కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w18 డిసెంబరు పేజీలు 10-14
  • దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వివాహానికి వచ్చిన తాత్కాలిక మార్పులు
  • విడాకులు తీసుకోవడానికి ఏకైక కారణం
  • పెద్దపెద్ద సమస్యలున్నప్పటికీ, వివాహాన్ని గౌరవించండి
  • పాఠకుల ప్రశ్న
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • ఒకవేళ వివాహం విచ్ఛిన్నం కాబోయే స్థితిలో ఉంటే
    కుటుంబ సంతోషానికిగల రహస్యము
  • వివాహాన్ని పవిత్రంగా ఎందుకు దృష్టించాలి?
    తేజరిల్లు!—2004
  • వివాహం—దాని ఆరంభం, ఉద్దేశం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2018
w18 డిసెంబరు పేజీలు 10-14
తన చుట్టూ పోగైన ప్రజలకు బోధిస్తున్న యేసు

దేవుడు చేసిన వివాహ ఏర్పాటును గౌరవించండి

“దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు.” —మార్కు 10:9.

పాటలు: 131, 132

మీరెలా జవాబిస్తారు?

  • యెహోవా, యేసు వివాహాన్ని ఎలా చూస్తున్నారు?

  • విడాకులు తీసుకోవడానికి ఉన్న ఏకైక లేఖనాధార కారణం ఏంటి? కానీ కొందరు విడాకులు తీసుకోకూడదని ఎందుకు నిర్ణయించుకోవచ్చు?

  • వివాహజత నుండి విడిపోవాలనుకుంటున్న వ్యక్తి ఏ సలహా గురించి ఆలోచించాలి?

1, 2. హెబ్రీయులు 13:4 ప్రకారం మనం వివాహాన్ని ఎలా చూడాలి?

మనందరం యెహోవాను ఘనపర్చాలనుకుంటాం. నిజానికి, ఆయన మన ఘనతకు అర్హుడు. అంతేకాదు ఆయన్ని ఘనపర్చినప్పుడు, ఆయన కూడా తిరిగి మనల్ని ఘనపరుస్తానని మాటిస్తున్నాడు. (1 సమూ. 2:30; సామె. 3:9; ప్రక. 4:11) మనం ఇతరుల్ని కూడా ఘనపర్చాలని లేదా గౌరవించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఉదాహరణకు ప్రభుత్వ అధికారుల్ని మనం గౌరవించాలి. (రోమా. 12:10; 13:7) అయితే మనం ముఖ్యంగా గౌరవించాల్సింది ఒకటుంది, అదే వివాహం!

2 అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: “వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి. భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకద్రోహం చేసుకోకూడదు.” (హెబ్రీ. 13:4) పౌలు వివాహం గురించి ఊరికే ఆ మాటలు చెప్పలేదు. క్రైస్తవులు వివాహాన్ని గౌరవించాలని, అంటే విలువైనదిగా చూడాలని ఆయన చెప్తున్నాడు. మరి మీరు కూడా వివాహాన్ని అలాగే చూస్తున్నారా? ఒకవేళ మీరు పెళ్లయిన వాళ్లయితే, మీ వివాహాన్ని కూడా విలువైనదిగా చూస్తున్నారా?

3. యేసు వివాహం గురించి ఏ ప్రాముఖ్యమైన సలహా ఇచ్చాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 మీరు వివాహాన్ని విలువైనదిగా చూస్తుంటే, యేసు ఉంచిన మంచి ఆదర్శాన్ని పాటిస్తున్నట్లే. ఎందుకంటే ఆయన వివాహాన్ని గౌరవించాడు. పరిసయ్యులు విడాకుల గురించి అడిగినప్పుడు యేసు వాళ్లకు జవాబిస్తూ, మొట్టమొదటి వివాహం గురించి దేవుడు అన్న ఈ మాటల్ని చెప్పాడు, “అందుకే పురుషుడు తన అమ్మానాన్నల్ని విడిచిపెడతాడు; అతను, అతని భార్య ఒక్క శరీరం అవుతారు.” అంతేకాదు, “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు” అని కూడా యేసు చెప్పాడు.—మార్కు 10:2-12 చదవండి; ఆది. 2:24.

4. వివాహం విషయంలో యెహోవా ఉద్దేశం ఏంటి?

4 వివాహానికి దేవుడే మూలమని, అది శాశ్వతకాలం ఉండాలని యేసు ఒప్పుకున్నాడు. దేవుడు మొదటి వివాహాన్ని చేసినప్పుడు, ఆదాముహవ్వలు విడాకులు తీసుకోవచ్చని ఆయన చెప్పలేదు. బదులుగా, “వాళ్లిద్దరూ” వివాహం ద్వారా శాశ్వతకాలం కలిసివుండాలనేదే ఆయన ఉద్దేశం.

వివాహానికి వచ్చిన తాత్కాలిక మార్పులు

5. మరణం వివాహం మీద ఎలాంటి ప్రభావం చూపించింది?

5 ఆదాము పాపం చేసినప్పుడు, చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. ఒక మార్పు ఏంటంటే, మనుషులు చనిపోవడం. అది వివాహం మీద ప్రభావం చూపించింది. మరణం వల్ల వివాహబంధం ముగుస్తుందని, బ్రతికున్న వివాహజత మళ్లీ పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఉంటుందని అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు వివరించాడు.—రోమా. 7:1-3.

6. మోషే ధర్మశాస్త్రం బట్టి, దేవుడు వివాహాన్ని ఎలా చూస్తున్నాడని అర్థమౌతుంది?

6 దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో వివాహం గురించిన వివరాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఇశ్రాయేలీయుడు ఒకరి కన్నా ఎక్కువమందిని పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉండేది. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వకముందు నుండే ఆ పద్ధతి ఉండేది. అయితే భార్యాపిల్లలు నిర్లక్ష్యానికి గురికాకుండా ధర్మశాస్త్రం రక్షణ కల్పించింది. ఉదాహరణకు, ఒక ఇశ్రాయేలీయుడు రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ, మొదటి భార్య అవసరాల్ని తీరుస్తూనే ఉండాలి. ఆమెను సంరక్షిస్తూ, పట్టించుకుంటూ ఉండాలని దేవుడు చెప్పాడు. (నిర్గ. 21:9, 10) నేడు మనం మోషే ధర్మశాస్త్రాన్ని పాటించట్లేదు. కానీ దేవుడు వివాహాన్ని చాలా విలువైనదిగా చూశాడని అది నేర్పిస్తుంది. కాబట్టి మనం కూడా వివాహాన్ని గౌరవంగా ఎంచాలనే ప్రోత్సాహం పొందుతాం.

7, 8. (ఎ) ద్వితీయోపదేశకాండం 24:1 ప్రకారం విడాకులు ఇవ్వడం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్పింది? (బి) విడాకుల విషయంలో దేవుని అభిప్రాయం ఏంటి?

7 ధర్మశాస్త్రం విడాకుల గురించి ఏం చెప్తుంది? భార్యాభర్తలు విడాకులు తీసుకోవడం యెహోవా ఉద్దేశం కాకపోయినా, ఒక ఇశ్రాయేలీయుడికి తన భార్యలో “మానభంగసూచన [అసభ్యకరమైనది, NW] ఏదో ఒకటి” కనబడితే ఆమెకు విడాకులు ఇవ్వడానికి ధర్మశాస్త్రం అనుమతించింది. (ద్వితీయోపదేశకాండము 24:1 చదవండి.) ఆ అసభ్యకరమైన విషయం ఏమైవుండవచ్చో ధర్మశాస్త్రం చెప్పలేదు. అయితే, అది చిన్న తప్పు కాదుగానీ సిగ్గుకరమైన లేదా గంభీరమైన విషయమై ఉంటుంది. (ద్వితీ. 23:14) విచారకరంగా, యేసుకాలం నాటికి చాలామంది యూదులు చిన్నచిన్న కారణాలకే తమ భార్యలకు విడాకులు ఇవ్వడం మొదలుపెట్టారు. (మత్త. 19:3) మనం అలాంటి వైఖరిని అలవర్చుకోవాలని ఎన్నడూ కోరుకోం.

8 మలాకీ ప్రవక్త కాలంలో, ఒక పురుషుడు తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి, ఆమె కన్నా తక్కువ వయసున్న అన్య స్త్రీని పెళ్లి చేసుకోవడం ఒక మామూలు విషయమైపోయింది. కానీ, విడాకుల గురించి తన అభిప్రాయం ఏంటో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. ‘విడాకులు నాకు అసహ్యం’ అని ఆయన చెప్పాడు. (మలా. 2:14-16, NW) “పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు” అని దేవుడు ఆదాముహవ్వలతో చెప్పాడు. ఇప్పటికీ వివాహం విషయంలో దేవుని అభిప్రాయం అదే. (ఆది. 2:24) “దేవుడు ఒకటి చేసినవాళ్లను ఏ మనిషీ విడదీయకూడదు” అని చెప్పడం ద్వారా యేసు తన తండ్రి అభిప్రాయంతో ఏకీభవించాడు.—మత్త. 19:6.

ఇశ్రాయేలు జనాంగం వ్యభిచారం చేసినప్పుడు దేవుడు ఎలా స్పందించాడు?

ఇశ్రాయేలు, యూదా రాజ్యాల ప్రజలు యెహోవాకు విశ్వసనీయంగా ఉండలేదు. వాళ్లు అన్య జనాంగాలతో స్నేహం చేసి, అబద్ధ దేవుళ్లను ఆరాధించారు. వాళ్లు “రాళ్లతోను మొద్దులతో వ్యభిచారము” చేసినందుకు దేవుడు వాళ్లను ఖండించాడు. (యిర్మీ. 2:13, 20; 3:1-3, 9; యెహెజ్కేలు 16:28; యాకోబు 4:4 పోల్చండి.) కానీ వాళ్లు మారకుండా వ్యభిచారం చేసే భార్యలా ఉన్నప్పుడు, దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ‘నేను అది చూసి, విశ్వాసఘాతకురాలైన ఇశ్రాయేలు వ్యభిచారాన్ని బట్టి ఆమెకు విడాకుల పత్రాన్ని ఇచ్చి పంపించేశాను’ అని ఆయన చెప్పాడు.—యిర్మీ. 3:6-8, NW.

విడాకులు తీసుకోవడానికి ఏకైక కారణం

9. మార్కు 10:11, 12 వచనాల్లో యేసు చెప్పిన మాటలకు అర్థమేంటి?

9 ‘ఏ కారణాన్ని బట్టి ఒక క్రైస్తవుడు విడాకులు తీసుకొని, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు?’ అని కొంతమంది అడుగుతారు. యేసు చెప్పిన ఈ మాటల్ని గమనించండి, “తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేసి తన భార్యకు ద్రోహం చేసినవాడౌతాడు. ఒకవేళ భార్య తన భర్తకు విడాకులు ఇచ్చి మరో అతన్ని పెళ్లి చేసుకుంటే, ఆమె వ్యభిచారం చేసినదౌతుంది.” (మార్కు 10:11, 12; లూకా 16:18) యేసు వివాహాన్ని గౌరవించాడని స్పష్టంగా అర్థమౌతుంది. అంతేకాదు ఇతరులు కూడా వివాహాన్ని గౌరవించాలని ఆయన కోరుకున్నాడు. ఒక భర్త నమ్మకంగా ఉన్న తన భార్యకు విడాకులు ఇచ్చి, ఇంకో పెళ్లి చేసుకుంటే అతను వ్యభిచారం చేసినట్టే. నమ్మకంగా ఉన్న భర్తకు విడాకులు ఇచ్చే భార్య విషయం కూడా అంతే. ఎందుకంటే, విడాకులు ఇచ్చినంత మాత్రాన వివాహబంధం ముగిసినట్టు కాదు. దేవుడు ఆ దంపతుల్ని ఇంకా ‘ఏక శరీరంగానే’ చూస్తాడు. ఒక భర్త తప్పుచేయని తన భార్యకు విడాకులు ఇస్తే, ఆమె వ్యభిచారం చేసే ప్రమాదం ఉందని కూడా యేసు చెప్పాడు. అదెలా? అప్పట్లో, విడాకులైన స్త్రీ ఆర్థిక సహాయం కోసం ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అయితే అలాంటి వివాహం, వ్యభిచారంతో సమానం.

విడాకులు తీసుకోవడానికి ఉన్న ఏకైక లేఖనాధార కారణం

భర్త లేదా భార్య తమ వివాహజతకు విడాకులు ఇచ్చి, ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఉన్న ఏకైక కారణం పోర్నియా అని యేసు రెండుసార్లు చెప్పాడు. ఆ గ్రీకు పదానికి అర్థమేంటి? వివాహజతతో కాకుండా వేరే వాళ్లతో పెట్టుకునే లైంగిక సంబంధాన్ని అది సూచిస్తుంది. దానిలో అక్రమ సంబంధాలు, ముఖ రతి, ఆసన సంభోగము, లేదా వేరే వ్యక్తి మర్మాంగాలను స్పర్శిస్తూ లైంగికంగా ఉద్రేకపరచి తృప్తి పొందడం వంటివి కూడా ఉన్నాయి.—2006, జూలై 15 కావలికోట సంచికలో “పాఠకుల ప్రశ్నలు”చూడండి.

10. ఏ కారణాన్ని బట్టి మాత్రమే ఒక క్రైస్తవుడు విడాకులు తీసుకొని, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు?

10 ఏ కారణాన్ని బట్టి ఒక వ్యక్తి విడాకులు ఇవ్వవచ్చో యేసు చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “లైంగిక పాపాలు అనే కారణాన్ని బట్టి కాకుండా తన భార్యకు విడాకులు ఇచ్చి ఇంకో స్త్రీని పెళ్లి చేసుకునే ప్రతీ వ్యక్తి వ్యభిచారం చేస్తున్నాడు.” (మత్త. 19:9) ఆయన కొండమీద ఇచ్చిన ప్రసంగంలో కూడా ఆ విషయాన్నే చెప్పాడు. (మత్త. 5:31, 32) ఆ రెండు సందర్భాల్లో యేసు ‘లైంగిక పాపాల’ గురించి ప్రస్తావించాడు. అంటే తమ వివాహజతతో కాకుండా వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకోవడం గురించి ఆయన చెప్పాడు. ఆ లైంగిక పాపాల్లో వ్యభిచారం, వేశ్యావృత్తి, పెళ్లికాని స్త్రీపురుషుల మధ్య లైంగిక సంబంధాలు, స్వలింగ సంపర్కం, జంతువులతో సంపర్కం వంటివి కూడా ఉన్నాయి. అయితే ఒక భర్త లైంగిక పాపం చేస్తే, అతనికి విడాకులు ఇవ్వాలో వద్దో అతని భార్య నిర్ణయించుకోవచ్చు. ఆమె విడాకులు ఇస్తే మాత్రం దేవుని దృష్టిలో వాళ్ల వివాహబంధం ముగిసినట్టే.

11. వివాహజత లైంగిక పాపం చేసినప్పటికీ, విడాకులు ఇవ్వకూడదని కొందరు ఎందుకు నిర్ణయించుకోవచ్చు?

11 మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, భర్త లేదా భార్య లైంగిక పాపం చేస్తే, అతనికి లేదా ఆమెకు విడాకులు ఇవ్వాల్సిందే అని యేసు చెప్పలేదు. ఉదాహరణకు, భర్త లైంగిక పాపం చేసినప్పటికీ భార్య అతనితోనే ఉండాలని నిర్ణయించుకోవచ్చు. ఎందుకు? ఆమె ఇంకా అతన్ని ప్రేమిస్తుండవచ్చు, క్షమించడానికి సిద్ధంగా ఉండవచ్చు. అంతేకాదు అతనితో కలిసి, తమ కాపురాన్ని చక్కదిద్దుకోవడానికి కృషి చేయాలనుకోవచ్చు. పైగా ఆమె విడాకులు తీసుకొని, ఇంకో పెళ్లి చేసుకోకపోతే ఆమెకు కొన్ని ఇబ్బందులు రావచ్చు. ఉదాహరణకు ఆమె ఆర్థిక, లైంగిక అవసరాల సంగతేంటి? ఆమె ఒంటరిగా ఉండగలదా? విడాకులు తీసుకోవడం ఆమె పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? వాళ్లను సత్యంలో పెంచడం ఇంకా కష్టమౌతుందా? (1 కొరిం. 7:14) దీనంతటిని బట్టి, తప్పుచేయని భర్త లేదా భార్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటే తీవ్రమైన సమస్యలు ఎదురవ్వవచ్చని స్పష్టంగా అర్థమౌతోంది.

12, 13. (ఎ) హోషేయ వివాహ జీవితంలో ఏ సమస్య వచ్చింది? (బి) హోషేయ గోమెరును ఎందుకు తిరిగి తెచ్చుకున్నాడు? అది మనకు ఏం నేర్పిస్తుంది?

12 వివాహాన్ని దేవుడు ఎలా చూస్తున్నాడో, హోషేయ ప్రవక్త అనుభవం నుండి తెలుసుకోవచ్చు. దేవుడు హోషేయకు గోమెరు అనే స్త్రీని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఆమె ఆ తర్వాత వ్యభిచారం చేస్తుందని, దానివల్ల పిల్లల్ని కంటుందని దేవుడు చెప్పాడు. గోమెరు-హోషేయలకు ఒక కొడుకు పుట్టాడు. (హోషే. 1:2, 3) కొంతకాలానికి, గోమెరుకు ఒక కూతురు, కొడుకు కూడా పుట్టారు. బహుశా ఈ ఇద్దరు పిల్లలు వ్యభిచారం వల్ల పుట్టినవాళ్లు కావచ్చు. ఆమె ఒకటి కన్నా ఎక్కువసార్లు వ్యభిచారం చేసినప్పటికీ, హోషేయ ఆమెకు విడాకులు ఇవ్వలేదు. కానీ కొంతకాలం తర్వాత గోమెరు హోషేయను విడిచిపెట్టి, ఒక దాసురాలిగా మారింది. అయినప్పటికీ, హోషేయ ఆమెను తిరిగి కొనుక్కున్నాడు. (హోషే. 3:1, 2) ఇశ్రాయేలు జనాంగం యెహోవాకు విశ్వసనీయంగా ఉండకపోగా, అబద్ధ దేవుళ్లను ఆరాధించింది. అయినప్పటికీ యెహోవా ఆ జనాంగాన్ని పదేపదే ఎలా క్షమించాడో తెలియజేయడానికి హోషేయను ఉపయోగించుకున్నాడు. హోషేయ పెళ్లి నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?

13 క్రైస్తవ భర్త లేదా భార్య లైంగిక పాపం చేస్తే, తప్పుచేయని వివాహజత ఒక నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చు. అప్పుడు తప్పుచేయని వివాహజత విడాకులు తీసుకొని, ఇంకో పెళ్లి చేసుకోవడానికి సరైన కారణం ఉంటుందని యేసు చెప్పాడు. అయినప్పటికీ, ఆ వివాహజత లైంగిక పాపం చేసిన తన భర్తను లేదా భార్యను క్షమించాలని నిర్ణయించుకుంటే, అది తప్పేమీ కాదు. హోషేయ గోమెరును తిరిగి తెచ్చుకున్నాడు. ఇకపై ఏ పురుషునితో సంబంధం పెట్టుకోకూడదని హోషేయ ఆమెకు చెప్పాడు. అంతేకాదు అతను కూడా కొంతకాలం ఆమెతో ‘లైంగిక సంబంధం’ పెట్టుకోలేదు. (హోషే. 3:3 అధస్సూచి, NW) కానీ ఆ తర్వాత, హోషేయ తిరిగి తన భార్యతో లైంగిక సంబంధం కొనసాగించివుంటాడు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని మళ్లీ అంగీకరించి, వాళ్లతో తనకున్న బంధాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడని అది సూచించింది. (హోషే. 1:11; 3:3-5) నేడు, వివాహం గురించి అది మనకు ఏం నేర్పిస్తుంది? వ్యభిచారం చేసిన తన భర్తతో లేదా భార్యతో తప్పుచేయని వివాహజత మళ్లీ కాపురం చేయడం మొదలుపెడితే, అతన్ని లేదా ఆమెను క్షమించినట్టే. (1 కొరిం. 7:3, 5) ఇక విడాకులు తీసుకోవడానికి ఏ కారణమూ ఉండదు. అయితే, ఆ భార్యాభర్తలు తమ వివాహాన్ని యెహోవా చూసినట్టు చూసేందుకు కృషి చేయాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి.

పెద్దపెద్ద సమస్యలున్నప్పటికీ, వివాహాన్ని గౌరవించండి

14. మొదటి కొరింథీయులు 7:10, 11 ప్రకారం వివాహంలో ఏం జరిగే అవకాశం ఉంది?

14 యెహోవా, యేసులాగే క్రైస్తవులందరూ వివాహాన్ని గౌరవించాలి. అయితే, అపరిపూర్ణత కారణంగా కొంతమంది తమ వివాహాన్ని గౌరవించకపోవచ్చు. (రోమా. 7:18-23) కాబట్టి, తొలి క్రైస్తవులు కూడా వివాహంలో పెద్దపెద్ద సమస్యలు ఎదుర్కొన్నారని తెలుసుకొని మనం ఆశ్చర్యపోకూడదు. “భార్య తన భర్త నుండి విడిపోకూడదు” అని పౌలు రాశాడు. కానీ కొంతమంది భార్యాభర్తలు విడిపోయారు.—1 కొరింథీయులు 7:10, 11 చదవండి.

పెళ్లయిన ఒక జంటకు లేఖనాధార సలహా ఇస్తున్న ఇద్దరు పెద్దలు

భార్యాభర్తలు తమ వివాహాన్ని ఎలా కాపాడుకోవచ్చు? (15వ పేరా చూడండి)

15, 16. (ఎ) వివాహంలో సమస్యలు వస్తే, భార్యాభర్తలు ఏం చేయాలని పౌలు చెప్పాడు? ఎందుకు? (బి) యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య ఉన్నవాళ్లు కూడా దాన్నెలా పాటించవచ్చు?

15 ఆ భార్యాభర్తలు ఎందుకు విడిపోయారో పౌలు చెప్పలేదు. కానీ వాళ్లు విడిపోవడానికి కారణం, భర్త లైంగిక పాపం చేయడం కాదని తెలుస్తుంది. ఎందుకంటే, భర్త లైంగిక పాపం చేసుంటే, భార్య విడాకులు తీసుకొని, ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒక కారణం ఉండేది. అయితే, భర్త నుండి విడిపోయిన భార్య “పెళ్లిచేసుకోకుండా ఉండాలి లేదా భర్తతో రాజీకి రావాలి” అని పౌలు రాశాడు. దీన్నిబట్టి, దేవుడు వాళ్లను ఇంకా భార్యాభర్తలుగానే చూస్తున్నాడని అర్థమౌతుంది. భార్యాభర్తల మధ్య లైంగిక పాపం కాకుండా వేరే ఏ సమస్య వచ్చినా వాళ్లిద్దరూ రాజీపడాలని అంటే తమ సమస్యను పరిష్కరించుకొని, కలిసిమెలిసి ఉండాలని పౌలు చెప్పాడు. వాళ్లు సంఘపెద్దల సహాయం తీసుకోవచ్చు. పెద్దలు ఎవ్వరి వైపూ మాట్లాడరు గానీ బైబిలు నుండి అవసరమైన సలహా ఇస్తారు.

16 మరి యెహోవాసాక్షికాని భర్త లేదా భార్య ఉంటే, అప్పుడేంటి? వివాహ జీవితంలో సమస్యలు వస్తే వాళ్లు విడిపోవచ్చా? పైన చర్చించుకున్నట్లు, లైంగిక పాపం కారణంగా మాత్రమే విడాకులు తీసుకోవాలని బైబిలు చెప్తుంది. కానీ భార్యాభర్తలు ఏ కారణాల్ని బట్టి విడిపోవచ్చో బైబిలు చెప్పట్లేదు. పౌలు ఇలా రాశాడు, “ఓ స్త్రీకి అవిశ్వాసియైన భర్త ఉంటే, ఆమెతో కలిసి ఉండడం అతనికి ఇష్టమైతే, ఆమె అతన్ని వదిలేయకూడదు.” (1 కొరిం. 7:12, 13) ఆ మాటలు మన కాలానికి కూడా వర్తిస్తాయి.

17, 18. పెద్దపెద్ద సమస్యలు వచ్చినప్పటికీ కొంతమంది క్రైస్తవులు ఎందుకు కలిసివుండాలని నిర్ణయించుకున్నారు?

17 కానీ కొన్ని సందర్భాల్లో ఒక “అవిశ్వాసియైన భర్త” తన భార్యతో కలిసి ఉండడం ఇష్టం లేదన్నట్లు ప్రవర్తిస్తాడు. ఉదాహరణకు ఆమె ఆరోగ్యం పాడయ్యేంతగా లేదా ప్రాణం ప్రమాదంలో పడేంతగా అతను హింసించవచ్చు, కుటుంబాన్ని పోషించడానికి నిరాకరించవచ్చు, లేదా యెహోవాను ఆరాధించకుండా ఆమెకు అడ్డుతగలవచ్చు. అలాంటి సందర్భాల్లో, భర్త మాటలు ఎలా ఉన్నా, అతను కలిసి ఉండడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఒక క్రైస్తవ భార్య విడిపోవాలని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చు. కానీ కొంతమంది క్రైస్తవులు అలాంటి సందర్భాల్లో కూడా కలిసివుండాలనే నిర్ణయించుకున్నారు. వాళ్లు సహనం చూపిస్తూ, తమ వివాహ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి కృషి చేశారు. ఇంతకీ వాళ్లు ఎందుకు ఆ నిర్ణయం తీసుకొనివుంటారు?

18 ఒకవేళ అలాంటి సందర్భాల్లో ఒక జంట విడిపోయినా వాళ్లింకా భార్యాభర్తలే. అంతేకాదు పైన చర్చించుకున్న ఇబ్బందులు వాళ్లకు ఎదురవ్వవచ్చు. భార్యాభర్తలు కలిసివుండడానికి అపొస్తలుడైన పౌలు ఇంకో కారణం చెప్పాడు. ఆయనిలా రాశాడు, “అవిశ్వాసియైన భర్త తన భార్యతో ఉన్న బంధం వల్ల పవిత్రపర్చబడతాడు. అలాగే అవిశ్వాసియైన భార్య విశ్వాసియైన తన భర్తతో ఉన్న బంధం వల్ల పవిత్రపర్చబడుతుంది; లేదంటే, మీ పిల్లలు అపవిత్రులౌతారు. ఇప్పుడైతే వాళ్లు పవిత్రులు.” (1 కొరిం. 7:14) చాలామంది క్రైస్తవులు, కష్టమైనప్పటికీ తమ అవిశ్వాస వివాహజతతో కలిసివుండాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు చేసిన ఆ త్యాగాన్ని బట్టి చాలా సంతోషించారు, ఎందుకంటే కొంతకాలానికి తమ వివాహజత యెహోవాసాక్షి అయ్యారు.—1 కొరింథీయులు 7:16 చదవండి; 1 పేతు. 3:1, 2.

19. క్రైస్తవ సంఘాల్లో చాలామంది ఎలాంటి వివాహ జీవితాన్ని గడుపుతున్నారు?

19 యేసు, విడాకుల గురించి సలహా ఇచ్చాడు. అపొస్తలుడైన పౌలు విడిపోవడం గురించి సలహా ఇచ్చాడు. దేవుని సేవకులు వివాహాన్ని గౌరవించాలని వాళ్లిద్దరూ కోరుకున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా, విజయవంతమైన వివాహ జీవితాన్ని గడుపుతున్న ఎంతోమంది క్రైస్తవ సంఘాల్లో కనిపిస్తున్నారు. మీ సంఘంలో కూడా సంతోషంగా ఉన్న భార్యాభర్తలు చాలామంది ఉండేవుంటారు. వాళ్లలో తమ భార్యల్ని ప్రేమించే నమ్మకమైన భర్తలు, తమ భర్తలను గౌరవించే ప్రేమగల భార్యలు ఉండివుంటారు. వివాహాన్ని గౌరవించడం సాధ్యమే అని వాళ్లందరు నిరూపిస్తున్నారు. అంతేకాదు “పురుషుడు అమ్మానాన్నలను విడిచిపెట్టి తన భార్యను అంటిపెట్టుకొని ఉంటాడు, వాళ్లిద్దరూ ఒక్క శరీరంగా ఉంటారు” అని దేవుడు చెప్పిన మాటలు నిజమని, లక్షలమంది భార్యాభర్తలు రుజువు చేస్తున్నందుకు మనం సంతోషిస్తాం.—ఎఫె. 5:31, 33.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి