఉపయోగిస్తూ ఒప్పించేలా మాట్లాడే గొప్ప నైపుణ్యం ఉండేది. నాన్నకేమో మాకు బైబిలు కథలు చెప్పడం అంటే ఇష్టం. ఆయన శరీరం మొత్తం కదిలిస్తూ ఆ కథల్ని కళ్లకు కట్టినట్టుగా చెప్పేవాడు.
వాళ్ల కృషికి ప్రతిఫలం దక్కింది. ఐదుగురు కొడుకుల్లో ముగ్గురం గిలియడ్ పాఠశాలకు హాజరయ్యాం. మా చెల్లెళ్లలో ముగ్గురు ట్రినిడాడ్‌లో, టొబాగోలో చాలా సంవత్సరాలు పయినీరు సేవచేశారు. అమ్మానాన్నలు మాకు బోధించడం ద్వారా, మంచి ఆదర్శం ఉంచడం ద్వారా మమ్మల్ని “యెహోవా మందిరములో” నాటారు. వాళ్ల ప్రోత్సాహం వల్ల మేము “మన దేవుని ఆవరణములలో” ఉండి వర్ధిల్లాం.—కీర్త. 92:13.
మా ఇల్లు ప్రకటనా పనికి నిలయంగా ఉండేది. పయినీర్లు మా ఇంట్లో కలుసుకుని, ట్రినిడాడ్‌ను సందర్శించిన జార్జ్ యంగ్ గురించి మాట్లాడుకునేవాళ్లు, ఆయన కెనడాకు చెందిన మిషనరీ. అమ్మానాన్నలు కూడా అంతకుముందు తమతో కలిసి పనిచేసిన బ్రౌన్ దంపతుల గురించి ఉత్సాహంగా చెప్పేవాళ్లు, అప్పటికి బ్రౌన్ దంపతులు పశ్చిమ ఆఫ్రికాలో ఉన్నారు. ఇవన్నీ, నేను పదేళ్ల వయసులోనే ప్రకటనా పని మొదలుపెట్టేలా నన్ను కదిలించాయి.
తొలి కార్యకలాపాలు
అప్పట్లో మన పత్రికల్లో వచ్చే సందేశం చాలా సూటిగా ఉండేది. అవి అబద్ధమతాన్ని, దురాశతో నిండిన వాణిజ్య వ్యవస్థని, కుళ్లు రాజకీయాల్ని ఎండగట్టేవి. దాంతో 1936లో మతనాయకుల ప్రోద్బలంతో ట్రినిడాడ్ ప్రభుత్వం వాచ్ టవర్ ప్రచురణలన్నిటినీ నిషేధించింది. మేము సాహిత్యాన్ని దాచిపెట్టి, అవన్నీ అయిపోయేవరకు వాటిని ఉపయోగిస్తూనే ఉన్నాం. మేము హాండ్‌బిల్స్, ప్లకార్డులు ఉపయోగిస్తూ సమాచార ప్రదర్శనలు, సైకిల్ రాలీలు చేసేవాళ్లం. టూనాపూనా పట్టణానికి చెందిన సౌండ్ కారు గ్రూపుతో కలిసి ట్రినిడాడ్‌లోని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రకటించాం. అది చాలా ఉత్తేజాన్ని ఇచ్చేది! అలాంటి ఆధ్యాత్మిక వాతావరణం వల్ల నేను 16 ఏళ్లప్పుడు బాప్తిస్మం తీసుకున్నాను.
టూనాపూనా పట్టణానికి చెందిన సౌండ్ కారు గ్రూపు
మా కుటుంబం ఇచ్చిన ఆధ్యాత్మిక ఆస్తి, ఇలాంటి తొలి అనుభవాలు మిషనరీ కావాలనే కోరికను నాలో కలిగించాయి. నేను 1944లో అరుబా ద్వీపానికి వెళ్లి, సహోదరుడు ఎడ్మండ్ డబ్ల్యూ. కమింగ్స్‌తో కలిసి సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ కోరిక నాలో ఇంకా అలాగే ఉంది. 1945లో జ్ఞాపకార్థ ఆచరణకు పదిమంది హాజరైనప్పుడు మా ఇద్దరికీ చాలా సంతోషంగా అనిపించింది. తర్వాతి సంవత్సరం ఆ ద్వీపంలో మొట్టమొదటి సంఘం ఏర్పడింది.
ఒరిస్ రాకతో నా జీవితం ఇంకా వర్ధిల్లింది
కొంతకాలం తర్వాత, నా పని స్థలంలో ఒరిస్ విలియమ్స్‌కు అనియత సాక్ష్యం ఇచ్చాను. ఆమె తన నమ్మకాల గురించి చాలా గట్టిగా వాదించేది. అయితే, బైబిలు స్టడీ సహాయంతో దేవుని వాక్యం నిజంగా ఏమి చెప్తుందో నేర్చుకుని, 1947 జనవరి 5న బాప్తిస్మం తీసుకుంది. కొంతకాలానికి మేమిద్దరం ప్రేమించుకుని, పెళ్లిచేసుకున్నాం. తను 1950 నవంబరులో పయినీరు సేవ మొదలుపెట్టింది, ఒరిస్ రాకతో నా జీవితం ఇంకా వర్ధిల్లింది.
నైజీరియాలో ఉత్సాహంగా సేవచేయడం
1955లో మేము గిలియడ్ పాఠశాలకు హాజరయ్యాం. ఆ గొప్ప అవకాశం కోసం సిద్ధపడుతూ మేమిద్దరం మా ఉద్యోగాలకు రాజీనామా చేశాం. మా ఇంటిని, ఇతర వస్తువుల్ని అమ్మేసి అరుబా ద్వీపానికి వీడ్కోలు చెప్పాం. మేము 1956, జూలై 29న గిలియడ్ 27వ తరగతిలో పట్టభద్రులయ్యాం, మమ్మల్ని నైజీరియాకు నియమించారు.
1957లో, నైజీరియాలో లాగోస్‌లోని బెతెల్ కుటుంబంతో
గతాన్ని తలుచుకుంటూ ఒరిస్ ఇలా చెప్పింది: “మిషనరీ జీవితంలో వచ్చే ఆటుపోట్లను తట్టుకోవడానికి యెహోవా పవిత్రశక్తి ఒకవ్యక్తికి సహాయం చేయగలదు. నేను నా భర్తలా మిషనరీని అవ్వాలని ఎన్నడూ కోరుకోలేదు. నాకు కుటుంబం ఉండాలని, పిల్లల్ని పెంచాలని కోరుకున్నాను. అయితే మంచివార్త ప్రకటించడం ఎంత అత్యవసరమో అర్థం చేసుకున్నప్పుడు నా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. గిలియడ్‌లో పట్టభద్రులం అయ్యే సమయానికల్లా, నేను మిషనరీగా మంచివార్త ప్రకటించడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. మేము క్వీన్ మేరీ ఓడ ఎక్కబోతుండగా, సహోదరుడు నార్ దగ్గర పనిచేసే వర్త్ థార్న్‌టన్ అనే సహోదరుడు వచ్చి మాకు వీడ్కోలు చెప్పాడు, మా ప్రయాణం క్షేమంగా సాగాలని అన్నాడు. మేము బెతెల్‌లో పనిచేయబోతున్నామని ఆయన మాకు చెప్పాడు. అది వినగానే నేను కొంచెం నిరాశపడ్డాను. కానీ వెంటనే నా ఆలోచనను మార్చుకుని, బెతెల్ సేవను ప్రేమించడం మొదలుపెట్టాను, అక్కడ నేను వేర్వేరు నియామకాల్లో సేవచేశాను. అయితే అన్నిటికన్నా ఎక్కువగా, రిసెప్షనిస్టుగా పనిచేయడాన్ని ఆనందించాను. నాకు ప్రజలంటే చాలా ఇష్టం, రిసెప్షనిస్టుగా పనిచేయడంవల్ల నైజీరియాలోని సహోదరసహోదరీల్ని నేరుగా కలిసే అవకాశం నాకు ఉండేది. చాలామంది బెతెల్‌కి వచ్చేటప్పటికి బాగా దుమ్ము పట్టి, అలసటతో, దాహంతో, ఆకలితో ఉండేవాళ్లు. వాళ్ల అవసరాల్ని తీర్చడం, వాళ్లకు ఊరట ఇవ్వడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చేది. అదంతా యెహోవాకు చేసే పవిత్ర సేవలో భాగం, అది నాకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చింది.” అవును, ప్రతీ నియామకం మమ్మల్ని వర్ధిల్లేలా చేసింది.
1961లో, ట్రినిడాడ్‌లో మా కుటుంబం అలాగే ఇంకొంతమంది కలుసుకున్న ఒక సందర్భంలో, సహోదరుడు బ్రౌన్ ఆఫ్రికాలో తనకు ఎదురైన కొన్ని మంచి అనుభవాలు చెప్పాడు. నేను నైజీరియాలో మన ప్రగతి గురించి చెప్పాను. అప్పుడు సహోదరుడు బ్రౌన్ ఆప్యాయంగా నా మీద చేతులు వేసి, మా నాన్నతో ఇలా అన్నాడు: “జానీ నువ్వెప్పుడూ ఆఫ్రికాకు రాలేకపోయావ్, కానీ ఉడ్వర్త్ వచ్చాడు.” దానికి నాన్న, “వర్త్, ఇలాగే కొనసాగు” అని నాతో అన్నాడు. ఎంతోకాలంగా యెహోవా సేవచేస్తున్న అలాంటి వాళ్లు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల, పరిచర్యను పూర్తిగా నెరవేర్చాలనే నా కోరిక ఇంకా బలపడింది.
విల్యమ్ “బైబిల్” బ్రౌన్, ఆయన భార్య ఆంటోనియా మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు
నాకు 1962లో, పది నెలలపాటు జరిగిన 37వ గిలియడ్ తరగతికి హాజరయ్యే అవకాశం వచ్చింది, ఆ కోర్సు వల్ల మరింత శిక్షణ పొందాను. అప్పట్లో నైజీరియా బ్రాంచి పర్యవేక్షకునిగా సేవ చేస్తున్న సహోదరుడు విల్‌ఫ్రడ్ గూచ్ 38వ గిలియడ్ తరగతికి హాజరయ్యాడు, ఆయన్ని ఇంగ్లాండ్‌కు నియమించారు. దాంతో నైజీరియా బ్రాంచిని నేను పర్యవేక్షించాల్సి వచ్చింది. సహోదరుడు బ్రౌన్ ఆదర్శాన్ని పాటిస్తూ నేను నైజీరియా అంతటా ప్రయాణించి, ప్రియమైన నైజీరియా సహోదరసహోదరీల గురించి తెలుసుకున్నాను, వాళ్ల మీద ప్రేమ పెంచుకున్నాను. అభివృద్ధి చెందిన దేశాల్లోని వాళ్లకు ఉండే ఎన్నో వస్తువులు నైజీరియా సహోదరులకు లేకపోయినా వాళ్లు ఆనందంగా, సంతృప్తిగా ఉన్నారు. జీవితం అర్థవంతంగా ఉండాలంటే డబ్బు, వస్తుసంపదలు తప్పనిసరి కాదని వాళ్లు నిరూపించారు. వాళ్లు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూటాలకు శుభ్రంగా, పద్ధతిగా, హుందాగా తయారై రావడం ఆశ్చర్యం అనిపించేది. వాళ్లు సమావేశాలకు లారీల్లో, బోలకాజస్‌లోa (అంటే, స్థానికంగా తయారయ్యే, కిటికీలు లేని బస్సుల్లో) గుంపులుగుంపులుగా వచ్చేవాళ్లు. తరచూ ఈ బస్సులకు ఆసక్తి రేకెత్తించే నినాదాలు ఉండేవి. వాటిలో ఒకటి: “చిన్న నీటి బిందువులే మహా సముద్రాలు అవుతాయి.”
ఆ నినాదం ఎంత నిజమో కదా! ప్రతీఒక్కరు చేసే ఏ చిన్న పనైనా విలువైనదే; మా వంతు పని మేము చేశాం, అంతే! 1974 కల్లా, నైజీరియాలో లక్ష మంది ప్రచారకులు అయ్యారు, అమెరికా తర్వాత ఆ సంఖ్యను చేరుకున్న దేశం నైజీరియానే. అక్కడ పని నిజంగానే వర్ధిల్లింది!
ఇలా ఒకవైపు మన పని వృద్ధి చెందుతుండగా, నైజీరియాలో 1967 నుండి 1970 వరకు అంతర్యుద్ధం చెలగేరింది. దానివల్ల, నైజర్ నదికి మరోవైపున్న బీయాఫ్రాన్‌లోని సహోదరులకు కొన్ని నెలలపాటు బ్రాంచి కార్యాలయంతో సంబంధాలు తెగిపోయాయి. కాబట్టి మేము వాళ్లకు ఆధ్యాత్మిక ఆహారాన్ని తీసుకెళ్లాలి. ప్రారంభంలో చెప్పినట్లు ప్రార్థనవల్ల, యెహోవామీద నమ్మకంతో మేము ఆ నదిని చాలాసార్లు దాటాం.
తుపాకుల్ని కాల్చడానికి సరదాపడే సైనికుల వల్ల, వ్యాధుల వల్ల, ఇతర ప్రమాదాల వల్ల మేము ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని ఆ నదిని దాటిన జ్ఞాపకాలు నాకు ఇంకా గుర్తున్నాయి. మమ్మల్ని అనుమానంగా చూసే పోలీసుల్ని దాటుకుంటూ నది దగ్గరికి రావడమే కష్టం అనుకుంటే, ఎన్నో ఆటంకాలు ఉండే బీయాఫ్రాన్‌కు చేరుకోవడం ఇంకా భయంకరంగా ఉండేది. ఒకసారి, నేను రాత్రిపూట ఒక చిన్న ప్రయాణికుల పడవలో నైజర్ నది దాటుతూ ఆసాబా నుండి ఓనీచాకు ప్రయాణించి, ఏనూగూలోని పర్యవేక్షకుల్ని ప్రోత్సహించడానికి వెళ్లాను. ఇంకోసారి యుద్ధం కారణంగా, ఇళ్లలోని లైట్లు ఆర్పేసిన ఆబా నగరంలో ఉండే సంఘపెద్దల్ని బలపర్చాను. ఒక సందర్భంలో, మేము పోర్ట్ హార్కర్ట్ నగరంలో కూటం జరుపుకుంటున్నప్పుడు ఆ నగరం బయటవున్న పోలీసులు, బీయాఫ్రాన్ రక్షణ వలయాల్ని చేధించుకొని వస్తున్నారు, దాంతో మేము త్వరత్వరగా ఆ కూటాన్ని ప్రార్థనతో ముగించాల్సి వచ్చింది.
అలాంటి కూటాలు వాళ్లకు చాలా ముఖ్యం; ఎందుకంటే వాటి ద్వారానే సహోదరులు యెహోవా తమమీద ప్రేమపూర్వక శ్రద్ధ చూపిస్తున్నాడనే భరోసాను, అలాగే వాళ్లు తటస్థంగా, ఐక్యంగా ఉండడానికి కావాల్సిన సలహాల్ని పొందేవాళ్లు. అయితే నైజీరియాలోని సహోదరసహోదరీలు ఆ భయంకరమైన పోరాటం నుండి విజయవంతంగా బయటపడ్డారు. వాళ్లు తెగల మధ్యున్న ద్వేషానికి మించిన ప్రేమను చూపించారు, తమ క్రైస్తవ తటస్థతను కాపాడుకున్నారు. ఆ కష్టకాలంలో వాళ్లకు మద్దతివ్వడం నిజంగా ఒక గొప్ప అవకాశం!
1969లో, న్యూయార్క్‌లోని యాంకీ స్టేడియంలో జరిగిన “భూమిపై సమాధానం” అనే అంతర్జాతీయ సమావేశానికి సహోదరుడు మిల్టన్ జి. హెన్షల్ ఛైర్మన్‌గా ఉన్నాడు. నేను ఆయనకు సహాయకునిగా పనిచేసి ఎంతో నేర్చుకున్నాను. అది సరిగ్గా సమయానికి అవసరమైన శిక్షణ, ఎందుకంటే 1970లో మేము నైజీరియాలోని లాగోస్‌లో ‘ఆయనకు ఇష్టులైన మనుషులు’ అనే అంతర్జాతీయ సమావేశం జరుపుకున్నాం. అంతర్యుద్ధం తర్వాత కొంతకాలానికే జరిగిన ఈ సమావేశం కేవలం యెహోవా ఆశీర్వాదం వల్లే విజయవంతమైంది. ఆ కార్యక్రమాన్ని 17 భాషల్లో విన్నారు, దానికి 1,21,128 మంది హాజరయ్యారు. ఆ సమావేశంలో 3,775 మంది బాప్తిస్మం తీసుకోవడాన్ని సహోదరుడు నార్, హెన్షల్, అలాగే అమెరికా, ఇంగ్లాండ్ నుండి అక్కడికి విమానాల్లో వచ్చిన ఎంతోమంది ప్రతినిధులు చూశారు. పెంతెకొస్తు తర్వాత అంత ఎక్కువమంది బాప్తిస్మం తీసుకుంది ఆ సమావేశంలోనే! ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి సహాయపడిన సందర్భమే బహుశా నా జీవితంలో అత్యంత బిజీగా ఉన్న సమయం కావచ్చు. నైజీరియాలోని ప్రచారకుల సంఖ్య విపరీతంగా పెరిగింది!
‘ఆయనకు ఇష్టులైన మనుషులు’ అనే అంతర్జాతీయ సమావేశానికి 1,21,128 మంది వచ్చారు, ఈబో భాషతో పాటు 17 భాషలు మాట్లాడేవాళ్లు హాజరయ్యారు
నైజీరియాలో 30 కన్నా ఎక్కువ ఏళ్లు చేసిన సేవలో, నేను అప్పుడప్పుడు ప్రయాణ పర్యవేక్షకుడిగా, పశ్చిమ ఆఫ్రికాలో జోన్ పర్యవేక్షకునిగా సేవచేశాను. మిషనరీలపై వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు, వాళ్లను ప్రోత్సహించినప్పుడు ఎంతో కృతజ్ఞతను చూపిస్తారు. వాళ్లు విలువైనవాళ్లని వాళ్లకు భరోసా ఇవ్వడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది. ఇతరులపై వ్యక్తిగత శ్రద్ధ చూపించినప్పుడు వాళ్లు వర్ధిల్లుతారని, యెహోవా సంస్థ బలంగా, ఐక్యంగా ఉండాలంటే అలా చేయడం చాలా ముఖ్యమని ఈ పనివల్ల నేను నేర్చుకున్నాను.
అంతర్యుద్ధం వల్ల, అనారోగ్యం వల్ల మాకు వచ్చిన ఇబ్బందుల్ని కేవలం యెహోవా సహాయంతోనే తట్టుకోగలిగాం. యెహోవా ఆశీర్వాదాల్ని మేము స్పష్టంగా చూడగలిగాం. ఒరిస్ ఇలా చెప్పింది:
“మా ఇద్దరికీ కొన్నిసార్లు మలేరియా వచ్చింది. ఒకసారి వర్త్‌ని స్పృహలేని స్థితిలో లాగోస్‌లో హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. ఆయన బ్రతకడం కష్టమని డాక్టర్లు చెప్పారు, కానీ సంతోషకరంగా ఆయన కోలుకున్నాడు! వర్త్‌కి స్పృహ వచ్చాక, తనను కనిపెట్టుకుని ఉన్న నర్సుతో దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు, అతని పేరు న్వామ్‌బీవె. తర్వాత నేనూ, వర్త్ అతన్ని కలుసుకుని బైబిలు పట్ల అతనికున్న ఆసక్తిని పెంచాం. అతను సత్యాన్ని అంగీకరించాడు, ఆ తర్వాత ఆబాలో సంఘపెద్ద అయ్యాడు. నేను కూడా చాలామందికి సహాయం చేశా, చివరికి ఎంతో నిష్ఠగల ముస్లింలు కూడా యెహోవా సేవకులయ్యేలా వాళ్లకు సహాయం చేశాను. అయితే మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన విషయమేమిటంటే, నైజీరియా ప్రజల్ని, వాళ్ల సంస్కృతిని, పద్ధతుల్ని, భాషను తెలుసుకోవడం, వాటిని ప్రేమించడం.”
మేము ఇంకో పాఠం కూడా నేర్చుకున్నాం. అదేంటంటే, విదేశీ క్షేత్రంలో చేస్తున్న సేవ ఫలవంతం అవ్వాలంటే, మన సహోదరసహోదరీల సంస్కృతి ఎంత వేరుగా ఉన్నా, మనం వాళ్లను ప్రేమించడం నేర్చుకోవాలి.
కొత్త నియామకాలు
నైజీరియా బెతెల్‌లో సేవచేశాక, 1987లో మాకు కొత్త నియామకం వచ్చింది. మమ్మల్ని కరీబియన్ దీవుల్లో అందమైన సెయింట్. లూసియా ద్వీపంలో క్షేత్ర మిషనరీలుగా నియమించారు. ఆ పని మాకు నచ్చింది, కానీ కొన్ని కొత్త సవాళ్లు కూడా ఎదురయ్యాయి. ఆఫ్రికాలో ఒక పురుషుడు చాలామంది స్త్రీలను పెళ్లి చేసుకునేవాడు, ఇక్కడేమో దంపతులు చట్టపరంగా పెళ్లిచేసుకోకుండానే కలిసి జీవిస్తున్నారు. అయితే మా బైబిలు విద్యార్థులు చాలామంది మార్పులు చేసుకునేలా శక్తివంతమైన దేవుని వాక్యం వాళ్లను కదిలించింది.
మా 68 ఏళ్ల వివాహ జీవితంలో నేను ఒరిస్‌ను ఎంతో ప్రేమించాను
వయసు పెరిగేకొద్దీ మా బలం తగ్గడంతో, 2005లో పరిపాలక సభ ప్రేమతో మమ్మల్ని అమెరికాలో న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఉన్న ప్రపంచ ప్రధాన కార్యాలయానికి పంపించింది. ఒరిస్ గురించి నేను ఇప్పటికీ రోజూ యెహోవాకు కృతజ్ఞతలు చెప్తాను. 2015లో తను చనిపోయింది, ఆమెను కోల్పోయినప్పుడు కలిగిన బాధను మాటల్లో వర్ణించలేను. ఆమె అద్భుతమైన భాగస్వామి, ఎంతో ప్రేమించే ప్రియమైన భార్య. మేము కలిసివున్న 68 సంవత్సరాలు నేను ఆమెను ఎంతో ప్రేమించాను. వివాహ జీవితంలో గానీ, సంఘంలో గానీ సంతోషంగా ఉండాలంటే శిరసత్వాన్ని గౌరవించాలని, ఎక్కువగా క్షమించుకోవాలని, వినయంగా ఉంటూ పవిత్రశక్తి పుట్టించే లక్షణాల్ని చూపించాలని మేము నేర్చుకున్నాం.
మాకు ఎప్పుడైనా నిరాశ, నిరుత్సాహం ఎదురైతే యెహోవా మీద ఆధారపడేవాళ్లం, ఆయన సేవలో కొనసాగేలా సహాయం చేయమని అడిగేవాళ్లం. మేము సర్దుబాట్లు చేసుకుంటుండగా, పరిస్థితులు ఎప్పటికప్పుడు మెరుగౌతున్నట్లు గ్రహించాం, మరింత శ్రేష్ఠమైనది ముందుంది!—యెష. 60:17; 2 కొరిం. 13:11.
ట్రినిడాడ్‌లో అలాగే టొబాగోలో మా అమ్మానాన్నలు, ఇతర సహోదరసహోదరీలు చేసిన సేవను యెహోవా దీవించాడు. తాజా నివేదిక ప్రకారం అక్కడ 9,892 మంది సత్యారాధనలో ఐక్యం అయ్యారు. అరుబాలో, నేను మొట్టమొదట సహవసించిన సంఘం చాలామంది కృషి వల్ల బలపడింది. ఇప్పుడు ఆ ద్వీపంలో వృద్ధి చెందుతున్న 14 సంఘాలు ఉన్నాయి. నైజీరియా విషయానికొస్తే, ప్రస్తుతం 3,81,398 మంది ప్రచారకులు ఉన్నారు. సెయింట్. లూసియా ద్వీపంలో యెహోవా రాజ్యానికి మద్దతిచ్చే 783 మంది ఉన్నారు.
ఇప్పుడు నా వయసు 90 ఏళ్ల పైనే. యెహోవా మందిరములో నాటబడినవాళ్లు “ముసలితనమందు ఇంక చిగురు పెట్టుచుందురు. సారము కలిగి పచ్చగా నుందురు” అని కీర్తన 92:15 చెప్తుంది. యెహోవా సేవలో నేను గడిపిన జీవితం గురించి ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను. యెహోవాను పూర్తిగా సేవించేలా అమూల్యమైన క్రైస్తవ వారసత్వం నన్ను ప్రోత్సహించింది. తన విశ్వసనీయ ప్రేమతో యెహోవా నన్ను ‘[నా] దేవుని ఆవరణములలో వర్ధిల్లేలా’ చేశాడు.—కీర్త. 92:13.
a 1972, మార్చి 8 తేజరిల్లు! (ఇంగ్లీషు) సంచికలో 24-26పేజీలు చూడండి.